జ్ఞాపకాల పందిరి-23

84
2

[box type=’note’ fontsize=’16’] “కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే…!!”అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్. [/box]

నన్ను పెళ్లి చేసుకోరూ..!!

[dropcap]చి[/dropcap]న్నప్పటి సినిమా పాట ఒకటి ఎప్పటికీ గుర్తుకొస్తుంటుంది. అది విద్యావంతులైన వారు అందరికీ అన్వయిస్తుంది. కనుక అందరూ ఆ పాట వినగానే, ఆలోచనలు కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోతాయి. మధుర స్మృతులైతే కాసేపు ఆనందించేదిగా ఉంటాయి, లేదంటే ఒకసారి బాధపడతాము, ఎందుకు గుర్తు తెచ్చుకున్నామా అని చింతిస్తాము. ఇంతకీ.. ఆ పాట ఏదో చెప్పలేదు కదూ.. చెప్పాలి, చెప్పకపోతే ముందు రాబోయే కథకు అర్థం ఉండదు! అందుకే చెప్పక తప్పదు.

“భలే.. భలే.. మంచిరోజులులే,
మళ్ళీ.. మళ్ళీ.. ఇక రావులే..
స్టూడెంట్ లైఫే సౌఖ్యములే..
చీకూ.. చింత కు దూరములే..!’’

ఎంత బాగా రాసాడు ఈ సినిమా కవి? నిజంగా ఆ రోజులు ఎంత గొప్పవి, ఎంత స్వేచ్ఛ.. ఎన్ని సరదాలు.. ఎన్ని అల్లరి పనులు! గుర్తు తెచ్చుకుంటే, అదో ఆనందం. అదో గొప్ప అనుభూతి! ఎన్ని అనుభవాలు, ఎన్నెన్ని వింత ఆలోచనలు! ఎంత గొప్ప కాలం అది!

పదో తరగతి వరకూ పల్లెటూరులోనో, తాలూకా స్థాయిలోనే పని జరిగిపోతుంది. ఇంటర్మీడియెట్ అనేటప్పటికీ తాలూకా/జిల్లా స్థాయి కళాశాలలతో సరిపెట్టేసుకోవచ్చు. వృత్తి విద్యా కోర్సుల విషయం వచ్చేసరికి రాష్ట్ర రాజదానిలోనో, ప్రధాన పట్నంలోనో ఇలాంటి కళాశాలలు ఉంటాయి.

నగరాల్లో-పట్టణాల్లో చిన్నప్పటినుండి పెరిగి అక్కడే చదువుకున్నవాళ్ళకి పెద్ద ఇబ్బందులు వుండవు గానీ, పల్లె వాతావరణం నేపథ్యంగా వచ్చిన విద్యార్థులకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఈ మిశ్రమ జీవన శైలి, కొందరిని ఇరకాటంలో పడేస్తుంది. భాష ఒకటి పెద్ద అడ్డుగోడగా నిలుస్తుంది.

