Site icon Sanchika

జ్ఞాపకాల పందిరి-21

[box type=’note’ fontsize=’16’] “కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే…!!”అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్. [/box]

ఆఖరి ముద్ద…!!

శ్రీమతి భారతి.మట్టా(కానేటి)

[dropcap]ఒ[/dropcap]కే తల్లిదండ్రులకు పుట్టిన సంతానం, చిన్నప్పటి నుండి, కలసిమెలసి తిరుగుతూ, ఆడుతూ పాడుతూ, తన్నుకుంటూ నవ్వుకుంటూ, ఎన్నో.. ఎన్నెన్నో అనుభవాలను, జ్ఞాపకాలను మూటగట్టుకుని, జీవితంతో పాటు ఎదుగుతూ ముందుకు సాగిపోతుంటారు. ఈ పయనంలో ఎన్నో ఎత్తుపల్లాలు, ఎగుడు దిగుడు సమస్యలను ఎదుర్కొన్నా, కష్టాలను సుఖాలను పంచుకుంటూ, ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. ఇదంతా జీవితంలో ఒక దశ వచ్చేవరకూ మాత్రమే. ఈ మధ్యలో, చదువు సంధ్యలు, ఉద్యోగాలు, పెళ్లిళ్లు, పిల్లలు, ఇలా దశలు మారి, పొట్ట చేత పట్టుకుని ఉద్యోగం పేరుతో, ఒక్కొక్కరు ఆ లింకు నుండి విడిపోవడం మొదలు పెడతారు. ఒక్కొక్కరూ ఒక్కోచోట స్థిరపడిపోతారు. ఇక్కడ ఆడ మగ అన్న తేడా లేదు. ఆడపిల్లలైతే అత్తగారింటికి వెళ్ళవలసిందే, అది రాష్ట్రంలో, దేశంలో, లేదా విదేశాల్లో ఎక్కడైనా కావచ్చు. బాల్యం, యవ్వనం హాయిగా ఇంటి పట్టున ఆనందంగా అనుభవించి, ఆ తర్వాత పరిస్థితులను బట్టి ఎవరికీ వారై పోవడం, వేరై పోవడం, లోతుగా ఇలాంటి ఆలోచనలు వస్తే, ఒక రకమైన మానసిక వ్యథ అల్లుకోవడం జరుగుతుంటుంది. మరి, అందరూ ఒకే చోట ఉండడం సాధ్యమా?అంటే, ఇప్పటి పరిస్థితుల్లో సాధ్యం కాదు. ఉద్యోగాల మీద కాకుండా, కులవృత్తుల మీద అధికంగా ఆధారపడి వున్నకాలంలో, అందరూ కలిసి ఉండడానికి, ఉమ్మడి కుటుంబాలు గొప్ప వూతం ఇచ్చాయి. ఆ రోజులు పూర్తిగా వేరు! అవి అనుబంధాలకు, ఆత్మీయతలు, ప్రేమలకు చిరునామాలు. ఇప్పుడు ప్రతి పౌరుడికి, చదువు ప్రధానం. ఈ చదువుతో, విజ్ఞాన సముపార్జన మాత్రమే కాకుండా, బ్రతుకు తెరువుకు చుక్కాని అయింది. చదువుకున్న చదువుకు, ఎక్కడ అనుకూలమైన ఉద్యోగం వస్తే అక్కడికి పోవలసిందే. ఒకోసారి చదువుకున్న చదువుకు చేస్తున్న ఉద్యోగానికి సంబంధమే ఉండదు,అది వేరే విషయం.

పెద్దక్క, చిన్నక్కలతో నేను

తల్లిదండ్రులు తమ పిల్లలు తమకంటే ప్రయోజకులు కావాలని, ఎన్ని కష్టనష్టాలనైనా భరించి, పిల్లలను చదివించుకుంటారు. ఉద్యోగాలు వచ్చాక రెక్కలొచ్చిన పిట్టల్లా ఎగిరి పోతారు. వివిధ ప్రాంతాల్లో స్థిరపడిపోతారు. ఒకరికొకరు దూరం అయిపోతారు. ప్రత్యేక సందర్భాలు వస్తే తప్ప కలుసుకోలేని పరిస్థితి.

