Site icon Sanchika

జ్ఞాపకాల పందిరి-36

[box type=’note’ fontsize=’16’] “కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే…!!”అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్. [/box]

అలా.. ఊహించలేదు..!!

[dropcap]స[/dropcap]మాజంలో మంచి జరిగినా, చెడు జరిగినా, దానివల్ల ప్రజలకు లాభం జరిగినా, నష్టం జరిగినా, బాధ్యత గల వ్యక్తి ముఖ్యంగా రచయితలు లేదా కవులు స్పందించాలి. తమ రచనల ద్వారా ప్రజలలో చైతన్యం తీసుకురావాలి. ఈ సిద్ధాంతాన్ని నేను గట్టిగా నమ్ముతాను. నమ్మడమే కాదు అది స్వయంగా ఆచరించడానికి లేదా అమలు పరచడానికి నా శాయశక్తుల ప్రయత్నం చేస్తాను. స్పందించ వలసిన సమయంలో, స్పందించవలసిన వాళ్ళు స్పందించక పొతే అది సమాజానికి అన్యాయం చేసినట్టే అవుతుంది. భర్తీ చేయలేనంత నష్టం కూడా జరగవచ్చు.

స్పందించడం వరకూ బాగానే వుంది గానీ, స్పందించినంత మాత్రాన అందరూ లేదా సంబంధిత అధికార గణం ప్రతిస్పందిస్తుందా? అంటే, కావచ్చు, కాకపోవచ్చు. అది అవతలి వాళ్ళమీద ఆధారపడి ఉంటుంది. కాస్త సంయమనం పాటించి వెంటపడితే, అది సమంజసమైన అంశం అయితే, నలుగురికీ ఉపయోగపడేది అయితే తప్పక ఫలితాలు ఉంటాయి. లేదంటే కాస్త ఓర్పు అవసరం అవుతుంది అంతే! నా జీవితంలో ఇలాంటి మంచి అనుభవాలు చాలా వున్నాయి. అవి కేవలం నా స్వార్థం కోసమో, నా వాళ్ళ కోసమో స్పందించిన సందర్భాలు కానేకాదు, పదిమందికీ లేదా సమాజానికి అంతో ఇంతో ప్రయోజనం అయ్యేవే! అందుకే వాటి ప్రాధాన్యతలను బట్టి ప్రతిస్పందనలు జరిగి కొన్ని మంచి పనులు జరిగాయి. అందులో ఒకటి మీకు ఇక్కడ వివరించడమే నా ఈ ప్రయత్నం.

అవి నేను మహబూబాబాద్‌లో పని చేస్తున్న రోజులు. అప్పటికే రేడియో తోనూ, రేడియో కార్యక్రమాలతోనూ మంచి అనుబంధం ఏర్పడి వుంది. ఎక్కువగా నా ప్రాధాన్యతలు ‘దంత సంరక్షణ -నోటి పరిశుభ్రత’ ఆధారంగా ఉండేవి. అప్పటివరకు దంత సమస్యల మీద అంత విస్తృతంగా రేడియో ద్వారా ప్రసంగించిన వారు లేరనే చెప్పాలి. సాధారణ నిరక్షరాస్యుడైన శ్రోతకు సైతం నా రేడియో ఉపన్యాసాలు ఆకట్టుకొనే విధంగా ఉండేవి. కష్టమైన దంత వైద్య సాంకేతిక పదజాలాన్ని సాధారణ వాడుక భాషలోకి తర్జుమా చేసి వ్యాసాలు రాస్తూండేవాడిని. అందుచేత ఆకాశవాణి అధికారులూ – పెద్దలూ నన్ను బాగా ప్రోత్సహించేవారు. ఆకాశవాణి ద్వారా/దూరదర్శన్ ద్వారా నన్ను అత్యధికంగా ప్రోత్సహించిన మహానుభావులు ఎందరో.. వారిలో కొందరిని ఇక్కడ ప్రస్తావించక తప్పదు. శ్రీ సత్యవోలు సుందరసాయి, ఆర్. వెంకటేశ్వర్లు గారు, డా. పాలకుర్తి మధుసూదన్ రావు గారు, చలపతిరావు గారు, భీమయ్యగారు, మంత్రవాది సుధాకర్ గారు, శ్రీనివాస రెడ్డి గారు, జయపాల్ రెడ్డి గారు,సి. ఎస్.రాంబాబు గారు, శ్రీమతి సరోజ నిర్మల గారు, శ్రీమతి ఝాన్సీ. కె. వి. కుమారిగారు, బాబూ రావు గారు, మహమూద్ ఆలీ గారు, దక్షిణా మూర్తి గారు, వై. రాఘవులు గారు, రాజారావు, ఇలా ఎందరెందరో నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. వీరందరినీ ఎన్నటికీ మరువలేను.

