Site icon Sanchika

జ్ఞాపకాల పందిరి-46

[box type=’note’ fontsize=’16’] “కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే…!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్. [/box]

బ్రతుకు దెరువుతో.. బెదిరింపు..!!

[dropcap]మ[/dropcap]నిషి వ్యక్తిత్త్వాన్ని బట్టి, మాట తీరును బట్టి, ప్రవర్తనను బట్టి అతనికి లేదా ఆమెకి గౌరవం లభిస్తుంది. ఇది ఎక్కడైనా జరిగే పనే. మన మాట వక్రంగా ఉంటే, ఎదుటి వాళ్ళు కూడా వక్రంగానే ప్రవర్తిస్తారు. ఇది సహజమే!ఇది తెలీక తమ పదవిని అడ్డుపెట్టుకునో, హోదాను అడ్డు పెట్టుకునో, ఆస్తులు – అంతస్తుల ప్రభావం వల్లనో కొంతమంది అతిగా ప్రవర్తిస్తారు. వాళ్ళు చేసే పని కరెక్ట్ అనుకుంటారు. వాళ్ళ ఓవర్ యాక్షన్ వాళ్ళకే సంతోషాన్ని కలిగిస్తుంది కానీ ఇతరులకు కాదు. అందుకే హోదాలకు, పదవులకు, అతీతంగా మన ప్రవర్తన ఉండాలి. గౌరవం/మర్యాద ఇచ్చి పుచ్చుకునేవిగా ఉండాలి గానీ, మరోలా కాదు. చిన్నప్పుడు మా నాయన ఎప్పుడూ ఇదేవిషయం ప్రస్తావించేవారు. “ఏమండీ.. అంటే – ఏమండీ.. అనాలి, అరేయ్.. అంటే.. ఒరేయ్.. అనాలి” అని చెప్పేవారు. ఆంగ్లంలో దీని గురించి మంచి నానుడి కూడా వుంది. ‘గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్’ అని. ఇది తెలియక, అక్షర జ్ఞానం కలవారు సైతం అతిగా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి అనుభవాలు ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఏదో ఒక సందర్భంలో ఎదురుకాక మానవు. నా జీవితంలో (ఉద్యోగ పర్వం) ఎదురైన రెండు సంఘటనలను లేదా అనుభవాలను మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. ఇవి ఇతరులకు కూడా ఎదురు కావచ్చు. అందుచేతనే దీనిని ఒక ప్రత్యేక అంశంగా ప్రస్తావించడం.

నేను 2005లో కరీంనగర్ జిల్లా ప్రధాన ఆసుపత్రికి డిప్యూటీ సివిల్ సర్జన్ ప్రమోషన్‌తో వెళ్లాను. అప్పటికి సివిల్ సర్జన్ పోస్ట్ ఖాళీగా ఉండడం వల్ల నేనే హెడ్‌గా వున్నాను. ఆ మొదటి రోజుల్లో నేను ఓ.పి విభాగంలో పేషేంట్స్‌ను చూడడంలో నిమగ్నమై వున్నప్పుడు, లైన్‌లో నిలబడకుండా డైరెక్ట్‌గా నా సీట్ దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. సూటు బూటూ, నెక్ టై, చాలా స్టైల్‌గా వున్నాడు. నలభై లోపు వయసు వాడు, చూడ్డానికి చాలా అందంగా వున్నాడు. అతని వాలకం చూస్తే, ఎందుకో అతనికి కుర్చీ ఆఫర్ చేసి కూర్చోమనబుద్ధి కాలేదు. నాపని నేను చేసుకుంటూ పోతున్నాను. నన్ను ఆకర్షించడానికి రెండు మూడు సార్లు దగ్గాడు కూడ. అయినా నేను పట్టించుకోకపోవడం గమనించి “సార్.. అయాం ఫ్రమ్ ది డెక్కన్ క్రానికల్” అన్నాడు.

“అవునా.. నన్ను ఇంటర్వ్యూ చేస్తారా?” అని అడిగాను.

“లేదు సార్..” అన్నాడు కొంచెం సీరియస్‌గా.

