Site icon Sanchika

జ్ఞాపకాల పందిరి-44

[box type=’note’ fontsize=’16’] “కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే…!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్. [/box]

పుస్తక రంగానికి పునాదిరాయి..!!

[dropcap]కొ[/dropcap]న్ని అపూర్వ విజయాల గురించి తలచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. అది నేనే చేసానా?, నా వల్లనే అయిందా?, నాకు సాధ్యమయిందా? ఇలాంటి అనుమానాలు తప్పక మదిలో మెదులుతాయి. ఆశ్చర్యపడడానికి అవకాశం కలిగిస్తాయి. కారణం ఏమిటంటే, అప్పుడు సాధించిన విజయాలకు సరిపడా వనరులు మనకు అనుకూలించక పోవడమే! ఇందులో ఆర్థిక వనరులు ప్రధానమైనవి. కోరికలు ఎన్నో ఉంటాయి, ఏదో చేయాలనీ, మరేదో సాధించాలనే గట్టి పట్టుదలే ఉంటుంది. మనం చేయవలసింది మనం శ్రద్ధగానే చేస్తాం. కానీ అది పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చడానికి సరిపడా ఆర్థిక వనరులు మనకు అందుబాటులో వుండవు. అలా అని నిరుత్సాహ పడకుండా నమ్మకం పెట్టుకుని ఆత్మవిశ్వాసంతో, ఆశాజనకంగా మనం చేయవలసినవి మనం చేసుకుంటూ దైర్యంగా ముందుకు పోయినప్పుడు, ఏదో రూపంలో మనకు అవసరమైన సహకారం ఊహించని రీతిలో మనకు అంది, అనుకున్నది సాధించే అవకాశం పుష్కలంగా ఏర్పడుతుంది. అలా అందరికీ ఏర్పడక పోవచ్చు గానీ, కొందరికి జరుగుతాయి. ఆ కొందరిలో నేనూ ఉండడం నా అదృష్టంగా నేను భావిస్తాను.

నిజానికి రచనా వ్యాసంగం నేను నాగార్జున సాగర్ (హిల్ కాలనీ)లో ఇంటర్ చదువుతున్నప్పటినుండీ మొదలుపెట్టినా, అది అప్పుడు మొగ్గ తొడిగినప్పటికీ, పువ్వై పరిమళించింది, నేను బి.డి.ఎస్ కోర్సులో జాయిన్ అయిన తర్వాతనే! అప్పుడు రచనలు చేయడానికి అవకాశాలు పుష్కలంగా లభించాయి. నా వృత్తిపరమైన దంత వైద్య విజ్ఞాన విశేషాలు గల వ్యాసాలతో నా రచనా వ్యాసంగం ఊపందుకుంది. నాటి ఈనాడు (ఆదివారం), ఆంద్ర పత్రిక నన్ను బాగా ప్రోత్సహించాయి. అందులో నాటి ఆంధ్రపత్రిక, కలువబాల మాసపత్రిక, బాలరంజని పిల్లల మాసపత్రిక సంపాదకులు శ్రీ వీరాజీ నన్ను చూడకుండానే,నా గురించి తెలియకుండానే,కేవలం నా రచనల ఆధారంగా నన్ను అధికంగా ప్రోత్సహించారు.

సంపాదకులు శ్రీ వీరాజి

అసలు అలా పత్రికలలో రాయడానికి సాహసించడానికి ముఖ్య కారణం, శ్రీ గోపరాజు సమరం గారు. శ్రీ రామోజీ రావు గారు ఈనాడు పత్రిక ప్రారంభించిన తొలి నాళ్లలో ఆదివారం ప్రత్యేక సంచిక (అప్పుడు పుస్తక రూపంలో ఉండేది కాదు) లో డా. జి. సమరం గారు ‘సెక్సు -సైన్స్’ శీర్షికతో వ్యాసాలు రాస్తూ ఉండేవారు. అప్పటి వరకూ శృంగారం అంటే బూతు అని పబ్లిక్‌గా పెదవి విప్పనివారు, ఆ యా విషయాలు బయట చర్చించుకునేవారు. అలా ఆ శీర్షిక విజయవంతమై పాఠక లోకానికి ఎంతో దగ్గరయింది. ముఖ్యంగా యువతీ యువకులు, ఆదివారం వచ్చే ఆ శీర్షిక కోసం ఎదురు చూసేవారు. అదిగో.. ఆ నేపథ్యంలో సమరంగారిని సలహా అడిగాను ‘నేను.. దంత వైద్య విజ్ఞానంకు సంబంధించిన వ్యాసాలు రాస్తే ఎలా ఉంటుంది’ అని. నా సహాధ్యాయిని డా. జె. క్రాంతి, సమరం గారి మేనకోడలు కావడంతో, సమరంగారితో సన్నిహిత సంబంధాలు ఉండేవి.