ఇంజనీర్ శ్రీ ఎన్.బి.దాస్.. ఖమ్మం
శ్రీ మడిపెల్లి  దక్షిణామూర్తి
నాటి దూరదర్శన్ సంచాలకులు డా. పాలకుర్తి మధుసూదన్ రావు
శ్రీ మంత్రవాది సుధాకర్
శ్రీ సి.ఎస్.రాంబాబు, అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టర్, హైదరాబాదు

ఇక అసలు విషయానికొస్తే, ఖమ్మంలో నాకు కజిన్ బ్రదర్ (కొత్తవాళ్లు మా ఇద్దరినీ సొంత అన్నదమ్ములు అనుకునేవారు) నల్లి భగవాన్ దాస్ ఉండేవాడు (ఎన్. బి. దాస్‌గా ప్రసిద్ధులు). ఆయన అక్కడ ఇంజనీరు గా పనిచేసేవారు. కేవలం ఆ కుటుంబంతో గడపడానికి, నేను ప్రతి ఆదివారం ఖమ్మంలో క్లినిక్ నడిపేవాడిని. చాలా ఆనందకరమైన రోజులు అవి. ఖమ్మంలో క్లినిక్ పెట్టుకోవడానికి మిత్రులు డా. ఎం. వి. ఎల్. నరసింహారావు గారు (హోమియో వైద్యులు), డా. సత్యన్నారాయణ రెడ్డి గారు సహకరించారు. దీని ఆధారంగా నేను ఆకాశవాణి -కొత్తగూడెంకు, దంతసంరక్షణ సంబంధమైన వ్యాసాలు పంపుతుండేవాడిని. ఒకసారి నాకు అక్కడి నుండి కాంటాక్ట్ వచ్చింది. బొత్తిగా తెలియని ప్రదేశం. అయినా సాహసం చేసాను. బస్సులో కొత్తగూడెం వెళ్లి, అక్కడినుండి, రేడియో స్టేషన్‌కు ఆటోలో వెళ్లాను. వూరికి చాలా దూరంలో ఉంటుంది అది. మంచి వేసవి కాలం. కానీ ఆకాశవాణి ఆవరణలోకి చేరగానే, అక్కడి ఆహ్లాదకర వాతావరణానికి ఎంతో హాయి అనిపించింది. అది మామూలు ఎఫ్. ఎం,కేంద్రాలకు చాలా భిన్నంగా చక్కగా వుంది. స్వర్గీయ వెంగళరావు గారు కేంద్రమంత్రిగా వున్న కాలంలో ఆవిర్భవించిన ఆకాశవాణి కేంద్రం అది. భవనంకు ముందు మొక్కలతో చక్కని పూలవనంలా ఉండేది. ఆ వాతావరణం చాలా సంతోషాన్ని పంచింది. లోపలికి వెళ్లి సంబంధిత అధికారికి (PEX) నా కాంటాక్ట్ లెటర్ చూపించాను. బహుశా అప్పుడు మిత్రులు మహమూద్ ఆలీ గారు ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌గా ఉన్నట్టు వున్నారు. ఆయన అప్పటికే నాకు విజయవాడలో పరిచయం. ఆయన చాలా మర్యాద చేసి త్వరలో పిలుస్తామని, విశ్రాంతి గదిలో కూర్చోమని చెప్పారు. విజిటర్స్ విశ్రాంతి గది బాగుంది. కానీ పంకా సదుపాయం లేనందువల్ల చాలా ఉక్కబోతగా వుంది. సిబ్బంది ప్రతి గదిలోనూ కూలర్లు హోరెత్తిస్తున్నాయి. ఆ గదిలో నాలాంటి వారు నలుగురైదుగురు, నాలానే గాలి ఆడక ఇబ్బంది పడుతున్నారు.

