[“కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే..!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్.]
అనుకున్నదొక్కటీ..!!
[dropcap]జీ[/dropcap]వితంలో అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరగవు. కొన్ని ఊహించని మంచి పనులు మన ప్రమేయం లేకుండానే మంచిగా జరిగిపోతుంటాయి. కొన్నింటిని ఆశాజనకంగా మంచి జరుగుతుందని ఊహిస్తాం. కానీ మన ఊహలను తలక్రిందులు చేస్తూ మనకు నిరాశను కల్పిస్తాయి. ఇటువంటివి జీవితంలో మనకు అనేకరూపాల్లో ఎదురవుతుంటాయి. పరిస్థితిని బట్టి ఉత్సాహ, నిరుత్సాహాలు బయట పడుతుంటాయి.
కొందరి మనుష్యులను, వారి జీవనశైలిని విపరీతంగా ఇష్టపడతాం. మన మనస్సులోని మంచితనం గుర్తింపు వచ్చేవరకూ ఎదుటివాళ్ళు వారి నిజస్వరూపాన్ని బయటపడనివ్వరు. ఒకసారి మనకు వారి మీద పూర్తి నమ్మకం ఏర్పడిన తర్వాత, ఎలాంటి అనుమానాలకు తావీయకుండా వారికి ప్రతి విషయంలోనూ పూర్తి స్వేచ్ఛ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. అల్లాంటి నమ్మకాన్ని ఒక్కోసారి ఎదుటివారు దుర్వినియోగం చేసుకుని, ఆనక సర్వం కోల్పోతారు. ఇది లోక నైజం. ఇలాంటివి ప్రతి ఒక్కరూ, ఏదో సమయంలో, ఏదో రూపంలో, ఇటువంటి సమస్యలను ఎదుర్కుంటారు. ఈ సమస్య బయటివారితోనే కాదు, బంధువులలోనూ, రక్తసంబంధీకులలోను, శ్రేయోభిలాషుల్లో కూడా ఉండవచ్చు. నమ్మకం కేంద్రంగా వ్యాపారాలలో భాగస్వాముల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్కాచెల్లెళ్ల మధ్య, స్నేహితుల మధ్య ఎక్కడైనా రావచ్చును. సహా ఉద్యోగుల మధ్య, పని కార్మికుల మధ్య, ఇంట్లో పనిచేసే పనిమనుష్యుల వల్ల, ఇలా ఎవరి వల్లనైన సమస్యలు ఎదురుకావచ్చు.
ఇంట్లో భార్యాభర్తలు ఉద్యోగస్థులైనప్పుడు, వారికి వారి కుటుంబ పెద్దల నుండి ఎలాంటి సహకారమూ అందే పరిస్థితులు లేనప్పుడు, వారు పూర్తిగా అన్నివిషయాలలోను పనిమనుష్యుల మీద ఆధార పడక తప్పదు. పిల్లల పెంపకానికి కూడా, పనిమనుష్యుల మీద ఆధారపడక తప్పదు. పనిమనుష్యులను నమ్మక తప్పదు. ఇలాంటి సందర్భాలలో చాలామంది పనిమనుష్యులు నమ్మకంగా పనిచేసి, వారి వారి యజమానుల ప్రశంసలు పొందుతుంటారు. ఎక్కడో ఒకచోట, పంటి క్రింది రాయిలా పనిమనుష్యులు తమపై ఉంచిన నమ్మకాన్ని దుర్వినియోగం చేసుకుంటారు. తాత్కాలిక ప్రలోభాలకు లొంగిపోయి భవిష్యత్తును సర్వనాశనం చేసుకుంటారు.
నా ఉద్యోగ పర్వంలో మేము పనిమనుష్యులమీద ఆధారపడక తప్పలేదు. మొదటి కారణం ఇద్దరం ఉద్యోగులం, రెండో కారణం, మా ఇద్దరి పిల్లల ఆలనాపాలనా చూసే పెద్దలు ఎవరూ మాకు అందుబాటులో లేకపోవడం. మా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేవరకూ ఎందరో పనిమనుష్యులు మా దగ్గర పనిచేసారు, మేము ఊహించిన/ఆశించిన దానికి మించి వారు మాకు పనిచేసిపెట్టారు. దానికి కారణం మేము వాళ్ళని ప్రత్యేకంగా పనిమనుష్యులుగా కాకుండా, ఇంటి మనుష్యులుగా చూడడమే! మేము ఏమి తినేవారమో వారికి అదే పెట్టేవారము. అలా పనిమనుష్యుల నుండి మంచి సహకారం అందుకోవడం మూలాన, మేము ఎప్పుడూ ఒంటరితనం ఫీల్ కాలేదు. మా పిల్లలకు ఎలాంటి ఇబ్బందీ కలగలేదు. ఆ విధంగా మేము, మా పిల్లలు చాలా అదృష్టవంతులం అని చెప్పాలి.
