Site icon Sanchika

జ్ఞాపకాల పందిరి-42

[box type=’note’ fontsize=’16’] “కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే…!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్. [/box]

స్నేహ పరిమళం – సాహిత్య సుగంధం…!!

[dropcap]ఒ[/dropcap]క సాహిత్యకారుడు లేదా ఒక సాహిత్యాభిమాని లేదా సాహిత్యపిపాసి తనకంటూ ఒక ఇమేజిని పెంచుకుని దానిని మరింత విస్తృతం చేసుకోవడానికే ప్రయత్నిస్తాడు గానీ, తన వెనుక కదలి వచ్చే తరానికి తనదైన శైలిలో దిశానిర్దేశం చేయగల విశాల హృదయం గల సాహిత్యకారులు బహు తక్కువగా కనిపిస్తారు. ఎప్పటికీ తమ గురించే డప్పుకొట్టుకునే సాహితీ పెద్దలు, స్వార్థపరులై, తమను మించిపోతారనే భ్రమతో కనీసం కొంచెం కూడా ప్రోత్సహించడానికి ముందుకు రారు. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. చేయి తిరిగిన సాహిత్యకారులు (ఏ ప్రక్రియలోనైనా సరే) ప్రతి చిన్న పోటీలోనూ తమ అస్తిత్వం చూపించడానికి ప్రయత్నం చేస్తారు. పత్రికలు కూడా అలాంటివారినే ప్రోత్సహిస్తాయి. మరి తరువాతి తరానికి ప్రోత్సాహం ఎక్కడినుండి వస్తుంది? ప్రతి పోటీలోనూ వారే బహుమతులు గెలుచుకుంటారు. ఒక స్థాయికి వచ్చిన తరువాత, చేయి తిరిగిన రచయితలు లేదా కవులు ఇలాంటి పోటీలకు దూరంగా ఉండాలి. అంటే వారి సాహిత్య కృషిని తక్కువ చేయడం కాదు. ఒక స్థాయికి వచ్చాక, పేరు ప్రతిష్ఠలు సంపాదించుకున్నాక, యువతను ప్రోత్సహించడానికి కృషి చేయాలి. కానీ ఈ ప్రోత్సాహం సాహిత్యరంగంలో ఇప్పుడైతే ఎక్కడా కనిపించడం లేదు. కొద్దిమంది ఎవరూ చెప్పకుండానే, ప్రోత్సహించడం అనే పద్దతికి కట్టుబడి వుంటున్నారు. వారు నిజంగా అభినందనీయులే!అయితే అలాంటి వారు బహు తక్కువ. ఈ విషయంలో పత్రికలు కూడా కట్టడి చేయలేవు. ఆయా సాహిత్యకారులకే ఆ జ్ఞానం ఉండాలి. నాకు అతి దగ్గరి రచయిత, ఎన్నో మంచి కథలు, నవలలు రాసిన, అనువాదాలు చేసిన రచయిత పదవీ విరమణ చేసిన తర్వాత, తన రచనా వ్యాసంగాన్ని తగ్గించినప్పుడు అది గమనించిన నేను ఆయన్ను నేను అడగడం జరిగింది ఇలా –

“మీరు పదవీ విరమణ చేసిన తర్వాత మీ విశ్రాంతి సమయంలో మీ రచనా వ్యాసంగ సమయం పెరుగుతుందని భావించాను, కానీ మీరు తగ్గిస్తున్నారేమిటి?” అన్నాను. దానికి ఆయన సమాధానం నన్ను ఆశ్చర్య పరిచింది.

“ఇప్పటి యువత మంచి రచనలు చేస్తున్నారు, ఇక నేను రాయడం భావ్యం కాదేమో!” అన్నారు.

