బద్ధకమా..! బహు జాగ్రత్త సుమా..!!
[dropcap]ప్ర[/dropcap]తి ఒక్కరి జీవితకాలం, వారి వారి జీవనశైలి మీద, ఆహారపు అలవాట్ల మీద, క్రమశిక్షణ మీద, ఆత్మవిశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైతే ‘బద్ధకం’ అనే వైరస్ మనిషి మస్తిష్కంలో ప్రవేశించిందో అప్పుడు అంతా చిందరవందర – గందరగోళమూనూ! బద్ధకాన్ని వైరస్‍తో పోల్చడానికి కారణం, ఇది ఒక అంటువ్యాధి లాంటిది. మనిషి, మంచి కంటే, చెడుకు చాలా త్వరగా ఆకర్షితుడౌతాడు. ఈ బద్ధకం అనే జబ్బు కొంతమందికి కుటుంబ సభ్యుల నుంచి ప్రాప్తిస్తే, మరికొందరికి ఇతరులను గమనించడం ద్వారా అంటుకుంటుంది. బద్ధకమూ – వాయిదా వేయడమూ, అనే పదాలు కలిసి బ్రతికే పదాల జంట. ఈ జంటకున్న ప్రేమబంధం ఏ పద జంటకూ ఉండదేమో! వాటి సఖ్యత, స్నేహబంధం అలాంటివి. అయితే బద్ధకాన్ని ఎలా నిర్వచించ వచ్చు? సరైన నిర్వచనం తోచక పోయినా, కనీసం, దగ్గరగా వున్న అర్థాన్ని చెప్పుకోవచ్చు.
చేయవలసిన పనిని వాయిదా వేయడం. ఇది చాలా మందిలో స్పష్టంగా కనిపించే లక్షణమే! ఇది ఎవరికీ అతీతం కాదు. ప్రతివారు ఏదో సమయంలో ఈ వైరస్ బారిన పడినవారే అయి వుంటారు.
పెద్ద పెద్ద విషయాలు పక్కన పెడితే, బద్ధకం అనేది ఉదయం నిద్ర లేచే విషయంతో ప్రారంభమౌతుంది. చక్కబెట్టవలసిన పనులున్నాయని తెలిసి కూడా, ఇంకొంచెం సేపు పడుకుందాం అని బద్ధకించడం, ఆలస్యంగా లేవడం, తాము హడావిడి పడడమే కాక పిల్లలను తొందర పెట్టడం, అనవసరమైన ఒత్తిడికి గురికావడం అనేక కుటుంబాలలో జరుగుతున్న కార్యక్రమాలే! రాత్రి ఆలస్యంగా పడుకుంటే సహజంగా – ఉదయం ఆలస్యంగా నిద్ర లేచే పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి కాస్త బద్ధకం తోడయితే ఇక చెప్పేదేముంది? అందుకే జీవితంలో కొన్ని అలవాట్లు క్రమశిక్షణతో కూడి ఉండాలి. అదే క్రమశిక్షణ పిల్లలకు అలవాటు కావాలి. అందుకే రాత్రి ఎనిమిది గంటలలోపు (కొన్ని ప్రత్యేక పరిస్థితులలో తప్ప) భోజనం ముగించడం, పది గంటలలోపు నిద్రకు ఉపక్రమించడం, కనీసం ఉదయం అయిదు గంటలకు నిద్రలేవడం వంటివి తప్పనిసరిగా ఆచరించవలసిన అంశాలు. ఇక్కడ బద్ధకానికి ఎట్టి పరిస్థితుల్లోనూ చోటివ్వరాదు.
