Site icon Sanchika

జ్ఞాపకాల పందిరి-176

[“కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే..!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్.]

మిత్రులతో మరో సంబరం

[dropcap]ఈ[/dropcap] రోజుల్లో పూర్వ విద్యార్థుల కలయికలు, కుటుంబాల కలయికలు, ఇతర మిత్రుల/గ్రూపుల ఆత్మీయ కలయికలు ముమ్మురంగా ఊపందుకున్నాయి. మానవ జీవితంలో ఇదొక మంచి పరిణామమేనని నా ఉద్దేశం. ఒకప్పుడు రవాణా సౌకర్యాలు అంతగా లేనప్పుడు, వున్నా సాధారణ/మధ్య తరగతి కుటుంబాలకు అందుబాటులో లేనప్పుడు, సమాచార సాధనాలు అంతంత మాత్రమే ప్రతి మనిషికీ చేరువలో వున్నప్పుడూ ఈ ఆత్మీయ సమ్మేళనాలు అంతగా జరిగేవి కావు. టెలిగ్రామ్, ట్రంకాల్, ఉత్తరం.. ఇవే ఆనాటి సమాచార సాధనాలు.

ప్రస్తుతం, ఇంటర్నెట్, మొబైల్, అందులో ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్ వంటివి ప్రపంచాన్ని అంతటినీ ఒకచోటికి చేర్చే వెసులుబాటును కలిగించాయి. ఒకప్పుడు అత్యవసరం అయితేనే ట్రంకాల్ జోలికి పోయేవారు. పైగా అది ఖర్చుతో ముడిపడి వున్నది. అందుచేత అతి తక్కువమందికి అందుబాటులో వున్నట్టు లెక్క. ఇకపోతే టెలిగ్రామ్ అర్జంట్ సమాచారం కోసం ఉపయోగించేవారు. అది మంచి కానీ, చెడు సమాచారం కానీ, వాటి కోసం టెలిగ్రామ్‌ను నమ్ముకునేవారు. సాధారణంగా టెలిగ్రామ్ వచ్చిందంటే ‘చావు కబురు’ ఏదో వచ్చిందని అనుమానం వచ్చి తెగ భయపడిపోయేవారు. ఈ రెండు సమాచార సాధనాలను ఈ వ్యాస రచయిత ఉపయోగించారని చెప్పడంలో ప్రత్యేకత లేదు కానీ ఇప్పటి లేత తరానికి, భవిష్యత్ తరాలకు, ఈ రెండు సమాచార సాధనాలు చరిత్రగానే ప్రదర్శనశాలల్లో మిగిలిపోతాయి.

ప్రసుతం మొబైల్ వెలుగులోనికి వచ్చాక అన్ని రంగాలలోనూ అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. అందులో సమాచార రంగమూ ప్రధానమైనదే! ఈ రోజున ప్రాంతీయంగా మాత్రమే కాదు, దేశ విదేశాలకు సైతం క్షణాల్లో సమాచారం ఇచ్చి పుచ్చుకునే సాంకేతిక వ్యవస్థ మన చేతి లోనికి వచ్చింది. ఇది నిజంగా గొప్ప సాంకేతిక విప్లవం/ఆవిష్కరణగా మనం చెప్పుకోవచ్చు. అదుగో.. అదే ఈ రోజున ఎక్కడెక్కడో వున్న బంధువులను, స్నేహితులను, శ్రేయోభిలాషులను ఒక దగ్గరకు చేర్చే వెసులుబాటును కలిగించింది. అందుచేతనే పలుచోట్ల నివసిస్తున్న బంధువులు, ఆత్మీయులు ఒక చోట చేరి ‘ఆత్మీయ సమ్మేళనాల’కు శ్రీకారం చుడుతున్నారు. పాఠశాలల్లో, కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో చదువుకున్న విద్యార్థులు, క్లాసులు వారీగా, గ్రూపుల వారీగా సంఘాలుగా ఏర్పడి, వారి వారి చిరునామాలు సేకరించి, అప్పుడప్పుడు ‘గెట్ టుగెదర్’ పేరుతో వయసుతో నిమిత్తం లేకుండా కలవగలుగుతున్నారు. పాత జ్ఞాపకాలను నెమరు వేసుకోగలుగుతున్నారు. రకరకాల కార్యక్రమాలు రూపకల్పన చేసుకుని ఆనందంగా గడపగలుగుతున్నారు.

