[“కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే..!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్.]
తాజాగా.. తాజ్ ఫలక్‌నుమా పేలస్..!!
[dropcap]ఒ[/dropcap]కప్పుడు నవాబులు పరిపాలించిన హైదరాబాద్, వారి కాలంలో కొన్ని చూడదగ్గ ప్రదేశాలకు ప్రసిద్ధి. వాటిని చూడనిదే హైదరాబాద్ చూసినట్టు లెక్కలోనికి రాదు. పని మీద హైదరాబాద్ వెళ్లినా, విద్యా పరంగా, వ్యాపార పరంగా లేదా ఉద్యోగపరంగా, హైదరాబాద్‌లో ప్రవేశించిన వెంటనే, కొన్ని తప్పనిసరిగా చూడవలసిన ప్రదేశాలను వారాంతంలో సరదాగా తిరిగి రావడం తప్పనిసరి. అంతమాత్రమే కాకుండా, దేశంలోని ఇతర ప్రాంతాల నుండి లేదా వివిధ రాష్ట్రాల నుండి అనేక మంది పర్యాటకులు ప్రత్యేకంగా హైదరాబాద్ చూడడానికి వస్తుంటారు. అలాగని విదేశీ పర్యాటకులు సైతం దీనికి అతీతం కాదు. అంటే అన్ని చూడదగ్గ ప్రదేశాలు వున్నాయి కనుకనే వాటిల్లో అనేక ప్రత్యేకతలను దృష్టిలో ఉంచుకుని పర్యాటకులు హైదరాబాద్‌కు తరలి వస్తుంటారు. రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక శాఖ పక్షాన, ప్రైవేట్ పర్యాటక సంస్థల ద్వారా పర్యాటకులకు హైదరాబాద్ లోని చూడదగ్గ ప్రదేశాలను చూపించే సౌకర్యం వుంది. కొందరు స్వయంగా తమకు తాము పర్యటించే అవకాశాలు వున్నాయి.
నవాబుల అద్భుత నిర్మాణం హైదరాబాద్ నగరం. హైదరాబాద్‌ను ఈ విధంగా ఊహించుకోవచ్చు. నవాబుల పరిపాలనా కాలం నాటి హైదరాబాద్, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత హైదరాబాద్, ప్రస్తుత హైదరాబాద్. భారతదేశంలో నిజాంల పాలనలోవున్న హైదరాబాద్ విలీనం అయిన తర్వాత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిపాలన నుండి నేటి తెలంగాణా రాష్ట్ర పరిపాలనలో ఇప్పటి వరకూ హైదరాబాద్ అనేక మార్పులకు గురి అయింది. ఒకప్పుడు ఎక్కడికంటే అక్కడికి హాయిగా నడిచి వెళ్లిపోగల, భాగ్యనగరంగా చెప్పబడే హైదరాబాద్, ఇప్పుడు లెక్కలేని జనసందోహంతో, రకరకాల వాహహానాలతో క్రిక్కిరిసి వీధులు, రోడ్లు నగరాన్ని మూసేసిన ఫ్లై ఓవర్లు, నేటి హైదరాబాద్ చిత్రం. ఒకప్పుడు కురిసిన వర్షం నీరు అప్పటికప్పుడు భూమిలో ఇంకిపోవడమో, లేదా డ్రైనేజి కాల్వల ద్వారా లోపలికి పోవడమో జరిగేది. అయితే, జనాభా పెరుగుదల, ఉద్యోగం, వ్యాపారం పేరుతో ,గ్రామాల నుండి పెరుగుతూ వసున్న వలసలను, ఒక పద్దతిలో నియంత్రించక పోవడం వంటి విషయాల ఆధారంగా, కబ్జాల జాతరలో సహజ డ్రైనేజీలు మూసుకుపోవడం వంటి సమస్యలు తలెత్తి వర్షం వస్తే, వరద వచ్చినట్టుగా భావించే పరిస్థితి ఏర్పడింది. పచ్చదనం తగ్గిపోయి, కాంక్రీటు కట్టడాల హోరులో మొక్కల పెంపకం కరువై, పర్యావరణ సమస్యలు తలెత్తి, విపరీతమైన వాతావరణ కాలుష్యంతో, రుతువులు తల్లక్రిందులయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ రెండురకాల హైదరాబాద్‌ను గమనించిన అనుభవం ఈ రచయితది.
