జ్ఞాపకాల పందిరి-20

105
2

[box type=’note’ fontsize=’16’] “కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే…!!”అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్. [/box]

మీరేదయినా చేయాలి బాబూ..!!

[dropcap]స[/dropcap]హాయం అనేది చాలా రకాలుగా ఉంటుంది. సహాయం చేయడం అనే అభిలాష వున్నవాళ్లు, అది ఎలాంటి సహాయం అని ఆలోచించరు. తమకు చేతనైనంత సహాయం చేయడానికి ముందుకు వస్తారు. లేదా మనసున్న మారాజుల చేత సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ సహాయం అనేది ఉపద్రవం వచ్చినప్పుడు అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని చేసేది మొదటి రకమైతే, అవసరాన్ని బట్టి సావధానంగా, సహాయం చేయడం మరోరకం.

మా తండ్రిగారు తాతయ్య కానేటి

మళ్ళీ స్వయంగా చేసే సహాయం, ఆర్థికపరంగా చందాలు వసూలు చేసి సహాయం చేయడం మరో మార్గం. ఏదైనా అర్థవంతంగా (ఫోటోల కోసం కాక) చేసే సహాయం ఏదైనా సహాయమే! ఈ సహాయం చేయాలనే కోరిక ఎవరో చెబితే వచ్చేది కాదు, అది జన్యు ప్రధానమైన అంశం, స్పందించే లక్షణం గల అంశం. ఈ స్పందన అందరిలోనూ ఉండదు. కోట్లు వున్నా ఒక రూపాయి కూడా విదల్చని పెద్దలున్నారు, అలాగే తాము పైసా.. పైసా కూడబెట్టి దాచుకున్న డబ్బు సహాయం చేసే చిన్న పిల్లలు కూడా వున్నారు.

దేశంలో, రాష్ట్రంలో ఉప్పెనలు, తుఫానులు, భూకంపాలు వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు, సినీ రంగ ప్రముఖులు స్పందించి, పెద్ద మొత్తంలో విరాళాలు సేకరించి ముఖ్యమంత్రి/ప్రధాన మంత్రి సహాయనిధికి సహాయం చేసిన వాళ్ళు వున్నారు. కొందరు మనసున్న మారాజులు ధనవంతులైన కాకపోయినా, పేదపిల్లలను, అనాథ పిల్లలను దత్తత తీసుకుని (విద్య వరకూ) విద్యావంతులుగా, ప్రయోజకులుగా తీర్చిదిద్దినవారు ఉన్నారు. బాల కార్మికులను ప్లాటుఫామ్‌ల మీద ఒక గమ్యమంటూ లేకుండా అనాథలుగా తిరుగుతున్న పిల్లలను చేరదీసి వాళ్లకు విద్యా బుద్ధులు నేర్పించి సామజిక ఉత్తమ పౌరులుగా మలచిన పుణ్యాత్ములు ఉన్నారు. మనసు ఉండాలి గానీ సహాయం అందించడానికి హద్దులంటూ వుండవు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, నాకు కూడా ఇలా చిన్న ప్రయత్నం చేసే అవకాశాన్ని మా నాయన, ప్రముఖ కమ్యూనిస్ట్ కార్యకర్త స్వర్గీయ కానేటి తాతయ్య గారు, నా చిన్నతనం లోనే ఉపదేశించారు. నేను చదువుకుని, ఉద్యోగస్థుడనై, ఆర్థికంగా కొద్దిగా నిలదొక్కుకున్నాక, మా నాయన మాటలు పదే పదే చెవుల్లో సందడి చేయడం మొదలు పెట్టాయి. అప్పుడు నేను నా శ్రీమతిని సంప్రదించి తీసుకున్న నిర్ణయం మంచి ఫలితాలనే ఇచ్చింది. అది చెప్పే ముందు దానికి సంబంధించిన నేపథ్యం కొంత చెప్పాలి.