వైద్యులు-రచయిత, డా.గోపరాజు సమరం గారు

అందువల్ల, ఆయన తక్షణమే మొదలు పెట్టండని సలహా ఇచ్చారు. నాకైతే పత్రికా రంగానికి సంబంధించి ఎవరూ తెలియరు. అందుచేత చిరునామాలు సంపాదించి ఆ యా పత్రికలకు పంపేవాడిని. అలా ఈనాడు ఆదివారం ప్రత్యేక సంచికలో కొన్ని చిన్న చిన్న వ్యాసాలూ వచ్చాయి. ఆంద్ర పత్రిక – ఆదివారం ప్రత్యేక అనుబంధం, హైదరాబాద్‌లో శనివారం సాయంత్రమే వచ్చేసేది. అలా ఆంద్ర పత్రికలోనూ, దాని అనుబంధ పత్రికలలోనూ నానా వ్యాసాలు వస్తుండేవి. దానికి సంపాదకులు శ్రీ వీరాజీ గారికి నేనెప్పుడూ రుణపడి వుంటాను. అలా విద్యాభ్యాసం పూర్తి చేసుకుని,ఆ తర్వాత కూడా వ్యాసాలు రాస్తూండేవాడిని. అలా చాలా వ్యాసాలు రాయగలిగాను.

1982 జూన్ నెలలో, మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగం వచ్చింది. అక్కడ సాహిత్య వాతావరణాన్ని సృష్టించగల అనుకూల పరిస్థితులు పుష్కలంగా ఉండడంతో, అక్కడ పని చేయకుండా మూలన పడిపోయిన ‘సారస్వత మేఖల’ అనే సాహిత్య సంస్థ బోర్డు బయటికి తీసి సంస్థను పునరుద్ధరించే అవకాశం నాకు కలిగింది. ఆ సదావకాశాన్ని అక్కడి పెద్దలు నాకు కలిగించారు. అక్కడ సాహిత్య వాతావరణం తిరిగి ఊపందుకున్నది. ఈ నేపథ్యంలో, నేను రాసిన వ్యాసాలు పుస్తక రూపంలో తీసుకురావాలన్న దురాశ మస్తిష్కంలో మొలకెత్తింది. కానీ ఎలా? అప్పుడే ఉద్యోగంలో చేరిన మొదటి రోజులు. ఆర్ధికపరంగా పెద్దగా ఆశాజనకంగా లేని రోజులు. మరేలా సాధ్యం అవుతుంది? ఆలోచనల పరంపరతో బుర్ర వేడెక్కిపోతుండేది. ఎన్ని ఆలోచనలు చేసినా,  పుస్తకం వేయాలంటే డబ్బు అవసరం! మరి అదెలా సాధ్యం? చాలా రోజుల తర్వాత బుర్రకి ఒక ఆలోచన తట్టింది. ఆలోచన రావడమే తరువాయి.. అమలు చేయడం ప్రారంభించాను.

నాటి ఈనాడు నుండి ఇలా వచ్చేది

అదేమిటంటే విజయవాడ, హైదరాబాడ్ ప్రాంతాలలో వున్న కొన్ని గ్రంథ ప్రచురణ సంస్థల చిరునామాలు సేకరించి వారందరికీ ఉత్తరాలు రాయడం. తర్వాత ఆ ఉత్తరాల విషయం, పుస్తక ప్రచురణ విషయం మరుగున పడి పోయాయి. వేరే అత్యవసర కుటుంబ విషయాలలో నిమగ్నం కావాల్సి వచ్చింది.

