జ్ఞాపకాల పందిరి-171

22
2

[“కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే..!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్.]

మరచిపోలేని మహనీయులు..!!

[dropcap]మ[/dropcap]నిషి జీవితంలో ఒక స్థాయికి వచ్చాక, భవిష్యత్తు గురించి, జీవితంలో స్థిరపడడం గురించి అనేక రకాలుగా ఆలోచిస్తాడు. పరిష్కార మార్గాల కోసం అన్వేషిస్తాడు. ఒక్కోసారి ఈ నేపథ్యంలో కొంచెం తికమకపడతాడు కూడా! ఇది ఆయా వ్యక్తుల ఆర్థిక పరిస్థితి మీద; కుటుంబ, విద్యా నేపథ్యం మీదా, ప్రాంతీయ స్థానిక పరిస్థితుల మీదా ఆధారపడి ఉంటుంది. స్నేహితుల ప్రభావాన్ని కూడా తీసివేయడానికి లేదు. కొందరు తెలివిగా స్వయం నిర్ణయాలతో, అపజయాలను ఎదుర్కొంటూ విజయ శిఖరాలను అధిరోహించే స్థితిలో వుంటారు. కొందరేమో ఆర్థికంగా పుష్టికరంగా ఉన్నపటికీ పదునైన నిర్ణయాలు తీసుకొనక పోవడం మూలాన జీవితంలో అపజయాలు పాలవుతుంటారు. మరికొందరు ఆర్థికంగా వెనుకబడి సరైన నిర్ణయాలు తీసుకొనకపోడం ద్వారా మంచి భవిష్యత్తును జారవిడుచుకుంటారు.

కొన్ని సందర్భాలలో, కుటుంబీకుల నుండిగానీ, స్నేహితుల నుండి గానీ, శ్రేయోభిలాషుల నుండి గానీ, ఏదో ఒక రూపంలో మార్గదర్శనం లభిస్తే వారి సూచనలతో, సహాయంతో, ప్రయోజకులు అయ్యే అవకాశం వుంది. ఇది మార్గదర్శనం చేసే వారి మీద, స్వీకరించే వారి మీద ప్రముఖంగా ఆధారపడి వుంటుంది. ఇక్కడ ఇతరుల అనుభవాలను ఉదాహరించడం కంటే కూడా నా అనుభవాలను మీ ముందు ఉంచడం శ్రేయస్కరం అని నాకు అనిపిస్తున్నది.

మా నాయన గారి ఎదుట నా బాల్యం అంతా బెదురు బెదురుగా, భయం గానే గడిచింది. ఆయన గురించి అప్పుడు అర్థం గాక, ఆయన విషయంలో అన్ని రకాలుగా అపోహపడిన విషయం వాస్తవం అని చెప్పక తప్పదు. కాస్త వయసు వచ్చాక, కాస్త ఆలోచించే గుణం అబ్బాక, ఆయనది హిట్లర్ స్వభావం కాదని, మా భవిష్యత్తు గురించి ఆయన అనుసరించిన కఠిన క్రమశిక్షణ అని, దాని వెనుక ఆయనకు, ఆయన సంతానం పైన విపరీతమైన ప్రేమ దాగి వున్నదని తెలిసింది. అంతమాత్రమే కాదు, ఆయన చెప్పే మాటలు ఎవరికైనా ఎప్పటికైనా ఉపయోగకరమైనవేనని ఇప్పుడు అర్థం అవుతున్నది.

రచయిత తల్లిదండ్రులు శ్రీ కానేటి తాతయ్య గారు, శ్రీమతి కానేటి  వెంకమ్మ గారు

మర్యాదలు ఇచ్చి పుచ్చుకునే విషయంలో మా నాయన సందర్భం వచ్చినప్పుడల్లా హెచ్చరిస్తూ ఉండేవారు. “అవతలివారు ‘ఏమండీ’ అని సంభోదిస్తే, మనం కూడా ‘ఏమండీ’ అనాలి” అని చెబుతుండేవారు. అదే విధంగా “అవతలివారు ‘అరేయ్’ అంటే, నువ్వు ‘ఒరేయ్’ అనాలి” అని చెప్పేవారు. అప్పట్లో అవి వినడానికి వింతగా ఉండేవి గాని అవి ఇప్పుడు మహా సూక్తులు అనిపిస్తున్నాయి.

