[box type=’note’ fontsize=’16’] “కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే…!!”అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్. [/box]
మానవీయం..!!
[dropcap]మ[/dropcap]నుష్యుల్లో రకరకాల వ్యక్తిత్వం గలవాళ్ళు వుంటారు. వారి జీవన శైలిని, వ్యక్తిత్వానికి అనుగుణంగా మలచుకొని జీవన యాత్రను కొనసాగిస్తారు. ఎలాంటి వ్యక్తులు వారికి తారసపడినా, వారి వ్యక్తిత్వానికి భిన్నంగా వ్యవహరించరు. ఎదుటివాళ్ళు తమ విధానం మార్చుకుని అనుకూల ఫలితాలు తెచ్చుకోవాలి గానీ, మరో మార్గం లేదు. ఫరవాలేదు, అలాంటి వారితో ఇబ్బంది లేదు.
ఇలాంటి వారికి భిన్నమైన వ్యక్తులూ సమాజంలో వుంటారు. చాలా చక్కగా మాట్లాడతారు. చాలా మంచివాళ్ళుగా ప్రవర్తిస్తారు. స్నేహానికి ప్రాణం ఇస్తున్నంత సన్నివేశం సృష్టిస్తారు. అవసరం లేకపోయినా, వాళ్ళ కబుర్లతో విసుగు వచ్చేవరకూ వదిలిపెట్టరు. ఎదుటి వ్యక్తి దగ్గర చాలా మంచివాడిగా ఒక ఇమేజ్ సృష్టించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తారు.
కానీ, సమయం వచ్చినప్పుడు, అంటే ఏదైనా చిన్న సహాయం చేయవలసిన పరిస్థితి ఏర్పడినప్పుడు, చాలా తెలివిగా తప్పించుకుంటారు. ఎంత అంటే మనం వాళ్ళని ఎలాంటి తప్పు పట్టలేనంత! దానికి తోడు వాళ్ళ మీద జాలిపడేంత.
అయితే ఇలాంటి అనేక భిన్నమైన వ్యక్తిత్వాలు గల వ్యక్తులతో కలిసి జీవించాలి కనుక, ఇది సమాజం కనుక, అనేక రకాల మనుష్యుల మేలు కలయిక కనుక, ప్రతి మనిషిని అర్థం చేసుకుని, అవసరమైతే, మన అవసరాన్ని బట్టి కొంత మనమే తగ్గి మన పనులు వెళ్లదీసుకోవాలి అంతే!
లేకుంటే మనమే ఏదో రూపంలో నష్టపోవాల్సి వస్తుంది. అవసరం మనదై నప్పుడు,దానికి తగ్గట్టుగా సర్దుబాటు చేసుకుని మన పని మనం పూర్తి చేసుకోవాలి. దీనికోసం ముందు మనం ఎదుటి వ్యక్తిని బాగా పరిశీలించవలసిన అవసరం ఉంటుంది. వారి మనస్తత్వాన్ని అంచనా వేయవలసి ఉంటుంది.
నా ఉద్యోగ పర్వంలో, నేను పనిచేసిన ప్రతిచోటా చాలా జాగ్రత్తగా ప్రవర్తించవలసి వచ్చింది. ప్రతి మనిషినీ క్షుణ్ణంగా అర్థం చేసుకోవలసి వచ్చింది. అది సాధ్యం కానప్పుడు ఇబ్బందులు కూడా పడవలసి వచ్చింది. అయినా ఎంతో జాగ్రత్తగానే నా ఉద్యోగ పర్వాన్ని ముగించగలిగాను. పని చేసిన ప్రతి చోటా ప్రజల మన్ననలు పొందగలిగాను. ఉద్యోగులకు ఒక్కోసారి ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి. మచ్చుకి ఒక ఉదాహరణను మీ ముందు వుంచుతాను.
1994లో నాకు మహబూబాబాద్ ఆసుపత్రి నుండి జనగాం ఆసుపత్రికి బదిలీ అయింది. నిజానికి అక్కడి నుండి నాకు రెండవసారి బదిలీ. మొదటి బదిలీ చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలో జరిగింది. అదికూడా చీరాలకు జరిగింది. పది సంవత్సరాలు మానుకోటలో పనిచేసిన తర్వాత, చాలా దూరమైన చీరాలకు వెళ్ళడానికి మనస్కరించలేదు.
