[box type=’note’ fontsize=’16’] “కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే…!!”అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్. [/box]
వేడి.. వేడి.. సమోసాలొయ్!!
ప్రయాణాల మీద పెద్ద అభిరుచి వుండదు నాకు. తప్పని పరిస్థితి అయితే తప్ప ప్రయాణాల గురించి ఆలోచించను. ప్రయాణాలు మళ్ళీ ఒక రైలు ప్రయాణానికి మాత్రమే ఎక్కువ మక్కువ చూపిస్తాను. రైలు మార్గాలు అనుకూలంగా లేనప్పుడు బస్సు ప్రయాణం తప్పదు మరి! ఇప్పుడు వయసు మళ్లడం వల్ల కారు ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. మనకి కారు వున్నా, లేకున్నా (నాకు వుంది లెండి) కారు ప్రయాణాలు చేయడానికి చక్కని అనుకూల పరిసితులు ఇప్పుడు మనకి అందుబాటులోనికి వచ్చాయి. కారువుంటే డ్రైవర్‌ను ఆ రోజుకు మాట్లాడుకునే అవకాశాలు వచ్చేసాయి. నా శ్రీమతి బ్యాంకు ఉద్యోగిని కనుక అప్పుడప్పుడు ఇతర ప్రాంతాలకు కుటుంబ సమేతంగా విహార యాత్రలు చేసే వెసులుబాటు ఉండేది. అయినా, కేవలం కుటుంబం కోసం వాళ్ళతో కలసి ప్రయాణం చేసేవాడిని. మొదటి విమాన ప్రయాణం పిల్లలతో ఇలానే సాధ్యమయింది.
అయితే ప్రతి రోజూ సంవత్సరాలపాటు ప్రయాణం చేయవలసిన పరిస్థితులు వస్తే ఏమి చేయగలం? ప్రయాణించక తప్పదు! ఉద్యోగ రీత్యా ఈ పరిస్థితి నాకు ఎదురయ్యింది.
పన్నెండు సంవత్సరాలు (1982-1994) మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేసాను. అప్పుడు అక్కడే ఇల్లు అద్దెకు తీసుకుని ఉండేవాడిని. అక్కడి నుండి హైదరాబాద్‌కు వెళ్లాలన్నా, విజయవాడకు వెళ్లాలన్నా మంచి రైలు ప్రయాణ సౌకర్యం ఉండేది. సహృదయులైన వైద్యులను, ప్రజలను నేను అక్కడ చూచాను. మంచి బియ్యం, కాయగూరలు, రకరకాల పండ్లు అక్కడ దొరికేవి.
1994లో అక్కడి నుండి జనగాంకు బదిలీ అయింది. నిజానికి సుదూరమైన చీరాలకు బదిలీ అయింది నాకు. ఆయుర్వేద వైద్య మిత్రుడు డా. జి. ఎస్. రెడ్డి గారి ద్వారా నాటి పేదల శాసన సభ్యుడు మద్దికాయల ఓంకార్ (నర్సంపేట) గారు పరిచయమై, నా బదిలీ జనగాంకు మళ్లింది. బ్రతికున్నంత కాలం ఆయనని, ఆయన సహకారాన్నీ నేను మరచిపోలేను. అప్పటికి నా శ్రీమతి కూడా అక్కడే ఉద్యోగం (స్టేట్ బ్యాంకు ఆఫ్ హైదరాబాద్) చేస్తున్నది. ఆమెకు అంత త్వరగా జనగాంకు బదిలీ అయ్యే పరిస్థితి లేదు, పైగా అవకాశాలు తక్కువ అని కూడా చెప్పారు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, ఇక్కడి నుండి నా ప్రయాణాల పర్వం మొదలైంది. పైగా చాలా క్లిష్టమైన ప్రయాణాలు. ఊహించడానికే భయంకరమైన ప్రయాణాలు. కొంతకాలం పాటు మహబూబాబాద్ నుండి జనగాం డ్యూటీకి వెళ్లాలని అనుకున్నాను. కష్టమని తెలుసు, అయినా తప్పని సరి!
కాకినాడనుండి వచ్చే ‘గౌతమి’ ఎక్స్‌ప్రెస్ రైలు మహబూబాబాద్‌కు ఉదయం 2.30 ప్రాంతంలో వచ్చేది. జనరల్ బోగీ ఆదివారం సంతలా ఉండేది జనంతో క్రిక్కిరిసి. ప్రయాణం తప్పదు కనుక అతి కష్టం మీద కంపార్ట్మెంట్ లోనికి చోరబడేవాడిని. 5 గంటల ప్రాంతానికి జనగాం చేరుకునేవాడిని. అంత ప్రొద్దున్న ఏమి చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి?
