Site icon Sanchika

జ్ఞాపకాల పందిరి-188

[“కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే..!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్.]

ప్రేమించు ప్రేమకై..!!

[dropcap]‘ప్రే[/dropcap]మా.. పిచ్చీ.. ఒకటే..’ అన్నాడు ఒక సినిమా కవి. అది ఎంతవరకూ నిజమోగానీ, ప్రేమ వేరు, పిచ్చి ప్రేమ వేరు! ప్రేమ ముదిరిపోతే పిచ్చి ప్రేమ అనాలేమో. ప్రేమ గురించి సరైన అవగాహన లేకుండా ‘ప్రేమ’ అనే పదాన్ని దుర్వినియోగం జరిపినా దానిని ‘పిచ్చి ప్రేమ’ అనవచ్చునేమో! అసలైన ప్రేమలో, నిజానికి పిచ్చితనం వుండకూడదు. ప్రేమ గురించి,సామాన్యుడి నుంచి మహామేధావుల వరకూ రకరకాల నిర్వచనాలు సెలవిచ్చారు, కానీ ఏదీ తృప్తినిచ్చే నిర్వచనంగా అనిపించదు. దానికి కారణం ‘ప్రేమ’కు వున్న విలువ అలాంటిది.

అనుకోని చిన్న పరిచయాన్నో, కాస్త సుదీర్ఘ స్నేహాన్నో ప్రేమగా ఊహించుకుంటే, పప్పులో కాలేసినట్టే! స్నేహితులైన ఆడ – మగల మధ్య ప్రేమ ఉండాలన్న నియమం ఏమీ లేదు. అలా అని స్నేహం ప్రేమగా మారకూడదన్న నియమము లేదు. ఆకర్షణ అనేది ఒకరిపట్ల మరొకరికి ‘ఇష్టం’ అనే సంకేతం ఇవ్వవచ్చు, గాని, ఆకర్షణతో ముడిపడి ఇష్టాలన్నీ ప్రేమగా రూపాంతరం చెందాలన్న నియమం లేదు.

యువతలో చాలా మట్టుకు, ఆకర్షణలు ప్రేమగా భ్రమపరచి, వాళ్ళల్లోని తొందరపాటుతనం ప్రేమ పేరుతో పెళ్ళికి దారితీయడం, మళ్ళీ ఆ పెళ్ళికి కులమో, గోత్రమో, మతమో, ప్రాంతమో అడ్డంవచ్చి, అష్టకష్టాలు పడి పెళ్లి చేసుకున్నా, అలాంటి పెళ్లిళ్లు ఎక్కువకాలం నిలవకుండా, అతి తక్కువ కాలంలోనే, పెటాకులుగా మారి, ‘విడాకుల’ను, ఆశ్రయించడం వంటి సంఘటనలకు సాక్ష్యమే, ఈనాడు ప్రతిరోజూ కిటకిటలాడుతున్న ‘ఫ్యామిలీ కోర్టులు’. యవ్వనం చేసే అలజడితో, తొందరపాటుతో తప్పటడుగు వేసే యువత, ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదే. కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, కొన్ని రకాల ఉద్యోగ కేంద్రాలు ఇలాంటి సమస్యలకు నిలయాలుగా మారాయి. సెక్సు అంటే ఏమిటో పూర్తిగా అవగాహన లేకుండా, దాని కోసం వెంపర్లాడడం, ప్రేమ అంటే ఏమిటో తెలియకుండా, కేవలం వయసు చేసే అల్లరిలో, కామ వాంఛనే (లస్ట్) ప్రేమగా ఊహించుకోవడం వంటి తొందరపాటు నిర్ణయాలు, కొందరి జీవితాలకు శాపంగా మారిపోతున్నాయి. వాళ్ళు ఇబ్బందులకు లోను కావడమే కాకుండా, పెంచి పెద్దచేసి, పిల్లల భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులనూ బాధపెడుతున్నరు. పిల్లలు పడుతున్న బాధను తట్టుకోలేక తల్లిదండ్రులు మానసిక వికలాంగులుగా మారిపోవడం, జీవచ్ఛవాలుగా మిగిలిపోవడం సమాజంలో అందరూ గమనిస్తున్న విషయమే!

