Site icon Sanchika

జ్ఞాపకాల పందిరి-19

[box type=’note’ fontsize=’16’] “కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే…!!”అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్. [/box]

పంతులమ్మ వద్దు..!!

[dropcap]యు[/dropcap]క్త వయస్సు రాగానే, పెళ్లి ఆలోచనలు వస్తాయి. పెళ్లి అయిన తర్వాత పిల్లల ఆలోచన వస్తుంది. పిల్లలు పుట్టగానే, వాళ్ళ పెంపకంపై శ్రమించాలి. బడి వయసు రాగానే, ఏ బడిలో వేయాలి, ఎలాంటి బడిలో వేయాలి, ఎలా చదివించాలి? ఇలా చదువుపై అధిక దృష్టి, గొప్ప శ్రమతో మొదలై, ఇంటర్ కాగానే, ఏ కోర్సులో చేరాలన్న సమస్య. తల్లిదండ్రుల దృష్టి ఒక వైపు ఉంటే, పిల్లల దృష్టి మరోవైపు ఉండడం ఒక సమస్యగా మారతాయి. అందరూ డాక్టర్ కోర్సులు, ఇంజనీరింగ్ కోర్సుల వైపు ఎక్కువగా దృష్టి సారిస్తారు. ఇక ఏ చదువు లేనట్లు, ఏ ఉద్యోగాలూ లేనట్లు, ఆ రెంటికి అధికంగా మొగ్గు చూపుతారు. ఇదంతా కాస్త ఉన్నవాళ్ళ మధ్య జరిగే ఘర్షణ!మరి, సామాన్యుల పరిస్థితి ఏమిటీ? పెద్ద పెద్ద, వృత్తి విద్యా కోర్సులు సామాన్యులకు ఎటూ వుండవు, మరి వాళ్ళు ఏమి చదువుకోవాలి? సమస్య అంతా మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి పిల్లల తోనే!

ఈ ప్రజలు, ఇలాంటి సమస్యను ఎలా అధిగమించాలి? ఈ స్థాయి పిల్లలు చదువుకున్న వెంటనే నిరుద్యోగులుగా ఉండకుండా, తక్షణమే ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకునే చదువు, చదువుకోవాలి. అలాంటి చదువును ఎంచుకోవాలి. తెలియకుంటే, తెలిసిన వారిని అడిగి తెలుసుకోవాలి. కొన్ని కుటుంబాలలో తల్లిదండ్రులు చేసిన ఉద్యోగాలే, తమ పిల్లలకు కూడా రావాలని కోరుకుంటారు. ఉపాధ్యాయ వృత్తి దీనికి చక్కని ఉదాహరణ. అలాగే వైద్య వృత్తి కూడా! వారి వారి స్థాయిని బట్టి కొంతమంది అనుకున్నది సాధిస్తారు, మరి కొంత మంది సాధించలేకపోతారు. అయితే, ఇక్కడ పిల్లల అభిరుచికి కూడా ప్రాధాన్యత నివ్వాలి. లేకుంటే విషయం అసలుకే బెడిసి కొడుతుంది. నాకు తెలిసిన ఒక మాష్టారు ఇలాగే పప్పులో కాలేశారు. ఆ పాఠశాలలో ఆయన ఒక చిన్న ఉపాధ్యాయుడు. ఆయన అనుభవాన్ని బట్టి, లెక్కల మాస్టర్లకు మంచి డిమాండు ఉంటుందని గ్రహించాడు. తన ఇద్దరి కొడుకుల్లో చిన్నబ్బాయికి గణితం ప్రధానాంశంగా ఇంటర్ చేయించాడు. అబ్బాయికి గణితం అంటేనే గుండె గాభరా! తండ్రి ఒత్తిడికి లెక్కలు తీసుకుని అతి కష్టం మీద, ఇంటర్ పాస్ అయినాడు. ఇక డిగ్రీ పరిస్థితి వచ్చేసరికి, మళ్ళీ సమస్య వచ్చింది అబ్బాయికి. తండ్రి టార్గెట్ సైన్సు డిగ్రీ. అది కూడా పిల్లాడికి ఇష్టం లేకుండానే, గణితం ప్రధానాంశంగా, బి.ఎస్.సి.లో చేర్పించాడు. ఇక కష్టాలు మొదలయ్యాయి అబ్బాయికి. లెక్కలు అర్థం కాక ఆత్మన్యూనతా భావం పెంచుకున్నాడు. లెక్కల పిరియడ్ వస్తుందంటే వణికి పోయేవాడు. క్రమంగా, భయానికి లోనై,తాను ఇక కాలేజీకి వెళ్ళేది లేదని ప్రకటించాడు. అతనికి డిగ్రీ పూర్తి కాలేదు. తండ్రి చనిపోయాడు. ఇప్పటికీ నిరుద్యోగిగా, తల్లికి వచ్చే పెన్షన్ ఆధారంగానే బ్రతుకుతున్నాడు. ఇలాంటి పరిస్థితి ఎలాంటి వారికీ రాకూడదు. అందుకే ఇంటర్ అయ్యాక వేసే ప్రతి అడుగు చదువుకు సంబంధించి జాగ్రత్తగా వేయాలి. అనవసరమైన వీలుకాని, అంచనాలు లేని ఊహలకు స్వస్తి పలికి నిజ జీవితం గురించి కలలు కనాలి. మన శక్తి సామర్థ్యాలకు అనుగుణమైన కోర్సులను ఎంపిక చేసుకోవాలి.

