[box type=’note’ fontsize=’16’] “కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే…!!”అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్. [/box]
జాతకం..!
[dropcap]జీ[/dropcap]వితంలో ఏదో జరగబోతోందని ముందే తెలుసుకోవడం కొందరికి ఆరాటం. మంచి కబుర్లు చెబితే ఎగిరి గంతులు వేయడం, చెడు గురించి వింటే లేని పోనీ అనవసర ఆలోచనలతో నీరసించిపోయి క్రుంగి కృశించిపోవడం, లేనిపోని సమస్యలను సృష్టించుకోవడం సాధారణ జనావళికి కొత్తేమీ కాదు. నిజం దేవుడెరుగు… అన్న నానుడి పక్కన పెడితే,ఈ హస్త సాముద్రికమూ, జాతకాలూ మనిషిని బహుదా ఆకర్షిస్తాయి. నమ్మకం మనిషిని బానిసను చేస్తుంది. నమ్మడం, నమ్మకపోవడం, ఆ యా వ్యక్తుల వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. అలాగని జ్యోతిష్య శాస్త్రాన్ని తక్కువ చేసి మాట్లాడం నా ఉద్దేశం కాదు. అది ఇప్పుడు పరిశోధనాంశం అయింది, అది వేరే విషయం. కానీ తెలిసీ తెలియక, దానిని వాడి, ప్రజలను మభ్య పెట్టి, మోసం చేసి, పిరికివాళ్ళుగా తయారుచేసి జీవితం మీద నిరాశా నిస్పృహలు కలిగించే వారి గురించే నా చర్చ.
చిలక జోస్యాలు, హస్త సాముద్రికాలు, ముఖం చూసి జాతకం చెప్పడాలు, సోది చెప్పడాలు, ఇవన్నీ ఎక్కువ శాతం పొట్టకూటి కోసం, ఆ యా వృత్తులవారి పోరాటం. సామాన్య ప్రజలకేమో తమకు ఏమి మంచి జరుగుతుందో, లేదా ఎలాంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయో తెలుసుకునే ఆరాటం. ప్రమాదాలు ఉంటే దానికి విరుగుడు ప్రయత్నాలు. ఇక ఎలాంటి సలహా ఇచ్చినా పాటించడానికి సిద్ధపడే జనం ఎక్కువ అయిపోయారు. చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా అప్పో సప్పో చేసి ఆ పని జరిపించడానికి సిద్దపడిపోతారు. అవతల వీరికి సలహా ఇచ్చే పెద్దమనిషి వీరిని, వీరి వీక్నెస్‌ను, వ్యాపారమయం చేసి వీలున్నంతగా దండుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తాడు. ఇలా కొందరు నిష్టగా చేస్తే, ఎక్కువ శాతం వ్యాపారంగా చూస్తారు. ఇందులో నిరక్ష్యరాస్యులకు, విద్యావంతులకు తేడా ఉండదు. కూటికోసం కోటివిద్యలు అన్నట్టు, చిలక జోస్యం, హస్త సాముద్రికం, ఇంకా రకరకాల పేర్లతో ఇది బాహాటంగా నడిచిపోతోంది.
మరికొంతమంది స్వాముల వేషంలో అమాయక స్త్రీ పురుషుల్ని నిలువునా దోపిడీ చేసే ఘరానా వ్యక్తులు కూడా సమాజంలో వున్నారు. ఒకప్పుడు వరంగల్ జిల్లాలో బొట్టుస్వామి అని, కుచమర్దన స్వామీ అని, సాగినంత కాలం అమాయకుల్ని దోచుకుని, అధికారుల దృష్టిలో పడ్డ తర్వాత శ్రీకృష్ణ జన్మ స్థానానికి నెట్టబడ్డ వారూ వున్నారు. శాస్త్రీయంగా జ్యోతిష్య శాస్త్రం చదువుకున్న వారి విషయం వేరు. వాళ్ళు దానిని ఒక విజ్ఞాన శాస్త్రంగా ప్రజల ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తారు. వచ్చిన చిక్కల్లా, పొట్టకూటి కోసం పాకులాడే మాయగాళ్లతోనే!
ఇలా.. సామాన్యుడికి అందుబాటులో ఉండేది చిలక జోస్యం. ఇది చాలా కుటుంబాలలో వంశపారంపర్యంగా అబ్బి, తరతరాలుగా ప్రజలకు తెలిసిన జ్యోతిష్య విద్య. అంతా చిలుక మీద,అది తీసే కార్డు మీద ఆధారపడి ఉంటుంది. సామాన్యుల మానసిక నాడిని దృష్టిలో పెట్టుకుని ఆ కార్డులు తయారు చేసి పెట్టుకుంటారు. అందులోని అంశాలను, మనిషి మానసిక పరిస్థితికి జోడించి, అనుభవం తెలివితేటలూ కలగలిపి, కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పడం ద్వారా నమ్మకం కుదిరేట్టు చేయడమే వీరి వ్యాపార రహస్యం.
