జ్ఞాపకాల పందిరి-156

19
2

భలే మంచి రోజు..!!

[dropcap]హై[/dropcap]దరాబాద్ వంటి మహానగరంలో, కళలకు, కళావేదికలకూ, సాహిత్యకారులకూ, సాహిత్య సాంస్కృతిక సంస్థలకూ కొదవలేదు. అయితే, హైదరాబాద్ – సికింద్రాబాద్ పట్టణాల జనాభాకు అవసరం అయినన్ని ఆధునిక ఆడిటోరియంలు మాత్రం అందుబాటులో లేవనే చెప్పాలి. నాకు తెలిసి, తెలంగాణా (ఆంద్ర) సారస్వత పరిషత్, త్యాగరాయ గానసభ, రవీంద్రభారతి, హరిహర కళాభవన్, కె.ఎల్.ఎన్ ప్రసాద్ ఆడిటోరియం, రావి నారాయణ రెడ్డి ఆడిటోరియం వంటివి, మరి కొన్ని కొత్తవి వుండి ఉండవచ్చు. అయితే చాలామందికి తెలిసిన ఆడిటోరియంలు మాత్రం, రవీంద్రభారతి, పుచ్చలపల్లి సుందరయ్య ఆడిటోరియం, ఇంకా త్యాగరాయ గానసభ.

వీటిల్లో ఎప్పుడూ సాహిత్య కార్యక్రమాలు, సదస్సులు, సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీత కార్యక్రమాలూ జరుగుతుంటాయి. నేను నా బాల్యం ఎక్కువ శాతం హైదరాబాదులో అన్నయ్య దగ్గర గడపడం మూలాన; ఆయన, శాంతినగర్, విజయనగర్ కాలనీ, మాసబ్ టాంక్, కాకతీయనగర్ వంటి ప్రదేశాలలో నివసించడం వల్లనూ, స్వయంగా ఆయన రచయిత కావడమూ, అనేక సాహిత్య సాంస్కృతిక సంస్థలతో సంబంధం ఉండడం మూలాన, అన్నయ్యకు ఆహ్వానాలు, ఫ్రీ పాస్‌లు వచ్చేవి. వాటిని ఎక్కువగా నేను సద్వినియోగం చేసుకునేవాడిని. అదిగో, అలా రవీంద్రభారతి నాకు బాగా దగ్గరయింది. త్యాగరాయ గానసభ చిక్కడపల్లిలో ఉండడం మూలాన, అంత దూరం నేను వెళ్లలేక పోయేవాడిని. అలా త్యాగరాయ గానసభతో నాకు ఎక్కువ సంబంధాలు లేవు.

అప్పట్లో రవీంద్రభారతిలో కార్యక్రమం జరపడం అంటే చాలా గొప్ప! చాలా మటుకు నాటకాలూ, నాట్యం, నృత్య రూపకాలు, అవధానాలు, కవిసమ్మేళనాలు, ఇతర సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు జరిగేవి. అలా నేను బి.డి.ఎస్.లో మా గురువు, డా. సి.డి. రెడ్డి గారి అమ్మాయి కూచిపూడి నృత్య ఆరంగేట్రం (మాట్లాడాను కూడా), దివాకర్ల వెంకటావధాని గారి అష్టావధానం, విశ్వనాధ సత్యనారాయణ గారి అధ్యక్షతన జరిగిన కవి సమ్మేళనం, ఈలపాట రఘురామయ్యగారి ఈలపాట పద్య గానం, పాలగుమ్మి విశ్వనాథం (ఆకాశవాణి -హైదరాబాద్) గారు రచించి, స్వరపరచి గానం చేసిన ‘అమ్మ దొంగా నిన్ను చూడకుంటే..’ (తర్వాత వేదవతి ప్రభాకర్ గారితో రికార్డు చేసినట్టు గుర్తు) పాట, ఆవిష్కరణ కార్యక్రమం, రేడియో అన్నయ్య చిన్నపిల్లల నాటికలు, ఇలా చాలా కార్యక్రమాలు రవీంద్రభారతిలో చూసిన అనుభవాలు నాకు వున్నాయి.

