జ్ఞాపకాల పందిరి-192

11
1

[“కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే..!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్.]

ఎన్నికల వేళ..!!

[dropcap]దే[/dropcap]శంలో ప్రజాస్వామ్యం ఇంకా బ్రతికి బట్టకడుతున్నది అని చెప్పుకోవడానికి సరైన ఉదాహరణ ‘ఎన్నికలే!’ అని నా అభిప్రాయం. అయితే ఈ ఎన్నికలు అవి పార్లమెంటుకు సంబంధించిన ఎన్నికలైనా, శాసనసభకు సంబంధించిన ఎన్నికలైనా ప్రారంభదశలో ప్రజాస్వామ్య పద్ధతిలోనే జరుగుతూ వచ్చాయి. తమకు కావలసిన ప్రజాప్రతినిధులను ప్రజలు స్వేచ్ఛగా ఎన్నుకున్నారు. దానికి తగ్గట్టుగానే, పార్టీ ఏదైనా ఆయా నాయకులు నిస్వార్థంగా, ప్రజల కోసం, ప్రజాసంక్షేమం కోసం ఇతోధికంగా పాటుపడేవారు. దేశం – ప్రజలు, దేశరక్షణ, అభివృద్ధి, ప్రజాసంక్షేమం ఇవే అంశాలు అజెండాగా పరిపాలన జరుగుతుండేది. కేంద్రస్థాయిలో ఏ పార్టీ అధికారంలో వున్నా, ప్రతి రాష్ట్రం పార్టీలకు అతీతంగా వారి రాష్ట్రాభివృద్ధికి పాటుపడుతుండేవారు. అందుచేత, ఎన్నికలన్నా, ఓటు వేయడం అన్నా, అదొక బాధ్యతాయుతమైన అంశంగా, ఒక పండుగగా భావించి ప్రతి పౌరుడు, అక్షరాస్యతతో సంబంధం లేకుండా ఓటింగ్‌లో పాల్గొనేవారు. అలా నా చిన్నతనంలో ప్రజలకోసం అహర్నిశలు పాటుపడ్డ మహానుభావులు నాకు గుర్తు వున్నారు.

మాజీ పార్లమెంటు సభ్యుడు కమ్యునిస్టు పార్టీ(మా) నాయకులు శ్రీ పుచ్చలపల్లి సుందరయ్య

నాకు తెలిసి శ్రీ పుచ్చల పల్లి సుందరయ్య గారు (కమ్యూనిస్టు పార్టీ) పార్లమెంటుకు ఎన్నిక అయినప్పుడు పార్లమెంటుకు సాదాసీదా డ్రస్సులో సైకిల్ మీద వెళ్లేవారట! అంతమాత్రమే కాదు, పార్టీకి న్యాయం చేయలేనేమోనని, భార్యను ఒప్పించి, పిల్లలు పుట్టకుండా జాగ్రత్త పడ్డారట! పార్టీ పట్ల, పార్టీ ద్వారా ప్రజలకు చేసే సేవ విషయంలో, జీవితాలనే త్యాగం చేసిన మహానుభావులు వారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ శాసనసభ్యులు, అధికారభాషా సంఘం అధ్యక్షులు స్వర్గీయ వావిలాల గోపాలకృష్ణయ్య గారు

అలాగే, ఆంధ్రా గాంధీగా చెప్పబడే, సంపూర్ణ గాంధేయవాది అయిన కళాప్రపూర్ణ శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య గారు. పల్నాడుకు చెందిన సత్తెనపల్లి నియోజకవర్గం నుండి ఏకగ్రీవంగా ఎన్నోసార్లు ఎన్నికైన వీరు అతి సాధారణ జీవితం గడుపుతూ ప్రతి నిముషం ప్రజలు – ప్రజాసంక్షేమం కోసం పాటుపడిన మహానుభావుడు, జీవిత చరమాంకం వరకూ బ్రహ్మచారి గానే జీవితం గడుపుతూ, ప్రజా హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయిన వ్యక్తి.

పేదల నాయకుడు (కమ్యునిస్టు పార్టీ) స్వర్గీయ ఎం.ఓంకార్.గారు

అలాగే, మద్దికాయల ఓంకార్ గారు (నర్సంపేట). తన రాజకీయ జీవితమంతా, ప్రజాసేవకే అంకితం చేసిన వ్యక్తి. పేద ప్రజలకు నిత్యం అందుబాటులో వుండి, వారి కోసమే శ్రమించిన మహానుభావుడు శ్రీ ఓంకార్ గారు.

రాజకీయాలలో ఆరితేరి, శాసన సభ్యుడు గాను, పార్లమెంటు సభ్యుడు గాను, కేంద్రమంత్రి గాను, రాష్ట్ర మంత్రి గానూ, నాటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన శ్రీ జలగం వెంగళరావు గారు, తన ఖమ్మం జిల్లాను అభివృద్ధి చేసిన విధానం గొప్పది. అందుకే ఖమ్మం ప్రజలు ఇప్పటికీ వెంగళరావు గారిని దేవుడిగా గుర్తు చేసుకుంటారు.

