Site icon Sanchika

జ్ఞాపకాల పందిరి-15

[box type=’note’ fontsize=’16’] “కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే…!!”అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్. [/box]

నాన్నా… నాకు టైమ్ కావాలి…!!

[dropcap]జీ[/dropcap]వితం పుట్టుకతో మొదలై గిట్టడంతో పూర్తి అవుతుంది, ఇది అందరికీ జరిగే సహజమైన జీవన విధానం. అయితే చావు పుటుకల మధ్య అనుభవించే జీవిత దశలు అందరిలోనూ ఒకేమాదిరిగా వుండవు. భిన్న రీతుల్లో, విభిన్నమైన పద్దతుల్లో జరుగుతాయి. ఈ దశలు అన్నీ అందరికి తృప్తి నివ్వాలని లేదు, అలాగని అసంతృప్తిగా మిగలాలనీ లేదు! ఈ దశలవారీ జీవితంలో, ఒక్కో దశా, ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా ఉండవచ్చు.

ఎవరి జీవితం అయినా బాల్య దశతోనే ఆ జీవితం ప్రారంభం కావాలి. అది అదృష్టవశాత్తు, తృప్తికరంగా గట్టెక్కగలిగితే, సులభంగా విద్యార్థి దశలోనికి, ఆనందంగా అడుగు పెట్టవచ్చు. ఈ దశ తల్లిదండ్రులకు ఒక పెద్ద సవాల్ లాంటిది. అది చిన్నపిల్లల ‘ప్లే స్కూల్’తో ప్రారంభం అవుతుంది. ఎక్కడ, ఎలా, ఎటువంటి బడిలో చేర్చాలన్నది పెద్ద చర్చనీయాంశం అయి కూర్చుంటుంది. దీనికోసం ఇంటిల్లిపాదీ, గంటల తరబడి తర్జనభర్జనలు. బడి, పరిసరాలు, రవాణా సౌకర్యం వంటి ప్రాథమిక అంశాల చర్చ ముగిసిన తర్వాత అసలు విషయం చర్చ తెరమీదికి వస్తుంది. అది ఆర్థిక వనరులకు సంబంధించిన విషయం! ఈ రోజుల్లో ప్లే-స్కూల్ ఫీజ్‌లు, సామాన్యుడికి అందుబాటులో లేవు. బహుశః సాధారణ కుటుంబాలు వాళ్ళ పిల్లలని ప్లే-స్కూల్‌లో వేసే ఆలోచనే చేయరేమో! ఆర్థికపరమైన ఇబ్బందులే దీనికి ప్రధాన కారణం కావచ్చు! అలా అని ప్రభుత్వ పాఠశాలలను తక్కువగా చూడడానికి వీలులేదు. ఉచిత విద్య అనేసరికి అదో రకమైన చిన్న చూపు! కానీ అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు అక్కడే ఉంటారన్న సంగతి చాలామందికి తెలియదు. కార్పొరేట్ బడులలో లభ్యమయ్యే విలాస వసతులు ప్రుభుత్వ పాఠశాలల్లో దొరకక పోవచ్చు. అందరూ ఆశించే ఆధునికత అక్కడ కనిపించకపోవచ్చు. కానీ చక్కని చదువు, క్రమశిక్షణ, నైతిక జీవన విధానం ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే అందుబాటులో ఉంటాయి.

