Site icon Sanchika

జ్ఞాపకాల పందిరి-30

[box type=’note’ fontsize=’16’] “కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే…!!”అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్. [/box]

మానుకోట – మురమురాలు..!!

[dropcap]పూ[/dropcap]ర్వం ఉపాధ్యాయులు, వారు పనిచేసే చోటే ఉండేవారు. దానికి కారణాలు అనేకం. కారణం ఏదైనా అప్పటి పరిస్థితులు అలాంటివి. బడిలో పిల్లలకు పాఠాలు చెప్పడమే కాకుండా, ఊరి ప్రజల ఆరోగ్యానికి సంబంధించి, ప్రాథమిక చికిత్స, చిన్న – చిన్న సమస్యలకు వైద్యం కూడా వారికున్న అనుభవంతో చేసేవారు. కొన్ని మారుమూల ప్రాంతాలలో డెలివరీలు చేసిన సంఘటనలు కూడా వున్నాయి. ఆ విధంగా ప్రజల అభిమానాన్ని, గౌరవాన్ని చూరగొనేవారు. అలా ప్రజల్లో గొప్ప ఆదరణ పొందేవారు. పిల్లల పై చదువులకు సంబంధించి, సలహాలూ – సూచనలు, గ్రామాభివృద్ధి కోసం యువతలో చైతన్యం తీసుకురావడం, రాజకీయ చైతన్యం తీసుకురావడం వంటి మంచి పనులు చేసేవారు. సాహిత్య -సాంస్కృతిక విజ్ఞానాన్ని అందించేవారు. కుల వృత్తులు – చేతి వృత్తులను అధికంగా ప్రోత్సహించేవారు. నిజానికి వారు, నిర్దేశిత సమయంలో వారి ఉద్యోగం చేసుకుని, హాయిగా ఇంట్లో కూర్చోవచ్చు. కానీ వారు అలా చేయలేదు. గ్రామాభివృద్ధిని, సామాజిక చైతన్యాన్ని దృష్టిలో వుంచుకుని, వారికి చేతనయినంత సహాయాన్ని తమ బాధ్యతగా తీసుకుని అందించేవారు. అది ‘పని చేసిన చోటే నివాసం ఉండడం’ వల్ల మాత్రమే సాధ్యం అయింది. ఇది ఇతర ఉద్యోగులు కూడా చేసే అవకాశం వున్నా, ప్రజలతో ఎక్కువ సత్సంబంధాలు కలిగిన ఉపాధ్యాయులకు మాత్రమే సాధ్యం అయింది. ఆ వృత్తి అలాంటిది మరి!

ఒక దంతవైద్యుడిగా, నాకు కూడా అంతో ఇంతో సామాజిక సేవ చేసే అవకాశం దక్కింది. నా వృత్తి – ప్రవృత్తి దానికి బాగా ఉపయోగపడ్డాయి. తత్ఫలితంగా, ప్రజా సంబంధాలు అమితంగా ఏర్పడ్డాయి. ఒక ప్రత్యేక గుర్తింపు రావడం కూడా నా అదృష్టం!

ఈ నేపథ్యంలో, ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడి, వారి ప్రత్యేక సమావేశాలలో, దంత సంరక్షణ –నోటి పరిశుభ్రత గురించి ఉపన్యసించేవాడిని. తద్వారా పిల్లలకు ఆ విజ్ఞానం అందుతుందన్నది నా ఆలోచన. అవి చాలా విజయవంతమైనాయి. తర్వాత ప్రభుత్వ/ప్రయివేట్ పాఠశాలల – ప్రధానోపాధ్యాయులతో సంప్రదించి, వారికి అనుకూలమైన సమయంలో పిల్లలకు వారికి అర్థమయ్యే రీతిలో నోటి పరిశుభ్రత -దంత సంరక్షణ గురించి, దంతసమస్యల ప్రభావం,శరీరంపై ఎంత ప్రమాదం తీసుకొస్తుందో తెలియచెప్పేవాడిని. ఇంచుమించు,ఇలా మొత్తం మహబూబాబాద్-దాని పరిసర ప్రాంతాలు కవర్ చేసాను. అప్పుడప్పుడూ పాఠశాలలో, దంతవైద్య పరీక్షా శిబిరాలు ఏర్పాటు చేసి, అవసరమైన చికిత్సలు చేసేవాడిని. పిల్లలకు ఉచితంగా టూత్ బ్రష్‌లు పంచేవాడిని.

