Site icon Sanchika

జ్ఞాపకాల పందిరి-34

[box type=’note’ fontsize=’16’] “కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే…!!”అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్. [/box]

ఆ వ్యథకు వెల కట్టలేం..!!

[dropcap]సా[/dropcap]ఫీగా నడుస్తున్న జీవితంలో ఒకోసారి మనకు తెలీకుండానే ఊహించని సమస్యలు ఎదురై భరించలేనంతగా మానసిక వ్యథకు గురిచేస్తాయి. సమస్యలు సృష్టించేవారికి అదొక ఆనందమైన క్రీడ! కానీ సమస్యను ఎదుర్కొనే వారి పరిస్థితిని వారు అంచనా వేయరు. అలా ఆలోచించే మనసు ఉంటే వాళ్ళు అసలు ఆ పని చేయడానికి తలపెట్టరేమో! మనం వారిపట్ల మంచిని ఆశిస్తే, వాళ్ళు మాత్రం మనకు ఎలాంటి హాని తలపెట్టడానికీ వెనుకాడరు. అది వాళ్ళ నైజం అంతే.. వాళ్ళని ఎవరూ మార్చలేరు. మార్చాలనే ప్రయత్నం కూడా వృథా అయిపోతుంది.

ఈ క్రీడ ఫలానా చోట ఉంటుందని గాని, ఫలానా వారిలో ఉంటుందని గానీ ప్రత్యేకంగా విడదీసి చెప్పలేము. ఎందుకంటే.. ప్రతి వృత్తిలోనూ, ప్రవృత్తిలోనూ, ప్రతి కులంలోనూ, ప్రతి మతంలోనూ, ప్రతి ప్రాంతంలోనూ ఇలాంటి వ్యక్తిత్వం గల వ్యక్తులు వుంటారు. ప్రత్యేకంగా మనం ఒకేసారి ‘ఫలానా’ అని ముద్ర వేసి వేరుగా చూడలేము. ఎందుచేతనంటే, అలాంటి వారు మన మధ్యనే ఉంటూ, మనల్ని మన జీవన శైలిని పరిశీలిస్తూ.. ఏదో ఒక రోజు మన వెనుక బాంబు పెడతారు. దీనికి ఫలానా కారణం అని చెప్పలేము. కొందరికి అలా జీవితాలతో ఆడుకోవడం ఆనందం, మామూలు ఆనందం కూడా కాదు, అది పైశాచికానందమనే చెప్పాలి. కానీ.. అవతలివాళ్ళని ఇబ్బంది పెట్టడం తప్ప వాళ్ళు సాధించేది కూడా ఏమీ ఉండదు. కొందరికి, ఏదో నెపం మనమీద పెట్టి దాని ద్వారా అక్రమ సంపాదన కోసం అడ్డదారులు కూడా తొక్కుతుంటారు. ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించేవాళ్ళు కూడా కొంతమంది వీరి వెనుక వుంటారు. ఇలాంటివి జీవితంలో చాలామందికి చాలా రూపాల్లో ఎదురవుతాయి. కొందరు వీటిని దైర్యంగా ఎదుర్కొని చాలా తేలిగ్గా తీసుకుంటారు.

మరికొందరు దీనిగురించి జీవితాంతము గుర్తుకు వచ్చినప్పుడల్లా అంతు లేని వ్యథకు గురి అవుతారు. హృదయంలో అది తీయలేని ముల్లుగా మిగిలిపోతుంది. సున్నితమనస్కులకు ఇలాంటి విషయాలు మరీ ఇబ్బంది అనిపిస్తుంది. సమాజంలో ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలియని అగమ్యగోచరం అవుతుంది పరిస్థితి. ఈ సందర్భంలో నేను ఎదుర్కొన్న విచిత్ర/దౌర్భాగ్య సంఘటనను మీకు వివరిస్తాను. ఇది కొంతమందికైనా ఉపయోగపడుతుందని నా ప్రగాఢ విశ్వాసం. ఏదీ తేలికగా తీసుకోకూడదు అన్నది నాకు తెలిసొచ్చిన సత్యం. ముఖ్యంగా వృత్తిపరమైన విషయాలలో ఇవి చోటు చేసుకుంటాయి. ఇది అన్ని రంగాలకూ వర్తిస్తుంది. దంత వైద్య రంగం దీనికి అతీతం కాదు.

