జ్ఞాపకాల పందిరి-4

63
2

[box type=’note’ fontsize=’16’] “కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే…!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్. [/box]

అమ్మో.. ! ఆపరేషనా.. !!

కష్టపడకుండా సంపాదించడం నేటి మానవనైజంగా మారింది. కష్టపడకుండా, వళ్లు కదపకుండా, కడుపులో చల్ల కదలకుండా ఎలా పనులు పూర్తి చేయాలి? ఎలా డబ్బు సంపాదించాలి? ఎలా పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి?అలా పనులు జరగడానికి ఏమేమి కుట్రలు పన్నాలి? ఎవరిని, ఎలా మోసం చేయాలి? ఎన్ని ఘోరాలు చేసి అనుకున్నవి అనుకున్నట్టుగా సాధించాలి? అనే విషయాల మీదే ఆలోచనలు, ప్రయోగాలూ జరుగుతున్నాయి తప్ప, సజావుగా, సరైన మార్గంలో ఏమి చేసి అనుకున్నవి సాధించాలి? అనుకునేవారు, ఆ దిశలో ఆలోచించేవారు, మన సమాజంలో బహు తక్కువ అయిపోతున్నారు. ఇది ఆలోచించవలసిన, విచారించవలసిన విషయం!

ముఖ్యంగా యువతీ యువకుల్లో ఈ జాడ్యం ఒక అంటువ్యాధిలా మారిపోయింది. జీవితంలో అనేక ఢక్కా మొక్కీలు తిన్న అనుభవజ్ఞులైన పెద్దలు కూడా ఈనాడు ఇటువంటి ఆలోచనా విధానానికి అతీతులు కాకపోవడం కాస్త ఆశ్చర్యంగానే అనిపిస్తుంది.

ప్రభుత్వాలు, ప్రజలకోసం ఏవైనా ప్రయోజనకరమైన పథకాలు ప్రారంభిస్తే, అవి మెల్లగా పట్టాలు తప్పి ఎవరి కోసమైతే ఆయా పథకాలు ప్రవేశ పెట్టబడ్డాయో, వారికి అందకుండా, వారికి తప్ప మిగతా పైరవీకారులకు అందే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎప్పుడూ దొంగదారిలో లేదా అడ్డదారిలో పోయి లబ్ధి పొందాలనే అంశాలమీదే మనస్సులు కేంద్రీకృతమై ఉంటాయి.

అందుచేతనే, పేదవారి కోసం, ఇతర బలహీన వర్గాల కోసం ప్రవేశ పెట్టే ప్రభుత్వ రాయితీలు, వివిధ పథకాలు, రూపం మార్చుకుని, తిరిగి.. తిరిగి, అవి మళ్ళీ బడాబాబుల పంచలకే చేరడం మనం కళ్లారా చూస్తూనే వున్నాం. ఇది ఇప్పుడు మన సమాజంలో ఆక్టోపస్‌లా అల్లుకుపోతున్న తప్పుడు ఆలోచనా విధానం. సబ్సిడీల పేరుతో ప్రభుత్వాలకు గుదిబండలుగా మారుతున్న ఆర్థిక వ్యయం వ్యవహారం. దీనికి రాజకీయ నాయకుల అండ, అనుకూలంగా వున్నరాజకీయ పార్టీల అండదండలు, ఇలాంటి తప్పుడు ఆలోచనలకు నాంది పలుకుతున్నాయి.

చోటా నాయకులను, పార్టీ సానుభూతిపరులను, ఇతర కార్యకర్తలను అదుపు చేసే శక్తి సామర్ధ్యాలు ఆయా ప్రభుత్వాలు, నాయకులు, పార్టీలు కోల్పోతున్నాయి. చేసే పని తప్పని తెలిసినా, యావత్ ప్రభుత్వయంత్రాంగాలు ఇలాంటి వారికి కొమ్ముకాయడం ఆశ్చర్యాన్ని, విడ్డూరాన్ని కలిగిస్తాయి.

