జ్ఞాపకాల పందిరి-195

21
2

[“కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే..!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్.]

రక్షణ ఎవరికీ..!?

[dropcap]ప్ర[/dropcap]జలను కాపాడవలసినవారు, ప్రజల సంక్షేమానికి పాటుపడవలసినవారు రాజకీయ నాయకులు, ముఖ్యంగా ప్రజలను పాలించే పాలకులు. అంత మాత్రమే కాదు, ప్రజల చేత ఎన్నుకోబడిన ఏ నాయకుడికైనా ఆ బాధ్యత వుండి తీరుతుంది. ‘మేము ప్రభుత్వంలో లేముకదా, దీనితో మాకు సంబంధం లేదు’  అని ప్రతిపక్ష నాయకులు తప్పించుకోవడానికి వీలు లేదు. ప్రజల చేత ప్రేమింపబడ్డ నాయకుడికి, లేదా నిత్యం ప్రజల్లో ఉంటూ, ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలూ పాటుపడే నాయకుడికి లేదా నాయకులకు ‘సెక్యూరిటీ’ అనబడే రక్షణ కవచం అఖ్ఖరలేదు. తన ప్రాణభయంతో నిత్యం రక్షణ వలయంలో తిరిగేవాడిని ప్రజానాయకుడు, లేదా నాయకుడు అనవచ్చునా? రక్షణ ఎలాంటి నాయకుడికి అవసరం అవుతుంది? ఏ నాయకుడు తనకు రక్షణ కావాలని కోరుతాడు?

ప్రజా సంబంధాలకు దూరంగా ఉండేవాడు, అత్యంత అవినీతి పరుడు, లేదా అనేక నేరచరిత్రలతో సంబంధం వున్నవాడు. మరి, అలాంటి నాయకుడు మనకు అవసరమా?

కొన్ని విషయాలలో సెక్యూరిటీ తప్పనిసరి! దానిని ఎవరూ కాదనలేరు. కానీ, ప్రతి చోటా మోటా నాయకుడు సెక్యూరిటీ కోరుకోవడం రాజకీయరంగంలో ఈనాడు ఫ్యాషనుగా మారింది. వెనక ఇద్దరు రక్షక భటులు, పది మంది కార్యకర్తలను కూడా తిప్పుకోవడం ప్రతి చిన్ననాయకుడికి అలవాటు అయిపొయింది. ఇక కాస్త పెద్ద నాయకుల విషయం, ముఖ్యంగా పవర్‌లో వున్న నాయకుల విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటా.

వీళ్ళు ప్రభుత్వ పనుల కోసమే కాక, తమ స్వంత పనులకు కూడా ఇలాంటి విచిత్ర వేషాలు వేస్తుంటారు. దీనివెనుక ఎంత ప్రజాధనం వృథా అవుతున్నదో, లెక్కలు కడితేగాని తెలియదు. ఈ రోజు ప్రభుత్వాలు, ప్రజాసంక్షేమం కోసం కంటే, నాయకుల సెక్యూరిటీ కోసమే ఎక్కువ ధనం ఖర్చు చేస్తున్నాయన్న భావన సామాన్యుడి మనసులో, ముల్లై గుచ్చుతున్నది. ‘తనను కాపాడుకోలేనివాడు, ప్రజలను ఎలా కాపాడుతాడు?’ అన్న ఆలోచన ప్రతి పౌరుడి బుర్రను తొలిచి వేస్తున్నది. గతంలో ప్రజానాయకులుగా పేరు తెచ్చుకున్న ఏ నాయకుడూ సెక్యూరిటీని ఆశ్రయించలేదు. ఇప్పుడు సెక్యూరిటీ పేరుతో కోట్ల రూపాయల ప్రజాధనం గంగపాలవుతుందన్న చందంగా తయారయ్యింది. అసలు వీళ్ళందరికీ ఏ ప్రతిపదికన ప్రభుత్వం సెక్యూరిటీ సదుపాయం అందజేస్తుందో సామాన్యులకు తెలియకుండా వుంది.

ఈ మధ్య నాకు తెలిసిన (పలు కండువాలు మార్చినవాడు) ఒక నాయకుడు, అదృష్టం బాగుండి, ఎం.ఎల్.సి. అయినాడు. ఇక చూడండి, ఆయన హడావిడి. బహుశః ప్రభుత్వంలోని మంత్రులు కూడా అంత హడావిడి చేయరేమో. అతని నియోజకవర్గ ప్రాంతంలో, ప్రభుత్వ సమావేశాలకు మాత్రమే కాకుండా, అక్కడి శుభకార్యానికైనా, అశుభకార్యానికైనా, సెక్యూరిటీని, ఓ పదిమంది దిగువశ్రేణి నాయకులను వెంట పెట్టుకుని, పెద్ద హడావిడి చేస్తుంటాడు. కొన్ని చోట్ల ఇది కొన్ని ఇబ్బందులకు కూడా దారి తీస్తుంటుంది. ఇబ్బంది పడేవారు ప్రజలే కాబట్టి ఆయనకు చీమ కుట్టిన చందం కూడా అనిపించదు. ఎన్నుకునే వరకే ప్రజలు వాళ్లకు దేవుళ్ళు! ఆ తర్వాతి సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. ఒకోసారి ఆలోచిస్తే ఇది అవసరమా? అనిపించక మానదు.

