జ్ఞాపకాల పందిరి-24

70
2

[box type=’note’ fontsize=’16’] “కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే…!!”అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్. [/box]

మా వాడిని ఫెయిల్ చేయండి..!!

[dropcap]పి[/dropcap]ల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ చదువు మీదకు మళ్లుతుంది తల్లిదండ్రుల ఆలోచన! అది కూడా చదివించాలనుకునే తల్లిదండ్రులకు. గ్రామాలలో చదువుకునేవారికి, వారి తల్లిదండ్రులకూ ఇది పెద్ద సవాలే. ఇప్పటి పరిస్థితి చెప్పలేముగానీ ఒకప్పుడు అరవై ఏళ్ళక్రితం మాట, ప్రతి పెద్ద గ్రామంలోనూ ఒక ప్రాథమిక పాఠశాల ఉండేది. అందుచేత తప్పక పిల్లలని బడిలో చేర్పించే సంప్రదాయం ఉండేది. గ్రామంలోనే బడి ఉంటుంది కనుక ఇతరత్రా ఇబ్బంది పడవలసిన అవసరం ఉండేది కాదు. వ్యవసాయ కూలీలు సైతం, తాము పనికి వెళ్లినా పిల్లలని తప్పక బడిలో వేసేవారు. చదువుతో పాటు పిల్లలికి రక్షణగా కూడా పాఠశాలలు ఉండేవి. అప్పుడూ మధ్యాహ్న భోజన వసతులు ఉండేవి కనుక, పిల్లలు సాయంత్రం వరకూ బడిలో సురక్షితంగా ఉండేవారు. అందుచేత పిల్లల గురించిన బెంగ పెద్దవాళ్ళకి ఉండేది కాదు. చదువు మీద అవగాహన, ఆసక్తి లేని తల్లిదండ్రులు చదువుకు పెద్దగా ప్రాధాన్యత నిచ్చేవారు కాదు. పాఠశాలల్లో పనిచేసే అప్పటి ఉపాధ్యాయులు కూడా పూర్తి బాధ్యతాయుతంగా పనిచేసేవారు. ఎక్కువశాతం మంది గ్రామాల్లోనే నివసించేవారు. క్రమశిక్షణ ప్రధానంగా బడిలో పిల్లలకు విద్యాబోధన జరిగేది. గ్రామస్థులకు అవసరమైన వ్యవసాయ/ఆరోగ్య సంబంధమైన సూచనలు సలహాలూ కూడా ఉపాధ్యాయుల నుండి,గ్రామస్థులకు అందేవి. అందుచేత బడిలో పనిచేసే ఉపాధ్యాయులకూ -గ్రామస్తులకూ ఒక దగ్గరితనం ఉండేది. ఉపాధ్యాయులకు గొప్ప గౌరవ మర్యాదలు లభించేవి. అదేవిధంగా తమ పొలాల్లో పండించిన పండ్లు, కూరగాయలూ, పాడి అందుబాటులో వున్నవారు, పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి ఇవ్వడం ఆనవాయితీగా ఉండేది.

అందుచేత ఉపాధ్యాయులు కూడా, పిల్లల చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడమే గాక, గ్రామ పెద్దలపట్ల వినయవిధేయతలతో, మర్యాదగా మెలిగేవారు. దానికి తగ్గట్టుగానే ఊరిపెద్దలు ఉపాధ్యాయులను గౌరవించేవారు. ఇలా ప్రాథమిక పాఠశాలలో చదువు వరకు చాలా మట్టుకు హాయిగా నడిచిపోతుండేది. అయితే అసలు సమస్య ప్రాథమిక విద్య తరువాత, ఉన్నత పాఠశాల విద్య విషయంలో చిక్కులు వచ్చి పడేవి. దానికి కారణం, ఉన్నత పాఠశాలలు, వూరికి దూరంగా ఎక్కడో తాలూకా స్థాయిలో ఉండేవి. దూరం పంపించడానికి అందరూ ఇష్టపడేవారు కాదు. పైగా కొందరి ఆర్థిక పరిస్థితి కూడా సహకరించేట్టుగా ఉండేది కాదు. అందువల్ల చదువుకునే వాళ్ళ శాతం ఆ స్థాయిలో తగ్గిపోయేది. దీనికి ఎక్కువగా ఆడపిల్లలు బలి పశువులుగా మారేవారు. ఆడపిల్లల చదువు నిష్పత్తి పడిపోయేది. అంత దూరం ఆడపిల్లను బడికి పంపాలంటే భయపడేవారు. ప్రభుత్వ నిధులతో ప్రయివేటు వసతి గృహాలు అందుబాటులోనికి వచ్చాక గ్రామాలనుంచి వెళ్లి చదువుకునేవారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది.