సున్నిత మనస్కులైన పౌరుల మనస్సులను, ఈ చర్యలు విపరీతంగా గాయపరుస్తాయి. యువతీ యువకుల్లో క్రమశిక్షణ, శ్రమ విలువ లోపించి జీవితంలో తమ మనుగడకు తప్పుడు మార్గాలు ఎంచుకునే దౌర్భాగ్యపు పరిస్థితులు దాపురిస్తాయి. జీవితం, భవిష్యత్తు పట్ల నిర్లక్ష్యం, నిర్వేదం మొదలై ఆశ నిరాశల మధ్య జీవితం కొట్టుమిట్లాడుతుంది. ఒక్కోసారి ప్రతికూల పరిస్థితులను తట్టుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ ఒక ఉదంతాన్ని ఉదాహరణ పూర్వంగా విపులంగా వివరిస్తే తప్ప అందరికీ ఈ సమస్య అవగాహనలోనికి రాదు!

నా ఉద్యోగ పర్వంలో జరిగిన ఒక యథార్థ గాథ ఇప్పుడు మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను.

***

అది 1994వ సంవత్సరం. పన్నెండేండ్ల పాటు నిరంతరాయంగా మహాబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసి, బదిలీ అయి జనగామ (ఇప్పుడు జిల్లా) ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ అయ్యాను. అంతా కొత్త ప్రదేశం, కొత్త సహోద్యోగులు, కొత్త మనుష్యులు, కొత్త పేషంట్లు వగైరా. ప్రభుత్వ ఆసుపత్రులు, ముఖ్యంగా, తాలూకా ఆసుపత్రులు, వైద్య విధాన పరిషత్ ఆధీనంలోకి వచ్చిన పిదప కొన్ని జాతీయ వైద్య కార్యక్రమాలు నిర్వహణ అదుపు తప్పింది. అందువల్ల ‘కుటుంబ సంక్షేమం’ వంటి కార్యక్రమాలు నత్తనడక నడవడం మొదలుపెట్టాయి. వైద్య విధాన పరిషత్ సిబ్బందిపై అధికారం చెలాయించే వెసులుబాటు జిల్లా వైద్యాధికారులు కోల్పోవడం వల్ల కుటుంబ సంక్షేమ కార్యక్రమాల హడావిడి తగ్గుముఖం పట్టింది. జిల్లా వైద్యాధికారి గట్టిగా చెప్పలేని/మాట్లాడలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. అధికారుల అధికారాలు ఆ విధంగా కుదించబడ్డాయి

ఒకప్పుడు, వైద్య విద్యా కళాశాలలు, వాటి అనుబంధ ఆసుపత్రులు, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆధీనంలోను, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు – తాలూకా ఆసుపత్రులు జిల్లా ఆసుపత్రులు, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ఆధీనంలోను ఉండేవి. జిల్లా, తాలూకా ఆసుపత్రుల పరిపాలనా యంత్రాంగం పక్షాన ప్రాంతీయ వైద్యాధికారి, జిల్లా వైద్యాధికారి జవాబుదారీగా ఉండేవారు. ఆ విధంగా జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు సజావుగా, కట్టుదిట్టంగా జరిగేవి. అధికారుల అంచెలంచెల పర్యవేక్షణ ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమాలను జయప్రదం చేయడానికి అధికంగా ఉపయోగపడేది.

కాలక్రమేణా తర్వాత వచ్చిన మార్పులవల్ల అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో వైద్యవిధాన పరిషత్ ఏర్పడిన తర్వాత కమీషనర్ పర్యవేక్షణలో, జిల్లా ప్రధాన ఆసుపత్రులు, తాలూకా ఆసుపత్రులు చేర్చబడ్డాయి. జిల్లాల స్థాయిలో ‘జిల్లా కోఆర్డినేటర్లు తమ విధులను నిర్వర్తించేవారు. ఇటువంటి నేపథ్యంలో కుటుంబ సంక్షేమ కార్యక్రమాల పని తీరు తగ్గిన తర్వాతి కాలంలో, అప్పటి వరంగల్ జిల్లా కలెక్టరు గారు, ఒక మంచి (వింత) ప్రకటన చేసారు. అది సద్వినియోగం చేసుకుంటే ఎంతోమందికి లబ్ధి జరిగే అవకాశం వుంది. అది ఏమిటంటే – రైతులు, వ్యాపారస్తులు, ఇతర వర్గాలకు చెందిన లబ్ధిదారులు త్వరిత గతిన బ్యాంకు రుణాలు పొందడానికి ఒక వినూత్న పథకం అది. అదేమిటంటే, పిల్లలు పుట్టకుండా శస్త్ర చికిత్స చేయించుకుని, దాని ఆధార పత్రం సమర్పించిన వారికి బ్యాంకు రుణాలు మంజూరు చేయడంలో అధిక ప్రాధాన్యతనివ్వడం!

