జ్ఞాపకాల పందిరి-153

23
2

ర్యాగింగా.. రాక్షసత్వమా..!!

[dropcap]ఈ[/dropcap] రోజుల్లో ‘ర్యాగింగ్’ అనే మాట, చదువుకున్నవాళ్లలోనూ, అక్షర జ్ఞానం లేనివాళ్లలోనూ, చిన్న పెద్ద, అన్న తేడా లేకుండా అందరి నోళ్ళల్లోనూ, నానుతున్న మాట. దాని అసలు అర్థం అందరికి తెలియకపోయినా ఈ మధ్య జరుగుతున్న కొన్ని సంఘటనల వల్ల, సారాంశం అందరికీ అవగాహన లోనికి వచ్చింది. కరోనా మహమ్మారి కలకలం సృష్టించక ముందు అందరికి ‘మాస్క్’ గురించి తెలియనట్లే, ర్యాగింగ్ గురించి గతంలో చాలా మందికి తెలియదు. కొత్తగా విశ్వవిద్యాలయాల్లో చేరిన విద్యార్థులకు, వృత్తి విద్యా కోర్సులు చదివే విద్యార్థులకు మాత్రం తప్పక ర్యాగింగ్ గురించి తప్పక తెలుస్తుంది. ఎందుచేతనంటే, దానిని ఎదుర్కొనేవారు, ఆ క్రీడకు బలి అయ్యేవారు ఆ.. విద్యార్థులే కాబట్టి!

నిజానికి, ర్యాగింగ్ అనేది భయపడవలసిన అంశం కానే కాదు. ఇది కొత్త-పాత విద్యార్థుల మధ్య జరిగే ఆత్మీయ సమ్మేళనం. మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసే సమావేశం. అది ఎవరు ప్రవేశపెట్టారో తెలియదు కానీ ఇది స్వదేశీయం మాత్రం కాదు.

ఈ ఆత్మీయ సమ్మేళనాలలో, కొత్తవారి, భయం, సిగ్గు (ముఖ్యంగా గ్రామ ప్రాంతాలలో ఇంటర్మీడియెట్ వరకూ చదువుకుని పెద్ద చదువుల కోసం, లేదా వృత్తి విద్యా కోర్సులు చదవడం కోసం, నగరాలకు, పట్టణాలకు వచ్చే విద్యార్థుల కోసం) పోగొట్టి దైర్యంగా అందరితో కలసి మెలసి ఉండడానికి, వారిలోని బెరుకుతనం పోగొట్టడానికి ఇది బ్రిటీష్ కాలంనాటి నుండీ ఇప్పటివరకూ కొనసాగుతూ వస్తున్నది. అయితే ఉద్దేశం ఏదైనా అప్పటినుండీ ర్యాగింగ్ పేరుతో అంశం పట్టాలు తప్పుతూనే వుంది. స్నేహతత్వం, మానవత్వం, పక్కకు జరిగి సీనియర్ విద్యార్థులంటే, జూనియర్లకు ఒకరమైన భయమూ, ఏహ్యభావమూ గూడు కట్టుకోవడం జరుగుతున్నది. బ్రిటీష్ తదితర హయాంలో, తెల్లవాళ్లు, మనవాళ్ళని బానిసలుగా చూసేవారని, ఏదో రూపంలో మనవాళ్ళని మానసికంగా హింసించేవారనీ చెబుతారు.

ప్రస్తుత పరిస్థితుల్లో, సీనియర్లు కొందరు, జూనియర్లను ఆటపట్టించడానికీ గతంలో తమని తమ సీనియర్లు ర్యాగింగ్ చేశారు కనుక, మనం అంతకంటే ఎక్కువ చేయాలని మరికొందరు, తమ క్రూరత్వాన్ని ప్రదర్శిస్తూ ర్యాగింగ్ పేరుతో వికృత చేష్టలకు పాల్పడేవారు ఇంకొందరు. ర్యాగింగ్ విషయంలో కొన్ని నిర్దిష్టమైన నిబంధనలు ఉన్నప్పటికీ పాలక వర్గాలు పట్టించుకోకపోవడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల కొన్ని అనర్థాలు చోటు చేసుకుంటున్నాయి, ప్రమాదాలకు దారి తీస్తున్నాయి.