అవి నేను జనగాం ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తున్న రోజులు. సంవత్సరం గుర్తులేదు. 1994-2005 మధ్య కాలం. ఆసుపత్రిలో డ్యూటీ పూర్తిచేసుకుని ఇంటికి రావడానికి రైల్వే స్టేషన్‌కు బయలుదేరే సమయంలో పోస్ట్‌మాన్ వచ్చి సంతకం తీసుకుని ఒక రిజిస్టర్డ్ లెటర్ ఇచ్చాడు. అప్పటికే సికింద్రాబాద్ నుండి తిరిగి వచ్చే గోల్కొండ ఎక్సప్రెస్‌కు సమయం దగ్గర పడింది. అందుకే లెటర్ విప్పకుండా, హడావిడిగా స్టేషన్‌కు వచ్చి, రైలు రావడానికి ఇంకా తగినంత సమయం ఉండడంతో, బెంచి మీద కూర్చుని తాపీగా ఉత్తరం విప్పాను.

లెటర్ హెడ్ మీద పేరు, వృత్తి చూడగానే వళ్లు ఝల్లుమంది. వడివడిగా మొత్తం చదివేసాను. ఉత్తరం పూర్తి అయ్యే సరికి వాళ్లంతా చెమటతో తడిసిపోయింది. ఊహించని నీరసం ఆవరించింది. అసలు రైలు ఎక్కగలగలనా? అన్న శంక నన్ను వేధించసాగింది. చెప్పలేనంత టెన్షన్ మొదలైంది. అసలిలా ఎందుకు జరిగింది? నాకు ఒక పట్టాన అర్థం అయింది కాదు. రైలు రాగానే, మెల్లగా బండి ఎక్కి అదృష్టవశాత్తు ఖాళీ సీటు దొరకడంతో అక్కడ కూలబడ్డాను. రైలు వేగానికి కాస్త చల్లని గాలి వచ్చి మనసు కాస్త చల్లబడింది.

నాకు వచ్చిన ఉత్తరం ప్లీడరు నోటీసు. ఆ ప్లీడరు వరంగల్‌లో ఎక్కడ ఉంటాడో కూడా తెలీదు. అతని లెటర్ చదివాక డబ్బు కోసం, నిజానిజాలు ఆరా తీయకుండా, ఇంత కక్కుర్తికి ఒడిగడతారా అనిపించింది!

న్యాయ దేవత ఇలాంటి వారిని క్షమిస్తుందా? అని కూడా అనిపించింది (ఈ పరిస్థితి అన్ని రంగాలలోనూ వుంది, అది వేరే విషయం!). విషయం ఏమిటంటే, తన క్లయింటు నా దగ్గర వైద్యం చేయించుకుందని, నా నిర్లక్ష్యం వల్ల, ఆమెకు సమస్య మరింత జటిలమై హైదరాబాద్‌లో చికిత్స చేయించుకోవడం వల్ల చాలా ఖర్చు అయిందని, తన క్లయింట్ మానసిక వ్యథకు గురి అయిందని, నష్టపరిహారంగా కొన్ని లక్షలకు దావా వేస్తున్నానని, ఆమె కోర్టు ఖర్చులు కూడా నేనే భరించాలని సారాంశం.

పేషంట్ పేరులేకపోవడం వల్ల, అసలు ఎవరో.. ఏమిటో.. అసలు అర్థం కాలేదు. ఈలోగా కాజీపేట రావడంతో, ఇంటికి కాకుండా సరాసరి, నా స్కూటర్ మీద, నా సాహితీ మిత్రులు, గురు సమానులు శ్రీ కె.ఎస్.ఆర్.జి. ప్రసాద్ గారి ఇంటికి పోనిచ్చాను. అప్పుడు నాకు బజాజ్ స్కూటర్ ఉండేది. సాయంత్రం అయింది కనుక, ప్రసాద్ గారు కోర్టునుండి వచ్చి,ఇంట్లోనే వున్నారు. నన్ను, నా చెమటలతో నిండిన ముఖాన్నీ చూసి ‘ఏమిటి.. అలా వున్నారు? ఆ చెమటలు ఏమిటీ? ముందు అలా కూర్చోండి’  అని కుర్చీ చూపించి పది నిముషాల్లో కాఫీ తెప్పించారు.