అభివృద్దికి (ఖమ్మం)మారు పేరు మాజీ కేంద్ర మంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ జలగం వెంగళరావు గారు

అలాగే డోర్నకల్ నియోజకవర్గానికి, శాసన సభ్యుడిగా, మంత్రిగా, శ్రీ రెడ్డియా నాయక్ చేసిన సేవలు గుర్తుంచుకోదగ్గవి.

ఇలా ప్రతి శాసనసభ్యుడు, పార్లమెంటు సభ్యుడు తమ తమ నియోజక వర్గాలను అభివృద్ధి పరుచుకుంటే, యావత్ దేశమే అభివృద్ధి చెందినట్టు కదా!

ఇలా ఇంకా కొందరు ప్రజాసంక్షేమం కోసం పట్టుబడిన వారు ఉండవచ్చు. కానీ ఇక్కడమాత్రం నా దృష్టికి వచ్చిన వారి గురించి మాత్రమే ప్రస్తావించాను. ఇలా ఒకప్పుడు పార్టీలకతీతంగా, ఆయా నాయకులపైనా, వారి సేవలపైనా గొప్ప నమ్మకమూ, భరోసా వుండేది. వారి నిస్వార్థ సేవలు ప్రజా హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయాయి.

ఇప్పుడు రోజులు మారాయి. నాయకుల్లో స్వార్థం పెరిగింది. తాత్కాలిక తాయిలాలు సామాన్యుడికి ఎరచూపి, శాశ్వత ప్రయోజనాలు పొందే నాయకులు తయారయ్యారు. సామాన్యుడి గోడు వినిపించుకునే నాయకులే కరువైనారు. ఎన్నికల రోజుల్లో తప్ప మిగతా రోజుల్లో వారి వారి నియోజకవర్గాల్లో కనిపించని వారి శాతం ఎక్కువైంది. స్వార్థ ప్రయోజనాల కోసం, తరచుగా కండువాలు మార్చే సంస్కృతీ ప్రబలిపోయింది. ఇలాంటి నేపథ్యంలో, ఎన్నికలపై నమ్మకం దిగజారే పరిస్థితి ఏర్పడింది. ఎక్కువ శాతం విద్యావంతులు ఎన్నికలలో ఓటింగ్‌లో పాల్గొనడానికి నిరుత్సాహం చూపించడం వల్ల నిజాయితీ గల నాయకులను ఎన్నుకోలేని దౌర్భాగ్యపు పరిస్థితి ఏర్పడుతున్నది.

ఇకపోతే, అసెంబ్లీ వాతావరణం ఒకప్పుడు చాలా గొప్పగా ఉండేది. అధికార పార్టీవారు, ప్రతిపక్షం వారు శాసన సభలోగానీ, పార్లమెంటులో గానీ చాలా హుందాగా ప్రవర్తించి, ఒకరినొకరు మర్యాదగా పలకరించుకునేవారు. సభా మర్యాదలను తప్పకుండా పాటించేవారు. ప్రతివిషయంలోనూ ప్రజలకు జవాబుదారీగా ఉంటూ, ప్రజల సమస్యల పరిష్కారంలో నిరంతరం కృషి చేసేవారు.

ఇప్పుడు ఈ గౌరవప్రదమైన సభలు, పరస్పర దూషణ కేంద్రాలుగా మారాయి. నాయకులు తాము ప్రజా ప్రతినిధులమన్న మాట మరచి, వారి స్వంత విషయాలు అన్నట్టు విమర్శించుకునే స్థాయికి దిగజారిపోవడం బాధాకరం. రికార్డుల నుంచి తొలగించవలసినంతగా దారుణమైన పదజాలం ఉపయోగిస్తూ, అమూల్యమైన సభాసమయాన్ని దుర్వినియోగం చేయడం, అసలైన ప్రజా సమస్యలను చర్చించక పోవడం, మనం అందరం ప్రసార/ప్రచార సాధనాల ద్వారా తిలకిస్తూనే వున్నాం. ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తున్నామన్న ఇంగితజ్ఞానం లేని సభ్యులు, చట్టసభలను యుద్దభూమిగా మార్చడం భారతదేశ పౌరులుగా ఎవరూ జీర్ణించుకోలేని విషయం.

ప్రతిపక్ష సభ్యులు కూడా ప్రజల చేత ఎన్నుకోబడ్డవారే! అయినప్పటికీ, పాలక పక్షం వారు వారిని శత్రువులుగా చూడడం, వారు ఏది మాట్లాడినా ఎద్దేవా చేయడం ఇప్పుడు చట్టసభలలో మామూలు విషయం అయిపొయింది. ఇది వింటే ఎవరికైనా విడ్డూరంగానే ఉంటుంది. ఎన్నికలలో పార్టలకతీతంగా, నోటుకు ఓటు అమ్ముకోవడం సాధారణ విషయం అయిపొయింది. తాత్కాలిక తాయిలాలకు ఆశపడే సామాన్య ప్రజానీకం, నాయకులు అందించే డబ్బు – మద్యంతో సంతృప్తి పడి, వారికే ఓటు వేసి ఎన్నుకోవడం, అలా ఆ నాయకులు, రాష్ట్ర/దేశ అభివృద్ధిని పక్కనపెట్టి, తమ స్వార్థ ప్రయోజనాల కోసం అధికారాన్ని విచ్చలవిడిగా దుర్వినియోగం చేయడం దురదృష్టకరం.

