జ్ఞాపకాల పందిరి-144

22
2

అనుకున్నదొక్కటీ..!!

[dropcap]ఆ[/dropcap]రోగ్యమే మహాభాగ్యం.. అన్న సూక్తి, కేవలం సూక్తి మాత్రమే కాదు బ్రతికినంతకాలం మననం చేసుకోవలసిన ఆరోగ్య సూత్రం. బ్రతికినంత కాలం ఆరోగ్యంగా ఉండడం అరుదైన విషయం కానీ, అది నిజంగా జరిగితే అంతటి భాగ్యవంతుడు మరొకడు వుండదనుకుంటాను. అందుచేతనే ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేసేవాళ్లు కొద్ది శాతం ఉన్నప్పటికీ చాలా మంది ఆరోగ్యంగా ఉండడానికి అనేక రూపాలలో రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ ప్రయత్నాలు కొందరిలో శాస్త్రీయంగా, మరికొందరిలో అశాస్త్రీయంగా జరుగుతుంటాయి. కొందరి విషయంలో ఇవి సంతృప్తికరమైన ఫలితాలు ఇస్తే, మరికొందరిలో నిరాశ మిగలడం అక్కడక్కడా మనం గమనిస్తూనే వున్నాం. అయినా జరిగేవి జరుగుతూనే ఉంటాయి. నాటు వైద్యుల నుండి, వంటింటి చిట్కాలను దాటుకుని, చిట్కా వైద్యాలు కొనసాగుతూనే ఉంటాయి. దీనికి పల్లెలు – పట్టణాలు అన్న తేడాలు లేవు. దీనికి కారణం,దీర్ఘ కాలపు అల్లోపతి వైద్యానికి విసుగుచెంది కావచ్చు, వ్యయ ప్రయాసల సంబంధం కావచ్చు, ప్రజలు విసిగి వేసారి శరీరం మీద ఇటువంటి ప్రయోగాలకు దిగుతారేమో! లేదా, త్వరగా అనారోగ్య పరిస్థితి నుండి ఆరోగ్య పరిస్థితికి రావాలనే అత్యాశ కావచ్చు. తెలిసిన వాళ్ళు చెబితే చాలు జనం రంగంలోకి దూకేస్తారు. ఇప్పుడు జనాన్ని ‘త్వర చికిత్స’ వైపు లాగుతున్న ముఖ్యమైన, ఎక్కువ మందికి సవాలుగా నిలిచిన సమస్యలు – మధుమేహం, అధిక రక్తపోటు, ఊబకాయం మొదలైనవి. ఇవన్నీ కూడా ఒక దెబ్బతో ఎగిరి పారిపోయేవి కాదు. ఎప్పటికప్పుడు వైద్యుల పర్యవేక్షణలో, సంరక్షణలో, ఆరోగ్య పరిస్థితిని నిలబెట్టుకోవలసినవి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమంటే, చికిత్సలో, వైద్యుడు -మందుల కంటే, మనిషి జీవన శైలి, జీవన విధానము ముఖ్యమైనవిగా భావించ వలసి ఉంటున్నది. మనిషి జీవన విధానంలో మార్పులు తెచ్చుకోకుంటే, మంచి వైద్యుడు వున్నా, మంచి మందులు వున్నా ప్రయోజనం ఉండదు.

ఇలాంటి తికమక పరిస్థితుల్లో, వారిని ఉపయోగించుకుని సొమ్ము చేసుకునే వారు ఎక్కువై పోయారు. ఫేస్‌బుక్ వంటి ఆధునిక ప్రసార/ప్రచార సాధనాలలో వస్తున్న సమాచారం చదువుతుంటే,ఇంటర్వ్యూలు వింటుంటే, ఏది సత్యం, ఏది అసత్యం అని తెలుసుకోలేని తికమక పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అలా అని ఆ సమాచారాన్ని మొత్తం తీసిపారేయలేము. ఎంచుకునే విషయంలోనే ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.

జాతీయ స్థాయిలో కొన్ని బడా కంపెనీలు, అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనంకు ప్రత్యామ్నాయంగా కొన్ని ఔషదాలు తయారు చేసి విపణిలో విడుదల చేస్తున్నాయి. ఇవి సరఫరా చేయడానికి ఏజెన్సీ తీసుకున్నవారికి భారీ మొత్తంలో డిస్కౌంట్ ప్రకటిస్తున్నాయి. ఇక ప్రచారానికి లోటేమున్నది. అందుచేతనే అవి అందరూ వాడుకునే పరిస్థితి లేదు. ఏదో కష్టపడి వాడుకున్నా అవి అందరికి సరిపడేలా వుండవు. ఇది ఇలా ఉంటే, జనం అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని కొన్ని సంస్థలు లేదా వ్యక్తులు, కొన్ని ప్రయోగాలు చేసి మూలికలు, అడవుల్లో లభించే వివిధ పండ్లు, దుంపలు, గింజలు సేకరించి, ఆహార పదార్ధాలుగా ఉత్పత్తి చేస్తున్నారు. ఇలాంటి వాటిల్లో శరీరానికి కావలిసిన ప్రోటీన్లు, విటమినులు వగైరా సమృద్ధిగా లభిస్తాయని, మధుమేహం, హైపెర్ టెన్షన్ సాధారణ స్థితికి వస్తాయని, బరువు తగ్గుతారని చెబుతుంటారు. నిజమే కావచ్చు.

