[“కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే..!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్.]
పిల్లల్లో సృజనాత్మకత..!!
[dropcap]ఈ[/dropcap] రోజుల్లో పిల్లలు పుట్టగానే, ఆ పిల్లలను ఎలాంటి స్కూళ్లల్లో, లేదా ఎలాంటి కాన్వెంట్‍లో వెయ్యాలి? అన్న ఆత్రుత పెరిగిపోతుంటుంది. అంతమాత్రమే కాదు, పసికందు వయసు నెలలవాడైనా, ఒక మంచి స్కూల్‌లో చదివించాలనే తపనతో, ఒక మంచి స్కూల్ కోసం వేట ప్రారంభం అవుతుంది. ఈ నేపథ్యంలో, తల్లికి నచ్చిన స్కూల్, తండ్రికి నచ్చకపోవచ్చు. తండ్రికి నచ్చిన స్కూల్ తల్లికి నచ్చకపోవచ్చు. వీళ్లిద్దరికీ నచ్చిన స్కూల్, పిల్లల ‘గ్రాండ్ పేరెంట్స్’కు నచ్చకపోవచ్చు. వారి తర్జనభర్జనల అనంతరం ఒక స్కూల్ ఎన్నిక చేశారనుకుందాం. ఇక అప్పుడు మొదలవుతుంది. ప్రాథమిక దశలో పెద్ద ఒత్తిడి వుండదు గాని, తర్వాత.. తర్వాత, పిల్లల మీద ఒత్తిడి పడుతుంది. ఇది ప్రత్యక్షంగా పిల్లల మీద, పరోక్షంగా తల్లిదండ్రుల మీద/సంరక్షకుల మీద పడుతుంది. అది కూడా, పిల్లల ప్రోగ్రెస్, గ్రేడ్‌లు, ర్యాంకులను దృష్టిలో ఉంచుకుని జరుగుతుంది.
అయితే చదువు అంటే, పిల్లల గ్రేడ్లు ర్యాంకులేనా? పిల్లల్లోని వివిధ సృజనాత్మక అంశాలను బయటకు తీసుకు రావలసిన అవసరం లేదా? అంటే, ఉందనే చెప్పాలి. అయితే ఆధునికంగా ప్రారంభించబడుతున్న విద్యాసంస్థల్లో, చదువుతో పాటు, వారిలో నిబిడీకృతమై వున్న సృజనాత్మక అంశాలకు కూడా ప్రాధాన్యతనిస్తున్నప్పటికీ, తల్లిదండ్రులు కేవలం చదువుకు మాత్రమే ప్రాధాన్యత నీయడం బాధాకరం. ఇక ప్రభుత్వ విద్యాసంస్థల విషయానికొస్తే, ఇలాంటి అంశాలు విద్యాబోధనలో బహు తక్కువ అని చెప్పక తప్పదు.
పిల్లల్లోని సృజనాత్మకతను బయటకు తీయడానికి, పిల్లలను ప్రోత్సహించడానికి, కేవలం విద్యాసంస్థలు బాధ్యతను స్వీకరించలేవు. ఇందులో తల్లిదండ్రుల పాత్ర ఎక్కువగా ఉంటుంది.
కార్పొరేట్ విద్యాసంస్థలు వెలుగులోనికి రాక మునుపు, ప్రభుత్వ విద్యాసంస్థల్లో సైతం చదువుతో పాటు, డ్రాయింగ్, తోటపని, క్రాఫ్ట్, క్రీడలు, సంగీతం క్లాసులు అదనంగా ఉండవి (ఇప్పుడు కూడా కొన్నిచోట్ల వుండి ఉండవచ్చు). అలాగే, లైబ్రరీ పిరియడ్ కూడా ఉండేది.
పిల్లలు ఈ పిరియడ్‌లో, తమ సిలబస్‌కు భిన్నమైన పుస్తకాలు చదివేవారు. తద్వారా వ్యాసరచనలో ప్రావీణ్యం సంపాదించేవారు. డిబేట్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే అవకాశం ఉండేది. చాలా ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఈ పిరియడ్ రద్దు అయినట్టుగానే భావించాల్సి ఉంటుంది. ప్రత్యేకంగా లైబ్రేరియన్లు లేక, గ్రంథాలయాలు పూర్తిగా మూతపడినాయి. కొన్ని చోట్ల, ఉపాధ్యాయులే ఆ బాధ్యతను తీసుకుని పని చేస్తున్న విషయాన్ని కూడా కాదనలేము. క్రాఫ్ట్ పిరియడ్‌లో బుక్ బైండింగ్, నవారు నేయడం, బొమ్మలు తయారుచేయడం వంటి మెదడుకు మేత పెట్టే పనులు చేయించేవారు.