అయితే ఈ ప్రేమలలో, తెలిసీ తెలియని ప్రేమలూ, నిజమైన ప్రేమలూ ఉంటాయి, కాదనలేము. అందుచేతనే కొన్ని కొద్దీ కాలంలోనే విఫలం అవుతుంటే, కులాంతర, మతాంతర ప్రేమ వివాహాలు చేసుకున్న కొద్దీ మంది ప్రేమికులు, భయం.. భయంగా బ్రతుకుతూ, ప్రాణభయంతో జీవితం గడుపుతున్న వాళ్ళు లేకపోలేదు. ప్రాణాలు కోల్పోయిన వారు సైతం అనేకం.

అలా అని, ప్రేమను, ప్రేమించుకున్న వాళ్ళని కించపరచడం గాని ప్రేమించుకున్న వాళ్ళ సంసారాలన్నీ కూలిపోయాయయని గాని చెప్పడం నా ఉద్దేశం కాదు. ప్రేమంటే ఏమిటో అవగాహన చేసుకుని, ప్రేమించుకుని, పెళ్లి చేసుకుని, చక్కని అర్థవంతమైన సంసారిక జీవితానందాన్ని అనుభవిస్తున్న వాళ్ళు ఎంతోమంది వున్నారు. వాళ్ళు నిజంగా అదృష్టవంతులు. ప్రేమించుకుని, పెద్దల ఆమోదం పొంది, పెళ్ళిచేసుకుని హాయిగా బ్రుకుతున్న వాళ్ళూ వున్నారు, విడిపోయిన వాళ్ళూ వున్నారు. తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా, ప్రేమించుకుని పెళ్లి చేసుకుని, ఆనందకరమైన వైవాహిక జీవితం అనుభవిస్తున్నవాళ్లూ లేకపోలేదు.

ఇక్కడ కారణం ప్రేమికులు పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు సూత్రాన్ని పాటించడమే. అనుకూల పరిస్థితులు వున్నా ప్రేమపెళ్లిళ్లు సక్సెస్ కాకపోడానికి ముఖ్య కారణం, ప్రేమ బులపాటం తీరిపోయి, అసలైన జీవితంలోకి అడుగుపెట్టాక, ఇద్దరి అసలు వ్యక్తిత్వాలు బయటపడి, ఒకరినొకరు అర్థం చేసుకుని సర్దుబాటు చేసుకోక పోవడం వల్లనే ఆ ప్రేమలకు, ప్రేమ పెళ్ళిళ్ళకూ అర్థం లేకుండా పోతున్నది. ఒకే కులం ఒకే మతం అయివుండి చేసుకున్న ప్రేమపెళ్లిల్లలో సమస్యలు కొంచం తక్కువే!

పేదరికం, కులం, మతం, ప్రాంతం అన్నవి ఎక్కువగా సమస్యలను తెచ్చి ఇరకాటం తెస్తుంటాయి. ఇటువంటి వాటిని కూడా జయించినవాళ్లు ఉత్తమ ప్రేమికులు అని చెప్పుకోక తప్పదు.

ఈ నేపథ్యంలో, ప్రేమను నిర్వచించగల మేధావిని కాకపోయినప్పటికీ, నాకు అర్థమైన రీతిలో చెప్పాలంటే, అది ఆకర్షణతో ముడిపడి ఉన్నప్పటికీ ఇద్దరు ఆత్మీయుల పరస్పర హృదయస్పందన ప్రేమను పుట్టిస్తుంది. అది నమ్మకమైన ఆనందమైన జీవితాన్ని అందిస్తుంది. కష్టంలో, సుఖంలో ఒకరికొకరు తోడుగా, నీడగా ఉండేలా అభయ హస్తం అందిస్తుంది. వారి సుఖమయ జీవితానికి ఒక భరోసా నిస్తుంది. అంతే గాని, ఆకర్షణకు, సెక్సుకు ముడిపెట్టి దానినే ప్రేమ అనుకుంటే, అది ఎక్కువకాలం నిలిచేది కాదు, అసలు ప్రేమ కానీ కాదు.