కొందరి విషయంలో ఇది బెడిసికొడుతుంది. సమస్య ప్రాణం మీదికి వస్తుంది. అలాంటి సమస్యలో ఇరుక్కున్న వాళ్ళల్లో నేనూ ఒకడిని!

పది సంవత్సరాల క్రితం మా అమ్మ నాకు పంచి ఇచ్చిన ఆస్తిలో ఈ మధుమేహం ముఖ్యమైనది. మొదట మందులతోను, తర్వాత ఇన్సులిన్ తోనూ, ఆ తర్వాత తిరిగి మందులతోనూ జీవితం నెట్టుకొస్తున్నా. జీవన శైలిలో మార్పులు తెచ్చుకున్నా, ఆహారంలో కూడా కొద్దిగా మార్పులు చేర్పులు జరిగాయి. జీవితం బాగానే; మిత్ర వైద్యులు ప్రొఫెసర్ వి. చంద్రశేఖర్ గారి (ప్రస్తుతం, సూపరింటెండెంట్, ఎం.జి.ఎం. హాస్పిటల్, వరంగల్) వైద్య పర్యవేక్షణలో గడిచిపోతున్నది. ఆలా మూడు సంవత్సరాల క్రితం నా ఎడమ కన్నుకు ‘కేటరాక్ట్’ సర్జరీ కూడా చేయించుకున్నాను. కంటి వైద్య నిపుణులు డా. ప్రవీణ్ గారి ఆధ్వర్యంలో నా కంటి సంరక్షణ జరుగుతున్న నేపథ్యంలో, గత సంవత్సరం కుడి కంటికి కూడా సర్జరీ చేయవలసిన అవసరాన్ని గుర్తు చేశారు. అయితే ఈలోగా అంటే గత సంవత్సరం, తప్పని పరిస్థితిలో మే నెలలో, సికింద్రాబాద్‌కు రావలసి వచ్చింది. అప్పటి నుండి మధుమేహానికి సంబంధించి సమస్యలు మొదలయ్యాయి. షుగర్ లెవెల్స్ పెరగడం, నార్మల్‍కు రాకపోవడం, కుడికన్నుకు సర్జరీ పెండింగ్ పడిపోవడం – కొద్దిగా టెన్షన్ మొదలయినది. ఎలా అయినా షుగర్ లెవెల్స్ నార్మల్ తెచ్చుకుని సర్జరీ చేయించుకోవాలనే ఆలోచనలో నా మిత్రుడు ఒకాయన గుర్తుకు వచ్చాడు.

ఆయన నాకు ఇంటర్మీడియెట్‌లో సహాధ్యాయి. తర్వాత స్త్రీ వైద్య నిపుణుడిగా పనిచేసి, కొంతకాలంగా మధుమేహ వ్యాధిగ్రస్థుల కోసం సహజ ఆహార పదార్ధాల తయారీ పరిశోధనలలో పాలుపంచుకుంటున్నాడు. మంచి పేరు పెట్టి, మార్కెటింగ్ చేసే సన్నాహాల్లో వున్నాడు. ఇది తెలిసి అదేదో నాకు ఇవ్వమని అడిగాను. ఆయన సంతోషంగా అల్పాహారం (బ్రేక్ ఫాస్ట్) సూచించాడు. అది అడవిలో సహజంగా లభించే పండ్లు. డ్రై ఫ్రూట్స్ వంటివి. చల్లని పాలల్లో కలుపుకుని తినాలి. లంచ్‌కు డిన్నర్‍కు మధ్య తినడానికి స్నాక్స్ ఇచ్చాడు. నేను స్నేహితుడిని కాబట్టి ఉచితంగా ఇచ్చాడు. దీనికి ఇంట్లోవాళ్ళు కూడా అడ్డుపెట్టలేదు, నా ఆరోగ్యాన్ని దృష్టిలోవుంచుకుని. నెల రోజులు ఆ బ్రేక్‌ఫాస్ట్ తిన్నాక షుగర్ లెవెల్స్ నార్మల్‍కి వచ్చాయి.

మధ్యాహ్నం అన్నం కొద్దిగా తినేవాడిని. రాత్రిపూట రాగి జావ తీసుకునేవాడిని. కంటికి త్వరగా చికిత్స చేయించుకోవచ్చనే ఆనందంతో, మరింతగా ఉత్సాహంతో ఈ ఆహార నియమాలు పాటించాను.

ఇక తర్వాత చూడాలి. ముఖం పీక్కుపోవడం, కళ్ళు లోతుకు పోవడం, నీరసం ఆవరించడం మొదలయింది. నా శరీర ఆకృతి లోనే పెద్ద మార్పు వచ్చేసింది. జీవితంలో ఎన్నడూ ఎరగని నీరసం ముంచుకొచ్చింది. షుగర్ లెవెల్స్ పెరిగాయి. ఉదయం లేచేసరికి ఆకలి, విపరీతమైన నీరసం. ఇది బ్రేక్‌ఫాస్ట్ వల్ల కాదని అది ఇచ్చిన మిత్రుడు చెబుతున్నాడు. నేను కూడా అతనిని తప్పుపట్టడం లేదు. ఇటువంటి ప్రయోగాలు చేసేటప్పుడు కాస్త వెనకా ముందు ఆలోచించి చేయాలి. అనుభవజ్ఞుల పర్యవేక్షణలో ఇటువంటి పనులు జరగాలి. లేకుంటే ఊహించని సమస్యలు చుట్టుకుని ప్రాణానికే ముప్పు వచ్చే ప్రమాద పరిస్థితులు ఏర్పడవచ్చు. ఇది నా అనుభవం నేర్పిన పాఠం.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here