కుడి వైపు శ్రీ కె.ఎస్.ఆర్.జి.ప్రసాద్ గారు

కాఫీ తాగి కాస్త కుదుటపడ్డాక.. ‘ఇప్పుడు చెప్పండి ఏమిటి విషయం?’ అన్నారు. లాయరు నోటీసు నా బ్యాగ్‌లోనుంచి తీసి ఆయన చేతిలో పెట్టాను. ఆయన అంతా క్షుణ్ణంగా చదివి ‘పేషంట్ ఎవరో మీకు తెలుసునా’ అన్నారు. ‘తెలీడం లేదు సార్’ అన్నాను. ‘నోటీసులో కూడా ఆ వివరాలు లేవు, మీరు కంగారు పడకండి, నేను రిప్లై ఇచ్చి విషయం కనుక్కుంటాను. అనవసరంగా టెన్షన్ పడకండి, నేను చూసుకుంటానుగా’ అని నాకు పెద్ద భరోసా ఇచ్చి ఇంటికి పంపించారు. పేరుమోసిన సహృదయుడైన లాయరు ఆయన. ఆ ధైర్యం ఉన్నప్పటికీ, నాకు టెన్షన్ దినదినాబి వృద్ధి చెందడం మొదలయింది. కొద్ది నెలల్లోనే బి.పి, డయాబెటిస్ ఆరంగేట్రం కూడా జరిగిపోయింది. ప్రముఖ ఫిజీషియన్ డా.వి.చంద్రశేఖర్ సంరక్షణలో వైద్యం చేయించుకోవడం మొదలు పెట్టాను.

లాయర్ కె.ఎస్.ఆర్.జి.ప్రసాద్ గారు రిప్లై ఇచ్చిన తరువాత వివరాలు బయట పడ్డాయి. నేను 1982-1994 మధ్యకాలంలో మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసాను. అక్కడ ఒక పెద్దావిడ ఫార్మాసిస్టుగా పని చేసేది. మంచి పని మంతురాలు సహృదయిని. మంచి మర్యాదగా ఉండేది. అప్పుడు రిటైర్మెంట్ కు అతి చేరువలో వుంది ఆవిడ. వీలు అయినప్పుడల్లా కుటుంబ విషయాలు చెబుతుండేది. అలా నేను చాలా దగ్గిర అయ్యాను.1995లో నేను జనగాంకు బదిలీ అయిన తర్వాత కొద్ది కాలానికి హన్మకొండలో ఇల్లు అద్దెకు తీసుకుని, ప్రైవేట్ క్లినిక్ కూడా పెట్టుకున్నాను.

ఒకరోజు సాయంత్రం ఒక లేడీ పేషంట్ నా క్లినిక్ కు వచ్చింది. ఆమె తల్లి మహబూబాబాద్ ఆసుపత్రిలో ఫార్మాసిస్టు అని పరిచయం చేసుకుంది. తాను వరంగల్‌లో పని చేస్తున్నట్టు చెప్పి తాను ఒక దంత సమస్యతో బాధపడుతున్నానని, దానికి వైద్యం చేయాలని అడిగింది. ఆమె కూడా ఆమె భర్త కూడా వచ్చాడు. డెంటల్ చైర్‌లో కూర్చోబెట్టి క్షుణ్ణంగా పరీక్ష చేసాను. ఆమె మామూలుగా ‘మధుమేహ వ్యాధి’తో బాధపడుతున్నది. నోటి పరిశుభ్రత సరిగాలేదు. పళ్లకు చిగుళ్లకు మధ్య గార (టార్టార్) పేరుకుని చిగుళ్లు వాచి, వాటినుండి రక్తం కారుతుంది. నొప్పిగా ఉన్నట్టు చెప్పిన పన్ను బాగా కదులుతోంది. ముందు మందులు వాడిన తర్వాత ‘స్కేలింగ్’ (పంటి గార తీసివేయడం) చేస్తానని, మధుమేహం అదుపులోనికి వచ్చాక పన్ను తప్పకుండా తీసివేయాలని, అందుచేత ఫిజీషియన్‌తో కూడా ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకోవాలని, మందులు వాడి రావాలని చెప్పి, మందులు రాసి ఇచ్చాను.