ఈ నేపథ్యంలో పెద్దన్నయ్య, పెద్దక్క, చిన్నన్న, చిన్నక్క పై చదువుల కోసం ఇల్లు విడిచి వెళ్లిపోవడం వల్ల, నేను ఒక్కడినే ఇంట్లో ఉండేవాడిని. తర్వాత నేను కూడా అలానే వెళ్ళిపోతానన్న బాధ నా తల్లిదండ్రులకు ఉండేదేమో, ముఖ్యంగా మా నాయనకు, నాకు తెలీదు.

మా వూరు దిండిలో వున్న ప్రాథమిక పాఠశాలలో ఒకటవ తరగతిలో చేరడం నాకు బాగా గుర్తుంది. మా ఇంటికి అయిదారు ఇళ్ల దూరంలో ఈ బడి ఉండేది. పొడవుగా ఒక హాలు, హాలు చివర ఒక గది ఉండేది. బడి అయిపోగానే, కుర్చీలు, బల్లలు, నల్ల బల్లలు, పిల్లలు తినే ప్లేట్లు ఆ గదిలో పెట్టి తాళం వేసేవారు. ఆ పని పెద్ద క్లాసు (ఐదో తరగతి) పిల్లల చేత చేయించేవారు. నాకు తెలిసేటప్పటికే ఆ బడిలో ముగ్గురు ఉపాధ్యాయులు ఉండేవారు. బడి చుట్టుతా ఖాళీ ప్రదేశం ఉండేది. అందులో కొంత భాగం ఆడు కోవడానికి, మరికొంత స్థలం మొక్కలు పెంచడానికి ఉపయోగించేవారు. ప్రత్యేకంగా ‘తోట పని’ అని ఒక పిరియడ్ ఉండేది. అప్పుడు మొక్కలు పాతడం, పెంచడం వంటి పనులు చేయించేవారు. మధ్యాహ్న భోజన పథకం ఉండేది. లంచ్ బెల్ కాగానే దళితేతరులు ఇళ్లకు పోయి భోజనం చేసి వచ్చేవారు. అప్పట్లో మధ్యాహ్న భోజనం కాంట్రాక్టు, నాకు పెద్దమ్మ (పెద్ది)వరస గలావిడ కానేటి లక్ష్మమ్మకు ఉండేది. ఆవిడ ఎవరో కాదు, మొదటి పార్లమెంటుకు, రాజమండ్రి నియోజక వర్గం నుండి ప్రాతినిధ్యం వహించిన, స్వర్గీయ కానేటి మోహన్ రావు గారి తల్లి. అప్పట్లో ఆకలి తీర్చుకోవడం తప్ప రుచి గురించి ఆలోచించే పరిస్థితి కాదు.