మా మేనమామ చొప్పల సుందర్రావు

నాకు ఇద్దరు మేనమామలు. పెద్దాయన ఆనందరావు, రెండవ మేనమామ సుందర్రావు చొప్పల. ఇద్దరూ మా అమ్మతో సహా నిరక్షరాస్యులే! ఇద్దరూ రైతు కూలీలే! మేనమామలది మా స్వగ్రామం దిండిని ఆనుకుని వున్న గ్రామం రామ రాజులంక. పెద్ద మామ ఆనందరావు పెళ్లి చేసుకోలేదు, బ్రహ్మచారి గానే వుండిపోయాడు. ఎందుకో మా నాయన, ఆనందరావు గారిని అంతగా ఇష్టపడేవారు కాదు. విషయం తెలీదు కానీ చిన్న మేనమామ సుందర్రావును బాగా ఇష్టపడేవారు. మా నాయనను చిన్నమేనమామ ఎంతగానో గౌరవించేవారు. ఆయన అంటే భయపడేవారు కూడా, చాలా నెమ్మది మనిషి. అనవసరమైన మాటలు మాట్లాడేవారు కాదు. మా చిన్న మేనమామ సుందర్రావు గారికి ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగ పిల్లలూను. ఆఖరివాడు రాజబాబు చొప్పల.

వాడు తప్ప ఆ ఇంట్లో మిగతా వారంతా నిరక్షరాస్యులే! కూలి పని చేసుకుని బ్రతికేవారు. ఇక అసలు విషయానికి వస్తే –

మా అన్నదమ్ములు, అక్కలు చదువుకుంటున్నప్పుడే, మా నాయన ఒక విషయం ప్రస్తావించేవారు. “మీ చిన్న మేనమామ అమాయకుడు, అతనికి మీలో ఎవరైనా సరే మీకు తోచిన సహాయం చెయ్యాలి” అన్నవిషయం పదే పదే గుర్తు చేస్తుండేవారు. ఆయన మాటల ద్వారా నాకు అర్థం అయిందేమిటంటే, మా మేనమామ ఇద్దరి ఆడపిల్లలను దృష్టిలో ఉంచుకుని అనేవారేమో అని! ఆ దృష్టి మాలో ఎవరికీ లేదు.

కారణం బహుశః అందచందాల గురించి కాదు గానీ, వాళ్ళ నిరక్షరాస్యత వల్ల అని నాకు అనిపిస్తుంది. అదృష్టవశాత్తు నేను దంత వైద్యంలో డిగ్రీ పట్టా తీసుకునే సమయానికి, చిన్న మేనమామ ఇద్దరి ఆడపిల్లలకు పెళ్లిళ్లు అయిపోయాయి. 1982లో మానుకోటగా చెప్పబడే మహబూబాబాద్ తాలూకా (ఇప్పుడు జిల్లా) ఆసుపత్రిలో దంతవైద్యుడిగా చేరాను.

ఆర్టిస్ట్ బాపూజీ గీసిన నా స్కెచ్

1983లో పెళ్లి అయింది. తర్వాత పిల్లలు, ఆ తర్వాత శ్రీమతికి బ్యాంకులో ఉద్యోగం, ఆమెకు కూడా మహబూబాబాద్ లోనే ఉద్యోగం (స్టేట్ బ్యాంకు ఆఫ్ హైదరాబాద్, ఇప్పుడు స్టేట్ బాంక్ ఆఫ్ ఇండియా) రావడం జరిగి రోజులు చాలా ఆనందంగా గడిచిపోతున్నాయి. ఈలోగా మా చిన్న మేనమామ చిన్న కొడుకు రాజబాబు పదవ తరగతి మంచి మార్కులతో పాస్ అయినట్టు సమాచారం అందింది నాకు. వెంటనే పదే పదే మా మేనమామ విషయంలో గుర్తు చేస్తున్న విషయం మదిలో మెదిలింది. రాజబాబుని తీసుకు వచ్చి నా దగ్గర చదివించాలని నిర్ణయం తీసుకున్నాను, విషయం నా శ్రీమతి అరుణతో సంప్రదించాను. ఆమె ఎలాంటి సందేహాలు వెలిబుచ్చకుండా, నాతో సహకరిస్తానంది. చాలా సంతోషపడి రాజబాబుని నా దగ్గరకు పంపమని మా మేనమామకు ఉత్తరం రాసాను.