సారస్వత మేఖల సాహిత్య సంస్ట స్టాపకులు స్వర్గీయ చౌడవరపు పురుషోత్తంగారు

చాలా సంవత్సరాలుగా మహబూబాబాద్‌లో మూతపడి వున్న సాహిత్య-సంస్థ ‘సారస్వత మేఖల’ ను పునః ప్రారంభించి, ఆదివారాలు సమావేశాలు ఏర్పాటు చేసేవాడిని. కవి సమ్మేళనాలు ఉండేవి. రాత పత్రిక నడిపేవాళ్ళం. సారస్వత మేఖల స్థాపకులు శ్రీ చౌడవరపు పురుషోత్తంగారు (మహబూబాబాద్ లో వ్యాపారస్తులు) బాగా ప్రోత్సహించేవారు. డా.మజీద్ (ఆర్.ఎం.పి -వైద్యం చేసేవారు,ఎక్కువ రైల్వే స్టేషన్ లో కనిపించేవారు, రైళ్లలో తిరుగుతుండేవారు) కవిత్వం రాసేవారు. ఎప్పుడూ ఆయన జేబులో కవిత రాసిన కాగితం ఉండేది. నరసింహారెడ్డి గారు (టీచర్), శ్రీరామ్ చేపూరి (లెక్కల మాష్టారు), గొట్టిపర్తి యాదగిరి రావు (ఆంధ్రాబ్యాంకు – ఉద్యోగి), సత్యన్నారాయణ (రచన.. క్లాత్ స్టోర్స్) వంటి వారు, కవిత్వం రాసేవారు. ఆప్పటి డి.ఎస్.పి శ్రీ ఆకుల రామకృష్ణ గారు, సాహితీ ప్రియులు కావడం మూలాన, మమ్మల్ని బాగా ప్రోత్సహించేవారు. వారి సహకారం వారి సహకారంతో కళాశాల విద్యార్థులతో కవిసమ్మేళనాలు ఏర్పాటు చేసేవాళ్ళం.

సారస్వత మేఖల సాహిత్య సంస్థ ఏర్పాటు చేసిన కవి సమ్మేళనంలో కవిత చదువుతున్న డా.మజీద్.

నా ఈ కార్యక్రమాలన్నీ, అక్కడ స్థానిక లాయర్ చలపతి రావు గారు గమనించారు. ఆయన, అప్పుడు ‘భారత్ వికాస్ పరిషత్’ మహబూబాబాద్ శాఖకు అధ్యక్షులుగానూ, సలహాదారుగానూ ఉండేవారు. ఆయన దృష్టి నా మీద పడింది. ఒక ఆదివారం రోజు కొందరిని వెంటబెట్టుకుని మా ఇంటికి వచ్చారాయన. మాటా -మంతీ అయిన తర్వాత, భారత్ వికాస్ పరిషత్ స్వచ్ఛంద సేవా సంస్థ గురించి విపులీకరించి,ఆ సంస్థకు అధ్యక్ష బాధ్యతలు తీసుకొమ్మని సలహా ఇచ్చారు.

నన్ను భారత్ వికాస్ పరిషత్ అధ్యక్షుడిగా ప్రతిపాదించిన ఎన్.వి.చలపతిరావు, మహబూబాబాద్‌లో సీనియర్ అడ్వకేట్

భారత్ వికాస్ పరిషత్ – అంటే, భారతీయ జనతా పార్టీకి సోదర సంస్థ. ప్రభుత్వ ఉద్యోగిగా, నేను పార్టీల కతీతంగా పనిచేయాలని, అందుచేత నన్ను వదిలేయమని చలపతిరావు గారిని అభ్యర్ధించాను, అందుకు ఆయన, పార్టీపరంగా ఎలాంటి కార్యక్రమాలూ ఉండవని, అన్నిపార్టీల వాళ్ళు ఇందులో సభ్యులుగా వున్నారని, కేవలం సేవా కార్యక్రమాలకు మాత్రమే ఈ సంస్థ పరిమితమై ఉంటుందని నాకు నచ్చజెప్పారు. నిజానికి నేను కమ్యూనిస్ట్ కుటుంబం నుండి వచ్చిన వాడిని. అప్పట్లో తెలుగు దేశం పార్టీని ప్రేమిసున్నవాడిని, అయినా సేవా కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని, చలపతి రావు గారి ఆహ్వానాన్ని, ఆనందంగా ఒప్పుకున్నాను.