ఇప్పుడంటే మొబైల్ వచ్చి ఎప్పుడంటే అప్పుడు మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది (వీడియో కాల్‌తో ముఖాముఖి చూసుకునే అవకాశం, జూమ్ పద్ధతిలో పలు చోట్ల నుండి ఎక్కువ మంది ముచ్చటించే పరిస్థితి వచ్చింది) కానీ, అంతకు ముందు దూరప్రాంతాలకు మాట్లాడాలంటే ట్రంకాల్ చేయాల్సి వచ్చేది. అధిక రేట్లను దృష్టిలో ఉంచుకుని ఎక్కువ సేపు మాట్లాడలేని పరిస్థితి ఉండేది. అసలు ట్రంకాల్ దొరకడమే గగనం అయిపోయేది. ఇలాంటి నేపథ్యంలో రక్త సంబంధీకుల మధ్య పెద్ద అగాధం ఏర్పడేది. కాల గమనంలో రవాణా సదుపాయాలు కూడా అందుబాటు లోనికి రావడంతో ఎప్పుడంటే అప్పుడు అనుకున్న వారిని కలుసుకునే అవకాశం ఏర్పడింది. అనేక సాంకేతిక ఆవిష్కరణలు మనిషికి కొంతలో కొంత తృప్తికరమైన జీవితాన్ని ఫలవంతం చేస్తున్నాయి. ఇక్కడ మా కుటుంబం నేపథ్యం చెబితే తప్ప ఈ వ్యాసం శీర్షిక అంతరార్థం తెలీదు, అందుకే అది మీ ముందు వుంచుతాను.

మా తల్లిదండ్రులకు (కానేటి వెంకమ్మ, కానేటి తాతయ్య దంపతులు) మేము మొత్తం అయిదుగురు సంతానం. అందులో నేను కనిష్ఠుడిని. నాకు ఇద్దరు అన్నయ్యలు,ఇద్దరు అక్కయ్యలు. అందరం చదువుకున్నాం, అందుకే అందరం ఉద్యోగాలు వెతుక్కుంటూ వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిపోయాం. వృద్ధాప్యంలో మా తల్లిదండ్రులు వంటరిగా వుండి, సాధారణ జీవితం గడపడానికి చాలా ఇబ్బందులు పడేవారు. తెలిసిన వారిని సహాయం కోరితే నమ్మించి వాళ్ళను మోసం చేసారు. అందుకే ఇవన్నీ ఊహించే కాబోలు మా నాయన – ‘మా చంటోడిని (నన్ను) చదివించి తప్పు చేశాన’ని అంటుండేవారు. చదివించకుండా ఉంటే, ఏదో పని చేసుకుంటూ వాళ్ళతోనే ఉండేవాడినని, సహాయకారిగా ఉండేవాడినని కాబోలు!

పెద్దన్నయ్య కె.కె. మీనన్‌తో

పెద్దన్నయ్య స్వర్గీయ కె. కె. మీనన్ (నవల/కథా రచయిత) ఏజీ ఆఫీసులో ఉద్యోగం సంపాదించుకున్నాడు. ఆయన వల్లే నాకు పునర్జన్మ లభించి ఈ రోజున ఇది రాయగలుగుతున్నాను. అన్నయ్య హైదరాబాద్‌లో స్థిరపడ్డాడు.

పెద్దక్క, కుమారి కానేటి మహానీయమ్మ, సైన్సు టీచర్‌గా ఉద్యోగం సంపాదించుకుని నాగార్జున సాగర్‌లో (దక్షిణ విజయపురి) స్థిరపడి, అక్కడే స్వర్గస్తురాలయింది. అక్క దగ్గర నేను ఇంటర్మీడియెట్ (ప్రభుత్వ జూనియర్ కళాశాల, హిల్ కాలనీ, 1972-1974) చదువుకున్నాను. నన్ను అతిగా ప్రేమించేది అక్క. ఆవిడ మరణం నాకు పెద్ద షాక్!

