జ్ఞాపకాల పందిరి-155

25
2

చదువే కాదు.. ఇవి కూడా..!!

[dropcap]పి[/dropcap]ల్లలు పుట్టగానే, వాళ్ళ ఆటా పాటా ప్రక్కన పెట్టి, కేవలం చదువు గురించి ఆలోచించే తల్లిదండ్రులు ఎక్కువైనారు ఇప్పుడు. అయితే అందరికంటే లేదా అందరిలానే తమ పిల్లలు కూడా మంచిగా చదువుకోవడానికి మంచి విద్యాసంస్థల్ని ఎన్నుకునే ప్రయత్నం చేస్తారు. ఇందులో తప్పేమీ లేదు, కానీ, కేవలం చదువుకు మాత్రమే ప్రాధాన్యత నిచ్చి, మిగతా విషయాలు పట్టించుకొనకపోతే పిల్లలు మానసికంగా ఎదగలేరు, నలుగురితో కలవలేరు, మంచి చెడ్డలు నేర్చుకోలేరు, ప్రపంచ జ్ఞానం తెలుసుకోలేరు, మంచి – మర్యాదలను ఆకళింపు చేసుకోలేరు. ఇవన్నీ కేవలం చదువు వల్ల మాత్రమే వస్తాయనుకుంటే అది పొరపాటే! చదువుతోపాటు పిల్లలకు లోకజ్ఞానం కూడా అవసరమే! మరి, అది పిల్లలకు ఎలా సమకూరుతుంది?

మంచి చదువుతో పాటు, క్రీడలు, నాట్యం, చిత్రలేఖనం, నటన, బొమ్మలు చేయడం, సంగీతం, స్టాంపుల సేకరణ, ఇలా ఒకటి కాదు, అన్నీ పిల్లలకు అవసరమే. వీటికి పిల్లల వయసుతో ప్రమేయం లేదు. ఏ వయసులో, ఎవరికీ, ఏ అభిరుచి ఉంటుందో వాటిని తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. అంటే చదువు మాని ఇవి నేర్చుకోమని కాదు దీని అర్థం. చదువుతోపాటు ఇవి కూడా ఉంటే మంచిదని చెప్పడమే నా ప్రధాన ఉద్దేశం. మరి ఇవన్నీ అందరు పిల్లలకి సమకూరుతాయా? అన్న ప్రశ్న కూడా చాలా మందిలో ఉదయించవచ్చు. సాధ్యపడివ వాటిల్లోనే పిల్లలను ప్రోత్సహించాలి. ఇప్పుడు చాలా మటుకు కార్పొరేట్ పాఠశాలల్లో ఇవన్నీ సమకూర్చే ప్రయత్నం చేస్తున్నారు. కాస్త అభిరుచి వుండి, శ్రమ తీసుకునే ప్రభుత్వ పాఠశాలలు కూడా కొన్ని, కార్పొరేట్ పాఠశాలలను అనుకరించే ప్రయత్నం చేస్తున్నాయి. ఇది మంచి పరిణామమే! ప్రభుత్వ పాఠశాలలు చాలా మట్టుకు వీటిపట్ల శ్రద్ధ వహించకపోవడం బాధాకరం. ఉన్న వనరులను ఉపయోగించుకుని, తమ వంతు ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుల కృషిని కూడా ఇక్కడ విస్మరించలేము. ఇలా కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా పనిచేస్తున్న ప్రభుత్వ పాఠశాలలు కూడా లేకపోలేదు, లేదంటే బహు తక్కువ.

నాకు తెలిసి గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో, డ్రిల్లు పిరియడ్, డ్రాయింగ్ పిరియడ్, లైబ్రరీ పిరియడ్, క్రాఫ్ట్స్ పిరియడ్ ఉండేవి. ఇప్పుడు అవి కొనసాగుతున్నాయో లేదో నాకు తెలీదు. వీటితో, చదువుకు అదనంగా కొన్ని విషయాలు పిల్లలకు తెలిసేవి. ముఖ్యంగా క్రమశిక్షణ బాగా అలవాటు అయ్యేది. కొన్ని పాఠశాలల్లో తోటపని పిరియడ్ కూడా ఉండేది, ఇది కూడా పిల్లలకు బాగా ఉపయోగపడేది.

