[“కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే..!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్.]
బహుమతి..!!
[dropcap]ఎ[/dropcap]వరి జీవితంలోనైనా బహుమతికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. బహుమతిని, బహుమతికి, డబ్బుతో విలువకట్టరు. అది ఎంత విలువ తక్కువదైనా, బహుమతి అంటే బహుమతి అంతే! చిన్నతనంలో, అంటే బడిలో ప్రాథమిక స్థాయిలో, ఆటల పోటీలలో, ఇతర పోటీలలో గెలుపొందినప్పుడు, బహుమతిగా పెన్సిల్ ఇచ్చినా, ఒక కొలబద్ద (స్కెల్) ఇచ్చినా మహదానందమయ్యేది. కాస్త హైస్కూల్ స్థాయి వచ్చేసరికి, పుస్తకాలు, ఏవైనా ఉపయోగపడే వస్తువులు బహుమతిగా ఇచ్చేవారు. బహుమతి ఏమి ఇచ్చారన్నది కాకుండా, బహుమతి రావడమే గొప్పగా ఉండేది. అది ఒక గుర్తింపుగా, ప్రత్యేకతను సంతరించుకుని ఉండేది.
నాటక పోటీలలో బహుమతులు గెలుచుకోవడం, ఆటల పోటీలలో బహుమతులు గెలుచుకోవడం, వ్యాసరచన పోటీలలో, వక్తృత్వ పోటీలలో, ఇతర క్రీడల పోటీలలో బహుమతులు పొందడం మనిషి జీవితంలో మరచిపోలేని, మధుర సన్నివేశాలు.
కథల పోటీలలో, నవలల పోటీలలో బహుమతులు పొందడం, సాహితీరంగానికి సంబంధించి, అరుదైన తీపిగుర్తులుగా, జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. సాహిత్య రంగంలో, సినిమా రంగంలో, నాటక రంగంలో, క్రీడారంగంలో లభించే బహుమతులు, కొందరి జీవితాలనే మలుపు తిప్పుతాయి. వ్యక్తి హోదాను పంచుతాయి. సమాజంలో వ్యక్తి గౌరవాన్నీ, కీర్తి ప్రతిష్ఠలను పెంచుతాయి. అందుచేత ఏ రూపంలో బహుమతి లభించినా – వ్యకి ప్రత్యేకతను చాటి చెపుతాయి.
ఇళ్లల్లో చిన్న పిల్లలు ఏ చిన్న మంచి పనిచేసినా వాళ్ళని ప్రశంసిస్తూ బహుమతులు ఇవ్వడం మూలాన, వాళ్ళను ప్రోత్సాహించినట్టు అవుతుంది. చాలా కుటుంబాలలో, ఈ అలవాటు వుంది. దీనివల్ల పిల్లల్లో ఉత్సాహం మరింత పెరిగి, చేసే పనిలో శ్రద్ధ పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ప్రేయసీప్రియులు తొలిసారిగా కలిసినప్పుడు వారు పరస్పరం ఇచ్చి పుచ్చుకునే బహుమతులు జీవితాంతం గుర్తుపెట్టుకునేవిగా ఉంటాయి. భార్యా భర్తలు, తమ పెళ్లిరోజునో, పుట్టిన రోజునో ఇచ్చి పుచ్చుకునే బహుమతులు, వారి మధ్య ప్రేమను మరింత పటిష్టం చేస్తాయి. అలా బహుమతి అనేది మనుష్యుల మధ్య, స్నేహితుల మధ్య, ప్రేయసీ ప్రియులమధ్య, భార్యాభర్తల మధ్య, బంధువుల మధ్య ప్రేమాభి మానాలను పెంచుతుంది. బహుమతికి అంత విలువ ఉందన్న మాట!