ర్యాగింగ్‌లో కొన్ని వికృత చేష్టలు ఇక్కడ ఉదహరించక తప్పదు. నగ్నంగా ఆడపిల్లల వసతిగృహం చుట్టూ ప్రదక్షిణలు చేయమనడం, ఆడపిల్ల నగ్న చిత్రం నేలమీద గీసి, శృంగారం చేయమనడం, పచ్చిబూతులు మాట్లాడమనడం, గుంజీలు తీయమనడం, బట్టలు ఊడదీసి నాట్యం చేయమనడం, వికృత చేష్టలకు కొన్ని ఉదాహరణలు మాత్రమే!

అసలే భయం భయంగా కళాశాలల్లో అడుగుపెట్టే గ్రామీణ ప్రాంతపు పిల్లలు, ముఖ్యంగా సున్నిత మనస్కులు వీటిని ఎలా తట్టుకోగలరు?, ఎంతమంది అధికారులకు ఫిర్యాదు చేయగలరు? ఫిర్యాదు చేసి సీనియర్ల మధ్య ఎలా తిరగగలరు? అందుచేతనే ఏమీ చేయలేని పరిస్థితిలలో కొందరు విద్యార్థీ-విద్యార్థినులు తొందరపాటుతో అఘాయిత్యాలకు పాల్పడి కన్న తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తున్నారు. సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే వీటి గురించి సీరియస్‌గా ఆలోచించడం కాకుండా అసలు అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం వుంది.

అయితే, నిజానికి ఈ మధ్య ఒక మెడికల్ పి.జి. విద్యార్థిని ఆత్మహత్యకు కారణం ర్యాగింగ్ అని ప్రాథమిక దశలో కొన్ని పత్రికలు రాశాయి. కానీ దానిని ర్యాగింగ్ అనకూడదు. పిజి స్థాయికి వచ్చాక ర్యాగింగ్ అనడానికి వీలులేదు. కొన్ని విషయాల వల్ల రాక్షసత్వం, ఒక రకమైన శాడిజం మొదలై అఘాయిత్యాలకు దారితీయిస్తాయి. అది ఆడ-మగ మధ్య కావచ్చు, ఆడ-ఆడ మధ్య కావచ్చు, మగ-మగ మధ్య కావచ్చు, ప్రొఫెసర్లు -విద్యార్థీ, విద్యార్థినుల మధ్య కావచ్చు. అది ప్రేమ వ్యవహారం కావచ్చు, జెలసీ కావచ్చు, ఏదో కారణం వల్ల కసి తీర్చుకోవడం కావచ్చు.

కానీ, కారణం ఏదైనా సమస్యలకు బలైపోతున్నది ఎక్కువగా ఆడపిల్లలే! అందులో మళ్ళీ బడుగు బలహీన వర్గాల పిల్లలే! ఎవరి పిల్లలైనా నష్టం భర్తీ చేయలేనిది. అంతమాత్రమే కాదు, జరిగిన నష్టానికి ప్రభుత్వాలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించడం కూడా సమస్యకు సరియిన పరిష్కారమార్గం కాజాలదు. ఇలాంటి సమస్యలకు తావీయకుండా కళాశాల పాలక వర్గాలు కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఎంతైనా వుంది.

సుమారు యాభై సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటన ఇక్కడ ప్రస్తావించక తప్పదు. ర్యాగింగ్ ఫలితంగా జరిగిన సంఘటన ఇది. మాకు అతి సమీప బంధువుకు (సంఘటన జరిగేటప్పటికీ ఇంకా మాకు బంధువు కాలేదు) మద్రాసు మెడికల్ కాలేజీలో ఎం.బి.బి.ఎస్. సీటు వచ్చింది. దానికి వాళ్ళ కుటుంబంతో పాటు యావత్ గ్రామం (దిండి, మల్కీపురం మండల్, తూ.గో. జి) గర్వపడింది, సంతోషించింది. అప్పటికి మా సామాజిక వర్గంలో ఎక్కువమంది వైద్య వృత్తిలోకి రాలేదు.

