Site icon Sanchika

జ్ఞాపకాల పందిరి-183

[“కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే..!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్.]

చర్మ సంరక్షణలో..!!

[dropcap]ఒ[/dropcap]కప్పుడు పల్లెల్లో స్నానం చేయడానికి ఇప్పటి మాదిరిగా రకరకాల సబ్బులు, రకరకాల పిండి ఉత్పత్తులు లేవు. స్నానం చేయడానికి ఇప్పటి మాదిరిగా విలాసవంతమైన స్నాన గదులు లేకపోయినా మామూలు ప్రత్యేకమైన గదులు కూడా ఉండేవి కాదు. మగవారికి ఇబ్బంది లేదు కానీ, బాలికలకు, మహిళలకు ఇది మహా ఇబ్బందికరమైన విషయం. కొందరు ఇంటి వెనుక, కొబ్బరి ఆకులతో గానీ, కొబ్బరి తడికెలతో గాని, తాటాకులతో గాని (కోనసీమ వంటి ప్రాంతాల్లో ఇవి లభ్యం అవుతాయి కనుక) చతురాస్రాకారంలో దడిలా కట్టుకుని ఆ చాటున స్నానాలు చేసేవారు. అది కూడా చేసుకోలేనివారు చీకటి పడ్డాక, ఇంటివెనుక నగ్నంగా గబ గబా స్నానం ముగించుకుని వచ్చేవారు.

ఇప్పటి మాదిరిగా అప్పుడు దుకాణాలలో స్నానం కోసం సబ్బుల అమ్మకం ఉండేది కాదు. ఉన్నా అవి కొనుక్కునే స్థాయి అందరికి ఉండేది కాదు. పైగా అప్పట్లో సబ్బు వాడడం అంటే విలాసవంతమైన జీవితానికి తార్కాణంగా లెక్క గట్టేవారు. ఆడవాళ్ళకి, పసిపిల్లలకు ‘నలుగు పిండి’ వాడుకలో ఉండేది. మగవాళ్ళు బావి దగ్గరనో, పంట కాల్వలోనో తనివి తీరా స్నానం చేసేవారు. మామూలుగా చేతులతో ఒళ్లు తోముకోవడం ఉండేది. కొందరైతే మెత్తని బీరకాయ పీచుతో తోముకుని స్నానం చేసేవారు. మరికొందరు పురుషులు పంటకాలువలలో దిగి, ఒళ్ళంతా బంక మట్టి పూసుకుని, బాగా రుద్దుకుని, మంచిగా స్నానం చేసి వచ్చేవారు (తెలియకుండానే ప్రకృతి వైద్యం ఆచరించినట్టు అన్నమాట!). ఇప్పుడు అవన్నీ ఆలోచిస్తే చాలా ఆశ్చర్యం, బాధ అనిపిస్తాయి. రైతు కుటుంబాలలో, రైతుకూలీల కుటుంబాలలో పరిస్థితి ఇలానే ఉండేది. అయినా ఎక్కువ శాతం ప్రజలు ఎలాంటి చర్మ సమస్యలు లేకుండగనే బ్రతికి బట్టకట్టగలిగారు.

నాకు జ్ఞానం వచ్చిన తరువాత, పేద కుటుంబాలలో ఒక ఔషధం మాదిరిగా, ‘టెట్‌మోసాల్’ సబ్బు ప్రవేశించింది. చిన్నపిల్లలలో, పెద్దవారిలో, గజ్జి, చిడుము, దురద వున్నవారికి, గ్రామాలలో సంచరించే ‘ఆర్.ఎం.పి.’ వైద్యుల సలహా మేరకు, తాలూకా కేంద్ర ప్రాంతాలనుండి కొని తెచ్చుకునేవారు. అలాంటి చర్మ సమస్యలు వున్నవారు, ముఖ్యంగా పిల్లలు ఈ సబ్బుతో స్నానం చేయడానికి ఇష్టపడక, భయపడి ఏడ్చేవారు. దానికి కారణం ఈ సబ్బు వంటికి రాసుకుంటే తెగ మంట పుట్టేది. అందుకే ఆ సబ్బును చూస్తేనే భయపడేవారు.

