Site icon Sanchika

జ్ఞాపకాల పందిరి-162

[“కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే..!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్.]

స్నేహానికి సరిహద్దు లేవి..!?

[dropcap]స్నే[/dropcap]హం కొందరికీ తాత్కాలికం, మరికొందరికి శాశ్వతం. స్నేహానికి హద్దులు అంటూ వుండవు, వుండకూడదు కూడా!

స్నేహం శాశ్వతం కావడం అనేది, అనేక ముఖ్య అంశాల మీద అధారపడి ఉంటుంది. అది కలిసొచ్చేది బహు కొద్దిమందికి మాత్రమే!

స్నేహం తాత్కాలికం కావడానికీ ఒకరి అభిప్రాయాలతో, మరొకరి అభిప్రాయాలు కలవక పోవడం, ఒకరి అభిరుచులు మరొకరికి నచ్చకపోవడం, ఇలా ఎన్నెన్నో విషయాలు ముడిపడి ఉంటాయి. ఇలా కాకుండా, కలిసిన మనసులు, ఒకే రకమైన మనస్తత్వాలు, వ్యక్తిత్వాలు, అభిరుచులు, అభిప్రాయాలు కలసి వస్తే, అలాంటి స్నేహాలు శాశ్వతంగా నిలిచిపొతాయి. ఇలాంటి స్నేహబంధాలు బంధుత్వ అనుబందాలను మించివుంటాయి. అయితే, ఇలాంటి స్నేహాలు కలసిరావడం బహు అరుదు.

ఒక కాలనీలో వుండేవాళ్ళు, ఒకే వీధిలో నివసించే వాళ్లు, ఒకే గృహసముదాయంలో ఉండేవాళ్ళు, ఒకే ప్రాంతానికి చెందినవాళ్లు, అలాగే వివిద స్థాయిల్లో సహాధ్యాయులు, సహోద్యోగులు, ఎవరి మధ్యనైనా స్నేహం ఏర్పడవచ్చు. కుల, ఉప-కుల, మతాల మద్య స్నేహం కూడా దీనికి అతీతం కాదు. ఇకపోతే, యువతీ యువకుల్లో, వివిద కారణాల వల్ల స్నేహాలు ఏర్పడటం, అలాంటి స్నేహాలు కొన్ని, ప్రేమలుగా రూపాంతరం చెందడం, అవి పెళ్ళిగా రూపుదిద్దుకోవడం వంటి కొన్ని సందర్భాలు, స్నేహానికి పరాకాష్ఠ.

అలాగే, స్నేహానికి, ఇతర సందర్భాలు కూడా కలసి వస్తాయి. అవి అన్నీ మన జీవన అవసరాలతో ముడిపడి ఉంటాయి. ఉదాహరణలు చెప్పాలంటే బోలెడన్ని. కిరాణా కొట్టువాళ్ళు, కూరగాయలు అమ్మేవాళ్ళు, మందుల షాపు వాళ్లు, బాంక్ వాళ్లు, చిట్‌ఫండ్ వాళ్లు, బట్టలషాపు వాళ్లు, చెప్పుల షాపు వాళ్లు, బంగారం షాపు వాళ్ళు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు.. ఒకరేమిటి, మన జీవనశైలితో ముడిపడి ఉన్న ఎవరితోనైనా, వారి వారి మనస్తత్వాలను బట్టి, శాశ్వత స్నేహబందాలు ఏర్పడవచ్చు. వారి స్నేహాలతో, మనకు తృప్తికరమైన జీవిత అనుబంధ సంబందాలు స్థిరపడతాయి. ఇలాంటి స్నేహాలు అనుకోకుండానే ఏర్పడిపోతుంటాయి.

నా విషయం వచ్చేసరికి, చిన్నప్పటి నుండి నా ప్రమేయం లేకుండానే నాకు చాలా శాశ్వత స్నేహాలు ఏర్పడ్డాయి. ఈ స్నేహాలు నా ఈ డెబ్బై ఏళ్ల వయసుకు చైతన్యాన్ని కలిగిస్తున్నాయి. చురుకుదనాన్ని పుట్టిస్తున్నాయి. ఉత్సాహానికి, ఉల్లాసానికి ప్రేరకాలుగా పనిచేస్తున్నాయి. స్నేహానికి నా హోదా ఎప్పుడూ అడ్డు రాలేదు, నేను రానివ్వలేదు కూడా! నా ఆరవ తరగతి సహాధ్యాయులు ముగ్గురు, రెండు సంవత్సరాల క్రితం, నా కొడుకు వివాహానికి, రాజోలు నుండి హన్మకొండకు వచ్చి హాజరు కావటమే ముఖ్య ఉదాహరణ.