తోటపనిలో మొక్కలు పెంచడం, కూరగాయలు-ఆకుకూరలు, పండ్లు పండించడం నేర్పేవారు. ఇంచుమించుగా ఇప్పుడు వీటన్నటికి తిలోదకాలు పలికి, కేవలం చదువుకే ప్రాధాన్యత నిస్తున్నట్టు, దీనికోసం అధికారులు, ఉపాధ్యాయులపై ఒత్తిడి తీసుకు వస్తున్నట్టు తెలుస్తున్నది. ఇలాంటి ఆంక్షల వల్ల చాలామంది పిల్లలు క్రీడల వైపు కన్నెత్తి చూడని ఉదంతాలు వింటూనే వున్నాం. ఇది నేటి విద్యాసంస్థల దుస్థితి.
అయితే, కొన్ని కార్పొరేట్ విద్యాసంస్థలు, పుష్టికరమైన చదువును అందించడమే కాక, ఇతర అంశాలకు కూడా ప్రాధాన్యత నిస్తున్నారు. వారంలో అన్ని అంశాలకు ప్రాముఖ్యతను కలిగిస్తున్నారు. కొందరు తల్లిదండ్రులు అలాంటి విషయాల్లో తమ పిల్లల పట్ల శ్రద్ధ తీసుకుంటూనే వున్నారు.
కార్పొరేట్ విద్య అందరికీ సాధ్యం కాదు. ప్రభుత్వ విద్యాసంస్థలు, ప్రభుత్వ నిబంధనల ప్రకారం, పరీక్షలు – వాటి ఫలితాలకు ప్రాధాన్యం ఇస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థి పూర్తి స్థాయిలో విద్యను అందుకోలేకపోతున్నాడు. ఇలాంటి పిల్లల్లోని సృజనాత్మకత, అంతర్గతంగానే అడుగంటి పోతున్నది. నేను పాఠశాల స్థాయిలో వున్నప్పుడు కొన్ని సాంకేతిక కారణాల వల్ల, క్రీడలు, డ్రాయింగ్, డిబేటింగ్ వంటి అంశాలను సద్వినియోగం చేసుకోలేక పోయాను.
నా పిల్లలిద్దరూ కూడా, చదువుకు తప్ప ఇతర అంశాలకు ప్రాధాన్యత నివ్వలేదు. ఇక్కడ తల్లిదండ్రులుగా అది మా లోపమనే చెప్పాలి. నేను, నా శ్రీమతి ఉద్యోగస్థులం కావడం మూలాన మేము అశ్రద్ధ చేశామనే చెప్పాలి.
ఇప్పుడు మూడో తరం మనవరాలు ఆన్షితో ప్రారంభం అయింది. ఆమె తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లి, తానూ బాల్యంలో ఏమి కోల్పోయిందో, వాటి మీద కూతురు విషయంలో శ్రద్ధ పెట్టింది. చదువుకు ఏమాత్రం ఆటంకం కలగకుండా తన అభిరుచుల మేరకు ‘ఇతరేతర వ్యాపకాల’కు (Extra curricular activities) ప్రాధాన్యతనిస్తూ, ప్రోత్సహిస్తూ వస్తున్నది.
అలా నా మనవరాలు చదువులోనూ, ఇతరేతర వ్యాపకాలలోనూ చక్కగా రాణిస్తున్నది. ఆమె ఇలా రాణించడానికి ముఖ్య కారణాలు 1) స్వయంగా ఇష్టపడడం 2) తల్లిదండ్రుల ప్రోత్సాహం 3) పాఠశాల ఉపాధ్యాయుల/ఉపాధ్యాయినుల బాధతాయుతమైన, క్రమశిక్షణతో కూడిన చదువు, ఇతరేతర వ్యాపకాలపై ప్రత్యేక దృష్టి. ఈ అంశాలు అన్నీ కలిపి పిల్లల భవిష్యత్తుకు పుష్టికరమైన పునాది.
బడిలో చదువుకు మొదటి ప్రాధాన్యత. తరువాతనే, ఇతర వ్యాపకాలు. సమయపాలన, క్రమశిక్షణ, పిల్లల రక్షణ ఇలాంటి సదుపాయాలు వున్న పాఠశాలలనే, తల్లిదండ్రులు తమ పిల్లలకోసం ఎంచుకోవడానికి తాపత్రయ పడుతుంటారు. భరించలేని ఫీజులు వున్నా భయపడరు. కేవలం పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముందుకు పోతుంటారు.
