పాఠకులు లేని రచయితలు – రచయితలు దొరకని పాఠకులు..!!
[dropcap]ఒ[/dropcap]కప్పుడు పత్రికారంగం స్వర్ణయుగం అని చెప్పుకునే రోజుల్లో, రాజకీయ పార్టీలకు – పత్రికలు అమ్ముడుపోని కాలంలో, పత్రికలను, పత్రికాధిపతులను, జర్నలిస్టు మిత్రులను గౌరవించిన కాలంలో, పత్రికలంటే, ప్రజానాయకులు, రాజకీయనాయకులు భయపడి నోళ్లను అదుపులో పెట్టుకున్న రోజుల్లో, మంచి రచయితలకు తగ్గట్టుగానే, మంచి పాఠకులు కూడా ఉండేవారు. నా ఉద్దేశంలో, మంచి పాఠకులు అంటే, ఇచ్చిన అంశాన్ని చదవగలిగే స్టాయి వున్నవాళ్ళు, దానిని అవగాహన చేసుకునే శక్తి వున్నవాళ్లు, చదివిన తర్వాత ఖచ్చితమైన అభిప్రాయం, నిర్భయంగా వ్యక్తపరచగల సత్తా వున్నవాళ్లూను. అందుచేతనే, ఆ పత్రికలకూ, పత్రికాధిపతులకు, రచయితలకు, జర్నలిస్టులకూ, అంత మంచి పేరు, గౌరవం లభించేవి. సంఘంలో వారికి ఒక ప్రత్యేకత లభించేది. పత్రికలు, దినపత్రికలైనా, మాసపత్రికలైనా, పక్షపత్రికలైనా, వారపత్రికలైనా, ఎంతో విలువ కలిగి ఉండేవి. అనుభవజ్ఞులైన రచయితల రచనలు, కవితలు ఉండేవి. పాఠకులు కూడా పత్రికలు కొనుక్కుని శ్రద్ధగా చదివేవారు. చదివి తమ అభిప్రాయాలను ఉత్తరాల రూపంలో పత్రికలకు పంపేవారు. అందరి ఉత్తరాలు ప్రచురించలేకపోయినా, కొన్ని అన్నివిధాలా మంచిగా వున్న ఉత్తరాలు ప్రచురించేవారు. ఆయా ఉత్తరాలను బట్టి రచయితలు ఆమె రచనల స్థాయిని అంచనా వేసుకునేవారు.
పత్రికలు కొనుక్కొని చదవడానికి వీలుగా బయట షాపుల్లో దొరికేవి. బస్సు స్టాండుల్లో, రైల్వే స్టేషన్లలో, విమానాశ్రయాలలో, అన్ని రకాల పత్రికలూ లభించేవి. కొందరైతే చందాలు కట్టి పోస్టు ద్వారాను, ఏజెంట్ల ద్వారానూ, పత్రికలూ రప్పించుకునేవారు. ప్రతి ఇంట్లోనూ పత్రికలూ చదవడం ఒక వ్యసనంగా మారిపోయి ఉండేది. అంతమాత్రమే కాదు, నచ్చిన కథలు, సీరియల్స్ లేదా పత్రికలను బైండ్ చేయించుకుని దాచుకునేవారు. అప్పటి జనంలో ‘చదివే అలవాటు’ కు ఇది ముఖ్య ఉదాహరణగా చెప్పవచ్చు. పత్రికల నుండి రచయితలకు చెక్కుల రూపంలోనూ, మనీయార్డర్ల ద్వారాను పారితోషికం లభించేది.