మా ఇంటి నుండి కొంచెం బయటికి వెళ్లడం బహు అరుదుగా ఉండేది. ముఖ్యమైన పని ఉంటే తప్ప ఎక్కడికీ వెళ్లనిచ్చేవారు కాదు. ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళవలసి వస్తే ఇంట్లో ఎవరికో ఒకరికి ఎక్కడికి వెళుతున్నది చెప్పి వెళ్లాలని ఆదేశించేవారు మా నాయన. అప్పట్లో మొబైల్ ఫోన్ సంస్కృతి మన దేశంలోకి అడుగు పెట్టలేదు. ఆ సదుపాయం వున్నా అప్పట్లో ఫోను/మొబైల్ ఫోను వాడే స్థాయి కాదు మాది. ఇది జీవితంలో మంచి క్రమశిక్షణ అంశంగా నాకు అనిపిస్తుంది. ముఖ్యంగా నేను సైకిలు మీద దూరప్రాంతానికి వెళ్ళవలసి వచ్చినప్పుడు, బోలెడు సూచనలు చేసేవారు. ఎదురుగా రోడ్డుమీద రెండెడ్ల బండి/ఒంటెద్దు బండి/గుర్రపుబండి/ట్రాక్టర్/జీప్/కారు, వస్తే సైకిలు దిగి రోడ్డు ప్రక్కగా నిలబడమనేవారు. ఎత్తు ప్రదేశాలు (మాకు శివకోడు లాకుల వద్ద) వచ్చినప్పుడు సైకిలు దిగి నడిపించుకుంటూ అవతలికి వెళ్లాలని చెప్పేవారు. ఇలా ఎన్నెన్నో విషయాలు నాకే కాదు నా ద్వారా నా పిల్లలకు ఉపయోగ పడ్డాయని చెప్పక తప్పదు. సందర్భం వచ్చినప్పుడల్లా మా నాయన చేసిన సూచనలు ఇప్పటికీ నాకు గుర్తుకు వస్తుంటాయి.

నేను, నా ఇంటెర్మీడియేట్ కోర్సు, మా అక్క స్వర్గీయ కానేటి మహనీయమ్మ సంరక్షణలో నాగార్జున సాగర్ (దక్షిణ విజయపురి)లో చదువుకున్నాను. ప్రభుత్వ జూనియర్ కళాశాల హిల్ కాలనీలో (విజయపురి నార్త్) 1972-74 బ్యాచ్‌లో ఇంటెర్మీడియేట్ పూర్తిచేశాను. అక్కడ మాకు అనేకమంది అనుభవజ్ఞులైన మంచి లెక్చరర్‍లు పాఠాలు బోధించేవారు. ఎంతో బాధ్యతాయుతంగా మమ్ములను తీర్చిదిద్దేవారు. అలాంటి వారిలో మాకు తెలుగు బోధించిన మహా పండితులు డా. గోలి వెంకట్రామయ్య గారు ఒకరు.

ఇంటర్మీడియెట్ లో తెలుగు బోధించిన గురువుగారు డా. గోలి వెంకట్రామయ్య గారు

వారు సంస్కృతంలోనూ, తెలుగులోనూ గొప్ప పండితులు. ఆయన పాఠం చెప్పే విధానం చాలా గొప్పగా ఉండేది. పాఠానికి అనుబంధంగా వున్న అనేక విషయాలు ఉదాహరణగా, హృద్యంగా వర్ణించి చెప్పేవారు చమత్కారాలు, హాస్య సంభాషణలు వారికి కొట్టిన పిండి. ఆయన క్లాస్ ఎప్పుడు నిండుగా వికసించిన ముఖాలతో కళకళ లాడుతుండేది. ఆయన బోధన అంత బాగా వుండేది. విద్యార్థులెవరూ ఆ క్లాసు వదులుకునేవారు కాదు. సున్నితమైన శృంగార విశేషాలను ఆడపిల్లలకు ఇబ్బంది కలగకుండా బహు సున్నితంగా కాస్త హాస్యం జోడించి చెబుతుండేవారు గురువుగారు శ్రీ గోలి వెంకట్రామయ్య గారు. ఇదంతా ఆయన్ని పొగడడం కోసం మాత్రం కాదు. ప్రత్యక్షంగా కాకపోయినా, పరోక్షంగా ఆయన చూపించిన మార్గమే (ఏకలవ్య శిష్యరికం) నన్ను ఈనాడు ఒక రచయితను/కవిని చేసిందని చెప్పడానికి. సందర్భం వచ్చినప్పుడల్లా వెంకట్రామయ్య గారి ప్రస్తావన తీసుకురాకుండా ఉండలేను. ఆయనను ఎన్నటికీ మరచిపోలేను.