నేనూ, నా శ్రీమతి

ఇక మా ఇంటి ముచ్చట కూడా ఇక్కడ ప్రస్తావించాలి. నేను నా శ్రీమతిని పెళ్లి చేసుకున్నది, ఆమె విద్యార్హతలను బట్టి కాదు. ఆమె వ్యక్తిత్వాన్ని బట్టి, మా మధ్య వున్న బంధుత్వాన్ని బట్టి. ఆమె తల్లి టీచరు, చిన్నాన్న- పిన్ని టీచర్లు, మేనత్త టీచరు, ఇంకా అనేకమంది బంధువుల్లో టీచర్ ఉద్యోగం చేస్తున్న వాళ్ళే వున్నారు. అందుచేత నా శ్రీమతి కూడా ఆ ఉద్యోగం కోసమే సన్నద్ధమైంది. బి.ఎస్.సి, బి.ఎడ్. చేసింది. నేను ఉద్యోగం వచ్చిన తర్వాతే పెళ్లి చేసుకున్నాను. నా శ్రీమతి చేత ఉద్యోగం చేయించాలనే ఆలోచన అసలు లేదు. కానీ, ఆమెకు ఉద్యోగం చేయాలనేది ప్రఘాడ వాంఛ! పైగా పంతులమ్మ ఉద్యోగం చేయాలని ఆమెకు కోరిక ఉండేది. కారణం టీచింగ్ అభిరుచి, సెలవులు ఎక్కువ వుంటాయని. కానీ నేను అసలే ఉద్యోగమే చేయోద్దన్నాను. ఒకవేళ చేస్తే టీచర్ తప్ప ఏదైనా చేయమన్నాను. ఎందుకంటే నాది రాష్ర స్థాయి గజిటెడ్ పోస్ట్. టీచర్ అంటే జోన్‍తో ఆధారపడి ఉంటుంది. నాకు బదిలీ వచ్చిందంటే, ఇద్దరం వేరుగా ఉండాలి, లేదా ఆమె ఉద్యోగానికి రాజీనామా చేయాలి. ఈ సాంకేతిక పరమైన అంశాలను వివరించాక, ఆమె బ్యాంకు ఉద్యోగం చేయడానికి ఇష్టపడింది. అయితే పెళ్ళైన కొద్దీ రోజులకే, మహబూబాబాద్‌లో స్థానిక పాఠశాలలో (ఫాతిమా హైస్కూల్) బయాలజీ టీచర్‌గా ఉద్యోగం వచ్చింది. అది చేస్తూనే, బ్యాంకు పరీక్షలకు కఠోర పరిశ్రమ చేసింది. ఒకసారి పరీక్షకు వెళితే పాస్ కాలేదు. కానీ రెండవసారి బ్యాంకు ఉద్యోగం సాధించింది, అప్పటి ఎస్.బి.హెచ్.లో. ఇప్పుడు అది స్టేట్ బాంక్ ఆఫ్ ఇండియా అయింది. అయితే అదేకాలంలో ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజి ద్వారా టీచర్ ఉద్యోగం కూడా వచ్చి, గూడూరు (నర్సంపేట దగ్గర) పోస్టింగ్ ఇచ్చారు. ఆమె జాయిన్ కావడానికి ఉవ్విళ్ళూరింది కానీ, నేను ఒప్పుకోలేదు. బ్యాంకులో ఉద్యోగం వచ్చిన ఆ సమయానికి నా శ్రీమతి గర్భిణి (అమ్మాయి నిహార) కావడం వల్ల సంవత్సరం ఆలస్యంగా ఉద్యోగం వచ్చింది. మహబూబాబాద్ లోనే పోస్టింగ్.

ఎస్.బి.ఐ. డిప్యూటీ మేనేజరుగా నా శ్రీమతి అరుణ

నా పిల్లల విషయంలో మాత్రం వాళ్ళ చదువుల విషయంలో వాళ్ళకే పూర్తి స్వేచ్ఛను ఇచ్చేసాను. ఏమి చదువుతావని మా అబ్బాయిని అడిగితే. ‘మీరేమి చదవమంటే, అది చదువుతా’నన్నాడు.

మెకానికల్ ఇంజనీరింగ్ చేయించాము. అమెరికా (బోస్టన్) లో ఉద్యోగం చేస్తున్నాడు. అమ్మాయి బయాలజీ ఇష్టపడింది, జెనెటిక్స్‌లో ఎం.ఎస్.సి చేయించాము. ఈ డిగ్రీతో సంబంధం లేని ఉద్యోగం చేస్తున్నది – ఆకాశవాణిలో ఆమె ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్.

కనుక అందరికీ చదువుతో సంబంధమున్న ఉద్యోగాలు రావు. పోటీ పరీక్షలతో భవిష్యత్తును సుస్థిరం చేసుకోవాలి, అతి త్వరగా స్థిరపడగల ఉద్యోగాలు వచ్చే చదువు చదువుకోవాలి. ఆ విధంగా నా శ్రీమతి టీచర్ కాబోయి, బ్యాంకు ఆఫీసర్ అయింది, డిప్యూటీ మేనేజర్‌గా ఖమ్మంలో పదవీ విరమణ చేసింది.

ఇప్పటి చదువులు లక్షలతో, కోట్లతో కూడుకున్నవి. సామాన్యుడికి అందని ద్రాక్షపండు అయ్యే ప్రమాదం పొంచి వుంది. అయినా ఆశాజీవులుగా మనం ముందుకు సాగవలసిందే!

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version