ఆ రైలు తప్ప మరో మార్గం లేదాయె! నా బాధ అర్థం చేసుకుని డ్యూటీ స్టేషన్ మాష్టర్, వాళ్ళ విశ్రాంతి గదిలో కాసేపు పడుకునే అవకాశం కల్పించారు. అలా.. గౌతమికి వెళ్లి గోల్కొండకు తిరిగి వచ్చేవాడిని. అయితే బాగా అలసట ఏర్పడేది. ఇదంతా పరిశీలించిన ఒక సీనియర్ డాక్టర్, నా కథంతా విని, ఆశ్చర్య పోయారు. ఆయన ఇల్లు ఆసుపత్రికి ఎదురుగా నాలుగడుగుల దూరంలో ఉండేది. ఆయన ఇంట్లో ఒక ఖాళీ గది ఉంటే, అందులో ఉచితంగా ఉండేటట్లు, భోజనంతో సహా ఏర్పాటు చేశారు. కొద్దీ నెలలు స్వేచ్ఛగా, ఆనందంగా ఆ ఇంట్లో గడిపాను. ఆ ఇంట్లో ఉండగానే ‘దంతాలు -ఆరోగ్యం’ అనే పుస్తకం రాసాను. ఆ సహృదయ మిత్రుడిని ఎన్నటికీ మరచి పోలేను. ఆయన ఎవరో కాదు, డా. ఎస్. రామనర్సయ్య గారు. పూర్వ తెలుగు విశ్వవిద్యాలయం, ఉప కులపతి పేర్వారం జగన్నాధం గారి అల్లుడు. తర్వాత నా శ్రీమతికి హనంకొండకు బదిలీ చేయడంతో, మకాం హనంకొండకు మార్చాము. దీనివల్ల నాకు ప్రయాణ సమయం తగ్గింది. ప్రతి రోజు ఖాజీపేటలో రైలు ఎక్కి జనగాంలో దిగేవాడిని.
పైన శీర్షిక సమోసాలు గురించి రాసి ఇదంతా ఏమిటీ? అని పాఠకులు అనుకోవచ్చు. దాని కథ ఇప్పుడు ప్రవేశిస్తుంది. కథ చిన్ని సన్నివేశం అయినా దాని గురించి ఈ నేపథ్యం అంతా చెప్పక తప్పింది కాదు!
ప్రతి రోజూ స్కూటర్ మీద కాజీపేట స్టేషన్‌కు వచ్చేవాడిని. బండి స్టేషన్ స్టాండులో పెట్టి, ఫ్లాట్‌ఫామ్-2 కి చేరుకునేవాడిని, మిగతా మిత్ర బృందం అంతా అక్కడికి చేరుకునేవారు. భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ సుమారు 7.30కి వచ్చేది. అదే రైలు మూడు గంటలికి గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌గా వచ్చేది. బండి రాగానే, చేతిరుమాళ్ళు ఖాళీ సీట్ల పైకి విసిరేవాళ్ళం. సీటు దొరకకుంటే నిలబడి కబుర్లు చెప్పుకునేవాళ్ళం. అసలు జనగాం ప్రయాణించినట్టే ఉండేది కాదు.
ఈ బృందంలో రాష్ట్ర ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, బ్యాంకు, ఎల్.ఐ.సి.కి చెందిన సిబ్బంది, కోర్టు ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు ఇలా చాలామంది ఉండేవారు. ఎక్కడైనా స్వార్థం మనల్ని విడిచిపెట్టదు కదా!
అందుకే, సాధ్యమయినంత వరకూ మెడికల్ సిబ్బంది అంతా ఒకేచోట కూర్చునేవాళ్ళం. ఉదయం హాయిగా బ్రేక్‌ఫాస్ట్ తిని వస్తాం కనుక, ప్రయాణం మొత్తం కబుర్లతో నవ్వుతూ తుళ్ళుతూ ప్రయాణం చేసేవాళ్ళం.
ఇక తిరుగు ప్రయాణం గోల్కొండలో. పనివేళలు బట్టి అందరూ ఆ బండికి వచ్చేవారు కాదు. తిరుగు ప్రయాణం అంతా కొంచెం వేరుగా ఉండేది. చల్లని మజ్జిగ అంటూ ఒక అబ్బాయి మజ్జిగ సాచెట్లు నింపిన బకెట్‍తో చెమటలు కక్కుతూ వచ్చేవాడు. కొంతమంది అవి కొనుక్కుని తాగేవారు.
ఇంతలో పల్లీలు అమ్మే అమ్మాయి వచ్చేది, ఆమె దగ్గర పల్లీలు కొనుక్కుని కొందరు తినేవారు. సీజన్‌తో పనిలేకుండా ఘనాపూర్ స్టేషన్‌లో మంచి జామకాయలు వచ్చేవి, వాటి రుచి ఎప్పటికీ మరచిపోలేను. మేము కొంతమందిమి జామకాయలు కొనుక్కునే వాళ్ళం. తినడమే కాదు, పిల్లల కోసం ఇంటికి కొన్ని తెచ్చేవాడిని.