కానీ, గ్రామ పెద్దల ఆధిపత్యం, రాజకీయాల ప్రభావం, పర్యవేక్షణ లోపం ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేస్తున్నాయి. తల్లిదండ్రులు ప్రైవేట్ విద్యాసంస్థలను ఆశ్రయించడానికి ఇదొక ప్రధాన కారణం కావచ్చు! కారణం ఏదైనా విద్యారంగంలో పనికిరాని పెనుమార్పులు వచ్చి ఇటు విద్యార్థులను, అటు తల్లిదండ్రులను అయోమయంలో పడేస్తున్నాయి. కార్పొరేట్ విద్యాసంస్థలు దీనిని సులభంగా సొమ్ము చేసుకుంటున్నాయి. అసలు చదవడం ఎందుకు? చదువుకుని విజ్ఞానాన్ని సముపార్జించుకుని, దాని సహాయంతో జీవనభృతి కోసం అందివచ్చిన ఉద్యోగం సంపాదించుకోవడం, అందులో మళ్ళీ వృత్తి విద్యా కోర్సులు, అందులో మళ్ళీ పోటీపడి సీటు సంపాదించుకోవడం, లేదా నచ్చిన కోర్సులో సీటు లభ్యం కాకపోయినా వచ్చిన సీటుతో సంతృప్తిపడి, దాని ఆధారంగా జీవితంలో స్థిరపడడం! సమాజంలో ఇలాంటి వారి శాతమే ఎక్కువగా ఉంటుంది. ఇక రెండవ కేటగిరి ఏమిటంటే, సమాజంలో హోదా కోసం, హోదాలో వున్న భాగస్వామితో స్థిరపడడం కోసం. వీళ్ళ చదువులో సీరియస్‌నెస్ అసలే వుండదు. విద్యాసంస్థల్లో సమస్యలను సృష్టించేది కూడా ఇలాంటివారే! ఇక మూడవ వర్గానికి చెందినవారు, రాజకీయ పార్టీలకు అనుబంధంగా వుండే విద్యార్థి సంఘ సభ్యులు. వీళ్ళు చదువులో రాణించవచ్చు, రాణించకపోవచ్చు, విద్యార్థి సంఘాల మార్గ దర్శనంలోనే వీరి భవిష్యత్ జీవితం ఆధారపడి ఉంటుంది. అలా దేశంలోని అత్యున్నత స్థానాలను ఆక్రమించినవారూ వున్నారు.

ఈ నేపథ్యంలో… ఇంటెర్మీడియేట్ తర్వాత ఏమిటి పరిస్థితి? బయాలజీ గ్రూపా? గణితమా? ఆర్ట్స్ గ్రూపా? ఇక్కడ చదువుకునే పిల్లలకంటే, తల్లిదండ్రుల అభిరుచికి ప్రాధాన్యత పెరుగుతుంది. తక్కువ శాతం తల్లిదండ్రులు మాత్రమే పిల్లల ఇష్టానికే వదిలేస్తారు (ఒకో చోట ఈ ప్రయోగం దెబ్బతింటుంది, అది వేరే విషయం). ఎక్కువమంది తల్లిదండ్రులు తమ పిల్లల చేత ‘ఎంసెట్’ రాయించి, డాక్టర్‌నో, ఇంజనీర్‌నో చేసేయాలని ఉబలాట పడుతుంటారు. సహజమే, తప్పులేదు! కానీ అవి కాకుండా, ఐ.ఏ.ఎస్, ఐ.పి.ఎస్, ఐ.ఆర్.ఎస్. వంటి మరెన్నో ఉన్నతస్థానాలను అంది పుచ్చుకునే అవకాశాల గురించి అసలు ఆలోచించరు.

అంతెందుకు, మా ఇంట్లో విషయమే ఇక్కడ ప్రస్తావిస్తాను. నేను పిల్లల చదువు వాళ్ళ అభిరుచికి వదిలేసాను, కానీ నా శ్రీమతి కొడుకుని ఇంజనీర్‌ను చెయ్యాలని, కూతురిని డాక్టరు చేయాలని కలలు కన్నది. దానికి అనుగుణంగానే మా అబ్బాయి రాహుల్ కానేటి, మెకానికల్ ఇంజనీరింగ్ చేసి, అమెరికాలో ఎం.ఎస్. చేసి క్వాలిటీ ఇంజనీరుగా బోస్టన్‌లో స్థిరపడిపోయాడు. అతని ఇష్టం ఏది వున్నా కేవలం మా సలహా మేరకు జనగాం క్రీస్తు జ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో బి.టెక్-పూర్తి చేసాడు.

