[box type=’note’ fontsize=’16’] “కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే…!!”అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్. [/box]
ఓ ఇంటివాడినయ్యా..!!
[dropcap]జీ[/dropcap]వితంలో ఒక్కోసారి ఊహించని రీతిలో కొన్ని సంఘటనలు జరిగి అవి జీవితాంతం గుర్తు వుంచుకునేలా ఉంటాయి. అవి మంచికి జరిగిన సంఘటనలైతే, అసలు మరిచిపోయేటట్టు వుండవు. అది ఎవరివల్లనైనా మేలు జరిగిన అంశం అయితే, మేలుచేసిన వాళ్ళని నిత్యం స్మరించుకోవాలనిపిస్తుంది. ఆ సహాయం అందించినవారు రక్తసంబంధీకులు కావచ్చు, బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, శ్రేయోభిలాషులు కావచ్చు. అది మన మీద వున్నఅభిమానం కావచ్చు, ప్రేమ కావచ్చు, బాధ్యతగా భావించడం వల్ల కావచ్చు.
ఈ రోజుల్లో సహాయం చేయడం అన్నది, వింత విషయమే! అలా అని అసలు సమాజంలో మంచి చేసేవారు, మేలు చేసేవారు, సమాజంలో అసలు లేరని చెప్పడం నా ఉద్దేశం కానేకాదు. కానీ ఎక్కువశాతం స్వార్థబుద్దినే పట్టుకుని వ్రేలాడేవారు వుంటారు. అలాంటి వారు, ఎదుటివారు బాగు పడుతుంటే ఓర్వలేరు! ఇక సహాయం చేసే మనసు ఎక్కడ ఉంటుంది వాళ్లకి? పైగా ఒకరి అభివృద్ధి, వారికి జెలసీ కలిగిస్తుంది. సహాయం చేయకపోగా, ఏదో పద్ధతిలో దెప్పిపొడవడం, అసూయపడడం వంటివి చేస్తుంటారు.
చాలా కుటుంబాలలో, తమకంటే చిన్నవారు, జీవితంలో బాగా స్థిరపడాలని తోచిన సలహాలిస్తూ, అవసరమైతే తగిన సహాయం చేయడానికి ముందుకు వస్తారు. కొన్ని కుటుంబాలలో దీనికి పూర్తిగా భిన్నమైన పరిస్థితులు ఉంటాయి. పైగా దానికి తోడుగా ఎగతాళి చేయడం ఒకటి అదనంగా వచ్చి చేరుతుంది. అలా కావాలని నిరుత్సాహ పరిచేవాళ్లూ వుంటారు. ఇవి జీవితంలో ఒక్కొక్కరికీ ఒక్కో రూపంలో ప్రత్యక్షమవుతుంటాయి. సమస్యలను, అతి సులభంగా ఎదుర్కొని మంచి ఫలితాలను సాధించేవాళ్ళు కొందరైతే, నిరుత్సాహపడి సమస్యలకు తలవొగ్గేవారు మరి కొందరు!
అయితే మేలుచేసినవారిని ఎప్పుడూ ఏదో ఒక రూపంలో సందర్భాన్ని బట్టి గుర్తు చేసుకునేవాళ్ళు వుంటారు. గుర్తు చేసుకోకుంటే వాళ్ళు అసలు వాళ్ళు మనుష్యుల జాబితాలోకి వస్తారని నేను అనుకోను. అయితే మేలుపొంది మరచిపోయేవాళ్లను ఎందరినో మనం చూస్తుంటాం. చేసిన సహాయం మరచిపోకుండా జీవితాంతం గుర్తుపెట్టుకునేవాళ్లూ, నలుగురికీ గొప్పగా చెప్పుకునేవాళ్లూ కూడా వుంటారు, వున్నారు కూడా!
ఇలాంటి జాబితాలోకి నేను కూడా వస్తానేమో మరి మొత్తం చదివితేనేగానీ అది నిర్ధారణకు రాదు!