బద్ధకం గురించి చర్చించవలసిన మరో చిన్ని విషయం, నిద్ర లేవగానే, కప్పుకున్న దుప్పటి మడత పెట్టక పోవడం. ఇక్కడ కూడా కొంతమందిలో బద్ధకం అనేది నెత్తిమీదికెక్కి భరతనాట్యం చేస్తుంది. రెండు నిముషాల ఆ పనికి బద్ధకిస్తే, పక్క మీది వాతావరణం పరిశుభ్రంగా ఉండదు. భర్త చేస్తాడులే అని భార్య, భార్య చేస్తుందిలే అని భర్త, తల్లిదండ్రులు చేస్తారులే అని పిల్లలు.. ఆ అంశాన్ని అశ్రద్ధ చేస్తారు. పిల్లలకు చిన్నప్పటినుంచీ ఈ అలవాటు రావాలంటే, తల్లిదండ్రులు ఇక్కడ తప్పక క్రమశిక్షణ పాటించాలి.
అసలు బద్ధకం అనే పదం పిల్లల చెవిలో పడకూడదు. పిల్లలు చదవాలిసిన పాఠం చదవకుండా తర్వాత చదువుదాం అని బద్ధకిస్తే తర్వాత దానికి మరోటి తోడై చదవలేని పరిస్థితి ఏర్పడవచ్చు. ఒక కొత్త కథ లేదా నవల చదవ వలస ఉండగా, మన బద్ధకంతో తర్వాత వాటిని చదవలేని పరిస్థితి ఏర్పడవచ్చు అలా ఇళ్లల్లో స్వంత గ్రంథాలయం ఏర్పరచుకున్నవారు, చదవని పుస్తకాలే అందులో ఎక్కువగా ఉంటాయి. బద్ధకానికి ఇదొక మంచి ఉదాహరణ. ఇలాంటి బద్ధకస్తులు జాబితాలో నేనూ వున్నానని చెప్పక తప్పదు. ఇంట్లో గ్రంథాలయం ఏర్పరచుకున్నవారందరూ ఇలాంటి వారని చెప్పడం నా ఉద్దేశం కాదు. కొందరు బద్ధకస్తులు కూడా ఉంటారని చెప్పడమే ముఖ్యం. ఇంకా ఇంట్లో బద్ధకానికి గురి అయ్యే చిన్న చిన్న అంశాలు చాలా వున్నాయి. ఉతికి ఆరేసిన బట్టలు ఆరిన తర్వాత తీసుకొచ్చి ఇంట్లో మంచం మీదో, సోఫాలోనో వేసేవరకూ బాగానే ఉంటుంది. బట్టలు మడత పెట్టే అంశం వచ్చేసరికి బద్ధకం రంగప్రవేశం చేస్తుంది. అంతే ఆ బట్టలు మడతలలకు నోచుకోకుండా అలానే కుప్పమాదిరిగా పడిఉంటాయి. ఇలాంటిదే ఇంటి బూజులు దూలపడం. ఏదో ఒక ఆదివారమో, సెలవు రోజో ఆ పని చేద్దామని నిర్ణయించుకోవడం, బద్ధకంతో మరో రోజుకు వాయిదా వేయడం, ఆ అనుకున్న రోజు బంధువులో, స్నేహితులో రావడం అలా మళ్ళీ వాయిదా పడడం, చాలా ఇళ్లల్లో జరిగే సన్నివేశమే!
కొందరు వారానికి సరిపడా కూరగాయలు తెచ్చి లేదా నెలకు సరిపడా కిరాణా సరుకులు తెచ్చి వంటగదిలో పెడతారు. వాటిని ఓ పట్టాన సర్దుకోరు. చిన్న బద్ధకానికి పెద్ద పని చేరుకుంటుందక్కడ. అలాగే చాకలి నుంచి ఇస్త్రీ బట్టలు వస్తాయి. వాటిని లెక్కచూసి భద్రపరుచుకోవడానికి బద్ధకమే! చదివిన పుస్తకాలు చదివిన చోట వదిలేయడం, చదివిన దినపత్రిక సోఫాలోనో కుర్చీలోనో వదిలేయడం వంటివి బద్ధకానికి చిన్న చిన్న ఉదాహరణలు. ఏదైనా సాధ్యమయినంత వరకూ ఎప్పటి పని అప్పుడు పూర్తి చేయడం అంటే, బద్ధకాన్ని తరిమి కొట్టడమే! చూడడానికి, వినడానికి ఇవి చిన్న చిన్న విషయాలుగా అనిపిస్తాయి గానీ, మనిషి జీవన శైలిని పూర్తిగా తప్పుడు మార్గం వైపు మళ్లిస్తాయి ఇవి. అంతమాత్రమే కాదు, ఈ జబ్బు ఎదుగుతున్న పిల్లలకు కూడా అంటుకుంటుంది. అందుచేత వాళ్ళ గురించి అయినా పెద్దవాళ్ళు ప్రతి విషయంలోను అప్రమత్తంగా ఉండాలి.
