Site icon Sanchika

జ్ఞాపకాల పందిరి-26

[box type=’note’ fontsize=’16’] “కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే…!!”అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్. [/box]

అలా వెళ్ళేవాళ్ళం…!!

[dropcap]ర[/dropcap]వాణా సౌకర్యాలూ, జల సంపద వున్న ప్రదేశాలు అన్ని రంగాలలోనూ అభివృద్ధి చెందుతాయి. ప్రజల కృషి, సహకారం, సర్పంచుల దృష్టి, ఆ ప్రాంతపు రాజకీయ నాయకులు, శాసన సభ్యులు, పార్లమెంట్ సభ్యుల నిత్య పరిశీలన, ఆ ప్రాంతం అభివృద్ధి చెందడానికి దోహదపడుతుంది. ఆ ప్రాంతపు మంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే, ఇక చెప్పవలసింది ఏముంది? అన్నీ సదుపాయాలూ సమకూరుతాయి.

మనకు స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా ఇంకా మారుమూల ప్రాంతపు గ్రామాలకు సరైన రవాణా సదుపాయాలూ లేవంటే ఆశ్చర్యం వేస్తుంది. దానికి ఎవరిని బాధ్యులను చేయాలి? ముందు ఆ ప్రాంతపు ప్రజలను, తర్వాత నాయకులను, పాలకులను బాధ్యులను చేయాలి. ప్రజలలో చైతన్యం రానంత కాలం, ఆయా ప్రాంతాలు ఏ రకంగానూ అభివృద్ధి చెందలేవు. ఇది జగమెరిగిన సత్యమే కదా!

జనంలో చైతన్యం రావాలంటే, నిరక్షరాస్యత పూర్తిగా సమసిపోయి, అందరూ విద్యావంతులు కావాలి. విద్యావంతులు కావాలంటే, అవసరమైనన్ని విద్యాసంస్థలు, అతి సామాన్యులకు సైతం అందుబాటులో ఉండాలి. అది ప్రతి గ్రామానికీ, పట్టణాలతో లింకు ఉండేలా, సరిపడినంత రవాణా సౌకర్యం వున్నప్పుడే సాధ్యం అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లోనే నూటికి నూరు శాతం అక్షరాస్యత సాధ్యం అవుతుంది. అది కూడా తల్లిదండ్రుల్లో ఆ జిజ్ఞాస పెరిగినప్పుడే సాధ్యం అవుతుంది.

ఇప్పటికీ కొన్ని చోట్ల కాలువలు, నదులు దాటి పిల్లలు చదువుకోవడానికి వెళ్లే పరిస్థితులు వున్నాయి. తమకు తినడానికి తిండిలేకున్నా పిల్లల్ని కష్టపడి చదివించే తల్లిదండ్రులూ వున్నారు. తల్లిదండ్రుల చేయూతను సద్వినియోగం చేసుకుని ప్రయోజకులైన పిల్లలూ వున్నారు. ఎన్ని అడ్డంకులు వున్నా ఇలాంటి వారిని ఎవరూ ఆపలేరు,అది వేరే విషయం!

అయితే,మా చిన్నప్పటి చదువుకి రవాణా సౌకర్యాలు లేక కొద్దిగా ఇబ్బంది పడ్డ వాళ్ళల్లో నేనూ ఒకడిని. అయితే  స్థానికంగా వాటిని సులభంగానే అధిగమించాను గానీ, హైదరాబాద్‌లో చదువుకుంటూ ఇంటికి వెళ్లడం, తిరిగి గ్రామం నుండి హైదరాబాద్‌కు వెళ్లడం, సరైన రవాణా సౌకర్యాలు లేక చాలా ఇబ్బంది పడేవాడిని. నేనే కాదు, నాలా దూరప్రాంతాలనుండి వచ్చివెళ్లే చాలామంది నాలానే ఇబ్బందుల పాలయ్యేవారు. ఇప్పటిలా క్యాబ్ బుక్ చేసుకునే అవకాశాలు అప్పుడు ఉండేవి కాదు. టాక్సీలు ఉండేవి. అవి సామాన్యులు భరించే స్థాయిలో వుండేవి కాదు.

నర్సాపురం-సఖినేటిపల్లి దగ్గర గోదావరి దాటుతున్న పెద్దన్నయ్య,చిన్నక్క,తదితరులు.