డా. పాలేశ్వరన్, మలేషియా

అదుగో అలాంటి అవకాశము మాకూ వచ్చింది. మేము చదువుకున్న ప్రభుత్వ దంత వైద్య కళాశాల (అఫ్జల్‌గంజ్) హైదరాబాద్‌లో వుంది. దానికి ‘పూర్వవిద్యార్థుల అసోసియేషన్’ ఉన్నప్పటికీ, మా బ్యాచ్‌లో కొంత మందిమి అప్పుడప్పుడూ హైదరాబాద్ కేంద్రంగా కలుస్తుంటాం. మాది బి.డి.ఎస్. 1975-80 బ్యాచ్ అయినప్పటికీ, మేము అందరం కాకపోయిన అందుబాటులో వున్న కొద్దిమందిమి అయినా అప్పుడప్పుడు ప్రత్యేక సందర్భాలలో కలుస్తుంటాం. మా అందరికీ మంచి గ్రూప్ లీడర్‌గా నా సహాధ్యాయిని, డా. క్రాంతి (గోరా గారి మనుమరాలు) అప్పుడప్పుడూ ఇలాంటి ఆత్మీయసమ్మేళనాలు ఏర్పాటు చేస్తారు. గతంలో ఇలాంటివి చాలా జరిగాయి. కానీ ఈసారి కాస్త భిన్నంగా రూపకల్పన చేసుకున్నాం.

 

డా.పాలేశ్వరన్.. రచయిత

నిజానికి డా. క్రాంతి ఆగస్ట్ మూడున కాశ్మీర్ ప్రోగ్రామ్ ప్లాన్ చేసింది. నేను రావడం లేదని ముందే చెప్పేసాను. మిగతా కొంతమంది కాశ్మీర్ వెళ్ళడానికి తయారయ్యారు. అందులో ఒకడు మలేషియా మిత్రుడు డా. పాలేశ్వరన్ (మలేషియా ఆర్మీలో పనిచేశాడు) అతను మలేషియా నుండి, ఒకటవ తేదీ అర్ధరాత్రి హైదరాబాద్‌కు చేరుకున్నాడు. అతను ఎప్పుడు వచ్చినా, మా మరో స్థానిక మిత్రుడు డా. శంకర్ లాల్ (చందానగర్) దగ్గర ఉంటాడు. అతని కోసం కాశ్మీరుకు వెళ్లే ముందు రోజు (2, ఆగస్ట్) మా మిత్రుల ఆత్మీయ సమ్మేళనం కొండాపూర్ లోని ఒక హోటల్‌లో ఏర్పాటు చేసుకుని ఆ రోజు ఉదయం 12 గంటలకు ఒక్కొక్కరం హోటల్‌కు చేరుకున్నాం.

ఇక్కడ ఒక గమ్మత్తు జరిగింది. సాధారణంగా ఇలాంటి కార్యక్రమాలు రూపకల్పన చేసే మిత్రురాలు డా. క్రాంతి హైదరాబాద్‌లో వున్న మా సహాధ్యాయులతో పాటు, మార్కాపురంలో ఉంటున్న మా మరో మిత్ర సహాధ్యాయి డా. తోట ప్రసాద్‌ను కూడా తప్పకుండా వచ్చే విధంగా చూడాలనే ప్రతిపాదన చేసింది. దూరం వల్లనూ, ఇతర స్వంత కారణాల వల్లనూ డా ప్రసాద్, ఈ ఆత్మీయ సమ్మేళనాలకు హాజరు కాడు. ఆ ధైర్యం తోనే, అతను సమ్మేళనానికి రాడని, వస్తే సన్మానం చేస్తానని డా. క్రాంతితో అన్నాను. మా ఇద్దరినీ ఆశ్చర్యపరుస్తూ, తాను వస్తున్నట్టు, టికెట్ బుక్ చేసుకుంటున్నట్టు మెసేజ్ పెట్టాడు. అందుచేత ఈ కార్యక్రమాన్ని వినూత్నంగా తీర్చిదిద్దే విషయంలో, నేను కూడా పాలుపంచుకున్నాను.