తరువాత నా దృష్టికి వచ్చింది ‘లైఫ్‌బాయ్’ సబ్బు. మధ్యతరగతి ప్రజల వరకూ ఇది బహుళ ప్రచారం పొంది చాలాకాలం రాజ్యమేలిందని చెప్పవచ్చు. ఇప్పటికీ ఈ సబ్బు కొందరి ఇళ్లల్లో దర్శనం ఇస్తుందంటే ఏ మాత్రం ఆశ్చర్య పడవలసిన అవసరం లేదు. ఒకసారి నేను ఆర్మీ క్వార్టర్స్‌కు ఉదయం సమయంలో ఒక దూరపు బంధువును కలవడానికి వెళ్ళవలసి వచ్చింది. ఆ క్వార్టర్స్ అన్నింటికీ వాష్ రూమ్‌లు రోడ్డు వైపునే వున్నాయి. ఆ సమయంలో నాకు ఈ చివరినుండి ఆ చివరి వరకూ ‘లైఫ్‌బాయ్’ సబ్బు వాసనే వచ్చింది. అది ఇప్పటికీ నాకు గుర్తుంది. అంటే అంత విరివిగా ఆ సబ్బును వాడేవారన్నమాట! దీనికి తోడు బట్టలు ఉతుక్కోవడానికి ‘సన్ లైట్’ అనే సబ్బు కూడా ఉండేది. ఇవి రెండు సబ్బులు చాలా కాలం ప్రజల నోళ్ళలో నానాయి.

కాలం మారింది, అవసరాలు ఎక్కువయ్యాయి. ఆధునిక, నగర -నాగరిక జీవితం పల్లెలకూ ప్రవేశించింది. చర్మ సంరక్ష/సౌందర్య సాధనాలుగా అనేక రకాల సబ్బులు వెలుగులోనికి వచ్చాయి/వస్తున్నాయి. ఒక్కొక్క సబ్బుకు ఒక సువాసన, ఒక ప్రత్యేకతను చెబుతూ అనేక రకాల కంపెనీలు వినియోగదారులను ఆకర్షించి సొమ్ము చేసుకోవడం మొదలుపెట్టాయి. ఎక్కువగా ఆడపిల్లలు వీటికి బాగా అలవాటు పడ్డారు. పేరు ప్రఖ్యాతులు గాంచిన అందమైన నటీమణులు/నటుల ప్రకటనలతో ‘లక్స్’ సబ్బు విపణిలో అందుబాటులో ఉండేది. ఖరీదైన ఆ సబ్బునే వాడడానికి మహిళలు ఆడపిల్లలు ఎక్కువగా ఇష్టపడేవారు. ఈ సబ్బు కూడా చాలాకాలం రాజ్యమేలింది.

నేను మహబూబాబాద్ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాలంలో యవ్వనంలో వున్న ఒక మధ్యతరగతి అమ్మాయి, పంటి సమస్యతో నా ప్రైవేట్ క్లినిక్‌కు వచ్చింది. ముఖం మీద అక్కడక్కడా మొటిమలు వున్నాయి. ఆమె క్లినిక్ లోనికి ప్రవేశించగానే, చక్కని సుగంధ పరిమళం గదంతా వ్యాపించింది. దానికి కారణం ఏవైనా సెంటు వాడిందేమోనని నా అనుమానం వ్యక్తం చేసాను. దానికి ఆమె నవ్వి ఫలానా సబ్బుతో స్నానం చేసాను సార్, ఇది వాడితే నల్లవాళ్ళు తెల్లగా అవుతారట కదా! అని, నా వంక ప్రశ్నార్థకంగా చూసింది. సమాజంలో, ప్రముఖులైన వారి ప్రకటనల ప్రభావం ఎలా వుంటుందో, ఉత్పత్తిదారులు ఎంతగా లాభపడతారో దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు!