మా చిన్నప్పుడు మా పెద్దక్క, పెద్దన్నయ్య, భీమవరంలో డబ్ల్యు.జి.బి (వెస్ట్ గోదావరీ భీమవరం, కాలేజీ)లో చదువుకునేవారు. అక్కడ హాస్టల్ లోనే వుండి చదువుకునేవారు. సెలవులకు మాత్రం ఇంటికి (దిండి గ్రామం) వచ్చేవారు. భీమవరం నుండి నరసాపురం వరకూ బస్సులోగానీ, రైల్లో గానీ వచ్చేవారు. అక్కడి నుండి, రాజోలు వరకూ గోదావరిలో లాంచీ రవాణా సదుపాయం ఉండేది. మా ఊరి తిన్నగా లంకలు దగ్గరగా గోదావరి వడ్డున లాంచీ ఆగేది. ఆ సమయానికి లాంచీ రేవు దగ్గరికి వెళ్ళేవాళ్ళం. ట్రంకు పెట్టె, బెడ్డింగు లగేజి ఉండేవి. అవి మోసుకుని కొంత దూరం నడిస్తే  తప్ప మా ఇల్లు వచ్చేది కాదు! మాకు ప్రయాణాల వయసు వచ్చేసరికి, లాంచీ సదుపాయం పోయింది. ప్రయివేటు/ప్రభుత్వ బస్సుల సదుపాయం వచ్చింది. అది కూడా అసంపూర్తి. మా ఇంటి వరకూ బస్సు ఉండేది కాదు. నరసాపురంలో రైలు దిగి, నరసాపురం రేవులో గోదావరిలో పడవలో అవతలికి చేరేవాళ్ళం. అవతలికి వెళితే అది తూర్పు గోదావరిలో సఖినేటిపల్లి వస్తుంది.

నరసాపురం-సఖినేటిపల్లి…రేవు

మూగ మనసులు సినీమా ఇక్కడ కూడా షూటింగ్ జరిపారు. ఇక్కడి నుండి బస్సులోవెళ్లి, టేకిశెట్టిపాలెంలో దిగి అక్కడి నుండి, నడిచివెళ్లడమో ఒంటెద్దు బండిలో వెళ్లడమో, జట్కాలో (గుర్రపుబండి) వెళ్లడమో చేసే వాళ్ళం. తిరుగు ప్రయాణంలో తప్పక గుర్రపుబండి జర్నీ ఉండేది. మాకు తరచుగా మా గ్రామంలోనే వుండే ‘ఇల్లరికం’ అనే అతను జట్కా కట్టేవాడు

నిజానికి అతని పేరు కుటుంబ సభ్యులకు తప్ప ఎవరికీ తెలీదు. ఇల్లరికం రావడం వల్ల అతనికి ‘ఇల్లరికం’ అనేదే పేరుగా మారిపోయేది. తరువాత సఖినేటిపల్లి నుండి రాజోలు వరకు బస్సులోవెళ్లి అక్కడినుండి తిరిగి జట్కాలో మా గ్రామం చేరుకునేవాళ్ళం. ఆ తర్వాత రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారి పుణ్యామా అని, రాజోలు నుండి మినీ బస్సు వేయడంతో కొంతలో కొంత రవాణా సౌకర్యం మెరుగుపడింది.

మా..వూరికి దారి

రాష్ట్రంలో తొలిసారి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత అనుకోని రీతిలో మా గ్రామానికి మంచి రోజులు వచ్చాయి. మా గ్రామానికే కాదు,ఆ.. ప్రాంతం అంతటికీ మంచిరోజులు. ప్రయాణ సమయం గణనీయంగా తగ్గిపోయింది. ఇతర ప్రదేశాలనుండి వచ్చేవారికి, స్థానిక వ్యాపారస్తులకు,విద్యార్థులకు,రాజకీయ నాయకులకు ప్రయాణం సులభం అయిపొయింది. నరసాపురం వెళ్లకుండానే, పాలకొల్లులో రైలు దిగి అరగంటలో వూరికి చేరుకునే సౌలభ్యం అయింది. కాబ్, ఆటోల సదుపాయం మెరుగు పడింది. ఇంతకీ దీనంతటికీ కారణం ఏమిటంటారు? అదే గోదావరిపై చించినాడనూ -మా వూరు దిండిని, కలుపుతూ కట్టిన పొడవైన బ్రిడ్జి! ప్రజలకు ప్రభుత్వం నుండి అందిన అసలైన – సిసలైన, గొప్ప అభివృద్ధి కార్యక్రమం. పశ్చిమ-తూర్పు గోదావరి జిల్లాలను కలిపిన ప్రజల వంతెన.

 

చించినాడ బ్రిడ్.

ఇప్పుడు సదుపాయాలూ వచ్చాయి. మేము మా గ్రామం వెళ్లే అవసరాలూ తగ్గిపోయాయి. సదుపాయాలెన్ని వున్నా చదువుకునే వారి శాతం తగ్గిపోవడం, ఉన్నత చదువుల కోసం తాపత్రాయ పడేవారి సంఖ్య తగ్గిపోవడం ఇక్కడ కొసమెరుపు!

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version