కొన్ని పాశ్చాత్య దేశాలలో పరిస్థితి చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. అక్కడి పెద్దపెద్ద నాయకులు సైతం, మామూలు ప్రజల మాదిరిగా, బస్సుల్లో, రైళ్లల్లో ప్రయాణం చేస్తుంటారు. స్వేచ్ఛగా ఒంటరిగా నడిచిపోతుంటారు. వాళ్లకు అసలు సెక్యూరిటీతో పని లేనే లేదు.

సెలబ్రెటీలు, పెద్దపెద్ద నాయకులు, వ్యాపారవేత్తలు, స్వంతంగా తమకు తాము సెక్యూరిటీ దళాలను ఏర్పరచుకుంటారు. అది వాళ్ళ ఇష్టం, వారు ఖర్చుపెట్టే సొమ్ముకు, ప్రభుత్వ ఖజానాకు సంబంధమే లేదు. వారి వారి సంపద స్థాయిని బట్టి ప్రైవేట్ వ్యక్తులు వివిధ రూపాల్లో సెక్యూరిటీని ఏర్పాటు చేసుకుంటారు.

ఇరవై సంవత్సరాల క్రితం అనుకుంటాను, నేను హన్మకొండలో సాయంత్రం పూట ప్రైవేట్ డెంటల్ క్లినిక్ నడుపుకుంటున్న రోజులు. ఒక సాయంకాలం సమయాన ఒక స్త్రీమూర్తి, తన చిన్న కుమార్తెను తీసుకుని నా క్లినిక్‌కు వచ్చారు. ఆవిడను ఎక్కడో చూచినట్లు అగుపిస్తున్నది గాని, ఓ పట్టాన గుర్తుకురావడం లేదు. అతి సాధారణ దుస్తుల్లో సాదాసీదాగా వున్నారావిడ. ఆవిడను గుర్తుకు తెచ్చుకునే ప్రక్రియకు స్వస్తి పలికి, ఆవిడ కూడ వచ్చిన తన పుత్రికారత్నానికి దంతవైద్యం చేసి, కొన్ని సలహాలు-సూచనలు చేసి, నా పని అయిందనిపించాను. నేను అడిగిన ఫీజు చెల్లించి, ఆవిడ కూతురిని తీసుకుని వెళ్లిపోయారు. ఆవిడ నివాసం నా క్లినిక్‌కు దగ్గర కావడం వల్ల, వాళ్లిద్దరూ నడిచే వచ్చారు, తిరిగి నడిచి వెళ్లిపోయారు. వాళ్ళు బయటకు వెళ్లిన మరుక్షణం, నా క్లినిక్‌లో నాకు సహాయకారిగా వుండే, మెడికల్ షాపు అబ్బాయి కృష్ణమూర్తి, నా ఛాంబర్‌కు వేగంగా వచ్చి – “సార్.. ఇప్పుడు వచ్చిన మేడం ఎవరో తెలుసా మీకు?” అన్నాడు

“అదేనయ్యా.. ఎక్కడో చూచినట్టు వుంది, గుర్తుకు రావడం లేదు” అన్నాను

“అయ్యో.. ఆవిడ..!!” అన్నాడు.

అప్పుడు, ఆశ్చర్యపోవడం నా వంతు అయింది. ఎందుచేతనంటే, అప్పుడు ఆవిడ సిటింగ్ ఎం.ఎల్.ఏ.గా వున్నారు. ఆ తర్వాత స్త్రీ శిశుసంక్షేమ మంత్రిణి కూడా అయ్యారు. ఆవిడ కూడా, సెక్యూరిటీ సిబ్బంది గానీ, మంది మార్బలం గాని లేరు. అతి సాధారణ వ్యక్తిగా వచ్చి ‘నేను ఫలానా..’ అని కూడా చెప్పుకోలేదు. అప్పుడు అనుకున్నాను ‘నాయకులంటే.. ఇలా కదా వుండవలసిందీ!’ అని. దేశంలోని నాయకులంతా ఇలా ఉంటే ఎంత బావుణ్ణో కదా! అని అభిప్రాయపడ్డాను. అలా వుంటే, అలా వుండదగ్గ పరిస్థితిలో మనం ఉంటే, ఎంత ప్రభుత్వ (ప్రజల) సొమ్ము, ఆదా అవుతుందో కదా! అనుకున్నాను.

ఇంతకూ ఆ మహిళామణి ఎవరో మీకు చెప్పనేలేదు కదా! ఆవిడ ఎవరో కాదు సుమండీ.. ప్రస్తుత తెలంగాణా రాష్ట్ర మంత్రిమండలిలో సభ్యురాలు, శాసనసభలో అనర్గళంగా ఉపన్యసించ గల గొప్ప వక్త, వరంగల్ (పశ్చిమ) శాసనసభ్యురాలు శ్రీమతి కొండా సురేఖ గారు. ప్రజలు కోరుకునేది ఇటువంటి నాయకులనే. ప్రభుత్వాలు నమ్ముకునేది, ఇలాంటి ప్రజా నాయకులనే! ఇలాంటివారే మంత్రులు కావడానికి కూడా అర్హత పొందుతారు. నాయకుడు/నాయకురాలు అంటే, ప్రజారక్షకులు అనే భావన ప్రజలకు కలగాలి. త్వరలో అలాంటి పరిస్థితులు ఏర్పడతాయని ఆశిద్దామా?

పదిమందిలో స్వేచ్ఛగా తిరిగేవాడు

ప్ర జా నా య కు డు!

పదిమంది రక్షణతో తిరిగేవాడు..

పి రి కి వా డు!!.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here