చిన్నన్నయ్య డా. కె. మధుసూదన్

చిన్నన్నయ్య డా. కె. మధుసూదన్, ఆకాశవాణి విశాఖపట్టణంలో అనౌన్సర్‌గా ఉద్యోగం సంపాదించుకుని, అక్కడే స్థిరపడినాడు. అక్కడ సాహితీ రంగంలోనూ, సాంస్కృతిక రంగంలోనూ ఎందరినో ప్రోత్సహించి మంచి పేరు తెచ్చుకున్నాడు. బ్రహ్మచారిగానే వుండిపోయాడు. నేను దంత వైద్యం చదివి ఇంతటి వాడిని కావడానికి మూలపురుషుడు ఈయనే! తక్కువ మాట్లాడి ఎక్కువ పనిచేసే ప్రత్యేకమైన వ్యక్తిత్వం కలవాడు.

చిన్నక్క, మట్టా. భారతీ దేవి రైల్వేలో స్టెనోగా ఉద్యోగం సంపాదించుకుని, గజిటెడ్ హోదాలో పదవీ విరమణ చేసింది. హైదరాబాద్ (సఫిల్ గూడ)లో స్థిరపడింది. పదవీ విరమణ తర్వాత అతికొద్ది కాలం మాతో కలిసి జీవించింది. ఆమె మరణం నాకు రెండవ షాక్!

హైదరాబాద్‌లో దంతవైద్య విద్య నభ్యసించి, ఉద్యోగ రీత్యా హనంకొండలో స్థిరపడ్డాను. ఇలా ఇక్కడ స్థిరపడతానని నేను అసలు ఊహించలేదు. హైదరాబాద్‌‌లో మంచి ఇల్లు వున్నా, మిత్రులు-శ్రేయోభిలాషులు ఎక్కువగా, వరంగల్‌లో ఉన్నందువల్ల, నేనూ నా శ్రీమతి, హనంకొండలో స్థిరపడడానికి మొగ్గు చూపాము.