“మరి..?.. నన్ను ఏమైనా రాయమంటారా?” అన్నాను.

“ఆహా.. అది కాదు సార్..” అన్నాడు.

“మరీ.. ఏదైనా వార్త రాసుకుంటారా” అన్నాను.

“కాదు సార్.. నాకు క్రింది దవడ చివరి పన్ను నొప్పిగా వుంది.. చూపిద్దామనీ..” అంటూ నసుగుతున్నాడు. అప్పుడు కూర్చోమని నా ఎదురుగా వున్నా కుర్చీ చూపించాను. ఆ తర్వాత..

“చూడండీ, మీ పంటి నొప్పికి మీరు పని చేసే ఆంగ్ల పత్రికకీ అసలు సంబంధం ఏమైనా ఉందా?” అని సూటిగానే అడిగాను.

“లేదు సార్.. అలా చెబితే బాగా చూస్తారనీ..” అన్నాడు, కాస్త సిగ్గు ముఖం పెట్టి.

“అలాంటివి ఇక్కడ, అంటే నా దగ్గర పనికి రావు. నాకు అందరూ సమానమే! మీరు ముందే మీ పంటి సమస్య చెప్పి ఉంటే బాగుండేది. మీ లాంటి వాళ్ళు ఒకళ్ళకి చెప్పేవాళ్లు గానీ,చెప్పించుకునే వాళ్ళు కాకూడదు” అని, “గతంలో మీరు ఈ ఆసుపత్రికి ఎప్పుడైనా వచ్చారా?” అన్నాను.

“రాలేదు సార్..” అన్నాడు, కాస్త ఇబ్బందిగా.

“ఈ ఆసుపత్రి అవసరాలు ఏమిటో, ఎప్పుడైనా కనుక్కుని మీ పత్రికలో రాశారా?” అన్నాను.

“లేదు సార్..” అన్నాడు.

“ఈ ఆసుపత్రిలో ఎంతమంది డాక్టర్లు వున్నారో,ఇంకా ఎంతమంది అవసరమో మీకు తెలుసా?” అన్నాను.

“తేలీదు సార్..” అన్నాడు, కాస్త ఇబ్బందిగా.

“ఈ ఆసుపత్రికి అవసరమైన పరికరాలు సరిపడా ఉన్నాయో లేదో మీకు తెలుసా..?” అన్నాను.

‘తెలీదు’ అన్నట్టు తల అటూ ఇటూ ఊపాడు. అప్పుడు నేను ఇలా అన్నాను – “చూడు బాబూ.. నీ.. ఉద్యోగం ద్వారా నీకు సంక్రమించిన ఈ అధికారం, స్వార్థానికి ఉపయోగించుకోకు, సమాజం కోసం, ప్రజల కోసం సరైన పద్ధతిలో ఉపయోగించు. అప్పుడు ప్రజల్లో నీకు గౌరవం పెరుగుతుంది, జీవితంలో తృప్తి మిగులుతుంది. ఇప్పుడు చెప్పండి.. మీ సమస్య..” అన్నాను.

ఎక్కడా ఎదురుకాని సమస్య, అతనికి నాతో ఎదురైంది. ఇది అతను ఊహించని సన్నివేశం. ముఖం కాస్త రంగు మారింది. కొద్దీ క్షణాలు మా మధ్య నిశ్శబ్దం ఆవరించింది. తర్వాత, అతనే లేచి నిలబడి

“మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను సార్..” అని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు. జనగాం అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, మర్నాడు పేపర్లో ఏదో నాకు వ్యతిరేకంగా వార్త వస్తుందని ఊహించాను. కానీ వార్తా రాలేదు, మళ్ళీ అతను నన్నెప్పుడూ కలవలేదు. ఇదొక మరచిపోలేని జ్ఞాపకం. పత్రికల్లో పనిచేసే కొందరు, తమ పదవిని లేదా బ్రతుకు దెరువును ఎలా దుర్వినియోగం చేస్తారో, ఉద్యోగులను ఎలా భయపెడతారో చెప్పడానికి ఈ చిన్ని సంఘటన ఉదాహరించాను. అంతేకానీ మొత్తం పత్రికా రంగం అంతా ఇలానే ఉంటుందని చెప్పడం నా ఉద్దేశం కాదు.