ఈ నేపథ్యంలో, ఈ సంవత్సరం వచ్చిన తెలంగాణా రాష్ట్ర ఎన్నికల విషయంలో తప్పక పాల్గొవాలని, సరైన నీతిమంతుడైన వ్యక్తిని ఎన్నుకుని శాసనసభకు పంపాలనే నిర్ణయాన్ని సీరియస్‌గా తీసుకున్నాను. నేను ప్రస్తుతం సికింద్రాబాద్‌లో ఉంటున్నా మాకు ఓటు హక్కు ‘వరంగల్ -పశ్చిమం’ నియోజకవర్గంలో వుంది. అలా మా ఇంట్లో నాలుగు ఓట్లు వున్నాయి. అందుకే తప్పకుండా అందరం ఓటు వేయాలని నిర్ణయించుకున్నాం.

అప్పుడు నాకు తట్టిన పొట్టి గేయం:

మార్పు
~
ఎప్పుడైనా,
ఎక్కడైనా,
ఎందులోనైనా,
మార్పు సహజం!
మార్పు అవసరం!!

~

మార్పు కోసం   ఓటు వేయాలని నిర్ణయించుకున్నాం. ఉదయమే మా స్వంత కారులో సికింద్రాబాద్ నుండి హన్మకొండకు బయలుదేరాం. రోడ్డంతా పండగ వాతావరణాన్ని మించి వుంది. అన్నీ కార్లు -మోటారు సైకిళ్ళూను. హైద్రాబాద్ – సికింద్రాబాదులలో నివసించే ఉద్యోగులు, వ్యాపారస్థులు, ఇతరులు వారి వారి గ్రామాలలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి, ఒక కార్వాన్ మాదిరిగా వెళ్తుండడంతో, వాహనాలతో రోడ్డంతా చిక్కబడ్డట్టు అయింది.

ఓటింగ్ లో పాల్గొన్న రచయిత, కుటుంబ సభ్యులు

అనుకున్నదానికంటే గమ్యస్థానానికి (మా బూత్ సెయింట్ గాబ్రియేల్ స్కూల్, కాజీపేట, బూత్ నం-139) ముందుగానే చేరుకున్నాం. అదృష్టం కొద్దీ మాకు కేటాయించిన బూత్ ఖాళీగా ఉండడం వల్ల, మేము అనుకున్న అభ్యర్థికి ఓటువేసి ఆనందంగా బయటికి వచ్చాము.

అనుకున్నట్టుగానే ఈ నెల (డిశంబర్ -3) వెలువడ్డ ఫలితాలు ప్రజలు మార్పు కోరుతున్నారని  నిరూపించి చూపాయి.

మార్పు కావాలనుకున్నవారికి ఆనందమే అనిపించింది. కానీ, ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించదానికి ఢిల్లీ హైకమాండ్ చేసిన తాత్సారం, మరోసారి ఆ పార్టీపెద్దలను అసహ్యించుకునే పరిస్థితికి తీసుకువచ్చింది. ఆలస్యం అయినా అయననే, ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం అభినందనీయం.

తెలంగాణా రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి శ్రీ రేవంత రెడ్డి గారు

ప్రతి మనిషి ఎప్పుడూ ఆశాజీవిగా బ్రతకవలసిందే! ప్రభుత్వ మనుగడ -రాష్ట్ర అభివృద్ధి కూడా అలాంటి అంశమే. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి, ప్రజాసంక్షేమం విషయంలో ప్రభుత్వాలు, అందులోని ప్రజాప్రతినిధులూ పనిచేస్తే, అలంటి ప్రభుత్వాలూ ఎప్పటికీ నిలబడగలుగుతాయి. ప్రజల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు పనిచేయాలి.

వృద్ధాప్యానికి చేరువైన నేను, తరువాతి ఎన్నికలు చూస్తాననే గ్యారంటీ లేదు. అయినా ఆశాజీవిగా బ్రతకలిసిందే! అందుకేనేమో ఈ సంవత్సరం జరిగిన ఎన్నికల మీద అంత మమకారం. కులం, వర్గం, మతం, ప్రాంతం ప్రక్కన పెట్టి, నిస్వార్థమైన ప్రజానాయకుడిని ఎన్నుకోవడమే ప్రతి పౌరుడి ధ్యేయము కావాలి. అందరం అలాంటి రాజకీయ వాతావరణమే కోరుకుందాం. పదవికి పనిచేసేవాడు తప్ప, సీనియారిటీ పరిష్కారం కాదని రాజకీయ మేధావులు కూడా గ్రహించాలి.

మన ప్రజాస్వామ్యానికి వందనం! మన ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి!!

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here