అవి.. నేను మహబూబాబాద్ తాలూకా (ఇప్పుడు జిల్లా) ఆసుపత్రిలో పని చేస్తున్న రోజులు. అద్దె ఇంటిలో గడుపుతున్న కాలం. అలా అని ఇబ్బంది పడుతున్నానని కాదు సుమండీ! ఆస్తుల గురించి, అంతస్థుల గురించి ఏమాత్రం ఆలోచనలు లేని కాలం. సర్వం మరచి హాయిగా గడుపుతున్న రోజులు. ఎక్కడ సెటిల్ అవ్వాలన్నది అప్పటికి ఇంకా మా ఆలోచనలలోకి రాలేదనే చెప్పాలి. అందుకే మేము ఒక నిర్ణయం అంటూ తీసుకోలేదు. ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్ళినప్పుడు మాత్రం అన్నయ్య – వదినల సంభాషణలలో ఈ అంశం చర్చకు వస్తుండేది. నేను అప్పటికి ఇంకా హైదరాబాద్‌లో భూమి కొని ఇల్లుకట్టే స్థాయి లేకపోవడం వల్ల ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకునేవాడిని కాదు. అయితే అప్పుడప్పుడూ, ఇంటి స్థలం కొనడానికి నా స్థాయికి తగ్గ ప్రాంతంలో చూడమని చెబుతుండేవాడిని. ఇల్లు అయినా కొనుక్కోడానికి చూడమని చెబుతుండే వాడిని. అన్నయ్య పెద్ద సీరియస్‌గా ఈ విషయం పట్టించుకోలేదు. అందుకే ఎప్పుడూ.. “ఎక్కడా మంచివి కనపడ్డం లేదురా..” అనేవాడు.
ఇలా.. కొద్దీ రోజుల తర్వాత, నన్ను ఆశ్చర్య పరుస్తూ వదిన శ్రీమతి శిరోరత్నమ్మ దగ్గర నుండి ఫోను వచ్చింది. అప్పటికి మొబైల్ సందడి ఇంకా రాలేదు. వదిన ఇంజనీరుగా వాటర్ వర్క్స్ విభాగంలో పనిచేసేవారు. ప్రజా సంబంధాలు ఎక్కువగావుండే డిపార్ట్మెంట్ అది. అందుచేత ఆవిడకు విషయం తెలిసి ఫోన్ చేశారు. దాని సారాంశం ఏమిటంటే, హైద్రాబాద్‌లో ఒక చోట నివాస స్థలాలు ఫ్లాట్లు చేసి అమ్ముతున్నారని, అక్కడ ఇల్లు కూడా కట్టి ఇచ్చే పద్దతి ఉందనీ, అక్కడ ప్లాట్ కొనుక్కుంటే బావుంటుందని, ఇప్పుడు కొనుక్కోపోతే, భవిష్యత్తులో హైద్రాబాద్‌లో సెటిల్ అయ్యే అవకాశం రాదనీ, అందుచేత తక్షణమే వచ్చి చూసుకొమ్మని దాని సారాంశం. నా లాంటివాడికి ఇదే మంచి పద్దతి అనుకుని, నా శ్రీమతితో చర్చించి, ఒక శుభోదయాన బయలుదేరి హైద్రాబాద్‍కు వెళ్లాను. మా వదిన ఆ సైట్‌కు తీసుకువెళ్ళింది. అది ‘శేరిలింగంపల్లి’ అనే ప్రదేశం. హైద్రాబాద్ విశ్వవిద్యాలయం తర్వాత ఇది ఉంటుంది. అంటే బి.హెచ్.ఇ.ఎల్.కు వెళ్లే దారి అన్నమాట. ప్రేమ్‌కుమార్ అనే ఆయన విదేశాల్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసి, ఆ అనుభవంతో హైద్రాబాద్‌లో బిజినెస్ ప్రారంభించారు. నేను అది చూసేటప్పటికి ఒక ఫేజ్.. ఇళ్ళు కట్టడం పూర్తి అయింది. స్థలము ఇల్లు కలిపి రేటు నిర్ణయించడం – ఈ స్కీము నాకు నచ్చింది కానీ, మెయిన్ సిటీకి దూరంగా ఉండడం, సింగిల్ రోడ్డు, అతి తక్కువ బస్సు సౌకర్యం ఉండడం నన్ను కొంచెం ఇరుకున పెట్టింది వ్యవహారం. అయినా.. ఒక నిర్ణయానికి వచ్చేసాను, తీసుకోవాలని. మా వదిన కూడా బాగా ప్రోత్సహించింది.