అయితే, అప్పటి ఎం.ఎల్.సి. – సీరోలుకు చెందిన వెంకట రెడ్డి గారు నాకు పేషెంట్‌గా పరిచయం ఉండడం వల్లనూ, అప్పటి ముఖ్యమంత్రి శ్రీ మర్రి చెన్నారెడ్డి గారికి ఆయన చాలా దగ్గరివాడు కావడం వల్లనూ, ఆ బదిలీ ఆగిపోయింది. కొన్ని సంవత్సరాలకు మళ్ళీ నాకు బదిలీ అదే ప్రాంతమైన చీరాలకు వచ్చింది. ఎలా ప్రయత్నించుకోవాలో నాకు తెలీదు. మహబూబాబాద్ శాసనసభ్యులు శ్రీ జనార్ధన రెడ్డి గారితో పని కాలేదు.
అక్కడి పవర్‌ఫుల్ కాంగ్రెస్ నాయకులు శ్రీ మన్మోహన్ రెడ్డి గారు చెప్పినా పని కాలేదు. కానీ కొరివిలో పని చేస్తున్న ఆయుర్వేద వైద్య మిత్రుడు డా. జి. ఎస్. రెడ్డి గారి ద్వారా, అప్పటి నర్సం పేట శాసన సభ్యులు శ్రీ మద్దికాయల ఓంకార్ గారు పరిచయమై, వారి ద్వారా దగ్గరి ప్రాంతమైన జనగాం (ఇప్పుడు జిల్లా)కు బదిలీ అయింది. ఓంకార్ గారి రాజకీయ శక్తి ఎంతటిదో అప్పటికి గాని నాకు తెలియ రాలేదు. అలాంటి పేదల నాయకులు, క్రమంగా తగ్గిపోవడం బాధాకరం.
అప్పటికి నా శ్రీమతికి స్టేట్ బ్యాంకు ఆఫ్ హైదరాబాద్ (ఎస్. బి. ఐ) మహబూబాబాద్ బ్రాంచిలో క్లర్కుగా పని చేస్తున్నది. పిల్లలు చిన్నవాళ్లు. శ్రీమతికి జనగాం బదిలీ కోసం ప్రయత్నం చేసాము. కానీ వీలుకాలేదు. అసలు సమస్య ఇప్పుడు ప్రారంభం అయింది. జనగాంలో వంటరిగా వుండలేని పరిస్థితి, డ్యూటీకి వెళ్ళక తప్పదు. ఇక రైలు మార్గంలో ‘అప్ అండ్ డౌన్’ మార్గం ఎంచుకోక తప్పలేదు. మహబూబాబాద్‌లో స్థానికంగా ఉండడం వల్ల ఇలా ‘అప్ అండ్ డౌన్’ చేసేవాళ్ళని విమర్శించిన నేను తప్పని పరిస్థితిలో ఆ మార్గాన్ని ఎంచుకోక తప్పలేదు. అసలు కష్టం ఇప్పుడు మొదలైంది!
మహబూబాబాద్‌లో కాకినాడ నుండి – సికింద్రాబాద్‌కు వెళ్లే ‘గౌతమి ఎక్స్‌ప్రెస్’ తెల్లవారు ఝామున 2.30కి వుండేదనుకుంటాను. ఆ రైలు తప్ప మరో మార్గం లేకపోయింది. ఉదయం 5 గంటల లోపునే అది జనగాం చేరుకునేది. నా ఆసుపత్రి డ్యూటీ ఉదయం 9 గంటలకి. అప్పటి వరకూ ఏమి చేయాలి? ఎక్కడ ఉండాలి? పాలుపోలేదు. సమస్యలు ఎదురైనప్పుడే మెదడు పదునుగా పని చేస్తుందనుకుంటాను. సరాసరి డ్యూటీ స్టేషన్ మాస్టర్ దగ్గరకు వెళ్లి నన్ను నేను పరిచయం చేసుకుని విషయం చెప్పగానే, ప్రయాణికుల విశ్రాంతి గది తాళం తీయించి అక్కడి సోఫాలో హాయిగా పడుకోమన్నారు. కొన్నాళ్ల పాటు అది నిత్యకృత్యం అయిపొయింది. ఆ మహానుభావుడి పేరు మర్చిపోవడం నా దురదృష్టమే మరి!