నేను ఎప్పుడూ నా పిల్లలను బహుమతులు వస్తే, నేను ప్రశంసించడమే గానీ ప్రత్యేకంగా వారికి నేను ఎప్పుడూ బహుమతుల రూపంలో ఏమీ ఇవ్వలేదు. నా పరిస్థితిని సరైన రీతిలో అర్థం చేసుకుని, నన్ను, నా సేవలను సద్వినియోగం చేసుకున్న అదృష్టవంతులు నా పిల్లలు. కానీ, నాకు మనుమలు వచ్చేసరికి నేను పదవీ విరమణ చేయడం, ఆర్థిక పరిస్థితి మెరుగు పడడంతో, నా మనవరాలు ఆన్షి సాధించే ప్రతి చిన్ని విజయానికి స్పందించి బహుమతులిచ్చి, ఆమెను ఉత్సాహ పరుస్తుంటాను. అది ఆమె పురోగతికి ‘కేటలిస్టు’లా పనిచేస్తుందని నా భావన! అలాగే, నా పెద్ద మేనకోడలు (ఉషశ్రీ) కూతురు, పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించడంతో, విశాఖపట్టణం వెళ్లి ధన రూపంలో బహుమతి ఇచ్చినప్పుడు, ఆ కుటుంబ సభ్యుల ముఖాలలో వెలిగిన వెలుగు ఎన్నటికీ మర్చిపోలేను.
అలాంటి బహుమతులు, వారి భవిష్యత్తు మీద మంచి ప్రభావం చూపిస్తాయి. ఇక అసలు విషయానికొస్తే, నా కూతురికి తన బాల్యంలోగాని, యవ్వన కాలంలోగానీ నేను ఎలాంటి బహుమతి ఇవ్వలేదు. తాను తొమ్మిదవ తరగతి చదువుతున్నప్పుడు, స్కూటర్ కొనివ్వమంది. కానీ అప్పటి పరిస్థితుల్లో ఆమె కోరిక తీర్చలేక పోయాను. అది మొన్నటివరకూ ముల్లులా గుచ్చుతూనే వుంది. అయితే హైద్రాబాద్ (శేరిలింగం పల్లి)లో, ముప్పై ఏళ్ల క్రితం భూమితో కొన్న ఇల్లు ఆమెకే బహుమతిగా ఇవ్వాలని, నేను – నా శ్రీమతి నిర్ణయించుకున్నాం.
కానీ ఈ నెల (అక్టోబర్) మొదటి వారం వరకు దానిపై రాబడి మేమే అనుభవించాం. ఆమెకు బహుమతిగా ఇవ్వాలన్న కోరిక ఇప్పటికి సాకారం అయింది. ఇప్పుడు ఆ ఇల్లు నా కూతురిది అయింది. నా ఉద్యోగ పర్వంలో ఈ ఆస్తి కొనడమే నేను చేసిన గొప్ప పని. అది కూడా మా వదిన పూనుకొనకపోతే నేను హైద్రాబాద్‌లో ఇటువంటి స్థిరాస్తిని పొంది వుండేవాడిని కాదు. అందుచేత ఈ గౌరవం సూచన చేసి, నా చేత కొనిపించిన మా వదిన, సివిల్ ఇంజనీర్ శ్రీమతి శిరోరత్నమ్మ గారికే దక్కుతుంది.
ఇప్పుడు ఈ బహుమతిగా ఇచ్చిన ఆ ఇల్లు, కూల్చబడింది. కొత్త హంగుల్లో ఇల్లు కట్టుకునే ప్రయత్నంలో నా కూతురు, అల్లుడు వున్నారు.
ఆ కొత్త ఇంటిలో కూడా నేను కొంతకాలం దేవుడు నాకు ఇస్తాడనే ప్రగాఢ విశ్వాసంతో మేము వున్నాము. ఆ శుభఘడియల కోసం ఎదురుచూస్తుంటాం. ఆ సన్నివేశాన్ని కల్పించి మా జీవితాలకు గొప్ప తృప్తి కలిగించడమే, మా పిల్లలు మాకిచ్చే బహుమతిగా మేము భావిస్తాము. మా సంసారిక జీవన ఫలితంగా రత్నాల్లాంటి ఇద్దరు పిల్లలను మాకు బహుమతిగా ప్రసాదించిన ఆ.. దేవదేవుడికి ఎప్పటికీ కృతజ్ఞులమై ఉంటాము.
నాకు పునర్జన్మ నిచ్చి
నన్ను నాకే
బహుమతిగా ఇచ్చిన
పుణ్య పురుషుడు –
మహామనీషి -పెద్దన్నయ్య,
స్వర్గీయ శ్రీ కె. కె. మీనన్‌కు,
సహృదయంతో,
ఈ వ్యాసం అంకితం..!!
(మళ్ళీ కలుద్దాం)