అప్పట్లో మనకు అన్నీ నాణ్యమైన పత్రికలే ఉండేవి. ఉదాహరణకు, భారతి వంటి మాసపత్రికలు ప్రత్యేకంగా సాహిత్యానికి పరిమితమై ఉండేవి. పరిశోధక వ్యాసాలు ఇందులో మాత్రమే కనిపించేవి. భారతిలో కథ గాని కవిత గాని, వ్యాసం గాని అచ్చయితే, ఆ రచయితకు పాఠకుల నుండి ఇతరుల నుండి గొప్ప గౌరవం లభించేది. తెలుగు పరిశోధకులకు కూడా భారతి వంటి మాసపత్రికలు ఎంతగానో ఉపయోగపడేవి. అయితే భారతి వంటి పత్రికలు, భాషాభిమానులు, సాహిత్యాభిమానులు మాత్రమే ఎక్కువగా చదివేవారు. మామూలు పాఠకుల సంఖ్య ఈ పత్రికకు తక్కువే! దీనితో పాటు, ఆంద్ర పత్రిక, ఆంధ్రప్రభ, ఆంద్రజ్యోతి వంటి వారపత్రికలు, యువ, జ్యోతి, జయశ్రీ, వనిత, వనితా జ్యోతి, కలువబాల వంటి మాసపత్రికలు ఉండేవి (రచయిత దృష్టికి రాని పత్రికలు ఇంకా ఉండచ్చు) వాటికి పాఠకులు కూడా బాగానే ఉండేవారు. ఈనాడు సంస్థకు సంబంధించి ప్రత్యేకంగా తెలుగు-వెలుగు, చతుర, విపుల, మాసపత్రికలు ఉండేవి. పత్రికలకు డిమాండు ఉండడం మూలానే, పాఠకులూ పెరిగారు, రచయితలు సైతం పెరిగారు. పత్రికలకూ, పాఠకులకూ, రచయితలకూ అదొక మహర్దశ అని చెప్పక తప్పదు.
మూడు సంవత్సరాల క్రితం యావత్ ప్రపంచాన్నీ గడ.. గడ వణికించిన ‘కరోనా మహమ్మారి’ అన్ని రంగాల మీద ప్రభావం చూపించినట్టుగానే, పత్రికా రంగంపై కూడా విపరీతమైన ప్రభావం చూపించి పెద్దగా దెబ్బతీసింది. తప్పని పరిస్థితిలో కొన్ని ముఖ్యమైన పత్రికలు మూతపడక తప్పలేదు. అప్పుడు పత్రికాధిపతులకు, రచయితలకూ, పాఠకులకు గడ్డుకాలం ఏర్పడిందని చెప్పక తప్పదు. అదుగో ఈ క్లిష్టపరిస్థితిలో, రచయితలకు పాఠకులు; పాఠకులకు రచయితలూ కరువైనారు. కారణం పత్రికలు లేకపోవడమే!
ఈ అదను చూసుకుని, కొన్ని అంతర్జాల పత్రికలు ఎవరకు తోచిన విధంగా వారు మొదలు పెట్టారు. వాళ్ళ అభిరుచుల మేరకు పత్రికలను తీర్చిదిద్దుకున్నారు. అందులో కొన్ని సక్సెస్‌తో వేగంపుంజుకున్నాయి, కొన్ని నత్త నడక నడుస్తున్నాయి. నిజానికి ఈ అంతర్జాల పత్రికలు, కరోనా కాలంలో అవతరించక ముందే, అనేక పత్రికలు అందుబాటులో ఉన్నసమయంలోనే, అంటే 2011లోనే మనదేశపు మొట్టమొదటి మహిళా అంతర్జాల పత్రిక ‘విహంగ’ను ప్రయోగాత్మకంగా స్వర్గీయ శ్రీమతి డా. పుట్ల హేమలత గారు వెలుగులోనికి తీసుకువచ్చారు. కానీ ఎందుచేతనో అది సామాన్య పాఠకుల చెంతకు చేరలేదు. కరోనా నేపథ్యంలో అనేక అంతర్జాల పత్రికలు అందుబాటులోనికి వచ్చాయి. అందులో కొన్ని అంతర్జాల పత్రికలూ చందాలు వసూలు చేస్తుండగా, చాలా పత్రికలు ఉచితంగానే అందుబాటులోనికి వచ్చాయి. మరి పాఠకులు వీటిని సద్వినియోగం చేసుకుంటున్నారా? అంటే అవి మరి పాఠకులకు చేరాలి కదా! ఈ పత్రికలు పాఠకులకు ఎలా చేరాలి? అన్నది ప్రశ్న. రాసే వాళ్ళ కోసం పత్రికలు వున్నాయి. పత్రికలను నింపడానికి రచయితలున్నారు. మరి ఈ రచయితలు రాసిన కథలు, కవితలు, వ్యాసాలూ, తదితర అంశాలు చదవడానికి పాఠకులను సంపాదించడం ఎలా? ఇదే సమయంలో మా రచనలు ఎవరూ చదవడం లేదని పత్రికలలో రాసే రచయితలూ, కవుల అభియోగం! ఇంకొకరి రచన మనం చదివినప్పుడే కదా, మన రచనలు ఇతరులు చదివేది. ముఖ్యంగా అంతర్జాల పత్రికలలోని రచనలు ప్రమోట్ చేసుకోవలసింది ఆయా పత్రికల యాజమాన్యమూ, ఆయా రచయితలూను. అది ఎలా?