ఈ నేపథ్యంలో, నేను బడిలో మొదటి తరగతిలో చేరే సమయానికి ప్రధానోపాధ్యాయులుగా సీతయ్య మాస్టారు (ఇంటి పేరు గుర్తులేదు) ఉండేవారు. ఆయన ప్రక్క వూరు శివకోడు నుండి సైకిలు మీద వచ్చేవారు. ఆయన క్రమశిక్షణకు మారు పేరు. అందరూ ఆయనకు భయపడేవారు. తప్పుచేస్తే, ఆయన విధించే శిక్షలు గమ్మత్తుగా ఉండేవి. జీవితంలో మళ్ళీ అలాంటి తప్పు చేసే పరిస్థితి ఉండేది కాదు. ఆయన ఆహార్యం చూడగానే రెండు చేతులూ ఎత్తి నమస్కరించాలనిపించేది. ఖద్దరు పంచా, లాల్చీ, భుజాన కండువా.. గొప్ప విగ్రహం. ఆయన వల్ల మా బడికి మంచి పేరు ఉండేది. నేను ఏ క్లాసులో ఉండగా ఆయన బదిలీ అయ్యారో గుర్తులేదు.

అందరికీ ఆయన అంటే ఎనలేని గౌరవం, అందుచేతనే, విద్యార్థులతో పాటు, తల్లిదండ్రులు కూడా ఆయనకు భయపడేవారు. రెండవ మాస్టారు, సమాధానం మాస్టారు. నల్లగా పొడుగ్గా ఉండేవారు. క్రమశిక్షణకు ఈయన కూడా పెద్ద పీట వేసేవారు. ఎక్కాలు ఒప్పజెప్పక పొతే చింత బరికే వడ్డింపులు తరచుగా ఉండేవి. ఆయన అంటే చాలా భయం ఉండేది. ఆయన క్లాస్ టైంలో చెమటలు పట్టేవి!

మూడవవారు లేడీ టీచర్. ఆవిడ పేరు శ్రీమతి మేరీ గ్రేస్. ఆ టీచర్ గారు ‘పెద్ద పంతులమ్మ’గా ప్రసిద్ధులు! కారణం ఏమిటంటే, సమాధానం మాస్టారు స్థానంలో మరో జూనియర్ లేడీ టీచర్ రావడం వల్ల అలా పిలిచేవారనుకుంటా. ఆవిడతో కొంచెం బంధుత్వం కూడా ఉండడంతో, ఆవిడ అంటే భయం ఉండేది కాదు. ఆ టీచర్ మా పక్క గ్రామం రామ రాజులంక నుండి ప్రతిరోజూ కాలినడకన వచ్చేవారు. రాకపోకల్లో మా ఇంటి ముందు కాసేపు ఆగి మాట్లాడుతుండేవారు. మా నాయనను, మావయ్య గారూ అని సంబోధించేవారు. పెద్ద పంతులమ్మ గారి భర్త కూడా ఉపాధ్యాయులే! కానీ.. సఖినేటి పల్లిలో పనిచేసేవారు. ఆయనకు సాంస్కృతిక నేపథ్యం ఉంది. మంచి నటులు. సినీ నటులు నాగ భూషణం గారి ప్రసిద్ధ నాటకం ‘రక్తకన్నీరు’లో గోపాలం పాత్రలో నటించడం వల్ల ఆ మాష్టారుని ‘రక్తకన్నీరు గోపాలం’  అనేవారు! ఆయన అసలు పేరు ఈద సంపద రావు.

మరో టీచర్ గారు – కేటమ్మ! ఆవిడ వస్తుంటే పేస్ పౌడర్ సుగంధ పరిమళం వెదజల్లేది, బాల్యంలో మొదటి సారి ఫారెన్ పైలెట్ పెన్ ఆవిడ దగ్గర చూసాను. బడిలో ఆవిడ కొట్టడం, తిట్టడం వంటివి చేసేవారు కాదు! కేటమ్మ టీచర్ కూడా సఖినేటి పల్లి వాసి. కానీ మా వూరు దిండిలోనే కాపురం ఉండేవారు. మా ఊరి అబ్బాయినే అల్లుడుగా చేసుకున్నట్టు గుర్తు!