బయటికి చెప్పకపోయినా, ప్రతివారి జీవితంలోనూ, ఏదో ఒకరూపంలో ఈ సన్నివేశం ప్రత్యక్షమవుతుందని నా నమ్మకం. కొందరికి, ముఖ్యంగా స్త్రీమూర్తులకు ఇవి బయటకు చెప్పుకునేటట్టు వుండవు. ఏ ఆటంకాలు ఇబ్బందులు లేని మహిళలు సందర్భం వస్తే బయటకు చెప్పడమే కాదు, సాహితీ ప్రియులయితే, కథలు, నవలలు కూడా రాస్తారు. మొబైల్ ప్రతివారి నిత్య జీవితంలోకి ప్రవేశించాక ఇవి మరీ ఎక్కువ అయ్యాయి అనడంలో ఎలాంటి సందేహమూ లేదు.

ఇంత రాసిన ఈ రచయిత సైతం పైన చెప్పిన అంశాలకు అతీతుడు కాదు. కాలేజీ స్థాయికి వెళ్ళినతర్వాత నాకూ ఇలాంటి అనుభవాలు తప్పలేదు.

ఇంటర్మీడియెట్ వరకూ అసలు ఇలాంటి సమస్యలు నా మనసుకు తాకలేదు. డిగ్రీ కాలేజి రోజులు మొదలయ్యాక, అమ్మాయిలతో పరిచయాలు సహజంగానే మొదలయ్యాయి. నా సహాధ్యాయినులతో మాత్రమే కాకుండా, నా జూనియర్స్‌తో, సీనియర్స్‌తో చాలా చనువుగా ఉండేవాడిని. ఇది చాలామందికి తికమకగా ఉండేది. అయితే నన్ను అభిమానించే (కాసేపు ప్రేమ అనుకోవచ్చు) అమ్మాయిల కంటే, నేను ప్రత్యేకంగా అభిమానించే అమ్మాయిలు తక్కువగా ఉండేవారు. కొద్దిగా బంధువుల వైపునుండి కూడా ఈ సమస్య నాకు ఎదురైంది. అసలు సమస్య ఎక్కడంటే, ఈ స్నేహాలు ఇరువైపులా, సరైన నిష్పత్తిలో సరితూగక పోవడం.

బ్యాంకు ఆఫీసర్ గా శ్రీమతి అరుణ

అలా ఆశా నిరాశల మధ్య, ఎన్నో ఎత్తిపొడుపులను శాపనార్థాలు దాటుకుని, కుల మత, స్పీడ్ బ్రేకర్లను దాటుకుని, బయటపడి, ఇరుపక్షాల నచ్చిన మెచ్చిన యువతి ప్రేమలో పడ్డాను. ఇద్దరి ఆలోచనలు ఈ ప్రేమలో సమాన నిష్పత్తిలో కుదిరాయి. నా లేఖా సాహిత్యం మా ఇరు హృదయాలను మరింత దగ్గరకు చేర్చి, ప్రేమక సరైన అర్థం తెలుసుకునేలా చేసింది. అది పెళ్లిగా మారడానికి మూడు సంవత్సరాలు పైగా పట్టింది. పైగా అప్పటికి ఈ మొబైల్ యుగం ప్రారంభం కాలేదు. అందుకే మేము దగ్గర కావడానికి అంతకాలం పట్టివుండవచ్చు. మా మధ్యకు పిల్లలు వచ్చి, వాళ్లకు పిల్లలు పుట్టినా మా ఇద్దరిమధ్య ప్రేమలో ఇసుమంత కూడా హెచ్చుతగ్గులు లేవు. ఒకవేళ అలా చూసుకున్నా, ప్రేమలో మా ఆవిడదే పైచేయి. అలా మా ఇద్దరి ప్రేమ గురించి, మా బంధువులు, స్నేహితులతో పాటు, మా పిల్లలు కూడా గొప్పగా చెబుతుంటారు.

ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే, ప్రేమ.. చాలా సున్నితమైన అంశం. బలవంతం చేసి తీసుకునేది కాదు. ప్రేమించడం వేరు, ప్రేమను పొందడం వేరు. ప్రేమించేవారు, ప్రేమించబడితే, ఆ ప్రేమకు తిరుగులేదు.

ఒక్క విషయం మాత్రం వాస్తవం, ప్రేమకు వయసుతో పనిలేదు!

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version