నేను మొదట మహబూబాబాద్‌లో ఉద్యోగంలో చేరిన పిదప జరిగిన సంఘటన కూడా చెప్పాలి. నేను అక్కడ ఉద్యోగంలో చేరి అప్పటికి రెండు నెలలు అయింది. అప్పటికి పెద్దగా ఎవరితోనూ ఎక్కువ పరిచయాలు లేవు. కొద్దీ మంది ప్రైవేట్ డాక్టర్లు మాత్రం పరిచయం అయినారు. ఒకరోజు, ఒకానొక పాపులర్ దినపత్రికలో ఒక వార్త వచ్చింది. అది చదివి నిర్ఘాంతపోవడం నా వంతైంది. ఆ వార్త సారాంశం ఏమంటే, మహబూబాబాద్ తాలూకా ఆసుపత్రిలో (ఇప్పుడు అది జిల్లా ఆసుపత్రి) గత కొంతకాలంగా దంతవైద్యుడి పోస్టు ఖాళీగా ఉందని, పంటి సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారనీను. నాకు అప్పటికే రచనా వ్యాసంగంలో అనుభవం వుంది. నేను అక్కడ దంతవైద్యుడిగా చేరి అప్పటికే రెండునెలలు పైన అయిపోయింది. మరి ఆ పత్రికా ప్రతినిధి విషయాలు అవగాహన లేకుండా ఇంట్లో కూర్చుని వార్తలు తనకు తోచిన రీతిలో రాసేస్తున్నాడు. నేను ఏమాత్రం భయపడలేదు,ఎవరినీ సంప్రదించలేదు. సరాసరి హైదరాబాద్ లోని ఆ పత్రిక మేనేజింగ్ డైరెక్టర్‌కే ఉత్తరం రాసాను. రెండు రోజుల్లో నా ఆ ఉత్తరం మెయిన్ పేజీలో వార్తగా వచ్చి ఆ పత్రికా ప్రతినిధిని నా దగ్గరకు తీసుకు వచ్చింది. నేను చేసిన పనికి అతను మాత్రమే కాదు, ఆసుపత్రి సిబంది కూడా ఆశ్చర్యపోయారు.

ఆతను ‘క్షమాపణ’ కోరాడు. తర్వాత మంచి మిత్రుడైనాడు,అది వేరే విషయం.

ఒక మంచి పనికోసం వార్త రాయడంలో తప్పులేదు. ఒక అభివృద్ధి పనికోసం ప్రజల్ని అప్రమత్తం చేయడంలో,ప్రభుత్వం దృష్టికి తీసుకు రావడంలో తప్పు లేదు. కానీ తమ వార్త కోసం ఎదుటి వ్యక్తిని బలి చేయడం పొరపాటు మాత్రమే కాదు, ఘోరమైన నేరం కూడ! ఈ సమస్యను ఆసుపత్రులు మాత్రమే కాదు,ఇతర రంగాలకు సంబందించిన కార్యాలయాలు కూడా ఎదుర్కొంటున్నాయి. ఈ పత్రికా ప్రతినిధులు ప్రజా సౌఖ్యం కోసం,దేశ సౌభాగ్యం కోసం మాత్రమే కృషి చేయాలి తప్ప ప్రజలను, ప్రభుత్వాలను తప్పుదోవ పట్టించే విధంగా వుండకూడదు. స్వార్థం కోసం పని చేసే పత్రికలు ఎక్కువకాలం నిలవవు. తమ పనిని తాము సజావుగా చేసుకోనివ్వకుండా, స్వార్థ ప్రయోజనాల కోసం, ప్రజలను, ప్రజా ప్రతినిధులను, ఉద్యోగులను, ఇబ్బందులకు బలిచేసే చోటా మోటా, పత్రికలూ ఇంకా అక్కడక్కడా లేకపోలేదు. అలాంటి వారిని ప్రోత్సహించక,తగిన బుద్ధి చెప్పవలసిన బాధ్యత ప్రజలదే మరి!

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version