[“కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే..!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్.]
ఫోను.. గ్రామఫోను..!!
[dropcap]సు[/dropcap]మారు అరవై ఏళ్ళ క్రితం, ఫోను, గ్రామఫోనూ కూడా గ్రామాలలో చూసిన జ్ఞాపకాలు లేవు. ఫోను ధనవంతుల ఇళ్లల్లో సైతం ఉండేది కాదు! ఎవరో ఒకరికి ఉండేది కానీ అది సామాన్య ప్రజానీకానికి అందుబాటులో ఉండేది కాదు. అప్పటికి టెలిఫోన్ బంకుల సంస్కృతీ పల్లెటూళ్లకు చేరలేదు. ఎక్కువగా సమాచారం కోసం పోస్ట్ కార్డులనే వినియోగించుకునేవారు. కాస్త దగ్గరి ప్రదేశాలైతే మనుష్యులే కాలినడకన వెళ్లి సమాచారం అందించేవారు. అలా గ్రామాలలో టెలీఫోన్ అనేది గగన కుసుమం గానే ఉండేది. అందుచేత మా తరం పిల్లలు బాల్యంలో టెలిఫోన్ చూడడం గానీ, దానిని వినియోగించడం గాని జరగలేదు. సమాచార రంగంలో అప్పటికి అంత విస్తృతమైన అభివృద్ధి ఊపందుకోలేదు. ప్రధాన మంత్రులు స్వర్గీయ రాజీవ్ గాంధీ, పి.వి. నరసింహ రావు గార్ల హాయంలో ఈ సమాచార రంగం ఊహించని రీతిలో ఊపందుకుంది. ఫోను సంగతి అలా పక్కన ఉంచితే, ఫోను కంటే ముందు ‘గ్రామఫోను’ ముందుగా గ్రామాలలో ప్రవేశించిందని చెప్పక తప్పదు.
అప్పట్లో గ్రామఫోను చూడగలగడం గొప్ప విజయంగా భావించేవాళ్లు. గ్రామఫోను రికార్డులు సున్నితంగా శుభ్రం చేయడం, శుభ్రం చేసి మెల్లగా ఊది ప్లేయర్ మీద పెట్టడం, అది తిరుగుతున్నప్పుడు రికార్డు మీద జాగ్రత్తగా రీప్రొడ్యూసర్ (సౌండ్ బాక్స్)లో అమర్చిన స్టయలస్స్ (పిన్ను లేదా నీడిల్) ను ఉంచేవారు. అప్పుడు పాట వినిపించేది. అది చూడడానికి, వినడానికి చాలా వింతగా ఉండేది.
దూరంగా వినిపించడానికి స్పీకర్లు అమర్చేవారు. తాలూకా కేంద్రం నుండి, గుర్రపు బండికి అమర్చిన మైక్‌లు కొత్త సినిమాల ప్రచారం కోసం గ్రామాలకు వచ్చేవి. గ్రామఫోను ద్వారా పాటలు వేసి తర్వాత సినిమా ప్రకటనలు చేసేవారు. గుర్రపు బండిలోపల వుండి, గ్రామఫోను ద్వారా పాటలు వినిపించే వ్యక్తిని వింతగా చూసేవారు.
అలాంటప్పుడు, గ్రామఫోనును దగ్గరగా చూసే అవకాశం ఉండేది కాదు. దానిని దగ్గరగా చూడాలన్న తపన ఎక్కువగా ఉండేది. కానీ ఆ కాలంలో నాలాంటివారికి అది అందని ద్రాక్ష పండే అయింది.
తర్వాత అప్పట్లో, ఎంత పెద్దవారైనా, ఇళ్ళల్లో జరిగే పెళ్లిళ్లకు మైక్ సెట్లు పెట్టేవారు. అది పెట్టకపోతే మరీ తక్కువ స్థాయి కుటుంబాలుగా లెక్కగట్టేవారు. అలాంటి చోట దగ్గరగా గ్రామఫోను చూసే అవకాశం ఉండేది. అలాగే వాళ్ళు రికార్డులు వేయడం, అప్పుడప్పుడు పిన్నులు మార్చడం వింతగా చూసేవాళ్ళు. పనికి రాని పిన్నులు పారవేస్తే, పిల్లలు వాటిని సేకరించి దాచుకునేవారు, గొప్పగా చెప్పుకునేవారు. పెళ్లిళ్లకు, గ్రామఫోను, మైక్ సెట్ వచ్చిందంటే, పెద్దవాళ్ళు పద్యాలు వినిపించడం మానేవారు. పద్యాల రికార్డులు తేకుంటే అసలు ఊరుకునే వారు కాదు. అలా గ్రామాలలో గ్రామఫోను ప్రవేశించిందని చెప్పక తప్పదు.
అలాగే గ్రామాలలో, పండుగలకు, ముఖ్యంగా సంక్రాంతి పండుగ సమయంలో ఔత్సాహిక యువతీయువకులు నాటకాలు ప్రదర్శించేవారు. అలాంటప్పుడు కూడా గ్రామానికి, గ్రామఫోను, మైకు సెట్లు వచ్చేవి. తర్వాత గ్రామఫోను లోనే కాదు, గ్రామఫోను రికార్డుల్లో కూడా అనేక మార్పులు రావడం, క్రమంగా ఆధునిక సదుపాయాలు అవతరించడంతో, గ్రామఫోను – గ్రామఫోను రికార్డులు, కాలగర్భంలో కలిసిపోయాయి. ఔత్సాహికులైన పాతతరం ఇళ్లల్లో ఇప్పటికీ గ్రామఫోను బ్రతికే వుంది. ఇప్పటి తరానికి అది మరుగున పడ్డ మాణిక్యాం లాంటిదే! ఇప్పటి తరం పిల్లలు, బొమ్మను చూసి సరిపెట్టుకోవడమే గాని స్వయంగా గ్రామఫోనును చూసే అవకాశం లేదు. అయితే పాతతరం గ్రామఫోను ప్రేమికులు, వందలు, వేల సంఖ్యలో రికార్డులు సేకరించి, లైబ్రరీలను ఏర్పరచుకున్నారు. ఆకాశవాణి అన్ని కేంద్రాలలో ఇప్పటికీ, వాళ్ళ లైబ్రరీ లలో, వేల సంఖ్యలో గ్రామఫోను రికార్డులు భద్రపరచబడి వున్నాయి. రాబోయే తరాలకు అదొక చరిత్ర.