ఇప్పుడు మేము ఇద్దరం పదవీ విరమణ చేసిన తర్వాత, మనుమల పెంపకంపై దృష్టిపెట్టక తప్పలేదు. నా కూతురు – అల్లుడు ఉద్యోగస్థులు కనుక మళ్ళీ పనిమనుష్యుల విషయం తెరమీదికి వచ్చింది. మేము ఇద్దరమూ పదవీ విరమణ చేసివుండడం వల్ల అమ్మాయికి మొదటి సంతానం కూతురు (ఆన్షి) కావడం, అలా మనుమరాలు పెంపకం మా మీద పడడం, అదృష్టవశాత్తు మా అమ్మాయికి ఆ సమయంలో నిజామాబాద్ నుండి,నేను ఉంటున్న వరంగల్ (హన్మకొండ)కు బదిలీ కావడం మాకు కొంత కలిసొచ్చినట్టు అయింది.
అదృష్టం కొద్దీ, మంచి పనిమనిషి దొరకడం పాపకు ఐదు సంవత్సరాలు వచ్చేవరకూ ఆ అమ్మాయి మనవరాలిని చాలా బాగా చూసింది (పెంచింది). అలా ఒకగండం సాఫీగా గడిచిపోయినట్లు అయింది.
ఈ లోగా మా అమ్మాయికి, హైదరాబాద్ బదిలీ కావడం, ఇక్కడ వంశోద్ధారకుడు జన్మించడం జరిగిపోయాయి. మళ్లీ సమస్య పునరావృతం అయింది. మేము హైదరాబాద్‍కు తరలివచ్చినా, సమస్యకు పరిష్కారం దొరకలేదు.
మళ్ళీ పని అమ్మాయి, పైగా మా జీవనశైలికి అనుకూలంగా వుండే అమ్మాయి కోసం వెతుకులాట. మొత్తం మీద మా అమ్మాయి ప్రయత్నం ఫలించి, పాత వరంగల్ జిల్లాలో ఒక కుగ్రామం నుండి, తెలిసిన మిత్రుడొకాయన, ఒక పేదింటి అమ్మాయిని చూసి పెట్టారు. ఆమెకు ఇలా చిన్న పిల్లల్ని చూడడం మాతోటే ప్రారంభం. మాకు కావలసిన విధంగా ఆ అమ్మాయిని మలుచుకోవడంతో, కొద్దీ కాలంలోనే పనులన్నీ నేర్చుకుని శభాష్! అనిపించుకుంది. ఆమె వయసు 19 సంవత్సరాలు ఉండొచ్చు, కానీ చూడడానికి 15 ఏళ్ళ పిల్లలా కనిపించేది. మా ఇంటి పనిలో చేరిన తర్వాత అమ్మాయి పుష్టిగా బాగా తయారయ్యింది. అసలు వాళ్ళ పుట్టింటికి వెళ్ళడానికి ఇష్టపడేది కాదు. తృప్తికరంగా రోజులు గడిచి పోతున్నాయి. ఆ అమ్మాయి తల్లిదండ్రులు కూడా చాలా సంతోషంగా వున్నారు. మంచి అమ్మాయి (కేర్ టేకర్) దొరికిందని మేము బంధువులతో, స్నేహితులతో చెప్పుకునేవాళ్ళం. అలాంటి ఆ అమ్మాయి మీది నమ్మకం గత నెల గాలిలో కలిసిపోయింది.