మా ఇంట్లో నాకు మిగతా కుటుంబ సభ్యులతో ఇంచుమించు ప్రతిరోజూ ఇదే సమస్య. నాకు తరచుగా చాదస్తం బిరుదును ప్రసాదిస్తుంటారు. నాకు చికాకు కలిగించే ప్రధాన అంశం, ఉదయం సకాలానికి నిద్ర లేవక పోవడం. సెలవు రోజున ఒకలా, ఉద్యోగానికి వెళ్ళవలసిన రోజు ఒకలా నిద్రపోవడం సరికాదు అంటాను నేను. ఉదయం ఐదు గంటలకు లేవడం విద్యార్థి దశలోనే అలవాటై ఇప్పటికీ కొనసాగుతుంది. రాత్రి ఆలస్యంగా నిద్రపోయినా ఉదయం అయిదుగంటలకు లేవవలసిందే. నేను పదవీ విరమణ చేసి పదకొండు సంవత్సరాలయింది. విశ్రాంతి సమయం అని, బద్ధకం ముసుగు వేసుకుని ఆలస్యంగా నిద్రలేవాలి అనిపించదు. నా మస్తిష్కమే అలారమై, కోడై కూస్తుంది. నా వాళ్ళు కనీసం ఆరుగంటలకైనా నిద్రలేవాలి అని నేను ఆశిస్తాను. ఎక్కువసార్లు నా ఆశ వృథా ప్రయాసే అవుతుంటుంది. ఉదయం లేచి తమ పనులు తాము చేసుకునేవారు, ఎప్పుడూ ఆరోగ్యంగానూ, ఉత్సాహంగాను ఉండడం నేను గమనించాను. ఇలాంటి విషయాలలో అప్పుడప్పుడు నేను ఎంతగానో ప్రేమించే నా మనవరాలికి శత్రువు అయిపోతుంటాను. నన్ను ఆమె అప్పుడు హిట్లర్‌లా చూస్తుంది. చిన్నతనం నుంచే మంచి అలవాట్లు నేర్పాలన్నది నా ఆరాటం. అది తల్లిదండ్రులు కష్టమైనా ఇష్టంగా నేర్పించాలి. బద్ధకం పేరుతో, పనులను వాయిదా వేసుకోవడం అనేది జీవితంలో ఎంతో అమూల్య సమయాన్ని వృథా చేసినట్టే అవుతుంది. అందుకే బాల్యం నుంచే పిల్లలకు మంచి అలవాట్లు నేర్పించాలి. దానికి తల్లిదండ్రులు స్వయంగా పాటించగలగాలి. జీవితంలో నేను బద్ధకాన్ని సాధ్యమైనంతవరకూ దూరంగా పెట్టడానికే ప్రయత్నిస్తూ వచ్చాను. బద్ధకానికి బానిసలు కానివారు, తమ జీవిత కాలంలో ఏదైనా సాధించగలరు. దానికి దగ్గరి ఉదాహరణ ‘నేనే’ అంటే, ఎవరైనా అతిశయోక్తి అనుకున్నా నేను బాధపడను.
~
బద్ధకానికి
బానిస కావద్దు!
జీవితంలో అమూల్య సమయాన్ని,
వృథా చేసుకోవద్దు..!!
(మళ్ళీ కలుద్దాం)