ఆయన వ్యాఖ్యానం నూటికి నూరుపాళ్లు సరి అయినది కాకపోయినా, యువతను దృష్టిలో ఉంచుకుని, ఆయన చేసిన వ్యాఖ్యానం స్వాగతించ దగ్గదేనేమో! ఎంతమంది వుంటారు అలా? అలా వున్నవారికి రెండు చేతులు ఎత్తి నమస్కరించ వలసిందే..! తన తర్వాతి తరాన్ని ప్రోత్సహించేవారిని గొప్ప సాహిత్యకారులుగా ప్రశంసించ వలసిందే! అలాంటి పెద్దల రచనలు యువరచయితలకు మార్గదర్శనం చేసేట్టుగా ఉండాలి తప్ప, వారి భవితను అడ్డుకునేవిగా వుండకూడదు. చేయి తిరిగిన రచయిత లేదా పేరు ప్రఖ్యాతులు వున్న రచయిత తన ప్రక్రియలో, అంటే ఉదాహరణకు కథా రచయిత, కథకులను, కవి, కవులను, నవలాకారుడు -నవల రచయితలను తన వంతుగా ఎంతమందిని తయారుచేయగలిగాం అని ఎవరికీ వారు ప్రశ్నించుకోవాలి.

నేనొక పెద్ద కథా రచయితను కాక పోవచ్చు, గొప్ప చేయి తిరిగిన కవిని కాక పోవచ్చును, అలాగే వ్యాసకర్తను కాక పోవచ్చు, కానీ.. నా స్థాయిలో నేను ఎంతోమంది రచయితలను, కవులను, వ్యాసకర్తలను తయారు చేసాను. వాళ్ళు నన్ను మించిన ప్రయోజకులైనారు. అది నాకు గర్వకారణమే! ఏ యోగ్యతా లేకున్నా వాళ్ళు నన్ను ‘గురువు గారూ..’ అని పిలుస్తుంటే చెప్పలేనంత ఆనందం! ఇలా చెబుతుంటే, నన్ను నేను పొగడుకుంటున్నాననే అపవాదు రావచ్చు. అందుకే నా గురించి నేను చెప్పడం కాస్త తగ్గించి, నా ప్రోత్సాహంతో అతి తక్కువ సమయంలో రచయితలుగా ఎదిగి పేరు తెచ్చుకున్నవారి గురించి ప్రస్తావిస్తాను. ఎందుచేతనంటే నా కళ్ల ముందు వారి ఎదుగుదల నాకు కాక ఎవరికి సంతోషాన్ని కలిగిస్తుంది?

నేను ఉద్యోగం చేస్తున్న కాలంలోనే,  వరంగల్ ఆయర్వేద కళాశాలలో పి.జి. చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న మిత్రుడు ఒకాయన ఉండేవాడు. డెంటల్ పేషేంట్‌గా ఆయన నాకు పరిచయం అయ్యాడు. మంచి వైద్యుడిగా, ఉపాధ్యాయుడిగా పేరు తెచ్చుకున్నవాడు. సంస్కృతం చదువుకున్నవాడు, మంచి ప్రతిభావంతుడైన ఆయర్వేద వైద్యుడు. మా డెంటల్ వైద్యం విషయంలో, మా ఇద్దరికీ సరిపడేది కాదు. వారి వైద్య విభాగంలో చికిత్సా విధానాలకూ, మాకూ చాలా తేడా ఉండేది. ఎప్పుడూ ఏదో అంశం మీద చర్చ లేవదీసి నన్ను విపరీతంగా విసిగించి నా చేత తిట్లు తినేవాడు. అది ఆయన సీరియస్‌గా తీసుకునేవాడు కాదు. పైగా ఆనందించేవాడు. నామీద ఆయనకున్న అభిమానమూ, గౌరవమే దీనికి ప్రధాన కారణం. స్నేహం పెరిగిన తర్వాత నన్ను ‘గురువు గారూ’ అని పిలిచేవాడు. క్లినిక్‌కు వచ్చినప్పుడల్లా తినడానికి ఏదో ఒకటి తెచ్చేవాడు. ఇలా మా స్నేహం బాగా పెరిగింది.