మా మేనమామ చాలా సంతోషించి కాలేజీ అడ్మిషన్ల సమయానికి కొడుకుని నా దగ్గరకు పంపించాడు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేర్పించి, ట్యూషన్ పెట్టాలని నిర్ణయించుకున్నాను. అసలు అడ్మిషన్ వస్తుందా? లేదా?అన్నది ఒక పక్క భయపెడుతూనే వుంది. పైగా వాడి అడ్మిషన్ నాన్-లోకల్ కిందికి వస్తుంది. అప్పుడు ఆ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ గా లక్ష్మి నారాయణ (ఖమ్మం) గారు ఉండేవారు. ఆయన నాకు బాగా తెలుసును. అందుచేత కొంచెం ధైర్యంగానే వున్నాను.

అయితే, నేను ఏదైనా ఆర్ట్స్ గ్రూపుతో ఇంటర్ చదివించాలనుకున్నాను. కానీ గణితంలో మార్కులు బాగా వచ్చినందువల్ల, మేథ్స్ గ్రూపు తీసుకుంటానని రాజబాబు అభ్యర్థించాడు. అది చదవడం కష్టం అని నాకు తెలుసు,కానీ వాడి కోరికను కాదనలేక లెక్కల గ్రూప్ కోసం అప్లై చేయించాను. వాడి అదృష్టం కొద్దీ గణితం ప్రధాన అంశంగా ఇంటర్‌లో సీట్ వచ్చింది. దానికి సంబందించిన లెక్చరర్ పమ్మి చిరంజీవి గారు కూడా నాకు బాగా తెలుసును. ఇక ఆయన దగ్గర ట్యూషన్ పెట్టాలని నిర్ణయించుకున్నాను. అదే ధైర్యంతో రాజబాబును జూనియర్ కాలేజీలో జాయిన్ చేసాను. మిత్రులు చిరంజీవి గారితో మాట్లాడి రాజబాబుని ఆయన దగ్గర ట్యూషన్‌కు పెట్టాను. రోజులు, నెలలు గడిచాయి. ఒక రోజున చిరంజీవి గారు ఫోన్ చేసారు. అప్పటికి ఇంకా మొబైల్ ఫోన్లు ఇంకా రాలేదు. నాలాంటి వాడికి మామూలు ఫోను ఉండడమే గొప్ప అప్పుడు! ఆయన ఫోన్ సారాంశం ఏమిటంటే, రాజబాబుకి లెక్కల గ్రూప్ ఉపయోగం లేదనీ, ఎప్పుడు పరీక్షలు పెట్టినా జీరో మార్కులు వస్తున్నాయనీ.. సారీ..! అని ఫోన్ పెట్టేసారు. నాకు తల తిరిగినంత పని అయింది. ఏమి చేయాలో తోచలేదు. రాజబాబుని అడిగాను సంగతేమిటని. లెక్కలు అర్థం కావడం లేదనీ, సూత్రాలు గుర్తుండడం లేదనీ అన్నాడు. మరి టెన్త్‌లో తొంభై శాతం ఎలా వచ్చాయని అడిగాను. నోరు విప్పడానికి భయపడుతున్నట్టు గ్రహించాను. అందుకే పెద్ద వత్తిడి చేయలేదు. తర్వాత చెప్పాడు అక్కడ మాస్ కాపీయింగ్ చేయించారని, అందుకే అన్ని మార్కులు వచ్చాయని, తిడతారని ఈ విషయం చెప్పలేదని, చావు కబురు చల్లగా చెప్పినట్టు చెప్పాడు. ఏమీ మాట్లాడలేని పరిస్థితి, ఏమీ తోచని పరిస్ధితి ఎదురయ్యింది. రెండు సంవత్సరాలు చాన్సు తీసుకోమన్నాను. అయినా ఇంటర్ మొదటి సంవత్సరం పాస్ కాలేదు. అప్పుడు ఒక నిర్ణయానికి వచ్చాను.

