Site icon Sanchika

జ్ఞాపకాల పందిరి-174

[“కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే..!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్.]

మన రుచులు.. అభిరుచులు మన సొంతం..!!

[dropcap]ఈ [/dropcap]మధ్యకాలంలో మన ఆహారపు అలవాట్లను గురించిన అంశం ఎక్కడ చూచినా పెద్ద చర్చనీయాంశం అయింది. అది కాస్తా చిలికి చిలికి గాలివానలా తయారై కులాలకు, మతాలకూ చుట్టుకుని, ప్రజల మధ్య విద్వేషాలు రగిలించే వాతావరణం సృష్టించడం బాధాకరం. ఆహారపు ఆలవాట్లను బట్టి, కులాలుగా విడదీసి ఊహించుకోవడం పరిపాటి అయిపోయి ఆధునిక పద్దతిలో, కొత్తవారిని కలిసినప్పుడు, లేదా అద్దె ఇళ్ల కోసం వెతుకుతున్నప్పుడు సాధారణంగా ఆవలి వైపు నుండి వచ్చే మాట “మీరు శాకాహారా? మాంసాహారా?” అని. దీనిని బట్టి కులాన్ని లెక్కగట్టడం, లేదా ఊహించుకోవడం జరుగుతుంది. కొన్ని చోట్ల ‘శాకాహారులకు మాత్రమే ఇల్లు అద్దెకు ఇవ్వబడును’ అనే బోర్డులు కూడా మనం చూస్తూనే ఉంటాం. మరికొన్ని చోట్ల మరో రూపంలో బోర్డులు కనిపిస్తుంటాయి. శాకాహారులు ఒక కులానికి మతానికీ చెందినవారని, మాంసాహారులు మరికొన్ని ఇతర కులాలకు చెందినవారని, వారి వారి అలవాట్లను బట్టి సంస్కృతీ సంప్రదాయాలను బట్టి విడదీసుకొని చూసుకోవడం ఈనాటి సమస్య కాదు. మాంసాహారులను పక్కనపెడితే, శాకాహారులు, తాము ఎందుకు శాకాహారం ఎంచుకున్నది చెప్పగలిగితే, కొన్ని చిక్కు ముడులు విడిపోయే అవకాశం వుంది. అలాగే మాంసాహారం ఎందుకు ముట్టుకోరో కూడా విపులీకరిస్తే, మరికొన్ని అనుమానాలకు, సందేహాలకు పరిష్కారం దొరుకుతుంది. జీవహింస అనే అంశం తలెత్తినప్పుడు, దానిని రుచితో ముడిపెట్టడం సమంజసం కాదేమో.

సరే ఏది ఏమైనా, ఎవరి అలవాట్లు వారివి, ఎవరి రుచులు వారివి. అలా అని ఒకరినొకరు అసహ్యించుకునే అంశం కాదిది. ఎవరి ఇష్టం వారిది. ‘జిహ్వకో రుచి’ అన్నారు కదా! అందుచేత ఒకరు తినే ఆహార పదార్థాన్ని, మరొకరు అసహ్యించుకున్నట్టు మాట్లాడడం సరికాదు. ముఖ్యంగా శుభకార్యాలలో విందులో పాల్గొనే శాకాహారులు కొందరు కావాలని భోజనం చేయరు. కొందరికి స్పూన్లు, తెడ్లు అటు ఇటు మారాయేమోనని అనుమానం. భయం భయంగానే భోజనం ముగించడం వంటి తతంగాలు చూస్తూనే ఉంటాం. కొందరు ఉల్లిపాయలు, వెల్లుల్లి తినరు. మరికొందరికి అవి లేకుంటే అసలు నడవదు. ఎవరి అభిరుచి వారిది. ఎవరి ఇష్టం వారిది. అందు చేత ఫలానా కులం వాళ్ళే శాకాహారులని, మిగతా వాళ్లంతా మాంసాహారులనీ లెక్కగట్టే రోజులు ఎప్పుడో వెళ్లిపోయాయి.

ఒకప్పుడు మాత్రమే కాదు, ఇప్పుడు కూడా ప్రతి విషయంలోనూ నిష్ఠగా తమ జీవన శైలిని కొనసాగిస్తున్నవారు లేకపోలేదు. కానీ స్పష్టంగా అటూ ఇటూ విడదీసే పరిస్థితులు ఇప్పుడైతే లేవు. అందరిలోనూ మిశ్రమ అలవాట్లు, అభిరుచులు మొదలైనాయి. నా జీవితం నుండే కొన్ని ఉదాహరణలు ఇక్కడ పాఠకుల దృష్టికి తీసుకు రావలసిన అవసరం ఉంది.