జంటనగరాలలో వున్నా కొన్ని మంచి స్కూళ్లల్లో ఒకటైన ‘ గీతాంజలి పబ్లిక్ స్కూల్’ (బేగంపేట్)ను, నా మనవరాలి కోసం ఎంచుకోవడం జరిగింది. ఆ బడిలో చదువు గురించి విన్నాను కానీ, అక్కడ తెలుగు సబ్జెక్ట్ తప్పనిసరి అని వినలేదు. ఈ విషయం నన్ను ఎంతగానో ఆనందపరిచింది. తెలుగు సాహిత్యపరంగా నాకు ‘నా మనవరాలే- వారసురాలు’ అన్న ఆశ పుట్టింది.
నా మనవరాలు ప్రస్తుతం ఆంగ్ల మాధ్యమంగా రెండవ తరగతి చదువుతున్నది. ఈ వయసులోనే మహాకవి శ్రీశ్రీ కవిత ‘వర్షీయసి’ చూడకుండా, చక్కగా వినిపించి బహుమతి పొందడమే కాదు, టీచర్ల ప్రశంశలు కూడా పొందింది. సందర్భాన్ని బట్టి విచిత్ర వేషాలు వేసి,ఆ పాత్రకు న్యాయం చేకూరుస్తుంది. పాఠశాలలో జరిగే వివిధ సందర్భాలలో నృత్య కార్యక్రమాల్లో పాల్గొంటుంది. చిత్రలేఖనం,చార్ట్ తయారీ పోటీలలో పాల్గొని బహుమతులు పొందుతుంది. బడిలో నేర్పించే సంగీతం, కరాటే, క్రీడలు, డ్రిల్లు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుంది. ఇదంతా, తనలో ఉత్సాహం వున్నా తల్లిదండ్రుల, పాఠశాల యాజమాన్యం ప్రోత్సాహం వల్లనే సాధ్యం అవుతున్నది. ఇలా రాస్తుంటే నేను నా మనవరాలి గొప్పలు చెబుతున్నానని పాఠకులు అనుకోవడంలో తప్పులేదు కానీ, ఇందులో నా స్వార్థం కొంత వున్నా, పిల్లలు అందరికీ ఉపయోగపడాలన్నదే నా ఈ వ్యాసం ఉద్దేశం.
కేవలం చదువును మాత్రమే దృష్టిలో ఉంచుకుని, పిల్లల్లోని సృజనాత్మక శక్తిని నిర్దాక్షిణ్యంగా అణగదొక్కే తల్లిదండ్రులకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే ఇదంతా చెప్పడం. ఇలా చదువుతో పాటు ఇతర కార్యక్రమాలలో పాల్గొనే పిల్లలు మంచి విద్యావంతులు కాగలరు. మంచి ఉపన్యాసకులు, మంచి రచయితలు, మంచి చిత్రకారులు, మంచి నృత్యకారులు, మంచి నటులు కాగలరు. మంచి దృఢసంకల్పంతో ఎంతటి పనినైనా సులభంగా చేయగల నేర్పరులవుతారు. ఉన్నత స్థానాలకు చేరగలుగుతారు. జీవితం, కుటుంబం, మంచి-మర్యాద వంటి ముఖ్యమైన విషయాలను అవగాహన చేసుకోగల సమర్థులవుతారు. తమ పిల్లలు ఇలాంటి భావిభారత పౌరులు కావాలని ఏ తల్లిదండ్రులు మాత్రం కోరుకోకుండా వుంటారు! అందుకే పిల్లల భవిష్యత్తును విద్య సంస్థలకే వదిలేయడం సరికాదు. ఇంట్లో తల్లిదండ్రుల ప్రోత్సాహం చాలా అవసరం.
పిల్లల కోసం కొంత శ్రమ, కొంత ఓపిక, కొంత సమయం కేటాయించడం తల్లిదండ్రులకు తప్పనిసరి. నా మనవరాలు ‘సండే స్కూల్’ (చర్చి) లో సైతం, వివిధ కార్యక్రమాల్లో పాల్గొని బహుమతులు పొందుతుంది. ఆమెకు ఎప్పుడు ఎలాంటి బహుమతి వచ్చినా, ప్రోత్సాహంగా క్యాష్ రూపంలో నా వంతు అదనపు బహుమతిని ఇస్తుంటాను. మన ప్రోత్సాహం ఏ రూపంలో వున్నా, వారు ఉత్సాహంగా ముందుకు సాగడానికి, అది ‘ఉత్ప్రేరకం’గా పని చేస్తుందని చెప్పక తప్పదు.
~
చదువంటే
మార్కులు – ర్యాంకులు
మాత్రమే కాదు..!
జీవితానికి అవసరమైన
సంస్కారం
మంచి – మర్యాద
ప్రేమ – దయ
అన్నీ ఉండాలి,
అప్పుడే – కదా!
చదువుకు సార్థకత
బ్రతుక్కి భరోసా..!!
(మళ్ళీ కలుద్దాం)