కొన్నాళ్ల తర్వాత, నాకు గుర్తు చేస్తూ ఒక ఉత్తరం విజయవాడలో వున్న ఒక ప్రసిద్ధ పుస్తక ప్రచురణాలయం నుంచి ఒక లేఖ పోస్ట్ కార్డు రూపంలో వచ్చింది. అది చూసి ఆశ్చర్యపోవడం నా వంతు అయింది. ఆ పెద్ద పుస్తక ప్రచురణాలయం పేరు, ‘నవభారత్ బుక్ హౌస్, ఏలూరు రోడ్ విజయవాడ’.  దాని అధిపతి శ్రీ పుట్టగుంట ప్రకాశరావు గారు (ఇప్పుడు ఆయన లేరు, పుస్తక ప్రచురణాలయమూ లేదు). ఆ కార్డులో ఆయన ఇచ్చిన సమాచారం “మీరు ఒకసారి విజయవాడ వచ్చి కలవండి” అని.

స్వర్గీయ పి.ప్రకాశ రావు గారు

చాలా సంతోషం అనిపించింది,ఎందుకంటే ఇతరులు ఎవరూ నా ఉత్తరాలకు స్పందించలేదు. ఒక రోజు వీలు చేసుకుని విజయవాడ వెళ్లాను. అది 1986-87 ప్రాంతం అనుకుంటా. అప్పట్లో ప్రకాశరావు గారు చాలా ప్రముఖుల పుస్తకాలు వేస్తున్నారు. అందులో డా. సమరం, డా. ఇండ్ల రామసుబ్బారెడ్డి, యండమూరి వంటివారు ముఖ్యులు. నేను నవ భారత్ బుక్ హౌస్‌కు వెళ్ళగానే, ప్రకాశరావు గారు సాదరంగా ఆహ్వానించి, కూర్చోబెట్టారు. అప్పటికే, సమరం గారి పుస్తకాలు చాలా ముద్రించబడ్డాయి. తర్వాత సమరం గారి పుస్తకం ఒకటి నా ముందు పెట్టి “డాక్టర్ గారూ.. వైద్య విషయాల గురించి చాలా మంది రాస్తున్నారు, కానీ సమరం గారి పుస్తకాలే ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. ఎందుచేత అనేది నాకు తెలీదు.. మీరే ఆ పుస్తకం చదివి తెలుసుకోవాలి. మీరు ఇంటికి వెళ్లిన తర్వాత కొత్త వ్యాసం ఒకటి రాసి పంపండి చూద్దాం” అని నాకు ఎంతో సౌమ్యంగా సలహా ఇచ్చారు.

కొద్దీ రోజుల తర్వాత ఒక వ్యాసం రాసి ప్రకాశరావు గారికి పంపించాను. ఆ వ్యాసం ఆయనకు నచ్చింది. వెంటనే మొత్తం వ్యాసాలన్నీ పంపమని ఉత్తరం రాశారు. నేనే స్వయంగా విజయవాడలో ఆయనకు నా వ్యాసాలన్నీ సమర్పించాను. అప్పుడు ఆయన మరొక విషయం నాకు చెప్పారు. పుస్తకం వేసే ముందు ఓ ప్రాంతీయ దిన పత్రిక (జనత.. అని గుర్తు)లో రోజూ ప్రచురించాక పుస్తకం వేద్దాం అని చెప్పారు. దానికి నా సమ్మతిని తెలియ జేసాను. ఎలాగైనా నా పుస్తకం పబ్లిష్ అయి ప్రజల్లోకి వెళ్లాలన్నది నా ప్రగాఢ వాంఛ.

ఆయన అన్నట్టుగానే, దిన పత్రికలో ప్రతి రోజూ నా దంత వైద్య విజ్ఞాన వ్యాసాలు వస్తుండేవి. చాలాకాలం వరకు ప్రకాశరావు గారినుండి ఎలాంటి సమాచారమూ లేదు. నేను కూడా వారిని అడగడానికి సాహసించలేదు.

అయితే మహబూబాబాద్‌లో ప్రాంతీయ వారపత్రిక ఒకటి ఉండేది. ఆ పత్రిక పేరు ‘వార్తా లహరి’. ఆ పత్రికను ఎం.ఏ. ఉబేద్ అనే వ్యక్తి నడుపుతుండేవాడు. ఆయన నా గురించి తెలుసుకుని,ఆయన పత్రిక కోసం దంత వైద్యం మీద వ్యాసాలు రాయమన్నారు. అప్పుడు చిన్న పిల్లల పంటి సమస్యలపై వారం.. వారం వ్యాసాలు రాయడంలో మునిగి పోయాను. విజయవాడ పుస్తకం సంగతి మరచిపోయాను. పుస్తకం తప్పక వేస్తారనే నమ్మకం వుంది గానీ, ఆలస్యం కావచ్చునేమో అనుకున్నా, పెద్దగా టెన్షన్ పడ లేదు. నా దృష్టి పూర్తిగా పిల్లల దంతాల ఆరోగ్యం గురించిన వ్యాసాలమీదే పడిపోయింది.