1980లో నా బి.డి.ఎస్. డిగ్రీ పూర్తి అయింది. హౌస్ సర్జెన్సీ ప్రారంభం అయింది. ఆ సంవత్సరం ఆగస్టు 15న కాలేజీలో జండా వందనం పూర్తి కాగానే మా గురువుగారు ప్రొఫెసర్ పి రామచంద్రారెడ్డి గారు పిలిచి “ప్రసాద్ సాయంత్రం సమయంలో ఏమి చేస్తున్నావ్?” అని అడిగారు. “ఖాళీగానే ఉంటున్నా సార్” అన్నా. “అయితే సాయంత్రం నా క్లినిక్‌కు రా!” అన్నారు. అలా ఆయనతో సంవత్సరకాలం పనిచేసాను. ఆయన దగ్గర పని చేయడం ఒక గొప్ప అనుభవం. చాలా వృత్తిపరమైన మెళుకువలు ఆయన దగ్గర నేర్చుకున్నాను/తెలుసుకున్నాను. చదువుకుని డిగ్రీ పాస్ కావడం వేరు, క్లినిక్ మేనేజ్‌మెంట్ పూర్తిగా వేరు. అందుచేత నా ఉద్యోగ పర్వానికి, స్వంత క్లినిక్‌కు అది ఎంతగానో ఉపయోగపడింది. నేను అడగకుండానే నాకు అప్పట్లో నెలకు రూ. 700/- ఇచ్చేవారు. చాలా ఆత్మీయంగా చూసేవారు. ఆలస్యం అయితే గురువుగారు, నేను, వారి ఇంట్లో కలసి డిన్నర్ చేసేవాళ్ళం. మా ఇంటిదగ్గర (మాసాబ్ ట్యాంక్) వదలి పెట్టి వెళ్లేవారు. అంత ప్రేమగా చూసుకునేవారు.

రచయిత గురువు గారు ప్రొ.పి.రామచంద్రా రెడ్డి గారు

అంత మాత్రమే కాదు, ప్రభుత్వ ఉద్యోగం రాకముందే, సింగరేణి కాలరీస్ ఆసుపత్రిలో (బెల్లంపల్లి) నాకు దంతవైద్యుడిగా ఉద్యోగం ఇప్పించారు. సింగరేణి ఆసుపత్రులకు ఆయన పానల్ డాక్టర్ (డెంటల్)గా ఉండేవారు.

రచయిత పెళ్లి రిసెప్షన్ (ద్వారకా హోటల్) కు వచ్చి ఆశీర్వదించిన గురువు గారు

డాక్టర్ రామలక్ష్మి గారు చీఫ్ మెడికల్ ఆఫీసర్‌గా ఉండేవారు. ఇన్ని రకాలుగా నాకు సహాయం చేసి, నా భవిష్యత్తుకు మార్గదర్శనం చేసిన మహానుభావుడు ఆయన. గురువుగారి వయస్సు ఇప్పుడు 80+. ఇప్పటికీ వారు అప్పుడప్పుడూ ఫోన్ చేసి నన్ను పలకరిస్తూ వుంటారు.

క్లినిక్ లో గురువు గారితో రచయిత

నా జీవితంలో నన్ను గైడ్ చేసినవారు ఇంకా అనేకమంది వున్నారు. వారందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రతి క్షణం స్మరించుకోవలసిన మహోన్నత వ్యక్తులు వీరు. నా జీవితాన్ని గొప్పగా ప్రభావితం చేసిన మహాత్ములు వీరు!

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here