దీనికి సంబందించిన కార్యాలయం నాంపల్లిలో పబ్లిక్ గార్డెన్స్‌కు ఎదురుగా ఉండేది. ఒక ఎక్స్-సర్వీస్‌మాన్ మానేజరుగా వుండేవారు. ఆయన పేరు గుర్తులేదు. ఆయన మొత్తం మేప్ చూపించి ఒక కార్నర్ ప్లాటు,రెండు పక్కలా రోడ్డు ఉండేది, తీసుకొమ్మని సలహా ఇచ్చాడు. ఇతర ప్లాట్‌ల కంటే కొంచెం ఎక్కువ సొమ్ము ఖర్చుపెట్టాలి!
ఆయన చెప్పినదే తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చాను. ఆ మేనేజర్ మమ్మలిని సైట్ దగ్గరికి తీసుకు వెళ్లి చూపించారు. అదే ‘డాయన్స్ టౌన్‌షిప్’ (Doyen’s township). ఖాయం చేసుకుని మహబూబాబాద్‌కి బయలుదేరాను. అప్పటికి నాచేతిలో ముప్పైవేలు మాత్రం వున్నాయి అడ్వాన్సు కట్టడానికి. ఇంకా పెద్దమొత్తం కట్టాలి. ఇది 1991 నాటి మాట!
నా శ్రీమతికి ఇంటి లోన్ సౌకర్యం వుంది. అప్పటికి ఆమె స్టేట్ బాంక్ ఆఫ్ – హైద్రాబాద్‌లో పని చేస్తున్నది. కానీ వెంటనే లోన్ రాదు. ఏమి చేయాలో అర్థం కాలేదు అయితే అప్పటికి కొద్దినెలల క్రితమే, ఒక నెలవారీ చిట్.. లో చేరి వున్నాను. దానిని నాకు అత్యంత ఆత్మీయ మిత్రులు,నా శ్రేయోభిలాషి, డా. వి. నరసింహ రెడ్డి గారు, రాజగోపాల్ అనే వ్యక్తితో కలిపి నడిపించేవారు. ఆయన ప్రైవేట్ ప్రాక్టీషనర్. నేనంటే బాగా ఇష్టపడేవారు. ఆయన దగ్గరకువెళ్లి ఒకరోజు ఈ విషయం అంతావివరించాను. ఆయన ఏమాత్రం ఆలోచించకుండానే, “నీ చిట్టీ డబ్బులు ముందే ఇప్పిస్తాను, అక్కడ కట్టేయ్” అన్నారు. ‘బ్రతుకు జీవుడా!’ అనుకుని,ఆనందంగా ఇంటికి తిరిగి వచ్చేసాను. ఆ మరునాడు, ఆ డాక్టరు గారే నా ఇంటికి డబ్బు పంపించారు. తర్వాత నేను వెళ్లి అక్కడ ఆఫీసులో కట్టవలసిన సొమ్ము జమ చేసాను. దాని ఆధారంతో, హైదరాబాద్ రాయదుర్గ బ్రాంచిలో, నా శ్రీమతికి ఋణం మంజూరు అయింది. అప్పుడప్పుడు ‘టౌన్‌షిప్’కు వెళ్లి, ఇల్లు కట్టడ పురోగతిని చూస్తూండేవాడిని. చక్కని ఇల్లూ – మూడు పక్కల ఖాళీ స్థలం బాగుంది. అయితే, మా ఒప్పందంలో ప్రహరీగోడ (compound wall) లేదు. అది నేనే కట్టుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. అయితే, అక్కడ నేను దగ్గర వుండి కట్టించే అవకాశం లేదు.