ఈ చిలక జోస్యం చెప్పేవాళ్ళు కాలనీల్లో తిరిగేవాళ్లు కొందరైతే, చాలామంది జనసమ్మర్దం వుండే ఆఫీసులు, వ్యాపార సంస్థలు, మార్కెట్లు వున్న ప్రాంతాలలో, ఏదో చెట్టు నీడ ఎంచుకుని అక్కడ తిష్ట వేస్తారు. నాకు తెలిసి, కరీంనగర్ పోలీస్ ప్రధాన కార్యాలయం నుండి, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళేదారిలో చెట్ల క్రింద వరుసగా పది పన్నెండు మంది వడ్డీ వ్యాపారస్థుల్లా కూర్చుని కష్టమర్ల కోసం ఎదురు చూడ్డం ఈ ఆధునిక కాలంలో కూడా మనకు కనిపించే అరుదైన దృశ్యం. అది వారి జీవన భృతికోసం, కొనసాగిస్తున్న బ్రతుకు అంతే! ప్రజల నుండి డిమాండు ఉంది కనుక అంతమంది అక్కడ ఉదయం నుండి సాయంత్రం వరకూ అక్కడ కూర్చోగలుగుతున్నారు. గ్రామాల నుండి రకరకాల పనుల మీద వచ్చే జనం వీళ్ళను కూడా దర్శించుకుని వెళుతుంటారు. ఈ వ్యాపారం చాలాకాలంగా అక్కడ మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లుతోంది. దసరాకు కూడా ఈ పాలపిట్టలను ఉపయోగిస్తారేమో తెలీదు! బ్రతుకు తెరువుకు మాత్రం ఈ పాలపిట్టలను ఉపయోగిస్తున్నారన్నది మాత్రం సత్య దూరం కాదు.
ఇక నా అనుభవానికి సంబంధించి,రెండు ముచ్చట్లు సెలవిస్తాను. మొదటిది హైదరాబాద్ లోనిది. మా అన్నయ్య హైదరాబాద్, మాసాబ్‌ట్యాంక్ దగ్గర వున్నప్పుడు, నేను వారితోనే వుంటూ బి.ఎస్.సి.లో చేరాను. మా డిగ్రీ కాలేజీ చింతలబస్తీలో ఉండేది. రోజూ మాసాబ్‌ట్యాంక్ నుండి చింతలబస్తీకి నడుచుకుంటూ వెళ్ళేవాడిని. మాసాబ్‌ట్యాంక్ జంక్షన్ దగ్గర, ఎడం వైపు రోడ్డు శాంతినగర్‌కు పోతుంది. అక్కడ కుడివైపు గవర్నమెంట్ పాలిటెక్నీక్ హాస్టల్ ఉండేది. ఎప్పుడూ విద్యార్థులతో ఆ ప్రాంతం కళకళ లాడుతుండేది. ఇప్పుడు మాదిరిగా అప్పటికి ఇంకా ఫ్లై ఓవర్‌ల హడావిడి లేదు. అందుచేత ఫుట్‌పాత్‌ల మీద బిక్షగాళ్లతో పాటు,అక్కడక్కడా చిలక జ్యోస్యం వాళ్ళు కూర్చుని తమ అదృష్టం పరీక్షించుకునేవారు. ఎక్కువ విద్యార్థీ విద్యార్థినులు ఆసక్తిగా కొందరూ, సరదాగా కొందరూ, వేళాకోళంగా కొందరూ, కాసేపు వాళ్ళ దగ్గర కాలక్షేపం చేసేవారు. మామూలు జనంతో ఉన్నంత స్వేచ్ఛగా, విద్యార్థులతో వుండలేకపోయేవారు. వాళ్ళ చిలిపి చేష్టలు, అల్లరి పనులు ఈ చిలక జ్యోస్యులకు కాస్త ఇబ్బందికరంగా ఉండేది.
ఒక రోజు శనివారం సాయంత్రం కాలేజీ నుండి తిరిగి వస్తూ పాలిటెక్నిక్ హాస్టల్ ఎదురుగా, ఫుట్‌పాత్ మీద కుర్రాళ్ళ గుంపు కనపడింది. అక్కడ ఏమి జరుగుతుందో చూద్దామని నేనూ ఆ గుంపులో కలిసాను. ఆ గుంపు మధ్య ఒక చిలక జ్యోస్యగాడు వున్నాడు.
అందరూ ఆట పట్టిస్తూ చిలిపి ప్రశ్నలతో అతగాడిని ఆట పట్టిస్తున్నారు. కొందరు తోచినంత చిలక పంజరంలో వేస్తున్నారు. కొందరు ఏమీ ఇవ్వడం లేదు. అతనికి మాత్రం చెమటలు పుట్టిస్తున్నారు. అతను అక్కడినుండి ఏమాత్రం కదిలే పరిస్థితి లేదు. ఏదో యాంత్రికంగా చిలకను అడ్డం పెట్టుకుని తోచింది చెప్పేస్తున్నాడు. వాళ్ళు ఇచ్చిందేదో తీసుకుంటున్నాడు. ఇవ్వకపోయినా పెద్దగా పట్టించుకోవడంలేదు, అంతా కుర్రాళ్లతో గొడవ అవుతుందని.