చిన్నక్క భారతి (అక్క అని ఎప్పుడూ పిలవలేదు. ‘పాప’ అని పిలిచేవాడిని) నేనూ ఆఖరివాళ్ళం కాబట్టి ఇద్దరము, ప్రాథమిక పాఠశాల లోనూ, హై స్కూల్ లోనూ కలిసి చదువుకునే అవకాశం కలిగింది. మా ఇద్దరి పోలికలు కూడా ఇంచుమించు ఒకేలా ఉంటాయి. నేను అనారోగ్యం వల్ల ఎనిమిదవ తరగతి ప్రథమార్థంలో బడి విడిచి పెట్టడం, హైదరాబాద్ అన్నయ్య దగ్గరకు వెళ్ళవలసి వచ్చింది. చిన్నక్క, ఎస్.ఎస్.ఎల్.సి. చదవడానికి పెద్దక్క దగ్గరకు (నాగార్జున సాగర్) వెళ్ళింది. తర్వాత పాప హైదరాబాద్ కమలా నెహ్రు పాలిటెక్నిక్‌లో డి.సి.పి (Diploma in commercial practice) చదివింది. తర్వాత ఉద్యోగం వచ్చింది. పెళ్ళికి ముందు తాను, వర్కింగ్ ఉమెన్ హాస్టల్‌లో ఉండేది. హైదరాబాద్ గన్‌ఫౌండ్రి, స్టేట్ బ్యాంకు ఎదురుగా లోపల స్నేహాలయం అది. చిన్నక్కని ఆదివారాలు, సెలవు రోజుల్లో అక్కడ కలుసుకునేవాడిని. మొదట ఆమెకు డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్‌లో స్టెనోగా ఉద్యోగం వచ్చింది. తరువాత రవీంద్ర భారతి దగ్గర ఉన్న ఫారెస్ట్ ఆఫీసులో, ఆ తర్వాత రైల్వేలో వచ్చింది, అందులో స్థిరపడింది. వివాహం అయిన తర్వాత రైల్వే క్వార్టర్స్‌లో ఉండేవారు. ఆ తర్వాత సఫిల్ గూడలో ఇల్లు కట్టుకుని స్థిరపడ్డారు. నేను హైదరాబాద్‌లో ఉన్నంత కాలం అప్పుడప్పుడు సఫిల్ గూడ వెళ్తుండేవాడిని. అక్క బావగారు కూడా బాగా చూసేవారు. వాళ్లకు ముగ్గురు పిల్లలు. ఇద్దరు ఆడపిల్లలకు పెళ్లిళ్లు అయ్యాయి. కొడుకు అమెరికాలో స్థిరపడ్డాడు. అంతా బాగానే ఉంది. చిన్నక్కకు అప్పుడప్పుడు తుంటి నొప్పి వచ్చేది. రైల్వే ఆసుపత్రిలో వైద్యం చేయించుకునేది. పదవీ విరమణ జరిగిన తర్వాత సమస్య జటిలమైంది. వ్యాధి నిర్ధారణలో వైద్యులు విఫలమై, జబ్బు ఒకటైతే, వైద్యం మరోటి చేసి, వ్యాధిని ముదర బెట్టేసారు. చివరికి కాన్సర్‌గా నిర్ధారించారు. అప్పటికే పరిస్థితి చేయి జారి పోయింది. ఆసుపత్రిలో కొన్నాళ్ళు, ఇంట్లో కొన్నాళ్ళు ఉంటూ కేన్సర్ వైద్యం చేయించుకునేది. నేను వరంగల్ జిల్లాలో ఉంటూ కరీంనగర్‍లో పని చేస్తుండేవాడిని. అందుచేత అప్పుడప్పుడు సఫిల్ గూడా వెళ్లి అక్కను చూసి వస్తుండేవాడిని. కొన్నాళ్ల తర్వాత చిన్నక్క మంచానికే పరిమితం అయిపొయింది. బావగారు శక్తివంచన లేకుండా అక్కకు సేవ చేసేవారు. అలా కొన్నాళ్ళు జరిగాయి.

చిన్నక్క, బావగారు

ఒక రోజు హనంకొండ నుండి బయలుదేరి పాప (చిన్నక్క)ను చూడ్డానికని, సఫిల్ గూడా వెళ్లాను. ఆ సమయానికి పాప మంచం మీద కూర్చుని అన్నం తింటోంది. నన్ను చూసి, నవ్వి “చంటీ ఒక ముద్ద పెడతాను, ఇలా రా…” అంది. ఆ ఇంట్లో ఎన్నోసార్లు కలసి భోజనం చేసాము కానీ పాప ఎప్పుడు.. తాను తింటూ ముద్ద పెడతానని ఎప్పుడూ అనలేదు. నాకు వూహ తెలిసిన తరవాత అదే మొదటి సారి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా, వెంటనే దగ్గరికి వెళ్లి పాప తినిపించిన ముద్ద, ఎంతో ఆనందంగా తిన్నాను. సాయంత్రం వరకూ వుండి, రాత్రికి గమ్యస్థానానికి చేరుకున్నాను.

ఈ ఘటన జరిగిన కొద్దీ రోజులకే పాప మరణ వార్త వినాల్సి వచ్చింది. ఆనాడు పాప తినిపించిన ముద్ద, ఆఖరి ముద్ద అవుతుందని నేను కలలో కూడా అనుకోలేదు.

అలా… ఇద్దరు అక్కలను, పెద్దన్ననూ, పోగొట్టుకున్న దురదృష్టవంతుడిగా మిగిలిపోయాను. నా సమయం కోసం వేచి చూడడం తప్ప మరో ధ్యాస లేదిప్పుడు!!

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version