ప్రకటన వెలువడిందో లేదో, జనగామ ఆసుపత్రి రకరకాల ఆడ/మగ జనంతో క్రిక్కిరిసి పోవడం మొదలు పెట్టింది. అందరూ ఆ ధ్రువ పత్రాల కోసం ఎగబడడం మొదలు పెట్టారు. నిజాయితీగా శస్త్ర చికిత్స చేయించుకున్న వారు ధ్రువపత్రాలు ఆశించడంలో తప్పులేదు. వారికి ఆ హక్కు వుంది!

కానీ అక్కడికి వచ్చిన వారిలో ఎక్కువ శాతం దొంగ ధ్రువ పత్రాల కోసం వచ్చిన వారే! ఇదే అదను అనుకుని అక్కడి ఒక సీనియర్ వైద్యాధికారి జేబులు నింపుకోవడం మొదలు పెట్టాడు. శస్త్ర చికిత్స చేయించుకోకున్నా (వేసెక్టమీ లేక ట్యూబెక్టమీ) చేయించుకున్నట్టు ధ్రువ పత్రాలు ఇవ్వడం మొదలైంది. ఒక రోజు ఒక వ్యక్తి విషయంలో అంచనా తలక్రిందులై, జరుగుతున్న గుట్టు చప్పుడు కాని వ్యవహారం బట్టబయలు అయింది.

జనగామకు కొద్దిదూరంలో వుండే ఒక గ్రామం నుండి ఒక వ్యక్తి వేసెక్టమీ ధ్రువపత్రం కోసం ఒక చోటా రాజకీయ నాయకుడిని వెంటబెట్టుకుని వచ్చాడు. వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి ఒప్పందం కుదిరిందో గానీ, వ్యక్తిని బయట కూర్చోబెట్టి, ఆ చోటా నాయకుడు లోపలికి వెళ్లి డాక్టర్‌తో ఏమి మాట్లాడి వచ్చాడో తెలీదు కానీ, ‘భోజనం చేసి మధ్యాహ్నం వద్దాం’ అని చెప్పి బయటికీ తీసుకుపోయాడు. సరిగ్గా ఒంటిగంటకు మళ్ళీ ఇద్దరూ కలసి ఆసుపత్రికి వచ్చారు. నాయకుడు సదరు వైద్యుణ్ణి కలిసి మాట్లాడి వచ్చాడు. నాయకుడిని బయట కూర్చోబెట్టి, ఆ వ్యక్తిని ఆపరేషన్ థియేటర్ లాంటి ఒకగది లోనికి తీసుకు వెళ్ళాడు డాక్టర్.

పది నిముషాల తర్వాత లోపలి నుంచి కేకలు, ఏడ్పులు, ప్రతికేకలు, సముదాయింపులు, బ్రతిమాలాడాలు వినబడుతున్నాయి. అసలు అక్కడ ఏమి జరుగుతుందో బయటివాళ్ళకి తెలీడం లేదు. బయట కూర్చున్న నాయకుడు కాస్త టెన్షన్ ఫీల్ అవుతున్నట్టు కనపడ్డాడు. వ్యక్తి, వ్యక్తిని లోపలికి తీసుకు వెళ్లిన డాక్టర్ వాదోపవాదాలు బయటికి స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఎట్టకేలకు ఇద్దరు బయటికి వచ్చారు. రావడంతోనే నాయకుడి మీద విరుచుకుపడ్డాడు ఆ వ్యక్తి. నాయకుడు మెల్లగా ఎవరికీ వినిపించకుండా ఏదో సర్ది చెబుతున్నాడు. ఆ వ్యక్తి ఓ పట్టాన వినిపించుకోవడం లేదు. ఒకటే గొడవ చేస్తున్నాడు. సర్టిఫికెట్‌కీ ఈ గొడవకి మధ్య సంబంధం ఏమిటో చాలా సేపటి వరకు చాలామందికి అర్థం కాలేదు.