మన అభిమానులకు, సాహిత్య ప్రియులకు, మిత్రులకు, బంధువులకు మన రచనలు వున్న పత్రిక లింకు పంపుకోవాలి. చదివి రాతపూర్వకంగా స్పందించమని అభ్యర్ధించాలి. అంతకంటే ముందు మన తోటి రచయితల రచనలు మనం చదివి స్పందించాలి. ఇలా చేయడం వల్ల పత్రిక నలుగురికి చేరడమే కాదు పాఠకుల సంఖ్య కూడా పెరుగుతుంది. తద్వారా పత్రికలకు రేటింగ్ కూడా పెరుగుతుంది.
మూడు సంవత్సరాల క్రితం నాకు ‘సంచిక అంతర్జాల పత్రిక’ పరిచయం అయింది. సంపాదక వర్గం నాకు ‘జ్ఞాపకాల పందిరి’ రాసే అవకాశం ఇచ్చారు. మొదటి రోజుల్లో నా వ్యాసాలకు స్పందించిన వారి సంఖ్య వందకు పైగా ఉండేది. అంటే నా వల్ల, నా రచన వల్లా, పత్రిక వందమంది కొత్త పాఠకులకు చేరినట్లే కదా! అందరూ అలా చేస్తే, పాఠకులకు కొదవ ఎక్కడిది. మంచి రచన చేసినంత మాత్రాన అందరూ చదివేస్తారనుకోవడం వట్టి భ్రమ మాత్రమే. ఏ కొద్దీ రచనలో ఆ అదృష్టానికి నోచుకుంటాయి. మిగతా అందరూ ‘నా రచన చదవండి మహా ప్రభో..’ అని వేడుకోవలసిందే!
గతంలో కొన్ని పత్రికలు, సమాజంలోని యువతీ యువకులకు కొన్ని ప్రత్యేక శీర్షికలు పెట్టి వారి రచనా వ్యాసంగాన్ని ప్రోత్సహించేవారు. ఈ అంతర్జాల పత్రికలూ కూడా అలాంటి సాహసాలు చేస్తే తప్ప, విద్యార్థి లోకం ఈ పత్రికా రంగం వంక కన్నెత్తి కూడా చూడదు. ఎలాంటి సమాజ హిత శీర్షికలు పెడితే నేటి యువతను ఆకర్షిస్తామన్నది పత్రికా యాజమాన్యాలు ఎప్పటికప్పుడు ప్రయోగాలు చేస్తూనే ఉండాలి.
పాఠకుల అభిరుచులను దృష్టిలో పెట్టుకుని, పత్రికలను రూపొందించుకోగలిగితే, పత్రిక పదిమందికీ చేరే వ్యూహం రచించుకోగలిగితే, రచయితలకు పాఠకుల కరువు; పాఠకులకు రచయితల కరువు ఎప్పుడూ ఉండదు.
మనం ఇతరుల రచనలు చదువుదాం!
ఇతరుల చేత మన రచనలు చదివించుకుందాం!
(మళ్ళీ కలుద్దాం)