చొప్పల రాజబాబు

ఒక శుభోదయాన, కూర్చోబెట్టి రాజబాబుకి హితబోధ చేసాను. ఇంటర్ ఇక అతనివల్ల అయ్యే పని కాదు కాబట్టి, ఓపెన్ యూనివర్సిటీలో చేరి డైరెక్ట్‌గా డిగ్రీ చెయ్యమన్నాను. సంవత్సరానికి ఒక సబ్జెక్టు పాస్ అయినా ఫరవాలేదని చెప్పాను, అతను ఒప్పుకున్నాడు. వరంగల్‌లో ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకున్నాడు. చాలా సీరియస్‌గా చదవడం మొదలు పెట్టాడు. ఇక నేను ఏమీ పట్టించుకోలేదు, అన్నీ వాడే చూసుకున్నాడు. డిగ్రీ చదువుతో పాటు ప్రతి రోజు తెలుగు వార్తాపత్రిక క్రమం తప్పకుండా చదవడానికి అలవాటు పడ్డాడు, నేను అనుకున్నట్టు కాకుండా సకాలంలోనే డిగ్రీ పూర్తి చేసాడు. ఆ సమయానికి, నాకు జనగాం బదిలీ అయి ఫామిలీ హనుమకొండకు మార్చాను. రాజబాబు ఖాళీగా ఉండకుండా ఒక చిటీఫండ్ (సారయ్య) సంస్థలో చేరి పని చేసాడు.

తర్వాత కొన్నాళ్ళకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారు ఉద్యోగాలు ప్రకటించారు. ప్రవేశ పరీక్ష పెట్టారు. ప్రశ్నాపత్రం మొత్తం జనరల్ నాలెడ్జి ప్రశ్నలు ఉండడం వల్ల, రాజబాబుకి కలిసివచ్చింది. ప్రవేశ పరీక్షలో మంచి మార్కులు వచ్చాయి. ఇంటర్వ్యూ నామ మాత్రమే అయింది. అతనికి ఉద్యోగం వచ్చింది. క్లర్క్‌గా కామారెడ్డిలో జాయిన్ అయ్యాడు. అధికారులకు విశ్వాస పాత్రుడయ్యాడు. మంచి చలాకీ ఉద్యోగిగా మన్ననలు పొందాడు. ప్రస్తుతం పాల్వంచ డిపోలో డిప్యూటీ సూపరింటెండెంట్‌గా ఆనందంగా పని చేస్తున్నాడు. నేను తలచుకున్న పని సమాప్తమయింది. మా నాయన చేసిన సూచనను గౌరవించి పూర్తి చేయగలిగాననే తృప్తి మిగిలింది. మేము చేసిన ఈ చిన్ని సహాయం, రాజబాబుని విపరీతంగా ప్రభావితం చేసింది. అతనిప్పుడు మాకొక రక్షక కవచం. నా పిల్లలు అతనిని ఎంతగా గౌరవిస్తారో, రాజబాబు మా పిల్లలను అంతగా ప్రేమిస్తాడు. మా ఇంట్లో ఇప్పుడు రాజబాబుని తలుచుకొని క్షణమంటూ ఉండదు. మమ్మల్ని చూడని క్షణం అతనికి నిదురుండదు!

చాలా మంది చాలా రకాలుగా సహాయం పొందుతారు, తర్వాత ఆ సహాయమూ, సహాయము చేసిన వారూ అసలు గుర్తుండరు. కొద్దీశాతం మంది మాత్రమే కృతజ్ఞతా భావంతో జీవితమంతా గుర్తుంచుకుంటారు.

అలాంటి వారిలో మా రాజబాబు ముందు వరసలో ఉంటాడు!

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here