ఇప్పుడు కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజులు ఎక్కువైనా, చదువుతోపాటు, క్రీడల్లో, సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాల్లో, కరాటే వంటి విద్యల్లో సంగీతంలో, విచిత్రవేషాల్లో, డ్రాయింగులో, నాట్యంలో, ఆధునిక కంప్యూటర్ విజ్ఞానంలో తర్ఫీదు ఇచ్చి వాటిల్లో అందరూ పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నారు. కథలు చెప్పటంలో, కథలు అల్లడంలో, పుస్తకపఠనంలో ఉత్సాహం చూపించేలా చర్యలు తీసుకుంటున్నారు. తలుచుకుంటే ప్రభుత్వ పాఠశాలలు కూడా కార్పొరేట్ స్థాయికి చేరుకోగలవు. ఇంటి దగ్గర కూడా చదువు, హోమ్ వర్క్ పూర్తి అయిన పిదప, బలవంతంగా కాకుండా పిల్లల అభిరుచి మేరకు, వాళ్ళు ఆడుకుంటానంటే ఆడుకోనివ్వాలి. బొమ్మలు గీస్తుంటే గీసుకోనివ్వాలి. సంగీతం నేర్చుకుంటానంటే నేర్చుకోనివ్వాలి. రేడియోను, టి.వి.ని అనుకరిస్తూ పాటలు పాడుతుంటే పాడుకోనివ్వాలి, వాటిల్లో ప్రసారమయ్యే పాటలకు అనుగుణంగా, నాట్యం చేస్తుంటే చేయనివ్వాలి. మిమిక్రీ – మైమ్ వంటివి ప్రాక్టీస్ చేస్తుంటే చేయనివ్వాలి. తోటి పిల్లల పుట్టినరోజు పండుగలకు వెళ్లి వాళ్ళతో కలసి మెలసి ఉండేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. కులమతాల తేడాను పిల్లల మధ్య రానీయకూడదు. బహుశః ఈ ఉద్దేశంతోనేనేమో, కొన్ని పాఠశాలల్లో కులమతాలకు అతీతంగా ప్రతి పండుగను పాఠశాలలో జరిపి, దానికి తగిన వస్త్రధారణ చేయించి, ఆ పండుగ ప్రత్యేకత పిల్లలందరికీ తెలిసేలా చేస్తున్నారు. దీనికి భిన్నంగా, వాళ్ళు మన కులం కాదు, మతం కాదు, ప్రాంతం కాదు, ఆ దేవుడు మన దేవుడు కాదు అని చిన్నపిల్లల లేతమనసుల్లో విషం చల్లే తల్లిదండ్రులు, ఇతర పెద్దలు కూడా మన సమాజంలో లేకపోలేదు. కానీ ఇది సరైన పద్ధతి కాదు. ఇది వారు తెలుసుకోవాలి.

రచయిత మనవరాలు.. ఆన్షి.నల్లి, – ఐ .వి.ఇంటర్నేషనల్ స్కూల్, హన్మకొండ.
ఆన్షి.నల్లి, – గీతాంజలి పబ్లిక్ స్కూల్,బేగంపేట్,హైదరాబాద్

ఇక నా విషయానికొస్తే, చిన్నప్పుడు నా చదువు అంతంత మాత్రమే ఉండేది. ఇతర విషయాల జోలికి పోయేవాడిని కాదు. ఆర్థికపరంగా చాలా వెనుకబడిన కుటుంబం కనుక, డబ్బుతో ముడిపడిన అంశాల జోలికి అసలు పోయేవాడిని కాదు. ఇంటర్మీడియెట్‌కు వచ్చేవరకూ ఇదే కొనసాగింది. ఇంచుమించు నా పిల్లలు కూడా కొద్దీ తేడాతో ఇలాగే పెరిగారు. నన్ను, నాతో కలిసివచ్చిన అవకాశాలను వాళ్ళు సద్వినియోగం చేసుకున్నారు. పిల్లలిద్దరినీ, నా కులానికి మాత్రమే కట్టి పడవేయకుండా, కులమతాలకు అతీతంగా అందరితో కలిసి మెలసి ఉండేలా పెంచి పెద్ద చేసాను.

నా మనవరాలు (కూతురి పుత్రికా రత్నం) విషయం వచ్చేసరికి, మొత్తం సన్నివేశం మారిపోయింది. కార్పొరేట్ చదువుతోనే ఆమె బాల్యం మొదలయింది. అందరితో కలిసి వుండాలని, స్నేహం చేయాలని అంటుంది. బడిలో అన్ని పండుగలకు తన ఉనికిని చూపిస్తుంది. ఆ పండుగలకు తగ్గ వేషధారణతో బడికి వెళుతుంది. దేనికైనా నేను సిద్ధం అంటూ వాళ్ళమ్మ ముందు నిలబడుతుంది. తల్లి అన్నీ ఓపిగ్గా చేస్తూ కూతురుని మరింతగా ప్రోత్సహిస్తుంది.

మేనమామ రాహుల్ తో ఆడుతూ చి.ఆన్షి.నల్లి.