డా. కృష్ణమాచారి

అప్పట్లో పత్రికల్లో నా వ్యాసాలు వస్తుండేవి. అవి నా వృత్తికి సంబందించిన దంత వైద్యానికి సంబందించిన వ్యాసాలు. అవి ఆయనను బాగా ఆకట్టుకున్నాయి. ఆయనకు కూడా ఆయుర్వేదంలో వ్యాసాలు రాయాలనే కోరిక పుట్టింది. అదే విషయం నాతో ఒకరోజు చెప్పాడు. తప్పక రాయమన్నాను. నా సహకారం కావాలన్నాడు. సరేనన్నాను. ఒక సాయంత్రం తాను రాసిన వ్యాసం తీసుకుని నా క్లినిక్‌కి వచ్చాడు. ఆయనే డాక్టర్ కృష్ణమాచారి. ఆయుర్వేదంలో మంచి వైద్యుడు, మంచి ఉపాధ్యాయుడు కూడా! సంస్కృతంలో కూడా ఆయనకు మంచి పట్టు వుంది. అది నిరూపించడానికా.. అన్నట్టు, ఆయన తెచ్చిన వ్యాసం నిండా సంస్కృత శ్లోకాలు వున్నాయి. మామూలు చదువరికి అర్థం అయ్యే పరిస్థితి అసలు లేదు. పి.జి. విద్యార్థుల కోసం నోట్స్ రాసినట్టు వుంది. దానినే మళ్ళీ ఒక సామాన్య పాఠకుడికి అర్థమయ్యేలా రాసుకు రమ్మన్నాను. ఒక మామూలు విద్యార్థిలా చెప్పినట్టు చేసేవాడు. అరడజను సార్లు తిరగ రాసిన తర్వాత ఆతను ఒక మంచి వ్యాసం రాయగలిగాడు. నాకు అప్పుడు చాలా సంతోషం అనిపించింది. అతని పట్టుదలకు నేను చాలా గర్వపడ్డాను. ఆ తర్వాత ఆయన చాలా వ్యాసాలు రాసాడు. ఎక్కువగా.. ఆదివారం విశాలాంధ్రలో ఆయన వ్యాసాలు వస్తుండేవి. ఒక మంచి వైద్య విజ్ఞాన రచయితను తయారు చేయగలిగానన్న తృప్తి నాకు బాగా ఉండేది.

నాకు ఇష్టం లేకున్నా నన్ను ‘గురువు గారూ’ అని పిలవడానికి ఇష్టపడుతుండేవాడు. కానీ.. మా మైత్రి ఎక్కువకాలం నిలవలేదు! ఎవరూ ఊహించని వ్యాధి సోకి ఆయన స్వర్గస్థుడైనాడు. గుర్తుకు వస్తే ఇప్పటికీ అతని మరణం నాకు చాలా బాధ కలిగిస్తుంది.