మా నాయన గారి క్రమశిక్షణలో భయంకొద్దీ, నాకు అలా గ్రామఫోను దగ్గరికి వెళ్లి చూసే అవకాశం ఉండేది కాదు. దూరంగా వుండి పాటలు వినడం తప్ప, ఇల్లు విడిచి పెట్టి వెళ్లి అవన్నీ చూసే అవకాశం ఉండేది కాదు. అలా కొంత నిరుత్సాహం మనసులో చోటు చేసుకునేది. అయితే, నాకు హై స్కూల్‌కు వెళ్లే వయసు వచ్చాక ఎలా ప్రారంభమైందో గానీ, రికార్డింగు డాన్సుల హవా మొదలయింది. మాకంటే పెద్దవాళ్ళు, అంటే మా చిన్నన్న వయసు వాళ్ళు, మా గ్రామంలోనే ప్రాక్టీస్ (రిహార్సల్స్) చేసేవారు. ఆ బృందానికి మా చిన్నన్నయ్య దర్శకుడిగా వ్యవహరించేవాడు (చాలా మట్టుకు మా నాయనకు తెలియకుండా). ఈ నేపథ్యంలో, మా తాలూకా కేంద్రమైన రాజోలు నుండి ‘గ్రామఫోను’ అద్దెకు తెచ్చేవారు. రాత్రిపూట ఎక్కడో తెలియని చోట ఈ రిహార్సల్స్ జరిగేవి. రిహార్సల్స్ అప్పుడు, రికార్డింగ్ డాన్సు అమ్మాయి కూడా వచ్చేది. ఇక చిన్నాపెద్దా అన్న తేడా లేకుండా రిహార్సల్స్ జరిగే ఇంటి చుట్టూ జనం గుమిగూడేవారు.
అలాంటప్పుడు నాకు లోపలికి వెళ్లిచూసే పర్మిషన్ ఉండేది. అలా గ్రామఫోను, అది పనిచేసే విధానం, పనిచేయించే విధానం దగ్గరగా వుండి చూడగలిగాను. ఈ సందర్భంలో ఒక విషయం గుర్తుచేసుకోక తప్పదు. ఒకరోజు మా పెద్ద మేనత్త ఈ రికార్డింగ్ డాన్స్ రిహార్సల్స్ చూడ్డానికి వచ్చింది. నూరుశాతం నిరక్షురాస్యురాలు. గ్రామఫోను గురించి అసలు అవగానే లేని వ్యక్తి. రికార్డ్ ప్లే చేసినప్పుడు, ఆ పాట విని “ఒరేయ్.. అంత చిన్నాడబ్బాలో మనిషి కూర్చుని ఎలా పాడుతున్నాడు?” అని అడిగింది. ఆవిడ అమాయకపు మాటలు నేను ఎప్పటికీ మరచిపోలేను.
చిన్నన్నయ్య డా. మధుసూదన్, నా కూతురు నీహార కానేటి ఆకాశవాణిలో ఉద్యోగులు కావడం వల్ల, ఇప్పటికీ గ్రామఫోను – రికార్డులు ఏదో రూపంలో నా కళ్లబడుతూనే వున్నాయి. అంతమాత్రమే కాదు,ఈ మధ్య నా మిత్రులు శ్యామ్ కుమార్ – లీల గార్ల ఇంటికి నిజామాబాద్‌కు వెళ్ళినప్పుడు, భద్రంగా భద్రపరచిన గ్రామఫోను, గ్రామఫోను రికార్డులు చూసి ఆశ్చర్యము, ఆనందమూ కలిగాయి. బహుశా మిత్రుడు, తన బాల్యంలో అనుభవించలేకపోయిన ఒక వినోద ప్రక్రియని, ఇప్పడు గ్రామఫోను సేకరించి ఆనందిస్తూ తృప్తి పడుతున్నాడేమో అనిపించింది.
కాలగమనంలో ఎన్నోమార్పులు వచ్చేయి. తూనికలు – కొలతలు, అప్పటివి ఇప్పుడు లేవు. అతి ముఖ్యమైన సమాచార సాధనం టెలిగ్రామ్ ఇప్పుడు లేదు! అప్పుడు వాడిన నాణాలు, కరెన్సీ ఇప్పుడు లేవు. అలా ఎన్నో కాలగర్భంలో కలిసిపోతున్నాయి.
అందులో గ్రామఫోను కూడా ఒకటి. టెలిఫోన్ మాత్రం కొనవూపిరితో కొట్టుమిట్టాడుతోంది. మొబైల్ దానిని అధః పాతాళానికి తొక్కిపారేసింది. ఇవన్నీ భవిష్యత్ తరాలకు చారిత్రిక అంశాలుగా మిగిలిపోతాయి. ఇప్పుడు పాట వినడానికి గ్రామఫోను, టేప్ రికార్డర్ అవసరం లేదు! స్మార్టుఫోన్ ఒకటి ఉంటే చాలు, అన్నీ అందులోనే దొరుకుతాయి!!
(మళ్ళీ కలుద్దాం)