ఆడపిల్లలు గానీ, మగపిల్లలు గానీ ఒకరితో ఒకరు మాట్లాడడానికి సిగ్గుపడడమో, బెరుకుగా ఉండడమో చేస్తారు. అంతమాత్రమే కాదు కొందరు ఆడపిల్లల వెంట పడతారు. మూగ జీవులుగా వుండేవాళ్ళు కొందరైతే, మానసికంగా కృంగిపోయేవాళ్లు కొందరు. ప్రేమలో పడేవాళ్ళు కొందరూ, ప్రేమ అనుకుని మోసపోయేవాళ్లు కొందరు! ఇలా రకరకాల కొత్త అంశాలు చేరి చదువును అశ్రద్ధ చేసినవాళ్ళూ వున్నారు. అందుకనే ఆ రోజులు మంచికైనా చెడ్డకైనా గుర్తుకు వస్తే, సంఘటనలు గుర్తుకు వస్తే మనసు అదోలా అయిపోతుంది. ఇక రాజకీయాలతో ముడి పెట్టుకున్న వాళ్ళు, వాళ్ళ జీవితం మరో పార్శ్వం. రాజకీయాల్లో తిరిగి ఆ పైన ఉన్నత స్థానాలను అధిష్టించిన వారూ వున్నారు, భ్రష్టుపట్టిపోయినవాళ్ళూ వున్నారు, ప్రాణాలను కోల్పోయినవాళ్ళూ వున్నారు. ఇలా కాలేజీ జీవితం ప్రతి ఒక్కరిమీద ఏదో ఒక ముద్ర వేస్తుంది. ఒకప్పుడు కాలేజీ జీవితం తర్వాత, కలుసుకునే అవకాశాలు బహు తక్కువగా ఉండేవి. ఉద్యోగ రీత్యానో, వ్యాపార రీత్యానో, ఎక్కడెక్కడో స్థిరనివాసం ఏర్పరచుకున్నవాళ్ళు కలవడం అంటూ జరిగేది కాదు. మహా అయితే ఉత్తరాలు, ట్రంకాల్‌లు మిత్రులను కలుపుతుండేవి. కానీ ఇప్పటి పరిస్థితులు వేరు. ప్రపంచంలో ఎక్కడవున్నా, ఒకరినొకరు చూసుకుంటూ రోజూ పైసా ఖర్చు లేకుండా మాట్లాడుకునే పరిస్థితులు వచ్చేసాయి. పాత విద్యార్థులంతా ‘స్టూడెంట్ అల్యూమిని’గా ఏర్పడి, ‘గెట్ టు గెదర్’ లు ఏర్పాటు చేసుకునే సంస్కృతీ, వెసులుబాటూ వచ్చేసింది.

ఇంత ఉపోద్ఘాతం వెనుక నా అనుభవాలను కూడా చెప్పాలన్న ఉబలాటమే ఈ చిరు వ్యాసానికి ప్రేరణ. నా అనుభవం చెప్పకుండా ఎన్ని ఉదంతాలు చెప్పినా కావాలని కథలు అల్లినట్టుగానే ఉంటుంది. అందుచేత నా అనుభవం ఈ వ్యాసానికి నిండుదనం తప్పక ఇస్తుందన్నది నా ప్రగాఢ విశ్వాసం.

అవి నేను బి.డి.ఎస్. చదూతున్న రోజులు. సహాధ్యాయులైన ఆడపిల్లలతో సైతం అంత చనువు ఏర్పడని కాలం. ఈ నేపథ్యంలో జూనియర్లు సీనియర్లతో చనువుగా వుండే అవకాశం లేదు. అయితే మా ప్రొస్తోడాంటిక్స్ ప్రొఫెసర్ బి. శ్రీరామమూర్తి గారి ప్రోత్సాహంతో, మార్గదర్శనంతో నాగార్జున సాగర్ పిక్నిక్ ప్రోగ్రామ్ వేసాం. ఆయన ఇలాంటి కార్యక్రమాలకు మంచి ప్రోత్సాహం ఇచ్చేవారు. ముఖ్యంగా సాంస్కృతిక కార్యక్రమాలు డెంటల్ వింగ్ (తర్వాత డెంటల్ కాలేజీ అయింది)లో జరపడానికి ఆయన అత్యుత్సాహం చూపించేవారు. మెడికల్ ఎగ్జిబిషన్ ఉస్మానియా మెడికల్ కాలేజీలో జరిగినప్పుడల్లా, దంత వైద్య విభాగం పక్షాన డా. శ్రీరామమూర్తి గారి మార్గదర్శనంలోనే జరిగేవి. ఉస్మానియా మెడికల్ కళాశాల స్టూడెంట్ బస్ ఉండేది. ఖాన్ అనే డ్రైవర్ ఆ బస్సు నడిపేవాడు. అతనిది అంతా నవాబు దర్జా! అతనిని ‘ఖాన్ సాబ్’ అని మాత్రమే పిలవాలి. అతనికి నచ్చనిది ఎవరు చెప్పినా వినేవాడు కాదు.

అతను కాలేజీ బస్సుతో సాగర్ రావడానికి ఒప్పుకున్నాడు. ఈ విహార యాత్రకు స్టూడెంట్స్ అందరూ రాకపోయినా, మొత్తం మీద సీనియర్లు – జూనియర్లు చాలా మంది వచ్చారు. అందులో మగపిల్లలూ -ఆడపిల్లలూ కూడా వున్నారు. అసలు చాలామంది ఆడపిల్లలు ఉన్నందుకే చాలా మంది మగ పిల్లలు కూడా వచ్చారు. అప్పటికే చాలామంది స్నేహితులైన జంటలు వున్నాయి. వాళ్ళు తప్పక ఇలాంటి కార్యక్రమాలు మిస్ కారు.