మందులు వాడిందో లేదో తెలీదు గానీ, నాలుగు రోజుల తర్వాత వచ్చింది. ఆమె దంతసమస్యలో ఎలాంటి మార్పు కనిపించలేదు. స్కేలింగ్ చేయమంది, చేయనని చెప్పాను. మళ్ళీ మందులు వాడాలని చెప్పాను. మళ్ళీ నాలుగురోజులకి వచ్చింది. స్కేలింగ్ చేసి పంపించాను. మళ్ళీ మందులు రాసాను. వారం రోజులకు మళ్ళీ వచ్చింది. ఆయుర్వేద మందులు వాడుతున్నాననీ, పన్ను తీసేయమని పట్టుపట్టింది. నాకు మనస్కరించకపోయినా, ఇక తప్పలేదు. నిజానికి ఆ పన్ను తీయడానికి తిమ్మిరి ఇంజెక్షన్ ఇవ్వాలిసిన అవసరం లేదు. కానీ ఆమె భయాన్ని దృష్టిలో వుంచుకుని,ఇంజెక్షన్ ఇచ్చాను. ఆమె అసలు సహకరించలేదు. రెండు నిముషాల్లో అయ్యేపని అరగంట తీసుకుంది. మొత్తం మీద ఆ పని పూర్తి చేసి మందులు రాసి మళ్ళీ నాలుగు రోజుల తర్వాత రమ్మన్నాను. కొన్ని నెలలైనా ఆమె జాడలేదు. అదిగో.. ఆ ప్లీడర్ నోటీస్ తో మళ్ళీ ఆమెను గుర్తు చేసుకోవలసి వచ్చింది. ఆమె అలా ఎందుకు చేసిందో, ఎవరు ప్రేరేపిస్తే అలా చేసిందో ఇప్పటికీ అంతు చిక్కడం లేదు. అయితే తర్వాత తెలిసిన విషయం ఏమంటే ఆమె ఏమందూ సరిగా వాడలేదు. ఏ ఒక్క డాక్టర్ దగ్గరా నిలకడగా ఆమె వైద్యం చేయించుకోలేదు. ఒక ఫిజీషియన్‌ను ఇద్దరు దంతవైద్యులను సంప్రదించింది. చివరికి హైదరాబాద్ లోని మాగ్జిలో ఫేషియల్ సర్జన్ అయిన డా. వివేకవర్ధన్ రెడ్డి దగ్గర ఆమె నిర్లక్ష్యానికి బహుమతిగా దవడ ఎముకకు సర్జరీ చేయవలసి వచ్చింది. అక్కడే పూర్తిగా స్వస్థత చేకూరాక, ఎవరి ప్రేరణ వల్లనో నామీద కేసు వేసింది. నా నిర్లక్ష్యం వల్లనే ఇదంతా జరిగినట్టు ఆమె తరఫు లాయరు కథ చాలా అందంగా అల్లాడు.

ప్రొఫెసర్ వివేకవర్ధన్ రెడ్డి, మాగ్జిలో  ఫేషియల్ సర్జన్

ఇక నా విషయానికొస్తే, ఈ కేసు సుమారు రెండు సంవత్సరాలు జీడీపాకంలా సాగింది. ఆ కాలం నాకు చాలా బాధాకరమైన కాలం. శ్రీ కె.ఎస్.ఆర్.జి. ప్రసాద్ గారు ప్రాక్టీస్ తగ్గించేయడం వల్ల నా కేసును వారి అల్లుడు శ్రీ తాతిరాజు వెంకటేశ్వర రావు గారికి అప్పగించారు. ఆయన చాలా సమర్థుడైన లాయరుగా పేరున్నవాడు. పేషంట్ వైద్యంతో సంబంధం వున్న ప్రొఫెసర్ నూరుద్దీన్, డా. వివేకవర్ధన్ రెడ్డిలను కోర్టు పిలిచి వారిని ప్రశ్నించింది. వారు పేషేంట్‌తో వారికి గల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని, పేషంట్ నిర్లక్ష్యమే కారణం అని సాక్ష్యం ఇచ్చారట! ఆఖరున నన్ను పిలిచారు. నా దగ్గరున్న రికార్డు ఆధారంగా నా సాక్ష్యం కోర్టుకు వివరించాను. విజయం నన్నే వరించింది.

ప్రొ.ఎస్.ఎమ్.నూరుద్దీన్, నాటి మాగ్జిలో  ఫేషియల్ సర్జన్, ఎం.జి.ఎం.ఆసుపత్రి, వరంగల్.

అయితే నా తప్పులేకపోయినా అంతులేని మానసిక వ్యథకు గురిఅయ్యాను నేను. కోర్టు మీదుగా మార్కెట్‌కు వెళ్ళినప్పుడల్లా వణుకు వచ్చేది. ఇది నా జీవితంలో మరువలేని దురదృష్టకర సంఘటన. ప్రతి చిన్న విషయంలోనూ అప్రమత్తంగా వుండాలని ఈ అనుభవం ఒక పాఠం నేర్పినట్లయింది. మహానుభావులు శ్రీ కె.ఎస్.ఆర్.జి. ప్రసాద్ గారు బౌతికంగా మన మధ్య లేకపోయినా, నా హృదయంలో మాత్రం చిరస్థాయిగా నిలిచిపోతారు. ఆయన అందించిన ధైర్యము/భరోసా, మానసికంగా నన్ను గట్టిగా నిలబడేట్టు చేసింది. ఈ కేసు నడిచినంత కాలం నేను అనుభవించిన మానసిక వ్యథ అక్షరాల్లో చెప్పడం సాధ్యం కాదు మరి! ఇలాంటి సమస్య శత్రువుకి కూడా రాకూడదు!!

శ్రీ తాతిరాజు వేంకటేశ్వర రావు, అడ్వొకేట్

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version