మా కుటుంబం మాంసాహారులకు చెందినది. అలా అని రోజూ తినే వ్యవహారం కాదు. మా బాల్యంలో అయితే మాంసాహారం తినే అవకాశాలు అతి తక్కువగా ఉండేది. నాకు ఇద్దరు అన్నయ్యలు, ఇద్దరు అక్కలు. మాతో పాటు మా అమ్మ నాయన. ఇందులో మా పెద్దక్క స్వర్గీయ మహానీయమ్మ పూర్తి శాకాహారి. కనీసం ప్రక్కన నాన్‍వెజ్ తినేవాళ్ళు వున్నా, ఆవిడ తట్టుకోలేకపోయేది. మా ఇంట్లో అలా ఆదివారం మా అమ్మ రెండు కూరలు వండేది. నేను నాగార్జునసాగర్‌లో అక్క దగ్గర వుండి ఇంటర్మీడియేట్ చదువుకున్నప్పుడు, శాకాహారం లోని వివిధ రుచులు నేను చూడగలిగాను. నా బాధ చూడలేక మా అక్క అప్పుడప్పుడూ కోడి గుడ్డు ఉడకబెట్టి ఇచ్చేది. అంతకు మించి ఆవిడ మాంసాహారం జోలికి ఎప్పుడూ పోలేదు. జన్మతః అది ఆవిడకు అబ్బిన అలవాటు అంతే. “నువ్వు ఎందుకు తినవు?” అని ఆవిడను అడిగే హాక్కు మాకెవ్వరికీ లేదు. అది ఆవిడ ఇష్టం అంతే!

ఇటువంటిదే మరొక అనుభవం. నేను మహబూబాబాద్‌లో పని చేస్తున్నప్పుడు, నా సీనియర్ డాక్టర్ ఒకాయన ఉండేవారు. వారిది నిష్ఠ గల బ్రాహ్మణ కుటుంబం. వారి స్వస్థలం ఖమ్మం. వారి కుమారుడు కూడా వైద్యుడే. మా ఇద్దరికీ పరిచయం ఉండేది. ఒకసారి నా స్వంత పనిమీద ఖమ్మం వెళ్ళవలసి వచ్చింది. నన్ను రిసీవ్ చేసుకోవడానికి డాక్టరు గారి అబ్బాయి రైల్వే స్టేషన్‌కు వచ్చాడు. అక్కడి నుండి సరాసరి ఇంటికి తీసుకువెళ్లాడు. సరదాగా భోజనానికి బయటికి వెళదాం అన్నాడు. ఇద్దరం బయలుదేరాం బైక్ మీద. మా బండి ఒక నాన్-వెజ్ హోటల్ ముందు ఆగింది. ‘ఇదేమిటి?’ అన్నట్టు అతని వంక చూసాను. ‘పదండి’ అన్నట్టు హోటల్ లోపలికి దారి చూపించాడు. నాకు తెలియని నాన్-వెజ్ రుచులు నాకు రుచి చూపించాడు ఆయన ఆ రోజు. అక్కడ “ఎందుకు ఇలా?” అని ఆయనను అడిగే హక్కు నాకు లేదు. అది అతని ఇష్టం. ఆ ఆహరం అతనికి ఇష్టం. అంతే!

కార్టూనిస్ట్ పైడి శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలతో – వ్యాస రచయిత.

ఇంకొక అనుభవం కూడా చెప్పకపోతే, ఈ శీర్షికకు అన్యాయం చేసినట్టే ఉంటుంది. నేను జనగాంలో పని చేస్తున్నప్పుడు, ఒక కులానికి అనుబంధంగా వున్న ఒక సేవాసంస్థ మంచి సేవా కార్యక్రమాలు చేస్తుండేది. అందులో ఒక పెద్దాయన ప్రతి ఉచిత వైద్య శిబిరానికి నన్ను కూడా పిలిచేవారు. అలాంటి ఒక కార్యక్రమంలో మధ్యాహ్న భోజనానికి బ్రేక్ తీసుకున్నప్పుడు, ఆ పెద్దాయన కార్యక్రమ నిర్వాహకుడిగా, అందరికి ఒక ప్రశ్న వేశారు. “మన సభ్యుల్లో వెజిటేరియన్స్ ఎవరైనా ఉన్నారా?” అని. అయన అలా అనగానే అందరూ ఘొల్లున నవ్వారు. కారణం అందులో నేనొక్కడినే మాంసాహారిని. శాకాహారులుగా చెప్పబడే వర్గం ఆ కార్యక్రమ నిర్వాహకులది.

అందుచేత ఆహారపు అలవాట్లు అనే అంశం వచ్చినప్పుడు, ఎవరి ఇష్టం వారిది అని చెప్పక తప్పదు. ఎగతాళి చేయవలసిన విషయం కానే కాదు. ఒకరి భోజన అలవాట్లను మరొకరు కామెంట్ చేయడం, అసహ్యించుకునే హక్కు ఎవరికీ లేదు. దీని సాకుతో కులాలుగా విడదీసి మాట్లాడడం కూడా సమంజసం కాదు. అలాగే మాంసాహారులు మాత్రమే, అనేక రకాల హింసలకు పాల్పడతారనడం కూడా సమంజసం కాదు. మంచి చెడు అన్ని వర్గాల్లోనూ ఉంటాయి. ఏ ఒక్కరికో ఇది కట్టబెట్టడం సమాజానికే ప్రమాదం. సమసమాజ నిర్మాణంలో అందరూ తమ వంతు బాధ్యతను తమ భుజాలమీద వేసుకోవలసిందే!

‘సర్వే జనా సుఖినో భవంతు’.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version