నిజానికి, నేను ఆ ప్రయాణానికి, తదితర ఖర్చులకు, అవసరమైన డబ్బు ఖర్చు పెట్టే స్థితిలో లేను. నాకు ప్రభుత్వ పక్షాన స్కాలర్‌షిప్ వచ్చేది. కానీ, అది మెస్ బిల్‌కు, చిన్న చిన్న అవసరాలకు సరిపోతుండేది. అప్పుడప్పుడు నాగార్జున సాగర్‌లో పనిచేస్తున్న పెద్దక్క స్వర్గీయ కానేటి మహానీయమ్మ నాకు పాకెట్ మనీ పంపుతుండేది. అలా నేను ఈ విహార యాత్రకు ప్లాన్ చేసుకోగలిగాను. పైగా నా సీనియర్లు డా. వాసిరెడ్డి కిశోర్ కుమార్ (అమెరికాలో సెటిల్ అయ్యాడు), డా. రామ చంద్రారెడ్డి (గోవాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు), డా. పార్థసారథి (ఏలూరులో సెటిల్ అయ్యాడు), డా. చింగ్ చాంగ్ (విజయవాడలో సెటిల్ అయ్యాడు), నా సహాధ్యాయి డా. పాలేశ్వరన్ రాజా (మలేషియా) వంటి వారి అధిక ప్రోత్సాహంతో నేను కూడా సిద్ధపడ్డాను. అప్పటికి ఆడపిల్లలతో సహా అందరితో స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితి రాలేదు. కొంత ఈ స్నేహాలకు దూరంగానే ఉండేవాడిని. రచనా వ్యాసంగం మాత్రం కాస్త చురుగ్గానే సాగుతుండేది. ఆ ప్రవృత్తి నన్ను చాలామందికి ఇష్టుడిని చేసింది. అసలు చదువుతో పాటు,ఇతర అంశాలలో ఆసక్తి చూపించే వారిపై, ముఖ్యంగా సాహిత్యం, సంగీతం, క్రీడలు… ఆసక్తి వున్న వారిపై ప్రత్యేక గౌరవం చూపించేవారు. ఇక చదువులో చురుగ్గా ఉండేవారి విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వాళ్లకి ప్రత్యేక గౌరవం లభించేది.

అనుకున్న రోజు రానే వచ్చింది. ఉదయం బస్సు ఉస్మానియా మెడికల్ కళాశాల ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద పార్క్ చేయబడి వుంది. ఒక్కొక్కరే వచ్చి బస్సులో తమకు అనుకూలమైన సీటు ఆక్రమించుకుంటున్నారు. కొందరు కర్చీఫ్‌లు వేసి తమకు ఇష్టమైన వారికోసం సీట్లు పెట్టారు. నేను వెళ్లేసరికి ఇంచుమించు బస్సు అంతా నిండిపోయింది. పాటలు పాడేవాళ్లూ, కాస్త సందడి చేసేవాళ్ళూ వెనుక సీట్లలో సర్దుకున్నారు. మధ్యలో అక్కడక్కడా ఖాళీలున్నాయి. కానీ ఆ ధ్వని కాలుష్యం నేను భరించలేను!

అందుకే మరో ప్రత్యామ్నాయం కోసం నా కళ్ళు వెతికాయి. నా అదృష్టం కొద్దీ డ్రైవర్‌కు ఎడం పక్క డోర్ దగ్గర మొదటి సీట్లో ఒక ఖాళీ కనిపించింది. ఇద్దరు కూర్చునే సీట్ అది. కిటికీ వైపు సీట్లో ఒక అమ్మాయి కూర్చొని వుంది. జూనియర్ అనుకుంటాను, అప్పటివరకూ ఆ అమ్మాయిని చూడలేదు. ‘ఇంకా ఎవరైనా ఉన్నారా?’ అన్నట్టు సైగ చేసాను. ఖాళీగానే వున్నట్టు, పక్కకు ఒత్తిగిల్లి జరిగింది. నా దగ్గర వున్న చిన్ని బేగ్ కాళ్ళ దగ్గర పెట్టుకుని, జాగ్రత్తగా ఆ అమ్మాయికి ఏమాత్రం తగలకుండా సర్దుకుని కూర్చుని బ్రతుకు జీవుడా! అనుకున్నాను. అది అమ్మాయి పక్క సీటు దొరికినందుకు కాదు, అల్లరికి దూరంగా, ముందు సీటులో చోటు దక్కినందుకు.