ఇకపోతే, హైదరాబాద్‌లో, చూడదగ్గ కొన్ని ప్రదేశాల విషయానికి వస్తే ముందుగా గుర్తుకు వచ్చేవి – చార్మినార్, గోల్కొండ కోట, సాలార్ జంగ్ మ్యూజియం, నెహ్రు జూలాజికల్ పార్క్, (తాజ్) ఫలక్‌నుమా ప్యాలెస్, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల, ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రి (ముఖ్యంగా కట్టడాలు, వస్తుసేకరణ, వగైరా) ఇలా ఎన్నెన్నో.
అయితే మెట్రిక్యూలేషన్ నుండి, దంతవైద్యం (బి.డి.ఎస్) వరకూ నేను హైదరాబాద్ లోనే వుండి చదూకోవడం వల్ల ఇంచుమించు అనేక సందర్భాలలో, హైదరాబాద్‌లో చూడదగ్గ ప్రదేశాలు చాలామట్టుకు చూసేసాను ఒక్క ఫలక్‌నుమా పేలెస్ తప్ప. బహుశః అప్పట్లో ఫలక్‌నుమా పేలెస్‍కు సందర్శకులను అనుమతించేవారు కాదేమో! తర్వాత తాజ్ హోటల్ గ్రూప్ దానిని తీసుకుని, స్వల్పంగా మార్పులు చేర్పులు చేసి, సహజ నిర్మాణంలో ఎలాంటి మార్పులు లేకుండా, ఏడు నక్షత్రాల స్థాయి హోటల్‌గా మార్చినందువల్ల, అందులో ప్రవేశానికి, ఒక్కొక్కరికి (డిన్నర్‌తో సహా) ఆరువేలు ఫీజు ఉండడం వల్ల సామాన్యుల దృష్టిలో అది ఎక్కువగా పడదేమోనని, ఈ మధ్య నేను ఫలక్‌నుమా తాజ్ పేలస్ చూసిన తరువాత బాగా అర్థం అయింది. అంతమాత్రమే కాకుండా చారిత్రాత్మక కట్టడంగా దానిని తప్పక చూడాలనిపించింది. ఆనాటి నిజాం ప్రభువులు ఎంతటి విలాస జీవితాన్ని అనుభవించగలిగారో కూడా అర్థం అవుతుంది.
సాంకేతిక పరిజ్ఞానం అంతగా అందుబాటులో లేని కాలంలోనే, అలాంటి సుందర భవనాలు నిర్మించగలగడం మామూలు విషయం కానేకాదు. డబ్బు, కష్టం ప్రజలదే అయినప్పటికీ, అటువంటి గొప్ప కట్టడాల గురించి ఆలోచన చేయగలగడం గొప్ప విషయం. అందుచేతనే అవి ఇప్పటికీ చెక్కు చెదరని చారిత్రాత్మక అపురూప కట్టడాలుగా నిలిచి వున్నాయి. ఇప్పటి ప్రజలను కూడా అమితంగా ఆకర్షిస్తున్నాయి.
ఫలక్‌నుమా అంటే అర్థం ‘ఆకాశ దర్పణం’ అట. ఈ విలాసవంతమైన అపురూప కట్టడం, ఆరవ నిజాం పాలనలో నాటి ప్రధాన మంత్రిగా సేవలు అందించిన సర్. విఖర్ ఉమ్రా నవ్వాబ్ కట్టించాడని చెబుతారు. ఈ కట్టడం 3, మార్చి 1884 నాడు ప్రారంభమై, 1893లో నిర్మాణం పూర్తి అయిందట. నవాబుల కాలంలోనూ, వారి పాలనా కాలం చివరి దశలోనూ విదేశీయులకు, రాజులు మహారాణులకు అనేక విలాసవంతమైన గదులు కేటాయించి మరచిపోలేనంతగా ఆతిథ్యం అందించేవారట. నవాబుల కాలం చెల్లిపోయిన తర్వాత చాలాకాలం అది దిక్కూదివాణం లేకుండా వున్న నేపథ్యంలో, తాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ యాజమాన్యం లీజ్‌కు తీసుకోగా, ఒక గొప్ప ఏడు -నక్షత్రాల హోటల్‌గా, 1 నవంబర్ 2010 నాడు ఆవిర్భవించింది. దీనిని ఎత్తైన కొండమీద నిర్మించడం మూలాన, పచ్చని వృక్ష సంపదతో పాటు, మొత్తం హైదరాబాద్‌ను చూడగలిగే వెసులుబాటు ఉంటుంది. రాత్రిపూట చార్మినార్ అక్కడికి విద్యుత్ కాంతులు విరజిమ్ముతూ చూపరులకు నేత్ర పర్వం చేస్తుంటుంది.
