జ్ఞాపకాల పందిరి-168

16
2

[“కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే..!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్.]

పుట్టినరోజు.. పండుగే..!?

[dropcap]చి[/dropcap]న్నప్పుడు పుట్టినరోజు తలుచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. సామాన్యుడి నుండి కోటీశ్వరుడి వరకూ చేసుకునే పుట్టినరోజుల గురించి విశ్లేషించుకుంటే, వారి వారి స్థాయిని బట్టి, పుట్టినరోజులు చేసుకోవడం మనం చూస్తూనే వున్నాం. కొందరైతే తమ దర్పం, హోదా చూపించుకోవడానికే ఒకరిని మించి మరొకరు వేడుకలు జరుపుతుంటారు. కొందరి పుట్టినరోజు వేడుక ఇంటివరకే పరిమితమైతే, మరికొందరు పెద్ద పెద్ద హాల్స్ బుక్ చేసుకుని రంగరంగ వైభవంగా నలుగురికీ తెలిసేటట్లు విపరీతమైన హంగామాలు జోడించి పెద్ద పండుగ మాదిరిగా జరుపుకుంటారు.

చి. నివిన్.. పుట్టిన రోజు ఆహ్వానం
బర్త్ డే.. బాబు నివిన్ అయాంశ్.నల్లి

అయితే ఇలా పెద్ద ఎత్తున పుట్టిన రోజు పండుగ జరపడం, పెద్దలకంటే, మొదటి సంతానానికో, లేకుంటే చాలాకాలం తర్వాత పుట్టిన మొదటి సంతానానికో ఘనంగా చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఇందులో ఆడపిల్లలకు ఒక మాదిరిగా, మగపిల్లలకు (వంశోద్ధారకులు కదా) మరో మాదిరిగా సెలబ్రేట్ చేస్తుంటారు.

ముది మనుమడి కోసం ప్రార్ధన చేస్తున్న రచయిత అత్త గారు శ్రీమతి.పద్మ (విజయవాడ)
మనవడు నివిన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ రచయిత

డబ్బున్నవాళ్ళు ఎలాగైనా చేస్తారు. అన్ని హంగులకు ఆర్భాటాలకు కొదవ ఉండదు. జీతాలతో బ్రతికే ఉద్యోగస్థులకు ఇబ్బంది లేదు. జీతం మీద భరోసాతో ఎంతైనా ఖర్చు పెట్టడానికి వెనుకాడరు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు, సామాన్యుడు కూడా తమ పిల్లల పుట్టినరోజు పండుగగా ఘనంగా చేయాలనే చూస్తాడు. కానీ,అది ఎలా సాధ్యం. అప్పులు చేసి ఆ కోరిక తీర్చుకోవాలి. ఇలా ఒకరిని చూసి మరొకరు ఈ పుట్టిన రోజు పండుగలు చేయడానికి ఎగబడుతున్నారు.

మేనమామ రాహుల్, మేనత్త దివ్య,లతో చి.నివిన్.
కుటుంబ సభ్యుల మధ్య కేక్ కటింగ్

ఈ పండుగలలో ఆత్మీయతలు, ప్రేమలు పక్కన పెడితే, ఫలానా వాళ్ళు ఫంక్షన్ ఎలా చేసారు, ఎంత వైభవంగా చేశారు, ఎన్ని రకాల వంటకాలు వడ్డించారు, ఎంత ఖరీదైన ‘రిటర్న్ గిఫ్ట్‌లు’ ఇచ్చారు, అనే దాని మీదే ఆలోచనలు, సమీక్షలు నడుస్తుంటాయి. ఇప్పుడు ఈ రిటర్న్ గిఫ్ట్ సంప్రదాయం ఒకటి అదనంగా వచ్చి చేరింది. దాని కోసం ప్రత్యేకంగా ఒకరు కాపలా. పైగా ఆ వ్యక్తి బంధువులను, స్నేహితులను గుర్తు పట్టగలిగిన వారై ఉండాలి. ఈ పుట్టినరోజు పండుగలలో, పెళ్లిళ్ల మాదిరిగానే, మరో గొప్ప అంశం ఆశీస్సులు అందివ్వడానికి వెళ్లేవారితో ఫోటోలు. ఈ ఫోటో/వీడియోల ఖర్చు వేలు లక్షల్లో ఉండడం, ఆల్బమ్‌లు వస్తేగాని తెలియదు. ఇలా బోలెడు అనవసర ఖర్చులు, ఈ పుట్టినరోజు పండుగలతో ముడి పడి వున్నాయి. ఈ సంబరానికి ఇంత ఖర్చు అవసరమా? అన్నది ప్రశ్న. డబ్బు ఉన్నంత మాత్రాన అలా విచ్చలవిడిగా, డబ్బును మంచినీళ్ల ప్రాయంగా దుర్వినియోగం చేయవచ్చునా? ఇలా ప్రశ్నించిన వారిని పిచ్చివాళ్లుగా లెక్కగడతారు ఇప్పటి జనం.