పుస్తకావిష్కరణ గురించి వివరిస్తున్న రచయిత

అదెలాగంటే – నేను కొత్తగా రాసిన నా ఐదవ కథల పుస్తకం, మలేషియా మిత్రుడు డా. పాలేశ్వరన్ చేత ఆవిష్కరింపజేసి శాలువాతో సన్మానం చేసి, అతడిని ఆశ్చర్యపరిచాను. ముందుగా ఈ విషయం ఎవరికీ చెప్పకపోవడంతో అందరూ ఆశ్చర్యానికి గురి అయ్యారు, అందరూ ఆనందలోకంలో విహరించారు.

పుస్తకావిష్కరణ పిదప సన్మానం

ఇక రెండవ అంశం, డా. ప్రసాద్, మా ఆత్మీయ సమ్మేళనానికి హాజరయ్యాడు కనుక, నేను మాట తప్పకుండా, మిత్రురాలు డా. క్రాంతిని శాలువా కప్పి సన్మానించాను. అందరిలోనూ నవ్వుల పువ్వులు విరిశాయి. అంతకు రెండు రోజుల ముందు మరో మిత్రుడు డా. శంకరలాల్ (చందానగర్) పుట్టినరోజు కావడంతో, కేక్ తెచ్చి ఆయన పుట్టినరోజు వేడుక జరిపాం. ఆ కొద్దిగంటలూ ఇలా ఆనందంగా గడిపే అవకాశం ఈ ఆత్మీయ సమ్మేళనం మాకు ఇచ్చింది.

డా. శంకర లాల్ పుట్టిన రోజు వేడుక
డా. క్రాంతిని రచయిత సన్మానిస్తున్న దృశ్యం, కుడి వైపు డా. తోట ప్రసాద్ (మార్కాపురం)

మా మిత్రుల ఆత్మీయ సమ్మేళనంలో, నాతో పాటు, డా. తోట ప్రసాద్, డా. శంకర్ లాల్, డా. పాలేశ్వరన్, డా. దత్త ప్రసాద్, డా. హరనాథ్ బాబు, డా. జి. చంద్రశేఖర్, డా. క్రాంతి, ఆవిడ భర్త ప్రసాద్, డా. మంజుల, ఆవిడ భర్త శ్రీ రాజేశ్వర రెడ్డిలు పాల్గొనడం సంతోషాన్నిచ్చింది, సరదా సంభాషణలతో కమ్మని మధ్యాహ్న భోజనం చేసాం. సీనియర్ ఆర్థోడాంటిస్ట్ డా. జి. చంద్రశేఖర్ చక్కని సందర్భోచిత చిత్రాలు తీసి, ఈ ఆత్మీయ సమ్మేళనం గుర్తుంచుకునేలా చేసాడు. కొన్ని కారణాల వల్ల, డా. జి. ఎన్. రావు, గుంటూరు ఝాన్సీ, కర్నూల్ ఝాన్సీ వంటివారు కార్యక్రమానికి రాలేక పోవడం కొద్దిగా వెలితి అనిపించింది. ఆలస్యంగా వచ్చి ఆనందాన్ని పంచుకున్నారు, డా. అన్నే అరుణ. మలేషియా నుండి వచ్చిన మిత్రుడి కారణాన, ఇలా మేమంతా కలవడం ఈ వయసులో గొప్ప ఆనందం, తృప్తి మిగిల్చాయి. జీవితంలో గుర్తుండిపోయేవి ఇలాంటి జ్ఞాపకాలే కదా! ఇలాంటి అవకాశల కోసం ఎదురు చూసేవాళ్ళలో నాదెప్పుడూ ముందు వరుసే మరి!!

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version