Site icon Sanchika

జ్ఞాపకాల పందిరి-169

[“కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే..!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్.]

ముగ్గుబుట్ట..! రంగు జుట్టు..!!

[dropcap]మ[/dropcap]నిషి తనకు తాను అందంగా కనపడాలనుకుంటాడు. ఇతరుల చేత ఆకర్షింపబడాలనుకుంటాడు. చక్కని కామెంటు కోసం ఎదురు చూస్తాడు. మంచిగా పొగిడితే పులకించిపోతాడు. ఇది పురుషుల్లోనే కాదు, స్త్రీలలో కూడా ఒక మోతాదు ఎక్కువగానే ఉంటుంది. ఇది సహజం, తప్పు పట్టవలసిన అవసరం లేదు. మనిషి (స్త్రీ అయినా పురుషుడు అయినా) ముఖారవిందంలో తలజుట్టు కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. మహిళల విషయంలో మరీను! పురుషులు జుట్టు లేకపోయినా పెద్దగా జీవన శైలిలో పెద్దగా మార్పు ఉండదు, కానీ స్త్రీలకు జుట్టు లేకుంటే స్వేచ్ఛగా బయట తిరగలేరు. అయితే స్త్రీలలో బట్టతల అరుదు.

రచయిత నేటి పరిస్థితి

యుక్త వయస్సు వచ్చేసరికి, స్త్రీ పురుషులలో సైతం జుత్తు వత్తుగా వుండి ఆకర్షణీయంగా ఉంటుంది. క్రమంగా స్త్రీలలో (అందరిలో కాదు) జుత్తు పలుచబడే అవకాశం వుంది గాని బట్టతల (కొన్ని వ్యాధులవల్ల, చికిత్సల వల్ల బట్టతల వచ్చే అవకాశం వుంది) వచ్చే అవకాశాలు బహుతక్కువ.

జుట్టు వూడక ముందు రచయిత
జుట్టు వూడక ముందు రచయిత

మగవారిలో మాత్రం బట్టతల సమస్య చాలామందిలో కనిపిస్తుంది. కారణాలు ఇదమిత్థంగా చెప్పలేము కానీ, సంబంధిత విటమినుల లోపం గానీ, జన్యు కారణంగా గానీ, వంశపారంపర్యం గానీ, వివిధ సాధారణ చర్మ సమస్యల వల్ల గాని, గుండు లేదా బట్టతల వచ్చే అవకాశం వుంది. కారణాలు ఏమైనా కొందరిలో యుక్త వయస్సులోనూ, ఎక్కువ శాతం మందిలో నడి వయస్సులోనూ బట్టతల వచ్చే అవకాశం వుంది. నిజం చెప్పాలంటే బట్టతల కొందరికి బాగుంటుంది. కొంతమందికి నచ్చదు. అది కప్పిపెట్టుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.

జుట్టు రాలిపోతున్న క్రమం

బట్టతల వున్నవాళ్లు చాలా తెలివైన వాళ్ళు అని చెబుతుంటారు. అది ఒకోసారి పొగుడుతున్నారో, ఏడిపిస్తున్నారో అన్న అనుమానం వస్తుంది.

కానీ మనం గమనిస్తే ఎంతోమంది గొప్పవాళ్లకు, ముఖ్యంగా పరిశోధకులకు, శాస్త్రజ్ఞులకు బట్టతల ఉంటుంది. అయితే నాకు తెలిసి బట్టతల వున్న వాళ్ళల్లో తెలివైన వాళ్ళూ వున్నారు, తెలివితక్కువ వాళ్ళు వున్నారు. అందుచేత బట్టతల ఉన్నంత మాత్రాన అందరూ తెలివైన వాళ్ళు అని చెప్పడానికి వీలులేదు. బట్టతల గల వాళ్ళ లిస్టులో నేనూ ఒక సభ్యుడినే. నాకు బట్టతల వచ్చిందని మా మేనమామ, ఆనందరావుగారిని తిడుతుండేవాడిని. ఆయనకు పెద్ద బట్టతల. వంశ పారంపర్యంగా తనకి బట్టతల వచ్చిందని నా పెద్దన్నయ్య వంశీ కృష్ణ నన్ను ఆట పట్టిస్తుంటాడు.

మెట్రిక్యులేషన్ సమయంలో రచయిత

బట్టతల వచ్చి, తల నేరిస్తే అదొక సమస్య. బట్టతల గోప్యంగా ఉంచుకోవడం కోసం అతికొద్ది మంది ‘విగ్గులు’ వాడుతుంటారు. దీనికి మన సినీ నటులే పెద్ద సాక్ష్యం. ఇక బట్టతలతో ప్రమేయం లేకుండా తల నెరిస్తే, ముగ్గుబుట్టలా అయితే తొంభైతొమ్మిది శాతం డై (రంగు) వేసుకునేవాళ్ళు వుంటారు. కొందరు ఆ పని సొంతంగా చేస్తే ఎక్కవమంది క్షౌరశాలల్లో, బ్యూటీ పార్లర్లలో జేబులు ఖాళీ చేసుకుంటారు.