నేను ఆసుపత్రిలో డ్యూటీకి జాయిన్ అయిన సమయానికి ఇద్దరు సీనియర్ డాక్టర్లు ఉండేవారు. అదే క్యాంపస్‌లో లెప్రసీ విభాగపు అధిపతి డా. శ్రీనివాస రెడ్డి ఉండేవారు. మా సీనియర్ డాక్టర్లు ఇద్దరూ స్థానికులే! అందులో డా. ఎం. శ్రీహరి ఆసుపత్రి ఇన్‌చార్జి డిప్యూటీ సివిల్ సర్జన్‌గా ఉండేవారు. రెండవ వారు డా. ఎస్. రామనర్సయ్య గారు. వాళ్ళిద్దరికీ ఎప్పుడూ పడేది కాదు. వాళ్ళిద్దరికీ సయోధ్య చేయలేక నేను నలిగి పోతుండేవాడిని. అయితే వాళ్ళిద్దరి రాజకీయం పక్కన పెడితే, నన్ను ఇద్దరూ బాగా గౌరవించేవారు.
డా. రామనర్సయ్య గారు సహృదయులు. వైద్య రంగంలో ఇంచు మించు అన్ని విభాగాల్లోనూ పని చేసిన అనుభవం ఆయనది. అంతమాత్రమే కాకుండా, ప్రముఖ తెలుగు ప్రొఫెసర్ (కాకతీయ విశ్వ విద్యాలయం) మరియు ఆనాటి తెలుగు విశ్వ విద్యాలయం ఉప కులపతి స్వర్గీయ పేర్వారం జగన్నాధం గారు ఈయనకు స్వయానా మామగారు. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ పేర్వారం రాములు గారు డా. రామనర్సయ్య గారికి చిన్న మామ గారు. ఒక రోజు మాటల సందర్భంలో నా అనుదిన కార్యక్రమం విని విస్తుపోయారు. చాలా బాధపడ్డారు. అంతేకాదు, మరునాడు బట్టలు సర్దుకుని వచ్చేయమన్నారు. తన ఇంట్లో ఒక గది ఖాళీగా ఉందనీ, దానిలో స్వేచ్ఛగా ఉండవచ్చని నా భుజం తట్టారు. నేను చాలా సంతోషించాను ఆయన మాటలకు. ఎంతో కొంత అద్దె ఇవ్వవచ్చు అనుకుని, మరునాడు బట్టలు ఒక సూట్‌కేసులో సర్దుకుని జనగాం వచ్చేసాను. ఆయన యావత్ కుటుంబం నన్ను ఎంతో ఆత్మీయంగా ఆహ్వానించారు. అంతమాత్రమే కాదు, రోజూ భోజనం వారి ఇంట్లోనే చేయాలని, చెప్పి నన్ను ఆశ్చర్యపరిచారు. తర్వాత డబ్బు ఆఫర్ చేస్తే అసలు ఒప్పుకోలేదు. అలా ఒక నెలపైనే వారి ఇంట్లోనే వున్న జ్ఞాపకం. వారి ఇంట్లోనే ఉండగా ‘దంతాలు – ఆరోగ్యం’ అనే పుస్తకం రాసే అవకాశం కలగడం నా అదృష్టం.
ఆయనే కనుక ఆ అవకాశం కలిగించకపోతే ఆ ప్రయాణాలతో ఏమై పోయేవాడినో.. ఇప్పటికీ గుర్తు చేసుకుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఈ లోగా నా శ్రీమతికి వరంగల్‌కు బదిలీ చేయడంతో హనంకొండలో కాపురం పెట్టాము. హనంకొండలో రాంనగర్ లోని డా. రామనర్సయ్య గారి ఇంట్లో చాలాకాలం అద్దెకు వుండే అవకాశం కలిగింది.
నా జీవితంలో నేను మర్చిపోకూడని విషయాలలో ఇది ఒకటి! డాక్టర్ గారినీ, ఆ కుటుంబాన్నీ ఎన్నటికీ మర్చిపోలేను. ఇలాంటి సహాయాలు మామూలు విషయాలు కాదు. కొంతలో కొంతైనా మానవీయత వున్న మహానుభావులకే ఇలాంటి పనులు చేయడం సాధ్యం అవుతుందనుకుంటా..! అలాంటి వారందరికీ నా వందనం!! (మళ్ళీ కలుద్దాం)