నేను పదవీ విరమణ చేసిన తర్వాత, విశ్రాంత జీవితాన్ని హన్మకొండలో గడుపుతున్న సమయంలో వరంగల్ ఆకాశవాణిలో ప్రొగ్రామ్ ఎక్సికుటివ్‌గా పని చేస్తున్న నా కుమార్తెకు హైదరాబాదు, ఆకాశవాణికి బదిలీ కావడం, ఆమెకు కొడుకు పుట్టడం నన్ను, నా శ్రీమతినీ సికిందరాబాద్‌కు వలస వచ్చేలా చేశాయి. అక్కడ నాకు అంతా కొత్త.

కానీ, అతి కొద్ది రోజుల్లోనే, అన్నిరకాల, వ్యాపారస్తులతో, దుకాణదారులతో పరిచయాలు ఏర్పడ్డాయి. అవసరమయిన వస్తువులు, నాకు నచ్చిన వారి దగ్గర ఎప్పుడూ కొనడమే దీనికి ముఖ్య కారణం కావచ్చు. నన్ను చూడగనే, నవ్వుతూ పలకరించడం, నమ్మకంగా వస్తువులు ఇవ్వడం, నేను గ్రహించిన విషయాలు. అలా.. నాకు సఫిల్‌గూడలో, రైల్వే స్టేషన్‌కు దగ్గరలో ఒక మందుల షాపు యజమాని (కేర్ ఫార్మసీ) శ్రీ గంగారాం పరిచయమయినాడు.

కేర్ ఫార్మసీ.. సఫిల్‌గూడ

అతను షాపు క్రొత్తగా ప్రారంభించాడు. అంతకుముందు నాకు నెలకు సరిపడ కావాల్సిన మందులు, వేరే మందులషాపులో కొనుక్కునేవాడిని. కేర్ ఫార్మసీ మొదలయిన తరువాత, అక్కడ మందులు తీసుకోవడం మొదలు పెట్టాను. గంగారాం మాట్లాడే విదానం, మంచి మర్యాద నాకు బాగ నచ్చాయి. అందుకే అక్కడ కంటిన్యు చేస్తున్నాను. నా మందులే కాకుండా, నా శ్రీమతి మందులు అక్కడే తీసుకుంటున్నాను.

కేర్ ఫార్మసీ అధినేత గంగారాం

ఒకరోజు ఏమైందంటే నాకు ఆరోగ్యం సరిగాలేక మందుల కోసం నేను వెళ్ళలేకపోయాను. నా బదులు మందుల కోసం మా అమ్మాయి హడావిడిగా ‘కేర్ ఫార్మసీ’కి వెళ్లింది. కావలసిన మందులు తీసుకుంది. డబ్బులు ఇద్దామని చూస్తుంటే, పర్సులో డబ్బులు లేవు. డబ్బులు ఉన్నాయనుకుంది. నా డెబిట్ కార్డు కూడా తీసుకెళ్లడం మరచిపొయింది. విషయం అర్థం చేసుకున్న మా అమ్మాయి, నాకు సమాచారం అందించడానికి ఫోన్‍లో నా నంబరు తీయటం చూశాడు. వెంటనే మా అమ్మాయిని “డాక్టరు గారు మీకేమౌతారు అమ్మా?” అని అడిగాడట. మా అమ్మాయి “మా డాడీ..” అని చెప్పిందట. వెంటనే అతను “డబ్బుల సంగతి తరువాత చూద్దాం గానీ ముందు డాడీకి మందులు తీసుకెళ్ళమ్మా” అని మందులు ఇచ్చి పంపించాడు.

పనిలో సీరియస్ గా శ్రీ గంగారాం

అప్పటినుంచీ గంగారాం మీద గౌరవం మరింత పెరిగింది నాకు. వెంటనే డబ్బు నేనే స్వయంగా అతనికి కట్టివచ్చాను. నా మీద నమ్మకం మరింత పెరిగింది అతనికి. అది ఇప్పుడు మా ఇద్దరి మధ్య ‘స్నేహం’ గా రూపుదాల్చింది.

ఇంతకీ, ఈ అనుభవంతో నేను చెప్పొచ్చేదేమిటంటే స్నేహానికి, ఎల్లలులేవు.. ఎలాంటివారితోనైనా స్నేహాలు ఏర్పడే అవకాశం ఉంది. మంచి చెడ్డలు అనేవి, ఆయా వ్యక్తుల వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటాయి. అందుకే.. ‘స్నేహమా.. జయహో’ అనుకోక తప్పదు!!

(అరకు వేలీ నుండి)

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version