ఇక అమ్మాయి నిహార కానేటి విషయం వచ్చేసరికి పరిస్థితి భిన్నంగా మారింది. అమ్మాయి తొమ్మిదో తరగతిలో ఉండగానే ఒక సంచలన నిర్ణయం ప్రకటించింది మా ముందు. అదేమిటంటే, తాను ఎట్టి పరిస్థితిలోనూ ఇంటర్ తర్వాత ఎం.సెట్. పరీక్ష రాయనని, తాను బయాలజీలో మాస్టర్స్ చేసి రీసెర్చ్ చేస్తానని తన దృఢ నిర్ణయంగా చెప్పేసింది. చిన్న పిల్ల తనకు ఈ వయసులో ఏమి తెలుస్తుందిలే అని నెమ్మది పడ్డాం. కానీ… తాను పదో తరగతికి వచ్చినప్పుడూ అదేమాట, ఇంటర్ పాస్ అయినప్పుడూ అదే మాట! అమ్మాయి ఆ దృఢ నిర్ణయానికి కారణం లేకపోలేదు. అమ్మాయి హనుమకొండలోని సెయింట్ పీటర్స్ హై స్కూల్‌లో చదివింది. అక్కడ కుమార్… అనే బయాలజీ మాస్టారు ఉండేవారు. ఆయన పాఠం చెప్పడం లోనే కాదు, క్రమశిక్షణలో పెట్టడంలోనూ, విద్యార్థులకు మార్గదర్శనం చేయడంలోనూ మంచి నైపుణ్యం గలవాడు. ఆయన ప్రభావం అమ్మాయి పసి మనసు మీద బాగా పడినట్లు అర్థమైంది. అయితే తల్లి తృప్తి కోసం, మాత్రమే ఆమె ‘ఎం.సెట్’ పరీక్ష రాసింది. అమ్మాయి సీరియస్‌గా తర్ఫీదు అయివుంటే మెడిసిన్‌లో గ్యారంటీగా సీటు వచ్చేదని నాకు అనిపించింది. అయినా నేను బాధపడలేదు, నా శ్రీమతి మాత్రం ఎవరైనా మెడిసిన్ చదూతున్న పిల్లలు కనపడితే కాస్త కూతురు విషయంలో బాధ పడుతుండేది.

అమ్మాయి ఇష్టప్రకారం, ఇంటర్ హనుమకొండలో స్నేహ జూనియర్ కాలేజీలో చదివింది. తర్వాత జెనెటిక్స్… ప్రధాన అంశంగా, హైదరాబాద్ లోని సెయింట్ ఆన్స్ డిగ్రీ కళాశాలలో (మెహిదీపట్నం) బి.ఎస్.సి.లో చేరి తానే హాస్టల్ సదుపాయం చూసుకుంది. ఇదే సమయంలో హాబీగా ఆకాశవాణి రెయిన్ బో..లో, రేడియో జాకీగా అప్పుడప్పుడూ చేస్తుండేది. డిగ్రీ అక్కడ పూర్తి అయిన తర్వాత మల్లారెడ్డి కాలేజీ కూకట్‌పల్లి లో పి.జి, పూర్తి చేసింది.

నిజానికి అన్నయ్య మార్గంలోనే అమెరికా వెళ్ళిపోయి అక్కడ ‘జెనెటిక్స్’లో రీసెర్చి చేయాలని అనుకునేది. కానీ మా బాబు అమెరికా వెళ్లేప్పుడు బేగంపేట్ విమానాశ్రయంలో నేను పడ్డ బాధ గమనించి తాను అమెరికా వెళ్లే ప్రయత్నం మానుకుంది. కేవలం నా సంతోషం కోసం తన కోరికను త్యాగం చేసింది. ఈ విషయంలో కూడా నేను ఇంకా బాధపడుతూనే వుంటాను, ఆమె ఉన్నత భవిష్యత్తును నేను అడ్డుకున్నానేమోనని!