చిత్రం: అక్బర్

అమ్మాయి పెద్ద అందంగా లేకపోయినా, ఆకర్షణీయంగా వుంది. ఏదో ఉన్నత కుటుంబం నుండి వచ్చినట్టు కనిపిస్తోంది, ఆమె కట్టూ బొట్టూ వగైరాను బట్టి. నాకు అయితే ముందుకీ, లేదంటే డ్రైవర్ వైపు, అప్పుడప్పుడూ వెనక్కి తిరిగి మిగతా వారిని చూడ్డం తప్ప మరేమీ చేయబుద్ది కావడం లేదు. ఆ అమ్మాయి ఏమి చేస్తుందో నేను గమనించడం లేదు. బస్సు బయలుదేరి చాలా సేపు అయింది. వెనుక రకరకాల పాటలు మొదలు అయ్యాయి. అరుపులు, కేకలు, అల్లరి స్థాయి ఊపు అందుకుంది. కొందరు ఎప్పుడూ నిద్రపోనట్టు, కునకడం మొదలు పెట్టారు. మరికొందరు ముచ్చట్లలో మునిగిపోయారు. ప్రొఫెసర్లు ఈ కలగూరగంప సాంస్కృతిక జల్లులో ఆనందంగా తడిసిపోతున్నారు. నా చూపు ముందు రోడ్డువైపు వుంది. ఈ లోపు అనుకోని రీతిలో నా ఒడిలో ఏదో బరువు వున్న ఫీలింగ్ కలిగి పక్కకు చూసాను. ఆశ్చర్యమూ, భయమూ కలిగాయి. నా వంక ఎవరైనా చూస్తున్నారేమో అని వెనక్కి తిరిగి చూసాను. అదృష్టవశాత్తు, ఎవరి గొడవల్లో వాళ్ళు వున్నారు. నాకు కొద్దిగా వణుకు కూడా మొదలయింది. ఆ అమ్మాయి క్రమంగా నా ఒళ్లోకి వొరిగిపోతుంది. ఏమంటే ఏమౌతుందో అన్న శంక! ఆమె మంచి నిద్రలో వుంది. నిశ్చింతగా అమ్మ ఒడిలో నిద్రపోతున్నంత హాయిగా నిద్రపోతోంది. నేను ఏమీ చేసే స్థితిలో లేను. నా భయం నాది! ఎవరన్నా చూస్తున్నారేమో, మా ఇద్దరికీ ముందునుంచే పరిచయం ఉందేమో అనుకుంటారన్నది నా భయం!! మెడనొప్పి పుట్టేలా అస్తమానం అటూ ఇటూ చూడడమే. బస్సు మల్లేపల్లికి చేరేముందు ఉలిక్కిపడి లేచింది ఆ అమ్మాయి. ఆమె కూడా కొంత టెన్షన్ ఫీల్ అయినట్టు ఆమె ముఖ కవళికలు చెడుతున్నాయి. “సారీ.. అండీ!” అని ఓ డజను సార్లు చెప్పి ఉంటుంది.