నేను 1964 నుండి హైదరాబాద్‌తో సంబంధాలు కలిగి వున్నా ఇంత గొప్ప కట్టడం చూడడం నాకు వీలు కాలేదు. బహుశః నా ప్రయారిటీలలో అది లేదేమో! అందుకే ఇప్పటివరకూ ఫలక్‌నుమా ప్యాలెస్‌ను చూడలేక పోయాను. ఇప్పుడు అంటే జూన్ నెల మొదటివారంలో నాకు పిల్లలతో కలసి ఫలక్‌నుమా ప్యాలెస్ దర్శించే అవకాశం కలిగింది. మా అబ్బాయి రాహుల్, కోడలు దివ్య అమెరికా నుండి రావడంతో, దూర ప్రదేశాలకు పోయే అవకాశం లేక ఈ ప్రోగ్రామ్ ప్లాన్ చేసింది మా అమ్మాయి నీహార.
సరిగ్గా మేము నివాసం ఉంటున్న సఫిల్ గూడకు, కారులో గంట ప్రయాణం. సాయంత్రం కనుక ట్రాఫిక్ ఇబ్బంది వల్ల ఇంత సమయం పట్టి ఉండవచ్చు. ప్యాలెస్ ప్రాంగణం ఎత్తైన కొండమీద ఉండడం, దారిపొడుగునా, పచ్చని దట్టమైన చెట్ల సముదాయం, బోలెడన్ని నెమళ్లతో, ఆ ప్రాంతం అంతా ఆహ్లాదకరంగా ఉంది. చాలా ఆనందం అనిపించింది. ఇక ప్యాలెస్ లోనికి అడుగుపెట్టే ద్వారం నుండి సిబ్బంది అసలు ప్యాలెస్ దగ్గరికి వారి వాహనాలలో తీసుకు వెళ్లడం, అక్కడి నుండి ఇతర సిబ్బంది ఎంతో ఆత్మీయంగా, మర్యాదగా లోపలికి తీసుకువెళ్లడం, చూపించ వలసిన ప్రదేశాలు ఎంతో శ్రద్ధగా చూపించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. పరిశుభ్రత విషయంలో మాట్లాడే పనే లేదు.
ప్యాలస్‌లో నవాబులు ఉపయోగించిన సమావేశ మందిరాలు, ఆఫీసులు, గ్రంథాలయం, శయన మందిరాలు, వగైరా అన్ని ఆ కాలంలోని విదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకున్నట్లు, అక్కడినుండి సాంకేతిక నిపుణులను రప్పించుకున్నట్టు అర్థం అవుతుంది. సామాన్య ప్రజానీకానికి ఇదంతా వింతగానే కనిపిస్తుంది. రాత్రి భోజనం (డిన్నర్) భోజన మందిరం వర్ణించలేని అంశం. మాంసాహారులకు, శాఖాహారులకు సమాన స్థాయిలో, రుచికరమైన భోజనం ప్రత్యేకమైన తృప్తిని అందిస్తుంది.
భోజన ప్రియులకు ఇది సరైన చోటు. మద్యం కూడా వారి వారి అభిరుచులకు తగ్గట్టుగా సరఫరా చేయడం మరో ప్రత్యేక ఆకర్షణ. ఆర్డర్ చేసిన క్షణాల్లో వేడివేడిగా ఆహార పదార్ధాలు అందివ్వడం, వారి మర్యాదలు, ఒక ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న దానికంటే ఎక్కువ తృప్తిని అందించింది. అందరికంటే ఆ వాతావరణాన్ని బాగా ఎంజాయ్ చేసింది, సంవత్సరం వయసున్న నా మనుమడు చిరంజీవి నివిన్ ఆయాన్స్ (నికో).
ఇలా చెప్పుకుంటే పొతే చాలా వుంది. ప్రవేశం చాలా ఖరీదుతో కూడుకున్నదన్న విషయం ప్రక్కన పెడితే, అందరూ ఒకసారి చూడవలసిన సుందర కట్టడం ‘తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్’ అని చెప్పడంలో సందేహపడవలసిన అవసరం లేదు.
(మళ్ళీ కలుద్దాం)