తర్వాత, గుర్తుంచుకోలేనన్ని సబ్బులు రంగంలోనికి ప్రవేశించాయి. వాటిలో, రెక్సోనా, సింథాల్, మార్గో, మైసూర్ శాండిల్, పియర్స్, సంతూర్ – ఇలా నా దృష్టికి రాని మరెన్నో సబ్బులు విపణిలో లభ్యం అవుతున్నాయి. ఎవరికీ ఇష్టం వచ్చింది వాళ్ళు వాడుతున్నారు.

  

నా విషయానికి వస్తే, నా బాల్యం బీరకాయ పీచుతోనే స్నానం మొదలైంది. మా నాయన స్నానం చేయించేవారు. నేను స్వంతంగా స్నానం చేసే వయసు వచ్చేసరికి, ‘లైఫ్‌బాయ్’ సబ్బు నా జీవితంలోకి ప్రవేశించింది. రాజోలులో నా హాస్టల్ జీవితం వరకూ ఇదే కొనసాగింది. అంతకుమించి ముందుకు పోయే పరిస్థితి అప్పట్లో మాకు లేదు. రాజోలులో నా ఎనిమిదవ తరగతి పూర్తికాకుండానే, చదువుకు స్వస్తి పలికి, అనారోగ్య కారణాల మూలాన హైదరాబాద్‌లో ఉంటున్న పెద్దన్నయ్య దగ్గరకు వెళ్లడంతో, అప్పటినుండి నా బ్రతుకు చిత్రమే మారిపోయింది. అన్నయ్యవాళ్లు ‘మార్గో’ సబ్బు వాడేవారు.

తప్పని పరిస్థితిలో చాలా కాలం అదే వాడాను. అది ఇనప ముక్కలా వుండి ఓ పట్టాన అరిగేది కాదు. అలా చాలా కాలం ఇదే సబ్బు వాడాను. పిల్లలు పుట్టిన తరువాత ఎందుచేతనో ‘మార్గో’కు బై.. చెప్పేసాము. తర్వాతి కాలంలో, శీతాకాలంలో ‘పియర్స్’ సబ్బు, మిగతా కాలంలో ‘మైసూర్ శాండిల్’ వాడుతూ గడిపేసాం.

ప్రస్తుతం అన్నికాలాలకు ‘పియర్స్’ మాత్రమే వాడుతున్నాం. ఇక ఏది వాడినా, తృప్తి అనిపించడం లేదు. అందుకే దానికి అంకితం అయిపోయాం, నేను – నా శ్రీమతి.

ఇప్పుడు పల్లెలు – పట్నాలు అన్న తేడా కనిపించడం లేదు. పట్టణాలలో దొరికేవన్నీ పల్లెల్లోనూ దొరుకుతున్నాయి. పైగా ఎంత ఖరీదైనా డబ్బుకు ఎవరూ లెక్క చేయడం లేదు. అయితే ఇప్పుడు సబ్బుల స్థానంలో, రకరకాల లోషన్లు, మిల్క్ షేక్‌లు వస్తున్నాయి. చర్మ సంరక్షణతో పాటు, దేహసౌందర్యానికి కూడా ప్రాధాన్యత పెరిగింది. లెక్కలేనన్ని ఉత్పత్తులు అందుబాటులోకి వస్తున్నాయి. వినియోగదారుడి జేబు చల్లగా ఉంటే ఏదైనా లభ్యమవుతుంది. మనిషి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, నాణ్యమైన ఉత్పత్తులు సామాన్యుడికి సైతం అందుబాటులోనికి వచ్చేలా పారిశ్రామికవేత్తలు ఆలోచించాలి.

భవిష్యత్తులో, మరెన్ని ఆధునిక ఉత్పత్తులు లభ్యం కానున్నాయో, ఎదురు చూడాల్సిందే మరి!

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version