సుమారు పాతికేళ్ల తర్వాత మా స్నేహాన్ని పునరుద్ధరించుకునే అవకాశాన్ని, సహృదయ మిత్రులు శ్రీ తోట సాంబశివరావు గారు నాకు కలగజేశారు. నేను మహబూబాబాద్‌లో దంత వైద్యుడిగా పని చేస్తున్న కాలంలో ఆయన అక్కడ ఆంధ్రా బ్యాంకు (ఇప్పటి యూనియన్ బ్యాంకు) మేనేజరుగా పనిచేసేవారు. అలా మేము స్నేహితులమై, బదిలీ కారణంగా 1994లో మేము విడిపోయాము. మళ్ళీ ఒకసారి కరీంనగర్లో కలిసే అవకాశం కలిగింది. తర్వాత నా గురించి ఆయనకు, ఆయన గురించి నాకు, ఎవరు ఎక్కడ ఉన్నారన్నది తెలీదు. తర్వాత అనుకోని రీతిలో మా అబ్బాయి పెళ్లి కార్డు మమ్మల్ని తిరిగి కలిపింది. చాలా ఆనందం అనిపించింది. మళ్ళీ మేము కలుసుకునే సమయానికి, నేను రచయితగా కాస్త నిలదొక్కుకుని, మూడు కథా సంపుటాలు వేసి వున్నాను. సాంబశివరావు గారు నటులు – నాటక ప్రియులు. అయితే కథా రచయితగా పత్రికల్లో తన పేరు చూసుకోవాలనే విపరీతమైన కోరికను ఆయన వెలిబుచ్చారు. అన్నదే తడవుగా, ఆయన విజృంభించారనే చెప్పాలి. ఆయన కథ రాసి మొబైల్‌లో నాకు వినిపిస్తుండేవారు. అప్పటికే ఒక నవల వ్రాత ప్రతి ఆయన దగ్గర వుంది. ఆయన వినిపించిన కథలకు నాకు తోచిన మార్పులు చెబుతుండేవాడిని. ఒక మంచి మనసుతో ఆయన ఆ మార్పులు అంగీకరించేవారు. అంతమాత్రమే కాదు తక్షణమే కథను తిరగ రాసి మళ్ళీ నాకు వినిపించేవారు. అలా కథా రచయితగా ఆయన ఆరంగేట్రం చేశారు. పత్రికలకంటే ముందు ఆయనను రేడియోకు (ఆకాశవాణి -హైదరాబాద్) పరిచయం చేసాను. అప్పటి శ్రీ మంత్రవాది మహేశ్వర్ గారి ఆధ్వర్యంలో రేడియోలో పలుమార్లు ఆయన కథలు చదివారు. తర్వాత శ్రీ సి. రాంబాబు గారి ద్వారా, శ్రీ నక్కా సుధాకర్ గారిని పరిచయం చేసుకుని రెండు రేడియో నాటికలు ఆయన ఆధ్వర్యంలో ప్రసారం అయ్యే అదృష్టం శ్రీ సాంబశివరావు గారికి కలిగింది.

శ్రీ తోట సాంబశివరావుగారు

తర్వాత ‘సంచిక’ అంతర్జాల పత్రికకు కథలు, నాటికలు రాస్తున్నారు. ‘సహరి’ అంతర్జాల పత్రికకు కూడా ఆయన కథలు రాస్తున్నారు. వృత్తిపరంగా ఆయన ఎదుర్కొన్న అనుభవాలను నలుగురికీ పంచే ఉద్దేశంతో త్వరలోనే ‘సంచిక’ పత్రికలో ఆయన ధారావాహిక రాయబోతున్నారు. అంత మాత్రమే కాదు, ఈ రచనా వ్యాసంగం మూలంగా అనేకమంది సాహితీ మిత్రులకు ఆయన దగ్గర అయ్యారు. పదవీ విరమణ తర్వాత విశ్రాంతి తీసుకోవలసిన వ్యక్తి, ఇప్పుడు పూర్తిగా తన సమయాన్ని సాహిత్య – సాంస్కృతిక కార్యక్రమాలకు వెచ్చించగలగడం నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అతి కొద్ది కాలంలోనే మంచి కథా రచయితగా తన స్థానాన్ని పదిలపరుచుకోవడం ఆయన పట్టుదలకు తార్కాణం. ఇలాంటి పట్టుదల వల్లనే సాంబశివరావు గారు బ్యాంకింగ్ రంగంలో ఉన్నత స్థానాలను అధిష్టించ గలిగారని నాకు అనిపిస్తుంటుంది. అంతటి వ్యక్తి నన్ను గురువుగారూ అని పిలుస్తుంటే, చెప్పొద్దూ.. నాకు సిగ్గుగానే ఉంటుంది. ఆయన అభిమానానికి చేతులెత్తి నమస్కరించవలసిందే! సాంబశివరావు గారు మరిన్ని రచనలు చేయగలరన్న నమ్మకం నాకుంది. నిజంగా ఆయన ఏకలవ్యుడే!