క్లినిక్‌కు సహకరించిన డా.ఎం.వి.ఎల్. నరసింహరావు, ఖమ్మం.
ప్రసారభారతి డైరెక్టర్ జనరల్‌గా పని చేసిన తొలి తెలుగు వ్యక్తి శ్రీ రాపూరి వెంకటేశ్వర్లు గారు

ఇలా అలాంటి వాతావరణంలో ఇబ్బంది పడుతున్న సమయంలో, నాకు రికార్డింగ్ కోసం పిలుపు వచ్చింది. రికార్డింగ్ రూమ్‌లో ఏ.సి. ఉండడం వల్ల హాయిగా అనిపించింది. మనసు కుదుట పడింది. రికార్డింగ్ అయిపోయిన తర్వాత తేనీరు తాగించి, చెక్కు చేతిలో పెట్టారు. ఆనందంగా చెక్కు తీసుకుని, బస్సులో ఖమ్మం బయలుదేరాను. అక్కడినుండి రైలులో మానుకోటకు చేరుకున్నాను. ఇంటికి వచ్చాక ఒక ఆలోచన వచ్చింది, ఆలోచన రావడమే తరువాయి ఆచరణలో పెట్టేసాను. కొత్తగూడెం ఆకాశవాణి సంచాలకులకు ఒక ఉత్తరం రాసాను.

రేడియో కేంద్రం గురించి, సిబ్బంది గురించి, చాలా గొప్పగా రాస్తూ, ఈ మండు వేసవిలో సిబ్బంది అంతా హాయిగా కూలర్లు పెట్టుకుని, వేసవి తాకిడిని తప్పించుకుంటున్నారని, మరి ఎంతో దూరంనుంచి వస్తున్న మాలాంటి వారు కూర్చునే విశ్రాంతి గదిలో ఒక పంకా కూడా లేకపోవడం బాధాకరం అని.. ఇది మీ చేతిలో లేకపోయినా, ఒక బాధ్యత గల సాధారణ పౌరుడిగా మాత్రమే ఈ లేఖ రాస్తున్నానన్నది ఆ ఉత్తరం సారాంశం. నా.. ఉత్తరానికి వాళ్ళు భయపడి పోయి ఏదో చేస్తారని కాదు! స్పందించే నా గుణం ఆ.. పని చేయించింది అంతే. ఉత్తరం పోస్ట్ చేసి ఆ విషయం మర్చిపోయాను.

నేను ఉత్తరం రాసిన పది రోజులకు అనుకుంటాను, ఆకాశవాణి -కొత్తగూడెం స్టేషన్ డైరెక్టర్ గారి నుండి నాకు ఒక రిజిస్టర్డ్ లేఖ వచ్చింది. అది నాకు ఎంతో ఆశ్చర్యాన్నీ, ఆనందాన్నీ కలిగించింది. ఇలా కూడా జరుగుతాయన్న మాట అనిపించింది. సామాన్యుడి సణుగుడికి జవాబు దొరుకుతుందన్న నమ్మకం ఏర్పడింది.

ఇంతకీ డైరెక్టర్ గారి ఉత్తరంలోని సారాంశం ఏమిటంటే, విశ్రాంతి గదిలో పంకాలు లేకపోవడం నిజంగా కరెక్టు కాదనీ, విజిటర్స్‌ను ఇబ్బంది పెట్టడం మా ఉద్దేశ్యం కాదు అని, విషయం వారి దృష్టికి తీసుకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, మీ లేఖ చదివిన మరుక్షణమే విశ్రాంతి గదిలో రెండు పంఖాలు బిగించినామని, ఒకసారి వచ్చి చూడమని. స్పందించే గుణం, ప్రజల అవసరాలను అర్థం చేసుకునే అధికారులు ఉన్నంత వరకూ ఎలాంటి సమస్యలూ ఉండవని తెలుసుకున్నాను. తన జిల్లాకు శ్రీ వెంగళరావు గారు అందించిన సదుపాయాలు వృథా పోలేదని స్పష్టమయింది. ఈ సంఘటన ఎన్నటికీ మరువరానిది. ఆనాటి ఆ సహృదయ అధికారులకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను.

(మళ్ళీ కలుద్దాం)       

Exit mobile version