ఒక శుభోదయాన,నేను ఆసుపత్రిలో పనిలో ఉండగా పోస్టుమేన్ ఒక కవరు తెచ్చి నా చేతిలో పెట్టాడు. దానిమీద నవభారత్ బుక్ హౌస్ లోగోతో ఫ్రమ్ అడ్రసు వుంది. అది చూడగానే,ఒక వైపు సంతోషం మరోవైపు భయం.. ఎలాంటి వార్త చదవాల్సి ఉంటుందోనని. అయినా ఆత్రంగా కవరు తెరిచాను. ఆశ్చర్యం ఏమీ సమాచారంలేదు,కానీ కాగితం మీద పచ్చ జండా బొమ్మ వేసి వుంది. అది అర్థం చేసుకోవడానికి ఆ తొందరలో చాలా సమయం పట్టింది. తర్వాత హాయిగా నవ్వుకున్నాను. చాలా సంతోషం వేసింది. వెంటనే ధన్యవాదాలు చెబుతూ ఆయనకు ఉత్తరం రాసాను. చాలా రోజుల తర్వాత నాకు పోస్టులో పాతిక కాపీలు వచ్చాయి.

నవ భారత్ బుక్ హౌస్ లోగో

అలా.. నా మొదటి పుస్తకం పేరు ‘దంత సంరక్షణ’ నవభారత్ బుక్ హౌస్ – ప్రకాశరావు గారి ద్వారా వెలుగు చూసింది. ఆకర్షణీయమైన ముఖ చిత్రంతో, పుస్తకం చాలా అందంగా ముద్రించారు. నాకు తెలిసి తెలుగులో మొదట దంత సమస్యలమీద పుస్తకం రాసింది (ఈనాడు ఆదివారం ప్రత్యేక సంచికలో వచ్చినవి) పద్మశ్రీ డా. ఏ. ఎస్. నారాయణ గారు. తర్వాత రాసింది నేనే. ఈ రెండు పుస్తకాలూ విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాయి.

నా మొదటి పుస్తకం నాకు ఎంతో గౌరవాన్ని తెచ్చిపెట్టింది. ప్రకాశరావు గారు, సమరంగారు, ఇండ్ల రామసుబ్బారెడ్డి వంటి మహామహుల్ని నాకు పరిచయం చేసింది. ఆ.. తర్వాత, చిన్నపిల్లలు -దంతసమస్యలు, దంతాలు – ఆరోగ్యం, పిప్పిపన్ను – చికిత్స, అనే పుస్తకాలు వెలుగు చూడడానికి మార్గం సుగమం చేసింది. ఆ తర్వాత ఇదే పుస్తకాన్ని తిరిగి విశాలాంధ్ర బుక్ హౌస్ – హైదరాబాడ్ వారు ప్రచురించి నాకు మరింత ఉత్సాహాన్ని కలిగించారు. నాటి బుక్ హౌస్ మేనేజర్ రాజేశ్వర రావు గారిని మరచిపోలేను, వారికి హృదయ పూర్వక ధన్యవాదాలు. నాకు ఉచితంగా పుస్తకం ప్రచురించి ఇచ్చి పరోక్షంగా నా రచనా వ్యాసంగాన్ని ప్రోత్సహించిన శ్రీ నవ భారత్ ప్రకాశరావు గారికి ఎంతగానో రుణపడి వుంటాను. ఇప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, అంత మంది మహామహులైన రచయితలైన వారి పుస్తక ముద్రణలో నిమగ్నమైన ఆయన, వారి మధ్య నాలాంటి సాధారణ రచయితకూ చోటివ్వడం ఆయన సహృదయతకూ, ప్రోత్సాహ గుణానికీ నిదర్శనాలు. ఇప్పుడు ఆయన లేరు. ఆయనతో పాటు ఒక వెలుగు వెలిగిన ఏలూరు రోడ్డు లోని ‘నవ భారత్ బుక్ హౌస్’ లేదు. ఆయన ప్రచురించిన పుస్తకాలు, ఆయన మంచితనం, జ్ఞాపకాలుగా మిగిలి వున్నాయి. ప్రకాశరావు గారూ మా హృదయాల్లో మీరు శాశ్వతంగా కొలువై వుంటారు.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version