ఆ అమ్మాయి మా ఇంటి హాలులో పడుకునేది. ఉదయం 5.30కు లేచి తయారై ఉండేది. రాత్రి పని వున్నా 9.30 కి ఆమెను పడుకోమనేవాళ్ళం. ఒకరోజు ఏమైందంటే – ఆ రోజు మా అల్లుడు 12 గంటల, వరకూ హాలులోనే టివి చూసి తన బెడ్ రూంలో పడుకున్నాడు. అర్ధరాత్రి ఒంటిగంటకు, మా మనవడు మంచం దిగి బుడి బుడి నడకలతో హాల్ లోకి వెళ్ళాడు. మా అమ్మాయి అల్లుడూ లేచి గబగబా హాల్లో లైట్ వేసారు బాబు కోసం. హాల్లో పక్కమీద పని అమ్మాయి లేదు. లోపల వాష్‌రూమ్, బయట వెతికారు ఎక్కడా కనిపించలేదు. ఇంట్లో హడావిడి మొదలైంది. లైట్లు అన్నీ వెలిగాయి. నాకు మెలుకువ వచ్చింది. విషయం విని విస్తుపోయాను. ఆ అర్ధరాత్రి మా వాళ్లంతా ఏమి చేయాలో తెలియక పెద్ద టెన్షన్‌తో, ఆందోళనగా వున్నారు. మనసు పరి పరివిధాల ఆలోచనలతో మెదడును పూర్తిగా మొద్దుగా చేసేసింది.
ఈ లోగా నా శ్రీమతి నా దగ్గరకంటే వచ్చి, చెవిలో చెప్పినట్టుగా చెప్పింది. అదే, ఆ పని అమ్మాయిని పట్టుకోవడానికి దారి చూపించడానికి క్లూ.. అయింది.
ముందురోజు, ఆ అమ్మాయి నా శ్రీమతితో ఇలా అన్నదట! “అమ్మా నాకు ఎవరూ లేరు (పేద తల్లిదండ్రులు వున్నారు). మీరే నాకు పెళ్లి చేయాలి. నేను ఫేస్‌బుక్ ద్వారా ఒక అబ్బాయిని ప్రేమించాను, అతనిది ఫలానా వూరు, పెయింటింగ్ పని చేస్తాడు” అని చెప్పిందట! నా శ్రీమతి నవ్వి వూరుకుందిట. నాకు ఈ విషయం చెప్పగానే, ఈ సమాచారం బయట వున్న మా అల్లుడికి అందించాను. అది వినగానే అతని బుర్రలో బల్బు వెలిగింది. ఎందుకంటే, మా పక్కింటిలో వారం రోజులుగా పెయింటింగ్ పని జరుగుతున్నది. పగలు ఇద్దరు ముగ్గురు పని చేస్తే రాత్రి ఒకబ్బాయి పని చేస్తున్నాడు. ఈ అమ్మాయి అతనితో ఆ ఇంట్లో దొరికింది. ఎవ్వరం నమ్మలేని నిజం ఇది. ఎలా వాళ్ళిద్దరికీ ఎప్పుడు పరిచయం అయిందో, ఆ సాహసి మేము అందరం నిద్రలోకి జారుకోగానే పక్కింటికి జారిపోవడం మొదలు పెట్టింది. ఇలా ఈ అమ్మాయి అప్పటికే నాలుగుసార్లు అతని దర్శనం చేసుకున్నట్లు, ఆ ఇంట్లోని సి.సి. కెమెరాలు నిరూపించడం, ఈ హడావిడికి ఆ అబ్బాయి అక్కడినుండి పారిపోవడము, మరునాడు ఆ అమ్మాయిని మేము ఆమె ఇంటికి పంపించి వేయడం జరిగింది. ఆదిలోనే విషయం మా దృష్టికి వచ్చింది కాబట్టి సరిపోయింది కానీ, లేకుంటే ఎన్ని మలుపులు తిరిగి సమస్య పీక మీదికి వచ్చేదో!
ఇదంతా మీ ముందు ఉంచడం లోని ప్రధాన ఉద్దేశం ఏమిటంటే, ఎంతటి నమ్మకం గలవారైనా, వారిపై ఒక కన్నేసి ఉంచడం అవసరమనీ, నమ్మకంగా వున్నారుకదా అనీ అన్ని పనులు వాళ్లకి అప్పగించడం సరైనది కాదని నా అనుభవం ద్వారా చెప్పే ప్రయత్నమే ఇది. చేతులు కాలాక, ఆకులు పట్టుకుని ప్రయోజనం లేదు కదా! ఇది పనిమనుష్యులను కించపరచడానికి రాసింది కాదు, యజమానులకు అవగాహన కల్పించడానికి.
(మళ్ళీ కలుద్దాం)