ఈ వయసులో (ఇప్పుడు రెండవ తరగతికి వచ్చింది) అలవోకగా బొమ్మలు స్వయంగా గీస్తుంది. ఆ బొమ్మకు ఒక అర్థం లేకపోవచ్చు, కానీ తన ఊహతో ఏవో బొమ్మలు వేసేస్తుంది. ఇక ‘అలెక్సా’ వినిపించే పాటలకు డాన్సు చేసేస్తుంది. ఎప్పుడు అవసరం అయితే అప్పుడు విసుగు లేకుండా విచిత్ర వేషాలకు ‘సై’ అంటుంది. స్వంతంగా కథలు అల్లి చెబుతుంది. ఎంత పెద్ద ఆంగ్ల కవిత అయినా రెండుమూడు సార్లు చదివి, చూడకుండా వల్లించేస్తుంది. తన తరగతిలో ఉపాధ్యాయిని బోధించిన పాఠాన్ని, ఇంటికి వచ్చి యథాతథంగా మాకు బోధిస్తుంది, మాకు ప్రశ్నలు వేస్తుంది, మార్కులు వేసి ర్యాంకులు కూడా ఇస్తుంది.

 

చి.ఆన్షి.నల్లి కి ఆటవిడుపు

చదువులో ఎప్పుడూ అగ్రగామిగానే ఉంటుంది. ఇక్కడ నా మనవరాలి గొప్పతనం మీ మీద రుద్దడం నా ఉద్దేశం కానేకాదు. అటు బడిలోగానీ ఇటు ఇంట్లోగానీ, పిల్లలకు అనువైన వాతావరణం మనం కల్పించగలిగితే వారు చేసే ప్రతి మంచి పనిని ప్రోత్సహించ గలిగితే, ఆ వాతావరణంలో పెరిగే పిల్లలు అన్ని రకాలుగాను ముందంజలో వుంటారని, వారిని మంచి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దిన తృప్తి మనకు మిగులుతుందని చెప్పడమే ఈ నా వ్యాసం ముఖ్యోద్దేశం. చదవడం లేదని విసుక్కోవడం, పిల్లలు చేసే ప్రతి పనినీ విమర్శించడం, అడ్డు తగలడం, అర్థం పర్థం లేకుండా పిల్లల్ని దండించడం వంటి పనులు చేయడం వల్ల పిల్లల్లో సహజంగా వుండే సృజనాత్మక శక్తి క్రమంగా నశించిపోతుంది. అందుచేత ఏదైనా మన కోర్కెలకు తగ్గట్టుగా పిల్లల్ని బలవంతపెట్టకుండా వారి అభిరుచుల మేరకు పిల్లల్ని ప్రోత్సహించాలి.

ఆన్షి గీసిన చిత్ర మాలిక

పిల్లల విషయంలో తల్లిదండ్రులు కూడా కొన్ని త్యాగాలు చేయాలి. పిల్లలకు ఎక్కువ సమయం కేటాయించాలి. వాళ్ళు చదువుకుంటున్నప్పుడు, చదువుకోవాల్సిన సమయం ఆసన్నమయినప్పుడు, తల్లిదండ్రులు గానీ, ఇతరులు గానీ, గట్టిగా మాట్లాడుకోవడం, ఫోన్‌లో గట్టిగా మాట్లాడుకోవడం, టి.వి. చూడడం, రేడియో వినడం వంటివి చేయకపోవడమే మంచిది. పిల్లల చదువుకు, ఇంట్లో ప్రశాంత వాతావారణం కలగజేయవలసిన ప్రధాన బాధ్యత తల్లిదండ్రులదే! పిల్లల ముందు అరుచుకోవడం, పోట్లాడుకోవడం, ఒకరిని మరొకరు నిందించుకోవడం, తల్లిదండ్రులు చేయకూడని పనులలో మరికొన్ని అని అర్థం చేసుకోవాలి. పిల్లలకు చదువు సంధ్యలు ఎంత ముఖ్యమో, వాళ్లకి ఆటా-పాటా కూడా అంతే ముఖ్యమని అర్థం చేసుకోవాలి.

ఆన్షి విచిత్ర వేషాలు

చదువుతో పాటు ఇంట్లో సంస్కారం, మన సంస్కృతీ -సంప్రదాయాలు, మంచి -మర్యాద నేర్పుకోవలసిన బాధ్యత తల్లిదండ్రులది లేదా పిల్లల ఇతర సంరక్షకులదీను. తల్లిదండ్రులు మాట్లాడే ప్రతి మాట, ప్రతి పని, పిల్లలు గమనిస్తూ ఉంటారన్న సంగతి తల్లిదండ్రులు ఎప్పుడూ మర్చిపోకూడదు. ఈ విషయంలో నా ఈ స్థితికి కారకులైన నా తల్లిదండ్రులను, ఇద్దరు అన్నలను, ఇద్దరు అక్కలను, ఇతర శ్రేయోభిలాషులను ఎన్నటికీ మరువలేను.

పిల్లలకు చదువు అవసరమే
చదువుకు అదనంగా
క్రమశిక్షణ, ఆట – పాటలు
సంస్కృతీ – సంప్రదాయాలు,
ఇష్టమైన అభిరుచులు
ప్రోత్సహించవలసిన అంశాలు!

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here