ఇక పి.జి. కూడా అయిపొయింది కనుక ఉద్యోగ ప్రయత్నం చేయమన్నాను. పోటీ పరీక్షలకు సిద్దపడమని చెప్పాను.

అయితే.. తన మనసులోని అభిప్రాయం చెప్పడానికి తానూ ఎప్పుడూ నా దగ్గర వెనుకాడదు, భయపడదు కూడా! అందుకే… “డాడీ… నేను అప్పుడే ఉద్యోగం చేయను… నాకు కొంత సమయం కావాలి” అని చెప్పింది.

“దేనికోసం అమ్మా..?’’ అన్నాను.

“నేను… గ్రూప్-1 సర్వీసెస్‌కి, ఐ.ఏ.ఎస్.కి కోచింగ్ తీసుకుని పరీక్షలు రాస్తా” అంది.

“నువ్వు అంత కష్టపడగలవా?’’ అన్నాను.

“ప్రయత్నం చేస్తాను డాడీ…” అంది. ఆమె నమ్మకాన్నీ, పట్టుదలను, నేను నిర్వీర్యం చేయదలచుకోలేదు. అందుకే—

“చాలా సంతోషం అమ్మా… నీ ఉత్సాహాన్ని నీళ్లు కార్చే ప్రయత్నం నేను ఎప్పుడూ చేయను. నాకంటే ఉన్నతి స్థాయికి చేరుకుంటానంటే, అంతకు మించి ఈ తండ్రి ఏమి కోరుకుంటాడు? తప్పకుండా అలాగే నీ ప్రయత్నాలు నువ్వు చేయి, కానీ… ఒక షరతు…!’’ అన్నాను.

“షరతా…!! ఏమిటి డాడీ అది?’’ అంది ఆశ్చర్యంగా.

“ఏమీ లేదమ్మా… నువ్వు అనుకున్నవన్నీ4-5 సంవత్సరాల లోపు పూర్తి కావాలి. అందులో నువ్వు సక్సెస్ అయితే సంతోషమే! ప్రయత్నం ఫలించకపోయినా, నిరుత్సాహ పడకుండా, ముందు కష్టపడి ఎంతటి చిన్న ఉద్యోగంలోనైనా చేరిపోవాలి. అక్కడి నుండి ఎన్ని ప్రయత్నాలైనా చేసుకో. నీకు ఉద్యోగం వచ్చిన తక్షణం నీకు పెళ్లి ప్రయత్నాలు చేయాల్సిన బాధ్యత నాది” అన్నాను. దానికి కాస్సేపు ఆలోచించి-

“సరే, డాడీ, మీరు చెప్పినట్టే చేస్తాను, థాంక్స్ డాడీ…!!’’ అంది సంతోషంగా.

హైదరాబాద్‌లోనే కోచింగ్‍లో జాయిన్ అయింది. చాలా కష్టపడింది. శక్తికి మించిన శ్రమ చేసింది. రెండు సార్లు ప్రిలిమ్స్ అతి దగ్గరలో మిస్ అయింది. స్వయంగా అమ్మాయి శ్రమించిన విధానం చూసాను. ఇక ఆమె కష్టపడడానికి నా మనసు ఎంత మాత్రమూ అంగీకరించలేదు! ఒక శుభోదయన, హనుమకొండకు వచ్చినప్పుడు నా మనసులోని మాట ఇలా చెప్పేసాను –

“అమ్మా… నువ్వు ఇక ఎంత మాత్రమూ సమయం వృథా చేయొద్దు. వయసు దాటిపోతే ఉద్యోగాలు రావడం చాలా కష్టం, అందుచేత ఏదైనా కాలేజీలో లెక్చరర్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేయి, లేదా పోటీ పరీక్షలకు సిద్దపడు, ఏ చిన్న ఉద్యోగం వచ్చినా ముందు అందులో జాయిన్ అయిపోవాలి” అని ఎంతో మృదువుగా విషయం విశ్లేషించి చెప్పాను. అమ్మాయి ఏమాత్రం నొచ్చుకోకుండా, “మీరు చెప్పినట్టే చేస్తాను డాడీ..!!” అంది.