అందుచేత ఈ విషయంలో బావగారు (చిన్నక్క భారతి భర్త) స్వామి రావు గారి సహాయం అర్థించాను. ఆయన సంతోషంగా ఒప్పుకున్నారు. వాస్తు విషయంలో నాకు పెద్దగా నమ్మకాలు లేకపోయినప్పటికీ, నలుగురి కోసం, నేను దాన్ని పాటించక తప్పలేదు. మహబూబాబాద్ డాక్టర్ నరసింహారెడ్డిగారు ఇందులో సిద్దహస్తులు. విషయం చెప్పగానే, అంతగా ఆరోగ్యం బాగోనప్పటికీ, హైద్రాబాద్ రావడానికి సిద్ధపడ్డారు. కొలతలు చూపించి పని ప్రారంభింపజేశారు ఆయన. నెల రోజుల్లో ప్రహరీ గోడ పని పూర్తి అయింది. 1993లో అనుకుంటాను, గృహ ప్రవేశం చేసాను. స్థలంతో పాటు ఇల్లు కట్టించి ఇచ్చిన ప్రేమకుమార్ గారినీ, మహబూబాబాద్‌లో పరిచయం ఐన డి.ఎస్.పి. ఆకుల రామకృష్ణ గారినీ, మహబూబాబాద్ డాక్టర్లను, స్నేహితులను, బంధువులను, శ్రేయోభిలాషులను చాలా మందిని పిలిచాను. నాకు చిన్నాన్న, నా శ్రీమతికి తాతయ్య(ఈద బాల సుందర్ రావు గారు-సరిపల్లి) ప్రార్థన చేసి రిబ్బన్ కత్తిరించడం ద్వారా గృహప్రవేశం జరిగింది. ఆత్మీయులు చాలామంది ఆ రోజు వచ్చారు. బాలసుందర రావు గారు(మా అత్తగారి తండ్రి), నా పెద్దన్నయ్య, పెద్దక్క, చిన్నక్క, ఈ రోజున లేకుండా పోయారు. నాకు నిత్యం ప్రేమను పెంచే నా తమ్ముడు (పిన్నికొడుకు) ఆశీర్వాదం (సరిపల్లి) కూడా ఈ రోజున లేడు. ఇలా ఎందరి సహాయంతోనో, ఆశీస్సులవల్లనో నేనొక ‘ఇంటివాడిని’ అయ్యాను. ఈ విషయంలో మా వదినగారు చేసిన సహాయం, ప్రోత్సాహం మరువలేనిది. ఆ ఋణం తీర్చుకోలేనిది.
అంతే కాదు మొదట నా ఇంట్లో అద్దెకు వున్న కేరళ వాసి నాయర్, మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు పెంచి నాకు ఎంతగానో సహాయం చేసాడు. అంతమాత్రమే కాదు, నా ఇంట్లో ఉండడం వల్ల, ఆర్థికంగా తాను చాలా బలపడ్డానని సాక్ష్యం ఇవ్వడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంటుంది. బహుశా నా జీవితంలో నేను నా సంతానం కోసం చేసిన ఒకే ఒక్క మంచి పని ఈ ఇల్లు సంపాదించడమే! దాని విలువ – ప్రాధాన్యత, అంచనాలకు మించి ఉండడం నిజంగా మా అదృష్టమే!!
(మళ్ళీ కలుద్దాం)