భారత్ వికాస్ పరిషత్తు సమావేశంలో మాట్లాడుతున్న నేను

భారత్ వికాస్ పరిషత్ -మానుకోట శాఖ నన్ను అధ్యక్షుడిని చేసారు. ఈ సంస్థ ద్వారా సమాజానికి ఉపయోగపడే చాలా మంచి కార్యక్రమాలు జరిగేవి. ప్రతి సంవత్సరం,శాఖ/జిల్లా/రాష్ట్ర/జాతీయ -స్థాయి, బృంద గాన పోటీలు, యువతీ యువకులను బాగా ఆకర్షించేవి. పాఠశాలల యాజమాన్యాలు ఈ పోటీలకు బాగా సహకరించేవి. వికలాంగులకు కృత్రిమ అవయవ పంపిణీ మరో ముఖ్యమైన కార్యక్రమం. మహనీయుల జయంతి /వర్ధంతుల సందర్భంగా,వారి గురించిన ఉపన్యాసాలు తప్పక ఉండేవి. ప్రముఖ యువ సినీమా సంగీత దర్శకుడు స్వర్గీయ చక్రి, ఫేషన్ డిసైనర్‌గా ప్రసిద్ధికెక్కిన శ్రీమతి మంగా రెడ్డి, భారత్ వికాస్ పరిషత్ – మానుకోట శాఖ, బృందగాన పోటీలకు ప్రాతినిధ్యం వహించిన వారే!

భారత్ వికాస్ పరిషత్తు సమావేశంలో మాట్లాడుతున్న చలపతిరావుగారు

నేను స్వయంగా మహబూబాబాద్ ప్రయాణికుల కోసం, ఒక చక్కని కార్యక్రమం కోసం ప్రయత్నం చేసి సఫలీకృతుడిని అయినప్పటికీ, అది కిట్టని ప్రాంతీయ శాసన సభ్యుడు, దానికి వ్యతిరేకంగా పని చేసి, ప్రజోపయోగకరమైన ఒక మంచి పని కొనసాయకుండా చేసాడు. రాజకీయం తలపెట్టే దుర్మార్గాలకు ఇదొక మంచి ఉదాహరణ మాత్రమే!

భారత్ వికాస్ పరిషత్ -మానుకోట శాఖ,అధ్యక్షుడి హోదాలో నేను మహబూబాబాద్ నుండి నాగార్జునసాగర్‌కు ఒక ఆర్.టి.సి. బస్సు కోసం విశ్వ ప్రయత్నం చేసాను. అధికారులతో, ఒక సంవత్సరం పాటు ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగిన తర్వాత,  ఒక శుభోదయన ఆర్.టి.సి అధికారుల నుండి లేఖ వచ్చింది నాకు. ఫలానా రోజున, మహబూబాబాద్ నుండి సాగర్‌కు బస్సు ప్రారంభిస్తున్నామని, ఆ సమయానికి అక్కడికి నన్ను కూడా వెళ్ళమని ఆ లేఖ సారాంశం. ఇది నన్ను చాలా సంతోషపెట్టిన అంశం. బస్సు ప్రారంభమైంది, తొర్రూరు – దంతాలపల్లి మీదుగాఎప్పుడూ బస్సు నిండా పాసెంజర్లతో బస్సు నడిచేది. ఒక నెల రోజుల తర్వాత ఏదో సాంకేతిక అంశం లేవనెత్తి,  బస్సును రద్దు చేసారు. అలా ప్రజలకు ఉపయోగపడే ఒక సౌలభ్యానికి రాజకీయం అడ్డుపడింది. విషయం తెలిసి నేను బాధపడడం తప్ప ఏమీ చేయలేక పోయాను.

ఇలా.. నా వృత్తిపరంగానూ, ప్రవృత్తిపరంగానూ, నా ఉద్యోగ బాధ్యతలకు తోడుగా, ఇతర సేవా కార్యక్రమాలను చేయగలిగాను. తద్వారా ప్రజా మన్ననలను అధికంగా పొందగలిగాను.1994లో, నేను మహబూబాబాద్ నుండి బదిలీ అయినా,ఇప్పటికీ అక్కడి ప్రజలు-ప్రముఖులు నన్నుమర్చిపోకపోవడమే నాకు మిగిలిన గొప్ప ‘తృప్తి’!!

మైమ్ కళాధర్‌కు సన్మానం

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version