చిన్న చిన్న సంస్థలకు అప్పట్లో రవీంద్రభారతి దొరకడం గగన కుసుమం గానే ఉండేది. అయితే తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత, తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఒక చక్కని వెసులుబాటుకు తెర ఎత్తింది. అదేమిటంటే రవీంద్రభారతి లోని మినీ హాల్‍లో, సమావేశాలు ఉచితంగా ఏర్పాటు చేసుకునే ఏర్పాటు చేయడం చిన్న చిన్న సాహిత్య సంస్థలకు వారి కార్యక్రమాలకు అనువు ఏర్పడింది.

నా చదువు పూర్తికావడము, ఉద్యోగంలో చేరడం, హన్మకొండలో స్థిర నివాసం ఏర్పరచుకోవడం వల్ల, హైదరాబాదుకు దూరమయ్యాను. 2011లో పదవీ విరమణ చేయడం, 2021లో మా అమ్మాయి వరంగల్ ఆకాశవాణి నుండి హైదరాబాద్ ఆకాశవాణికి బదిలీ కావడం, మనవడు పుట్టడం వంటి సన్నివేశాలతో ఇప్పుడు నేను సికింద్రాబాద్ (సఫిల్‌గూడ)లో ఉండవలసిన పరిస్థితి ఏర్పడిపోయింది. తిరిగి ఇక్కడ వివిధ సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలకు వెళ్లే అవకాశం దొరికింది. లేదంటే ఎక్కడికి వెళ్లాలన్నా దూరమే! అయినప్పటికీ సాహిత్యసభలపై వున్న మక్కువతో ఎంత దూరమైనా వెళ్లక తప్పడం లేదు.

మూడు నెలల క్రితం సాహితీ మిత్రులు, రచయిత, కవి, సమీక్షకులు, మంచి విమర్శకులు, నా మిత్రుడు శ్యామకుమార్‌కు వియ్యంకుడు వరుస శ్రీ దాస్యం సేనాధిపతి గారి ఆహ్వానం మేరకు, వారి పుస్తకావిష్కరణ కార్యక్రమానికి, త్యాగరాయ గానసభకు వెళ్లే అవకాశం దొరికింది. బహుశః అదే నేను మొదటిసారి త్యాగరాయ గానసభకు వెళ్లడం అనుకుంటాను. అంతకు ముందు విద్యార్థి దశలో నేను అక్కడకు వెళ్లిన గుర్తులేదు. అయితే శ్రీ సేనాధిపతి గారు ఏర్పాటు చేసిన కార్యక్రమం, అక్కడి మినీ హాల్‍లో. చాలా చిన్నగా వుంది, ఎక్కువమంది ఆహూతులు కూర్చునే అవకాశం లేదు. అప్పుడు మెయిన్ హాల్‍లో నృత్య ప్రదర్శన జరుగుతుండడం వల్ల, అది చూసే అవకాశం నాకు రాలేదు.

అనుకోని రీతిలో 23-03 -2023 రోజున మళ్ళీ చిక్కడపల్లి లోని త్యాగరాయ గానసభకు వెళ్లే అవకాశం వచ్చింది. అది వంశీ ఆర్ట్స్ ఆధ్వర్యంలో, వంశీ రామరాజుగారు ఏర్పాటు చేసిన ‘ఉగాది సంబరాల’ కార్యక్రమం. అయితే దీనితో నాకేమిటి సంబంధం అంటారా? గొప్ప సంబంధమే వుంది.

ఉగాది సంబరాలలో భాగంగా, తెలుగు సాహిత్యంలో ఒక వెలుగు వెలిగిన ప్రసిద్ధ రచయితల పేరు మీద కొందరు ప్రస్తుత ప్రసిద్ధ రచయిత్రులకు, రచయితలకు అవార్డులు ప్రకటించి వారిని ఆహ్వానించారు. అందులో నాకు ఇష్టమైన, నేను మెచ్చిన, నాకు నచ్చిన, ఎందరెందరికో అభిమాన రచయిత్రి అయిన శ్రీమతి ఝాన్సీ శ్రీనివాస్ కొప్పిశెట్టి కూడా ఉండడం; ఆవిడ ఆ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం జరిగింది.