విద్యారంగంలోనో, బ్యాంకింగ్ రంగంలోనో స్థిరపడుతుందని ఊహించాను. నిజానికి చాలా రకాల పోటీ పరీక్షలు రాసింది, కానీ ఎవరూ ఊహించని ప్రసార భారతిలో ప్రోగ్రాం ఆఫీసర్‌గా ఉద్యోగం సంపాదించుకుంది. తాను హాబీగా ‘ఆర్.జె’గా చేసిన ఆకాశవాణిలో ఆఫీసర్ కావడం గొప్ప మలుపు.

నేరెళ్ల వేణు మాధవ్ గారి చివరి రోజుల్లో ఇంటర్వ్యూ చేస్తున్న నిహార

అమ్మాయి నిహర – ప్రసార భారతిలో ఆరంగేట్రం చేయడంలో ముఖ్యంగా ముగ్గురు వ్యక్తులను గుర్తుంచుకోక తప్పదు. వీరు ముగ్గురూ వారి.. వారి.. స్థాయిల్లో సహకరించడంవల్లనే అమ్మాయి ప్రసారభారతిలో ప్రవేశించగలిగింది. వారే.. పూర్వ ప్రసార భారతి డైరెక్టర్ జనరల్ (ఆ స్థాయి పోస్టులో పనిచేసిన మొదటి తెలుగువాడు) శ్రీ ఆర్. వెంకటేశ్వర్లు గారు, అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టర్ సి.ఎస్. రాంబాబు గారు, ఆత్మీయ మిత్రుడు, ఆకాశవాణిలో రిటైర్డ్ అనౌన్సర్ శ్రీ మడిపెల్లి దక్షిణా మూర్తి గారు.

ప్రోగ్రాం ఆఫీసర్‌గా ట్రైనింగ్ అవుతున్న నిహార
భర్త.. వినోద్, కూతురు ఆన్షితో… నిహార

ఇక్కడ చెప్పదలచుకున్నది ఏమిటంటే, చదువులో పిల్లలకు స్వేచ్ఛ ఇవ్వడం లేదా సరైన విధానంలో మార్గదర్శనం చేయడం కీలకం. అందరూ ఒకేరకమైన కోర్సులవైపు ఆకర్షింపబడకుండా, అసలు ఎలాంటి కోర్సులు మన పిల్లల భవిష్యత్తుకు ఆసరాగా నిలుస్తుందో ఆలోచించి, అవసరమైతే నిపుణుల దగ్గర సలహా తీసుకుని పిల్లల చదువు మీద దృష్టి పెట్టడం అవసరం. ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే, మా చిన్నన్నయ్య, డా. కానేటి మధుసూదన్, ఆకాశవాణి -విశాఖపట్నం కేంద్రంలో అనౌన్సర్‌గా చేసేవారు. ఆయన ద్వారా అమ్మాయి మీద ఆకాశవాణి ప్రభావం పడకపోవడం ఆశ్చర్యకరం!

రెండోది – మా అమ్మాయికి చిన్నప్పుడు ఏ రేడియో కేంద్రం చూపించడానికి తీసుకువెళ్లానో, అదే ఆకాశవాణి-వరంగల్ కేంద్రంలో ఆఫీసర్‌గా పని చేయడం యాదృచ్ఛికమైనా, ఆనంద దాయకం!

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version