ఈ జుట్టుకి రంగేసుకునేవాళ్ళు చాలా మంది, అసలు తెలియరు. కానీ కొందరు యిట్టే తెలిసిపోతారు. ఇది వారి వారి శ్రద్ధ/జాగ్రత్తల మీద ఆధారపడి ఉంటుంది. నిజం చెప్పాలంటే కొందరికి ఈ రంగు వేసుకోవడం కంటే తెల్ల జుట్టే బాగుంటుంది. కొందరు జుట్టుకు రంగు వేసుకోవడానికి అసలు ఇష్టపడరు, అందులో నేనూ ఒకడిని.

చిన్నక్క.. అమ్మతో రచయిత

చిన్నప్పుడు నా జుత్తు చాలా వత్తుగా నల్లగా నిగనిగలాడుతుండేది చివరి బాల్యదశలో ఎక్కువకాలం మా పెద్దన్నయ్య మీనన్ గారి దగ్గర ఉండడంతో, ఆయన కాలంతో సంబంధం లేకుండా ఎప్పుడూ సమ్మర్ క్రాఫ్ వేయించేసేవాడు. ఇక నాగార్జున సాగర్‌లో పెద్దక్కయ్య స్వర్గీయ మహనీయమ్మ గారి దగ్గర వుండి ఇంటర్ చదువుకుంటున్న క్రమంలో మెల్లగా జుత్తు రాలిపోవడం మొదలు పెట్టింది. ఇక దానిని ఆపే శక్తి ఇక ఎవరికీ లేకపోయింది. నేను కూడా పెద్దగా పట్టించుకోలేదు. క్రమంగా అది నా రూపాన్నే మార్చి పారేసి నేటి స్థితికి తీసుకు వచ్చింది.

చిన్నన్నయ్య డా. మధుసూదన్‌తో రచయిత

ఉద్యోగ రీత్యా నేను 1994లో హన్మకొండకు వెళ్లడం, అక్కడ స్థిరనివాసం ఏర్పరచుకోవడం జరిగిన తర్వాత, అక్కడ ఒక బార్బర్ మిత్రుడు పరిచయం అయ్యాడు. అతను నా జుట్టుకు రంగు వేస్తానని ఒకటే వెంటపడేవాడు. నేను నవ్వి వూరుకునేవాడిని. అయినా అతను వదలి పెట్టేవాడు కాదు. మా అమ్మాయి పెళ్లి నిశ్చితార్ధానికి, అమ్మాయి పెళ్ళికి మా బాబు పెళ్ళికి, మనవరాలి పుట్టినరోజుకి, ఇలా రకరకాల శుభసందర్భాలలో నా వెంటపడుతుండేవాడు. ఎందుకో మొదటినుండీ నాకు ఈ రంగు వేసుకోవడం మీద ఆసక్తి లేదు. అలాగే హెయిర్-గ్రాఫ్టింగ్ మీద కూడ పెద్దగా నమ్మకం లేదు. ఇంట్లో ముఖ్యంగా నన్ను భరించే వారినుండి ఎలాగూ ఎలాంటి ఒత్తిడి లేదు. అందుకే ఇలా ఉండడానికే ఇష్టపడతాను.

రచయిత చిన్నప్పటి సమ్మర్ క్రాఫ్‌

అలా ఎవరి అభిరుచి మేరకు వారు బ్రతికే స్వాతంత్య్రం ఉంటే బ్రతుకులో అంతకు మించిన ఆనందం, తృప్తి ఇంకేమి ఉంటుంది? తెల్లజుట్టు ముసలి వాళ్ళకే రావాలనే నియమం లేదు. ఏ వయస్సులోనైనా ఆయా పరిస్థితులను బట్టి రావచ్చును. అందుకేనెమో ఇప్పుడు చాలామంది ఇళ్లల్లో సౌందర్య సాధనాలుగా, మగాళ్ళకి ‘డై’ లు, ఆడవాళ్ళకి ‘డై లు, మేకప్ కిట్లు’ తప్పనిసరి అయినాయి.

జీవితంలో మనిషికి ఇది కూడా ఒక ముఖ్యమైన సౌందర్య అంశంగా మారిపోయింది. నాలాంటి వారికి, ఎలాగూ ఇలాంటి సమస్యలతో పని లేదు. ఎలర్జీ సమస్యలు రానంతవరకూ ఎవరికీ ఇబ్బంది వుండదనుకుంటా! తెల్ల జుట్టు చర్చకు వచ్చినప్పుడల్లా వృద్దాప్యానికి సంకేతంగా మహాకవి శ్రీ శ్రీ రాసిన ‘భిక్షువర్షీయసి’ కవిత గుర్తుకు వస్తుంది.

‘ముగ్గుబుట్ట వంటి తల

ముడుతలు దేరిన దేహం..’.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version