రచయిత్రికి అవార్డు ప్రకటన

అలా నేను మళ్ళీ కొద్దిరోజుల్లోనే త్యాగరాయ గానసభకు వెళ్లే అవకాశం కలిగింది. అయితే ఈ కార్యక్రమం మెయిన్ హల్లో పెట్టారు. ఏభై ఎళ్ల సుదీర్ఘ చరిత్ర గల వంశీ ఆర్ట్స్‌కు నాకు తెలిసినప్పటి నుండి చాలా మంచి పేరు వుంది. కార్యక్రమాలు చాలా ఘనంగా చేస్తారని కూడా విన్నాను. అయితే మారుతున్న పరిస్థితులను బట్టి, ఈ మధ్య నిర్వహిస్తున్న గందరగోళం అవార్డు ఫంక్షన్లను దృష్టిలో ఉంచుకుని, మిత్రమణి గారి మీద అనుమానం గానే సకాలంలో సభాస్థలికి చేరుకున్నాను. అదృష్టావశాత్తు రచయిత్రికి కేటాయించిన సీటుకు దగ్గరలోనే సీటు దొరికింది. అడపాదడపా ముచ్చటించుకునే అవకాశం దొరికింది.

అవార్డు కైవసం చేసుకున్న శ్రీమతి కొప్పిశెట్టి రచనలు

ఇక రచయిత్రి విషయానికొస్తే, శ్రీమతి ఝాన్సీ శ్రీనివాస్ కొప్పిశెట్టి గారు తన కవితల ద్వారా, నాకు ఫేస్‌బుక్ ఫ్రెండ్ అయ్యారు. మా పరిచయం తర్వాతనే వారి రచనలు ముద్రింపబడ్డాయి. ఆ విధంగా వారి అన్ని రచనలు చదివిన అనుభవం నాకుండడమూ, రచయిత్రి మీద వున్న అభిమానంతో, త్యాగరాయ గానసభలో వంశీ ఆర్ట్స్ వారి కార్యక్రమం ఎట్లా వుంటాయో చూడాలన్న అభిలాషతో అక్కడికి చేరుకున్నాను.

రమణాచారి గారినుండి అవార్డు అందుకుంటూ శ్రీమతి కొప్పిశెట్టి

రచయిత్రి శ్రీమతి ఝాన్సీ కొప్పిశెట్టి, తన యవ్వన కాలంలోనే మంచి కవయిత్రి, కథా రచయిత్రి కూడా. సంసార ఉద్యోగ బాధ్యతల్లో పడి రచనా వ్యాసంగాన్ని వదిలేశారు. అప్పుడు మళ్ళీ రాయగలుగుతానని ఈ రచయిత్రి అనుకుని వుండరు, ఎందుకంటే అప్పటి కుటుంబ, ఉద్యోగ పరిస్థితులు అలాంటివి. కానీ, వార్ధక్యానికి కాస్త చేరువలో ఉండగానే మళ్ళీ మంచి రచయిత్రిగా సాహితీ రంగంలో ప్రవేశించడం, నాలాంటి సాహితీ అభిమానులకు చేరువ కావడం, వంశీ ఆర్ట్స్‌ను ఆకర్షించడం, అలా ఈ సంవత్సరం ఉగాది సంబరాలలో, శ్రీ వంశీ రామ రాజుగారు, ‘స్వర్గీయ తెన్నేటి హేమలత పురస్కారం’ శ్రీమతి ఝాన్సీ గారికి ప్రకటించడం, నా వంటి అనేకమంది ఆమె సాహితీ బందువులకు సంతోషాన్ని కలుగజేసింది.