అయితే, అనుకున్నట్టుగానే ఒక సన్నివేశం అక్కడ ఆకట్టుకుంది. అక్కడ వున్నవాళ్లు నివ్వెరపోయేట్లు, జ్యోతిష్కుడు బెదిరిపోయేట్టు, అక్కడ సన్నివేశం మారిపోయింది. గుంపులోకి ఇద్దరు కుర్రాళ్ళు దూరారు. వాళ్ళ ముఖాలు చూస్తే, జాతకం చెప్పించుకోడానికి వచ్చిన వాళ్ళలా లేరు. ఒకడి చేతిలో లావుపాటి దుడ్డుకర్ర వుంది.
“అన్నా… మా దోస్తుకి, జరగబోయే సంగతులు చెప్పాలే..” అన్నాడు ఒకడు.
“అలాగే చెబుతా.. తమ్మీ, రా..కూర్చో” అని దుడ్డుకర్ర చేతిలోవున్న అబ్బాయిని పిలిచి ఎదురుగా, కూర్చోబెట్టుకుని, అతని పద్ధతిలో చిలకను బయటకు రప్పించి తన దగ్గర వున్న కార్డుల ముందు నిలబెట్టాడు. రామచిలుక వయ్యారంగా నడుస్తూ ఏవో శబ్దాలు చేస్తూ ఒక కార్డు తీసి అతని ముందు పడేసింది. ఇక ఆ కార్డు చూసుకుంటూ చెప్పడం మొదలు పెట్టాడు జ్యోతిష్కుడు.
“అన్నా.. అవన్నీ నాకు వద్దు కానీ.. నీకు ఎవరూ ఇవ్వనన్ని డబ్బులు ఇస్తా.. ఒక ముచ్చట చెప్పరాదూ..!!” అన్నాడు కుర్రాడు.
“అడుగు బాబూ..!” అన్నాడు ఆ చిలక జ్యోతిష్కుడు.
“జరగబోయే సంగతులు బాగా చెబుతావ్ కదా! ఈ దుడ్డు కర్రతో నీ నెత్తి మీద గట్టిగా దెబ్బ వేస్తానో లేదో చెప్పు” అన్నాడు, దుడ్డు కర్ర అతని నెత్తి వైపు మోహరించి.
“బాబూ..” అని అరిచాడు ఒక్కసారిగా, దిక్కులు పిక్కటిల్లేలా. అతను ఎప్పుడూ ఎదురుకాని ఈ భయంకర సంఘటనకు వణికిపోతున్నాడు.
భయంతోనే ఇలా అన్నాడు – “బాబూ.. పొట్ట కూటికోసం ఇదంతా, మీకు తెలియనిది ఏముంది? మా కుటుంబాలలో తరతరాలుగా వస్తున్న వృత్తి ఇది. మీరు కూడా ఇలా బెదరగొట్టేస్తే ఎలా? మా బ్రతుకులు ఎలా కడదేర్చుకోవాలి చెప్పండి?” అని రెండు చేతులు జోడించి, అక్కడి నుండి కదిలిపోవడానికి తన సరంజామా సర్దుకోవడం మొదలు పెట్టాడు.
“చూడన్నా.. మేము నిన్ను భయపెట్టి మేము సాధించేదేమీ లేదు, కానీ నువ్వు ఆరోగ్యంగా వున్నావు, మంచి వయసులో వున్నావు, ఏదైనా కష్టపడి సంపాదించుకునే బ్రతుకు తెరువు చూసుకో.. అంతే గానీ ఈ ఆధునిక యుగంలో కూడా నువ్వు ఉన్నవీ లేనివీ కల్పించి, జనాన్ని ముఖ్యంగా యువతరాన్ని భయబ్రాంతులకు గురి చేస్తున్నావు. అది తగదు. ఇంకెప్పుడూ ఈ పరిసర ప్రాంతాల్లో కనిపించకు” అని, ఒక వంద రూపాయల నోటు అతని చేతిలో పెట్టాడు.
అంతే.. క్షణాల్లో బైక్ స్టార్ట్ చేసుకుని చిలక జ్యోస్యగాడు వేగంగా పలాయనం చిత్తగించాడు. తర్వాత ఎప్పుడూ ఆ ప్రాంతంలో చిలక జోస్యగాళ్ళు కనపడ్డ సందర్భాలు లేవు!
తర్వాత కరీంనగర్‌లో పని చేస్తున్నప్పుడు, ఒకే చోట పదిమందికి పైగా చెట్ల క్రింద కూర్చుని ఉండడం చూసాను. గ్రామాల నుండి కరీంనగర్‌కు ఏదో పనిమీద వచ్చి,ఈ చిలక జ్యోస్యం కూడా చెప్పించుకునే వెళ్లే అలవాటును నేను గమనించాను. అందరూ బిజీగా ఉండేవారు. పైగా వీరి అడ్డా పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వెనుక ఉండడం కొసమెరుపు!
(మళ్ళీ కలుద్దాం)