అసలు విషయానికి వస్తే – ఆ వ్యక్తికి బ్యాంకు లోన్ కావాలి. అది త్వరగా మంజూరు కావాలంటే, ప్రస్తుతం కలెక్టర్ గారి ప్రకటన ప్రకారం, అతనికి వేసెక్టమీ ధ్రువీకరణ పత్రం అవసరం. ఆతను గతంలో వేసెక్టమీ చేయించుకున్నా, ఇప్పుడు చేయించుకున్నా అతగాడికి అధికారికంగా ధ్రువపత్రం ఇవ్వబడుతుంది. కానీ ఆ వ్యక్తి గతంలో ఆపరేషన్ చేయించుకోలేదు, ఇప్పుడు చేయించుకోడానికి సిద్ధంగా లేడు. అందుకే ఒక ఒక యువ రాజకీయనేతను (పైరవీ కారుడు) ఆశ్రయించాడు. ఆతను వూరికే పైరవీ చేస్తాడు, అందుకే ఇద్దరూ ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు.

మరోవైపు డాక్టరు ఫీజు తీసుకుని సర్టిఫికెట్ ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. మరి రికార్డుల్లో లేకుండా అది ఇస్తే అతని ఉద్యోగానికి ముప్పు వచ్చే ప్రమాదం వుంది. అందుచేత పక్కా రికార్డు తయారుచేయాలి. ఆ రికార్డును బట్టి డాక్టరు ధ్రువపత్రం సులభంగా ఇవ్వగలడు. వెధవ పనులు చేయడానికి మార్గాలెన్నో కదా! అందుకే డాక్టర్ ఆలోచన ప్రకారం, ఆపరేషన్ (వేసెక్టమీ) చేసినట్టు ఒక గాటుపెట్టి దానికి కుట్లువేసి సర్టిఫికెట్ రాసి ఇవ్వడానికి రంగం సిద్ధం చేసుకుని ఆ వ్యక్తిని లోపలి తీసుకెళ్లాడు డాక్టర్. కానీ ఇది అర్థం కాని ఆ వ్యక్తి నిజంగా ఆపరేషన్ చేస్తున్నాడు అనుకుని, సహకరించకుండా గోల చేయడం మొదలు పెట్టాడు. సర్టిఫికెట్ అవసరాన్నిబట్టి, డాక్టర్ చెప్పినట్టు అతను వినాలి. కానీ అతను గొడవ చేయడానికీ ఒక కారణం వుంది. అదేమిటంటే – ఆ వ్యక్తి పెళ్ళిచేసుకుని పది సంవత్సరాలు అయినా, అతనికి పిల్లలు కలగలేదు. అందుకే ఎలాగో భార్యను ఒప్పించి నెలరోజుల క్రితమే మరదల్ని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు డాక్టర్ ఆపరేషన్ చేస్తే ఈమెకు కూడా పిల్లలు పుట్టరన్నది అతగాడి భయం. మొత్తం మీద అతనికి నచ్చజెప్పి అనుకున్న ప్లాను ప్రకారం పని ముగించారు. అతనికి సర్టిఫికెట్, డాక్టర్‌కు ఫీజు దండిగా ముట్టాయి. నాకు ఇలా ప్రభుత్వాన్ని మోసం చేయడం, ప్రభుత్వ పథకాలను నిర్వీర్యం చేయడం ఏ మాత్రం నచ్చలేదు. అందుచేత చేతిలో కలం అనే ఆయుధం ఉండడం వల్ల ఒక కథ ‘తిరగబడ్డ త్రికోణం’ రాసి తృప్తి పడ్డాను.

ముగింపు:

నేను కథ రాసి ఏదో గొప్ప పని చేశానని చెప్పడం కోసం ఈ ఉదంతం మీ ముందు ఉంచలేదు. ప్రభుత్వ పథకాలు ఎందుకు, ఎలా, విఫలం అవుతున్నాయి, ప్రభుత్వ పథకాలు ఎందుకు, ఎలా, దుర్వినియోగం అవుతున్నాయి, అధికారులు, సిబ్బంది, అవినీతికి ఎన్ని మార్గాలు ఆలోచిస్తున్నారో తెలియడానికి చిన్న ఉదాహరణగా మాత్రమే వివరించడం జరిగింది. పాఠకులు అర్ధం చేసుకుంటారన్నది నా ప్రగాఢ విశ్వాసం.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here