శిష్యరికానికి నిలువెత్తు సంతకం మా సాగర్ రెడ్డి. పూర్తి పేరు పెనుబోలు విద్యాసాగర్ రెడ్డి. నెల్లూరు వాస్తవ్యుడు, ఉద్యోగ రీత్యా చెన్నైలో ఉంటున్నాడు. ‘అపురూప జ్ఞాపకాలు’ సమూహంలో పరిచయం అయ్యాడు సాగర్ రెడ్డి. సాహిత్యం పట్ల అభిరుచి వున్నవాళ్లను ప్రోత్సహించడం నాకు మొదటి నుండీ వున్న జబ్బు కదా! అలా నా వలలో పడ్డ సాహిత్య పిపాసి సాగర్ రెడ్డి. తెలీని విషయం తెలుసుకోవడంలోనూ, మొహమాటం లేకుండా సందేహాలు నివృత్తి చేసుకోవడంలోను సాగర్ రెడ్డి తన ప్రత్యేక వ్యక్తిత్వాన్ని నిరూపించుకుంటున్న వర్ధమాన కవి. అతనిలో కవి అంతర్గతంగా వున్నాడు. కాస్త చేయి అందించగానే అతని విశ్వరూపం కవిత్వంలో చూపిస్తున్నాడు. గురువును మించిన శిష్యుడిగా ఎప్పుడో నేను అతనిని గుర్తించాను. ఎన్నో సమూహాలలో సాగర్ ఇప్పుడు సభ్యుడు. అందరికంటే ముందు తన కవిత సమూహంలో ఉండాలనుకునే క్రమశిక్షణ గల యువ కవి సాగర్ రెడ్డి. తన కవిత్వం ద్వారా, ఇతరుల కవిత్వం మీద తన అభిప్రాయాలు రాయడం ద్వారా సాగర్ రెడ్డి ఎంతోమంది సాహితీ మిత్రులను తన ఖాతా జమ చేసుకున్నాడు.

శ్రీ సిహెచ్. సాగర్ రెడ్డి

అతికొద్ది కాలంలోనే రెండువందలకు పైగా కవితలను ‘ప్రతి లిపి’లో జమ చేసిన రికార్డు సాగర్‌ది. ఈ మధ్యనే ప్రముఖ రచయిత శ్రీ ఇందూ రమణ గారు ప్రధాన అడ్మిన్‌గా నడుస్తున్న ‘ప్రియమైన రచయితలు’ గ్రూప్‌లో సాగర్‍ను చేర్చడం జరిగింది. అందులో ప్రతి రోజు ఒక ప్రత్యేకమైన అంశం మీద సాగర్ కవిత్వం రాస్తున్నాడు. ‘నానీలు’ ప్రక్రియలో తనదైన శైలిలో చెలరేగిపోతున్నాడు. ఈ మధ్య అంతర్జాల పత్రికా రంగంలో కూడా అడుగుపెట్టాడు. అతని ఉత్సాహం, పట్టుదల, నిజంగా ప్రశంసనీయం. తెలుగు సాహితీ క్షేత్రంలో మరో ఆణిముత్యం మనకు అందబోతుందన్న నమ్మకం నాకు వుంది. నా నమ్మకాన్ని వమ్ము చేయడనే ప్రగాఢ విశ్వాసం నాకుంది. సాగర్ రెడ్డికి నిండు మనసుతో నా అభినందనలు.

నేను ఎక్కువగా కవిత్వం రాయకపోయినా, నా రచనల్లో ఎక్కువ కవిత్వం లేకున్నా, నా ప్రేరణతో నన్ను మించి రాస్తున్న ఎవరినైనా నేను ఇష్టపడతాను. జీవితంలో నాకు మిగిలిన ఈ తృప్తి చాలు. నా ఆరోగ్యానికి, నా ఉత్సాహానికి, రచనా వ్యాసంగానికీ ఇదే ఇంధనం, ఇదే నన్ను నిత్యం ప్రేరేపించే అత్యుత్తమ కేటలిస్టు! ఈ స్నేహ పరిమళం ఇలాగే కొనసాగాలన్నది నా కోరిక.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version