అయితే ఇతర మిత్రులు మా వ్యవహారం చూశారేమో అన్న ఆందోళన ఆమెలో ఏమాత్రం కనిపించలేదు. అడపా దడపా ఏవో కబుర్లు చెబుతోంది. మాటల్లో ఆమె పేరు ‘గీత’ (పేరు మార్చడం జరిగింది) అని తెలిసింది. నా గురించి కూడా కొంత సమాచారం తెలుసుకుంది. మెల్లగా మాటల్లో పడ్డాం, ఈ లోగా మల్లేపల్లి వచ్చింది. అక్కడకాసేపు ఆగి టీ, స్నాక్స్ ముగించాం. బస్సు బయలుదేరి గంట సమయంలో హిల్ కాలనీకి చేరుకున్నాం. అక్కడ అప్పుడు ‘విజయ విహార్’ గెస్ట్ హౌస్ ఫేమస్. అక్కడ దిగి ఫ్రెష్ అయి నాగార్జున సాగర్ చూడ్డానికి వెళ్లాం. గీత నన్ను విడిచి పెట్టలేదు. నేను ఎటు వెళితే అటు వచ్చేది. కేవలం ఆమె గురించి నేను ఫ్రెండ్స్‌ను వదలి గీతకు కంపెనీ ఇచ్చేవాడిని. అప్పటికే గూఢచారుల్లాంటి నా మిత్రులు మా ఇద్దరి గురించి గుసగుసలు మొదలుపెట్టారు. అలా అక్కడ గడిపిన కాలం చాలా బాగా గడిచిపోయింది. తిరుగు ప్రయాణంలో గీత మరింత దగ్గరయింది. కాలేజీలో, గ్రంథాలయంలో కలిసేది. వైవా పరీక్షలప్పుడు నాకు తినడానికి ఏదో ఒకటి తెచ్చేది.

నాకు తెలీకుండానే ఆమె నాగురించి చాలా ఆశలు పెంచుకుంది. నేను అది అంతగా గమనించలేదు, కానీ.. ఒక రోజున లైబ్రరీలో తన మనసులోని మాట చెప్పేసింది. అదురు బెదురూ ఏమాత్రం లేకుండా.

“నన్నుపెళ్లి చేసుకోరూ..!” అంది.

చిత్రం: మాధవ్

నాకు, ఏమి చెప్పాలో అసలు అర్థం కాలేదు. అసలు ముందు నా మనస్సులో అలాంటి భావన లేదు ఆమె పట్ల. పైగా సామాజిక పరంగా ప్రజల దృష్టిలో ఆమె నాకంటే ఉన్నత కులస్థురాలు. వాళ్ళ నాన్న ఒక మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్, అందమైన చెల్లెలు, చదువుకుంటున్న తమ్ముడు. ఆర్థికపరంగా చాలా ఉన్నత స్థాయిలో వున్నవాళ్లు. పైగా రాజకీయంగా, కాంగ్రెస్ పార్టీలో మంచి పరపతి వున్నవాళ్ళూనూ. ఈ నేపథ్యంలో నా వల్ల, తనకే నష్టం ఎక్కువ అని చెప్పాను. అయినా ఆమె సాహసం చేయడానికే సిద్దపడింది. చాలా వారించాను, నచ్చచెప్పాను, మొండి పట్టు పట్టింది, నన్ను తనకు వచ్చిన రీతిలో శాపనార్ధాలు కూడా పెట్టింది. నిజానికి ఆమె ముందు నేనే ఓడిపోయాను.

ఈలోగా నా హౌస్ సర్జన్సీ పూర్తికావడం, నాకు సింగరేణీ కాలరీస్ హాస్పిటల్‌లో బెల్లంపల్లిలో (ఆచార్య పి.రామచంద్రారెడ్డి గారి ఆశీస్సులతో) ఉద్యోగం రావడం, ఆరునెలల తర్వాత ఆంధ్రప్రదేశ్ సర్వీస్ కమీషన్ ద్వారా మహబుబాబాద్ ఆసుపత్రిలో ఉద్యోగం రావడం జరిగి పోయాయి. చాలాకాలం వరకూ గీత విషయాలు నా దృష్టికి రాలేదు. గీత ఒక డాక్టరును పెళ్లి చేసుకుని ఇతర రాష్ట్రంలో సెటిల్ అయిందనీ, బామ్మ కూడా అయిందనీ ఈమధ్యనే తెలిసింది. గీత దృష్టిలోనూ, పాఠకుల దృష్టిలోనూ నేను చెడ్డవాడిగా కనిపించవచ్చు, అయినా ఆమె భవిష్యత్తును, కుటుంబ గౌరవాన్నీ దృష్టిలో ఉంచుకుని నేను మంచి పనే చేశానని నామటుకు నాకు ఇప్పటికీ అనిపిస్తుంది.

ప్రేమ కథలు అన్నీపెళ్లి వరకూ కొనసాగేవేమో..!!

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here