చెప్పులు పాలీష్ చేసేవాళ్ళు వచ్చేవాళ్లు. ఒక పరిచయం ఉన్న అబ్బాయి వచ్చి తప్పనిసరిగా నా దగ్గర నిలబడేవాడు. నాకు అప్పుడు అతని అవసరం లేకపోయినా, ఆ అబ్బాయి కోసం చెప్పులకు/షూకు తప్పక పాలిష్ చేయించుకునేవాడిని.
ఇక తినుబండారాలు అమ్ముకునేవాళ్లలో ఎక్కువమంది సమోసాలు అమ్ముకునేవాళ్ళు వుండేవాళ్ళు. కొంతమంది జనగాంలో, కొంతమంది ఘనపూర్‌లో ఎక్కేవాళ్ళు. సమోసాలు మంచి వాసన కొడుతుండేవి. చాలామంది ఆ సమోసాలు కొనుక్కు తినేవాళ్లు. ఒక రోజున ఏమైంది అంటే, ఇద్దరు సమోసా అమ్ముకునే కుర్రాళ్ళు టాయిలెట్స్ దగ్గర ఎదురు బదురై అక్కడ ఆగిపోయారు. ఏవేవో మాట్లాడుకున్నారు, మాకు అర్థం కాలేదు. ఆ మాటలు మెల్లగా శబ్దం పెంచుకుని తారాస్థాయికి చేరుకున్నాయి. మాటలు సరిపోక ఒకరి నొకరు నెట్టుకునే వరకూ వచ్చింది పరిస్థితి. అదీ స్థాయి పెరిగి ఇద్దరి బేసిన్ల లోని సమోసాలు క్రిందపడిపోయాయి. ఎవరో ఇద్దరికీ సయోధ్య కుదిర్చారు. అంతే మరు క్షణం ఎవరి సమోసాలు వాళ్ళు తమ బేసిన్లలో ఎత్తుకుని, రైల్లో ఒకరు ముందుకి, మరొకరు వెనకవైపు, ‘… సమోసా.. వేడి.. వేడి సమోసా’ అనుకుంటూ వెళ్లిపోయారు. మేమంతా ప్రేక్షకుల్లా అలా చూస్తూ ఉండిపోయాము. ఆ సమోసాలను ఎంతమంది కొనుక్కుని తిని వుంటారో! తలచుకుంటేనే, కడుపులో తిప్పినట్టు అవుతుంది. మళ్ళీ రైల్లో ఎప్పుడూ ఆ సమోసా వాళ్ళ వంక చూడలేదు. అలా జనగాంలో ఉద్యోగం చేయడానికి పది సంవత్సరాలు పాటు రైలు ప్రయాణాలు రోజూ (ఆదివారాలు -సెలవు రోజులూ తప్ప) చేయవలసి వచ్చింది. ఈ కాలం మంచి, మంచి జ్ఞాపకాలను మిగిల్చింది.
నాతో కలసి ప్రయాణం చేసిన కొంతమంది పేర్లు అయినా ఇక్కడ ప్రస్తావించకపోతే, ఈ వ్యాసం అసంపూర్తిగా మిగిలిపోతుందని నా నమ్మకం. అలాంటి వారిలో కొందరు – డా. రాజకుమార్ (కంటి వైద్య నిపుణులు), డా. తుకారాం బాబాయ్ (కం. వై. ని), డా. బెల్లంకొండ గిరిధర్ రెడ్డి (కం. వై. ని), డా. సత్యన్నారాయణ (కం. వై. ని), డా. సారంగం (ఈ.ఎన్.టి), డా. రాజు (చర్మవ్యాధుల నిపుణులు), డా. సుబ్బలక్ష్మి (ఇప్పుడు విశాఖపట్నం, కింగ్ జార్జ్ ఆసుపత్రిలో ఎనస్థటిస్ట్), డా. రాజేశ్వరరావు (పిల్లల వైద్య నిపుణులు – ఇప్పుడు లేరు), డా. భోజ (పిల్లల వైద్య నిపుణులు), డా. నాగేందర్ రావు (గైనకాలజిస్ట్), సాంబయ్య (రేడియోగ్రాఫర్), రవీందర్ రెడ్డి (ఆప్తాలమిక్ అసిస్టెంట్), ప్రసాద రావు (ఆప్తాలమిక్ అసిస్టెంట్), రమేష్. కె (కౌన్సిలర్ -ఎయిడ్స్), డా.లక్ష్మీ నారాయణ (ఎనస్థటిస్ట్), సప్త ఋషి (లెప్రసీ), శ్రీనివాస రెడ్డి (ట్రెసరీస్), జనార్దన్ (ఫామ్లీ ప్లానింగ్), ఇంకా ఎందరో. కొందరు ఇప్పటికీ టచ్‌లో వున్నారు. మిగతా వారంతా ఎక్కడ వున్నారో? వీరందరికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు.
(మళ్ళీ కలుద్దాం)