కుటుంబ సభ్యులు
‘లేడీస్ సీట్’ పుస్తకావిష్కరణ

నాకు పుట్టినరోజులు జరుపుకోవడంలో పెద్ద మక్కువ లేదు. ఆ సందర్భంగా అనవసర ఖర్చులు చేయడమూ ఇష్టం లేదు. కానీ నా పిల్లలు పెద్దవాళ్ళయి వాళ్లకు కూడా పిల్లలు పుట్టుకొచ్చినప్పుడు నా ఆలోచనలు అభిరుచులతో సంబంధం లేకుండా, నిర్వహణా బాధ్యతలు వాళ్ళ చేతుల్లోకి వెళ్లిపోయాయి. అలా ఈ జూన్ నెల 13న, నా మనవడు నివిన్ ఆయాంశ్, మొదటి పుట్టినరోజు, మెట్టుగూడ (సికింద్రాబాద్) రైల్వే ఆఫీసర్స్ క్లబ్‌లో నిర్వహించడం జరిగింది మనవరాలు ఆన్షి మొదటి పుట్టినరోజు జరిపినట్టే ఘనమైన ఏర్పాట్లు చేశారు. వేదికను చాలా అందంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.

మేనమామ రాహుల్, కేవలం ఈ పుట్టిన రోజు పండుగలో పాలుపంచుకోవడం కోసం అమెరికా నుండి వచ్చాడు. కరోనా తర్వాత కలువలేక పోయిన అనేకమంది బంధువులు, స్నేహితులను కలుసుకునే అవకాశం చి. నివిన్ పుట్టిన రోజు పండుగ రోజున కలిగింది. ముఖ్యంగా మా అత్తగారు, ముదిమనుమడు పుట్టిన రోజు వేడుకను తిలకించడానికి తన 85 ఏళ్ళ వయస్సును లెక్కచేయకుండా విజయవాడ నుండి రావడం అందరికీ ఆనందాన్ని కలిగించింది. బంధువులు మిత్రులు, శ్రేయోభిలాషులతో హాలంతా నిండిపోయింది. పాస్టర్ల విలువైన సందేశంతో, ఆశీస్సులతో పిల్లల సమక్షంలో కేక్ కటింగ్‌తో ముఖ్యమైన కార్యక్రమం ముగిసింది.

కథల సంపుటి

తర్వాత, ఆనవాయితీగా నేను రాసిన ఒక పుస్తకం ఆవిష్కరణ. నిజానికి మనవరాలు చి. ఆన్షిని దృష్టిలో పెట్టుకుని ఇప్పటివరకూ మూడు పుస్తకాలు రాసాను. కానీ సంవత్సరం పూర్తి అయినా మనవడు నివిన్ కోసం ఒక కవిత కూడా రాయలేక పోయాను. ఆ లోటు నన్ను వెంటాడుతూనే వుంది. అందుకే హడావిడిగా ఒక నిర్ణయం తీసుకుని నా దగ్గర మిగిలిన నా చిట్టిపొట్టి కథలను కూర్చి, నా ఐదవ కథా సంపుటిగా (లేడీస్ సీట్ – కథా సంపుటి)తీసుకు వచ్చాను. ముఖచిత్రంతో పాటు లోపలి కథలకు కూడా మొదటిసారి శ్రీ ఎన్. మాధవ్ (కార్టూనిస్ట్ -ఆంధ్రప్రభ) గారి చేత బొమ్మలు వేయించి, ఈ పుస్తకాన్ని, మనవడికి – మనవరాలికి అంకితం ఇచ్చాను.

పుస్తకం కోసం శ్రీ మాధవ్ గారి చిత్రాలు
పుస్తకం కోసం శ్రీ మాధవ్ గారి చిత్రాలు

అలా ఈ పుస్తకం నివిన్ పుట్టినరోజు వేడుకలలో ఆవిష్కరణకు నోచుకుంది. పాస్టర్ గారి ప్రార్థన తర్వాత, పుస్తకాన్ని విజయవాడనుంచి వచ్చిన నా పెద్ద బావమరిది శ్రీ రాజబాబు (జాన్) ఆవిష్కరించాడు. అతనికి ఇది పెద్ద సర్‌ప్రైజ్. తర్వాత కథాసంపుటి మొదటి కాపీని, ప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి ఝాన్సీ కొప్పిశెట్టి ఆనందంగా స్వీకరించారు. అలా మనవడి పుట్టినరోజు రంగరంగ వైభవంగా ముగిసింది. ఇది కూడా నేను గుర్తుపెట్టుకోవలసిన ముఖ్యమైన రోజు.

శ్యాం కుమార్, ఝాన్సీ కొప్పిశెట్టి గార్లతో రచయిత

ఎన్నో ఘనమైన పుట్టినరోజులు చూసాను. కానీ, చిన్నప్పుడు నా పుట్టినరోజుకు (13-జనవరి) మా అమ్మ కొన్న ఖద్దరు చొక్కా, కాకి నిక్కరు, నాకు పెళ్ళై పిల్లలు పుట్టినా, తానూ బ్రతికినంత కాలం నా పుట్టిన రోజుకు మా అక్క మహానీయమ్మ నాకు కొన్న కొత్త బట్టలు, నాకు గొప్పగా అనిపిస్తాయి. అసలు నా పుట్టినరోజు క్రమం తప్పకుండా జరుపుకుంటున్నది, నా శ్రీమతి అరుణ, నా జీవితంలో ప్రవేశించాకే. పుట్టినరోజులు జరుపుకోవడంలో తప్పులేదు. కానీ ఆ పేరుతో వృథా ఖర్చుల జోలికి పోకూడదన్నదే నా అభిప్రాయం.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here