వంశీరామరాజు గారు (రచయిత్రికి కుడి) తదితరులతో శ్రీమతి ఝాన్సీ

ఝాన్సీ గారు హైదరాబాద్ వాస్తవ్యురాలు అయినప్పటికీ, ఇద్దరు ఆడపిల్లల్లో ఒకరు ఆస్ట్రేలియాలో, మరొకరు అమెరికాలో ఉండడం వల్ల ఎప్పుడూ ఈ త్రికోణ ప్రయాణాలు చేస్తూ వుంటారు. అయినా ఎక్కువగా గడిపేది పెద్ద కూతురు దగ్గర ఆస్ట్రేలియాలోనే! అయితే అక్కడ ఆవిడ విశ్రాంతిగా ఏమీ కాలక్షేపం చేయడం లేదు. చేతినిండా క్షణం కూడా ఖాళీ లేకుండా నిత్యం బిజీగా వుండే ఈ రచయిత్రి, తాను రచనా వ్యాసంగానికి వినియోగించుకునే స్వేచ్ఛా సమయం, ఇంట్లో అందరూ నిద్రపోయిన దగ్గరనుండి తెల్లారిపోయే వరకు. తెలుగు సాహిత్యం మీద, అందులోను నవల/కథ మీద ఆవిడకు వున్న మక్కువను తెలియజేస్తుంది. ‘నాకు రచనలు చేసే సమయం లేదు’ అని తప్పించుకునే వారికి సరైన సమాధానం, శ్రీమతి ఝాన్సీ శ్రీనివాస్ కొప్పిశెట్టి. అతి కొద్దికాలం లోనే, నాలుగు పుస్తకాల రచయిత్రిగా సాహితీలోకంలో నిలబడగలగడం నిజంగా అభినందనీయం.

స్పందన తెలియజేస్తూ రచయిత్రి ఝాన్సీ
జ్ఞాపికతో ఝాన్సీ కొప్పిశెట్టి గారు

హాల్ లోనికి అడుగు పెట్టగానే, నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. హాలు అంతా గొప్ప గొప్ప వాగ్గేయ కారుల, కళాకారుల చిత్రపటాలతో, ఇతర అలంకరణలతో, సంగీత వాయిద్యాలతో, మైలవరపు శ్రీనివాసరావు గారి వినసొంపైన, ఉగాది పంచాంగ శ్రవణంతో ఆహ్లాదకరంగా, కనువిందుగా అనిపించింది. రమణాచారి గారు, సినీ దర్శకులు శ్రీ రేలంగి నరసింహారావు గారు, ప్రసిద్ధ రచయిత శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ వంటి నగర పెద్దలందరితోనో హాలు నిండుగా వుంది. ఆహ్లాదకర వాతావరణంలో, శ్రీ రమణాచారి, ఇతర పెద్దల చేతుల మీదుగా, వంశీ రామరాజు తదితర వంశీ ఆర్ట్స్ సభ్యుల సమక్షంలో, రచయిత్రి శ్రీమతి ఝాన్సీ కొప్పిశెట్టికి అవార్డు ప్రధానము, సన్మానము ఘనంగా జరిగాయి.

త్యాగరాయగానసభ ప్రాంగణంలో మిత్రమణి ఝాన్సీ కొప్పిశెట్టి తో రచయిత

ఈ మధ్య కాలంలో ఇలాంటి కార్యక్రమాలు చూడలేదు. ఎక్కడా విమర్శకు అందని రీతిలో రామరాజుగారు, అన్నసమయానికే ముగించడం కూడా ఒక ప్రత్యేకతగా అనిపించింది. సాహిత్యకారులకు ఇలాంటి ప్రోత్సాహాలు మరిన్ని రచనలు చేయడానికి, పుష్టికరమైన సాహిత్యాన్ని అందించడానికి కేటలిస్టులుగా దోహదపడతాయని నాకు అనిపించింది.

మిత్రమణికి జరిగిన ఈ ఘన సన్మానం నాలో కూడా మంచి చైతన్యాన్ని రగిలించిందని చెప్పక తప్పదు. రచయితలుగా, రచయిత్రులుగా పాఠకుల మన్ననలను పొందడం అంత సులభమైన పని కాదు. అవార్డులు పొందడం అంతకన్నా సులభం కాదు.

ఏది ఏమైనప్పటికీ,ఈ ఉగాది సన్మానాల కార్యక్రమం నాకు ‘భలే మంచి రోజు..’ సినీమా పాటను గుర్తుచేసింది.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here