ఇక అసలు విషయం, నా ఐదో తరగతి గురించి. ప్రధానోపాధ్యాయులుగా సీతయ్య మాష్టారు బదిలీ అయిన తర్వాత, ఆ స్థానంలో మరో మాస్టారు సఖినేటిపల్లి నుండి వచ్చారు. ప్రతి రోజూ అక్కడినుండి సైకిలు మీద బడికి వచ్చేవారు. కొద్దిగా ఆధునికుడిగా కనిపించేవారు. ఆయన పేరు తాడి చిట్టెయ్య. చిట్టెయ్య మాస్టారుగా ప్రసిద్ధులు. కొద్దిగా ఆధునికత సంతరించుకున్న వ్యక్తి. వూళ్ళో ఎవరు ఏమీ చెప్పినా వినేవారు, గ్రామ పెద్దలు అంటే భయపడేవాళ్లు. కారణం అప్ అండ్ డౌన్ చేయడం వల్లనేమో అని ఇప్పుడు అనిపిస్తుంది. ఐదో తరగతి అన్ని సబ్జెక్టులు ఆయనే టీచ్ చేసేవారు. ఆ రోజుల్లోనే మా చేత ‘గిరిజా గైడ్’ కొనిపించారు. మా క్లాసులో నాకు గుర్తున్నంత వరకూ, నాతో పాటు, చింతా రాజగోపాల్ (విశాఖపట్నం), చింతా మోహన్ రావు (విజయనగరం), నల్లి రాజు (విజయ నగరం), కట్టా చిట్టెయ్య (దిండి), బందిల చిట్టి బాబు (దిండి), బాపూజీ (విజయనగరం), ఏనుగుపల్లి నాగేశ్వర రావు (విశాఖ పట్నం), కానేటి మీనాక్షి (విశాఖ పట్నం), మేడిది ఆదిలక్ష్మి, నల్లి శాంత కుమారి (దిండి), గుడాల వరలక్ష్మి (ఢిల్లీ), కానేటి నాగేశ్వర రావు మొదలైన వారు చదివారు.

చిట్టెయ్య మాస్టారు మధ్యాహ్న భోజనం కాగానే కాళ్ళు టేబుల్ మీద పెట్టుకుని, వంతులవారీగా మగపిల్లల చేత కాళ్ళు పట్టించుకునేవారు. ఆ బృందంలో నేనూ వున్నాను. తర్వాత, లేత తాటి ఆకులు (మొవ్వు) రప్పించి విసనకర్రలు తయారు చేయించేవారు. చదువంతా ఆ.. గిరిజా గైడు నుంచే!

వార్షిక పరీక్షల సమయం వచ్చింది. మా నాయనకూ – చిట్టెయ్య మాష్టారుకీ ఏమి ఒప్పందం జరిగిందో తెలీదు. పరీక్షలో ఫెయిల్ అయ్యాను. పాస్ అయిన వాళ్లంతా నన్ను మించిన వాళ్ళు కాదు! ఆ రకంగా మరో సంవత్సరం నేను ఐదో తరగతి చదవ వలసి వచ్చింది. ఒక సంవత్సరం వెనుకబడితే, ఉద్యోగ విషయాల్లో ఎన్ని ప్రయోజనాలను కోల్పోతామో మా నాయన గారికి అప్పుడు తెలిసి ఉండదు. ఆయన కోరిక అదనంగా మరో సంవత్సరం వాళ్ళతో కలసి వుండడమే!

దీనివల్ల నా ఉద్యోగ సర్వీసులో ఒక సంవత్సరం తగ్గిపోయినందుకు నేను ఎప్పుడూ బాధ పడలేదు. విషయం తెలిసిన తర్వాత ఇప్పుడు, నా తల్లిదండ్రుల కోరిక ఇలా తీర్చగలిగానన్న తృప్తి నాకు మిగిలింది. నా అభివృద్ధిని చూడకుండానే స్వల్ప వ్యవధిలో ఇద్దరూ మమ్మల్ని విడిచి వెళ్లిపోయారు!

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here