కేవలం ర్యాగింగ్ వల్ల 50 ఏళ్ల క్రితం మద్రాసు లో మెడికల్ సీటు వదులుకుని స్వరాష్ట్రానికి తిరిగి వచ్చిన రచయిత సమీప బంధువు.. స్వర్గీయ శ్రీ వర్ధనపు బ్రహ్మానందరావు,(బ్రహ్మం) రాజమహేంద్రవరం

అయితే, ఆ అందరి సంతోషం ఎంతోకాలం నిలవలేదు. అక్కడి ర్యాగింగ్ తట్టుకోలేక ఆ వైద్య విద్యార్థి, పారిపోయి స్వగ్రామానికి తిరిగి వచ్చేసాడు. స్వతహాగా తెలివైనవాడు కనుక ఆ తర్వాత విద్యారంగంలో మంచి స్థాయికి ఎదిగాడు. ‘డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయాని’కి డిప్యూటీ డైరెక్టర్ (రాజమండ్రి)గా, సేవలు అందించి, పదవీ విరమణ చేశారు. ఇప్పుడు ఆయన లేరు, అది వేరే విషయం.

నేను, దంత వైద్యం కోర్సులో చేరినప్పుడు కూడా మా సీనియర్లు మమ్ములను ర్యాగింగ్ చేశారు, కానీ వాళ్ళు మా మీద ఎలాంటి రాక్షసత్వమూ, క్రూరత్వం ప్రదర్శించలేదు. మంచి ఆత్మీయమైన వాతావరణంలో, చిట్టీలు రాసి, లాటరీలా తీసి అందులో ఏమి రాసివుంటే ఆ పని చేయమన్నారు.

రచయిత తో పాటు ర్యాగింగ్ ఎదుర్కొన్న సహాధ్యాయ మిత్రులు-మిత్రమణులు కొంతమంది

వాళ్ళు మా నుండి ఆశించినవి – పాటలు పాడడం, సినిమా డైలాగులు చెప్పడం, నాట్యం చేయడం, మాయలఫకీరులా నవ్వడం ఇలా కొన్ని. నాకు పాటలు పాడే ఛాన్సు వచ్చింది, పాడాను. కానీ ఏ పాట పాడానో ఇప్పుడు నాకు గుర్తులేదు.

ర్యాగింగ్ జరిగిన కోటి- కామత్ హోటల్ (1975)

ఇంతకీ, నేను చెప్పదలచుకున్నది ఏమిటంటే, ర్యాగింగ్‌కు నేను వ్యతిరేకిని కాను. కానీ ర్యాగింగ్‌‌కు కొన్ని కఠినమైన పరిమితులు వుండి సంతోష వాతావరణంలో జరిగేటట్టు, సీనియర్ల పట్ల, జూనియర్లకు గౌరవం, మర్యాద ఎప్పటికీ నిలిచి ఉండేటట్లు ఉండాలి, కానీ, అఘాయిత్యాలకు ముఖ్యంగా ఆత్మహత్యలకు దారితీయకుండా ఉండాలి. పిల్లలు, కన్న తల్లిదండ్రుల ఆశలు అడియాసలు అయ్యేట్లు వుండకూడదు.

1975 బి.డి.ఎస్. బ్యాచ్

విద్యార్థీ – విద్యార్థినులు కూడా ఇది గమనించాలి. ఇప్పటికీ కొందరు నా సీనియర్లు, చదువు చెప్పిన ప్రొఫెసర్లు, నన్ను ఆత్మీయంగా పలకరించడం నాకు ఎంతో తృప్తిని, ఆనందాన్ని కలిగిస్తుంటుంది.

‘సమస్యకు పరిష్కారం

ఆత్మహత్య కాదు..!

బ్రతికి సాధించగలగడం

కావాలి, జీవిత పరమార్థం!!’

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here