Site icon Sanchika

జ్ఞాపకాల పందిరి-48

[box type=’note’ fontsize=’16’] “కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే…!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్. [/box]

నేను పిసినారినా ఏమో…!!

[dropcap]స[/dropcap]మాజంలో భిన్నమైన వ్యక్తులు, భిన్నమైన వ్యక్తిత్వాలను కలిగి వుంటారు. ఈ విభిన్నమైన మనస్తత్వాలు కొందరికి పుట్టుకతోనే ప్రాప్తిస్తే, మరి కొందరికి పరిసరాల ప్రభావాన్ని బట్టి, కుటుంబ నేపథ్యాన్ని బట్టి సంక్రమిస్తు ఉంటాయి. మంచి వ్యక్తిత్వము -మంచి మనస్తత్వం గల మంచి మనుష్యులను లోకం ఎప్పుడూ కొనియాడుతుంది. అందరూ ఇలాంటి సుగుణాలనే కలిగి వుంటారా? అంటే అది సాధ్యమయ్యే పనికాదు. అలా అయితే సమాజంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలు ఎందుకుంటాయి? అయితే, అందరూ మంచి గుణాలతో మంచిగుండాలనే కోరుకుంటాం.

మంచి- చెడుల మధ్య స్వార్థం అనేది ఒకటి ముఖ్య భూమిక పోషిస్తుంది. ఒక కుటుంబంలోనే, ఎవరికివారు కేవలం తమకోసమే ఆలోచించడం, మిగతా వారిని పట్టించుకోకపోవడం జరుగుతుంటుంది. ఇలా కాకుండా మరి కొంత మంది, తమ త్యాగ గుణంతో ఎదుటి వారి సుఖం, సంక్షేమం కోసం లేదా యావత్ కుటుంబం కోసం తపన పడుతూ వుంటారు. అలాంటి వాళ్ళు తల్లిదండ్రులు కావచ్చు,అన్నదమ్ములు-అక్కాచెల్లెళ్లు కావచ్చు.

కుటుంబ బాంధవ్యాలు చాలా మట్టుకు కనుమరుగై పోతున్నప్పటికీ, ఇంకా పూర్తిగా ఆ పరిస్థితి రాలేదు అనడానికి ఇంకా కొన్ని ఉదాహరణలు మన ముందు కదలాడుతూనే వున్నాయి. ఆ జాబితాలో నాలాంటి వాళ్ళు కొందరు తప్పక ఉంటారన్నది నా నమ్మకం! తన సుఖాలూ – సౌఖ్యాలూ కొంత కాలం పక్కన పెట్టి కుటుంబం భవిష్యత్తు కోసం ఆరాటపడే వాళ్ళు ఇంకా వున్నారు.. అని చెప్పడానికే ఈ ఉపోద్ఘాతమంతా. ఎందుచేతనంటే ఈ.. మాత్రం కూడా లేకపోతే మొత్తం కుటుంబ వ్యవస్థ కుప్పకూలిపోయి, బంధుత్వాలూ-బాంధవ్యాలూ, క్రమంగా కనుమరుగయ్యే ప్రమాద పరిస్థితి ఏర్పడుతుంది. అంత మాత్రమే కాకుండా కుటుంబంలో అశాంతి ప్రబలి సుఖ- శాంతులు కరువయ్యే దుస్థితి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో నా జీవితంలోని దీనికి సంబందించిన కొన్నిఘట్టాలను వివరించడం ద్వారా, ఇది ఏ కొద్దిమందికి ఉపయోగపడిన ఈ వ్యాసానికి ప్రయోజనం సిద్ధించినట్టే అవుతుంది.

నేను 1964 ప్రాంతంలో వైద్యరీత్యా పెద్దన్నయ్య మీనన్ దగ్గరికి హైదరాబాద్‌కు వెళ్లాను. అప్పటికి కొద్దీ సంవత్సరాల క్రితమే అన్నయ్యకు ఉద్యోగం రావడం వల్ల, అయన కూబ్ధీగూడలో ఉండేవాడు. ఆయన ఏ.జి. ఆఫీసులోనూ, వదిన నీటిపారుదల శాఖలో (పిక్చర్ హౌస్, లక్డి కాపూల్) పని చేసేది. వీరిద్దరి సేవల పుణ్యాన ఆరోగ్యవంతుడిని కావడమే కాకుండా కొన్ని జీవితసత్యాలను పరిశీలించడంతో పాటు, నా భవిష్యత్తు కోసం కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందులో మొదటిది అతి ముఖ్యమైనది ‘పొదుపు’. దీని విలువ, లోతుపాతులూ అంతగా అప్పట్లో అవగాహన లేకుండానే, పొదుపు విషయంలో నేను తీసుకున్న నిర్ణయాల గురించి ఇప్పుడు ఆలోచిస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. నేను పొదుపు విషయంలో అంత జాగ్రత్త పడడానికి కారణం వుంది. అది అన్నయ్య జీవితంలో నుండి తీసుకున్నదే!

మా కుటుంబంలో, బంధువుల్లో మొదట హైదరాబాద్‍లో కాపురం వున్నది మా పెద్దన్నయ్య. అందుచేత, బంధువులు స్నేహితులు ఎవరు ఏ పనిమీద హైద్రాబాద్‌కు వచ్చినా మొదట దిగేది ఈ ఇంట్లోనే. అన్నయ్య, స్టేషన్ కు వెళ్లి మరీ తీసుకు వచ్చేవాడు. ఆ జాబితాలో గల్ఫ్ దేశాలకు వెళ్లే వాళ్ల పాస్‌పోర్ట్ పనులు, నిరుద్యోగుల ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ పనులు అధికంగా ఉండేవి. ఆ ఆఫీసులకు అన్నయ్య తన వెస్పా స్కూటర్ మీద వాళ్ళను తిప్పేవాడు. బంధువుల రాకపోకలు కూడా అధికంగానే ఉండేవి. ఈ నేపథ్యంలో ఆయన కొద్దిపాటి జీతం పదో తారీఖు లోపు అయిపోయేది. అప్పులు బాగా చేసేవాడు. జీతం రాగానే మొదలు అప్పులు తీర్చేసేవాడు. మళ్ళీ పరిస్థితి మామూలే. అయన ఏమి కష్టాలు పడేవాడో గానీ మాకు ఎలాంటి ఇబ్బందులు కలగనిచ్చేవాడు కాదు. ఆయన పరిస్థితిని కళ్లారా చూసిన నేను, అప్పటికి మెట్రిక్యులేషన్ కూడా చదవక పోయినప్పటికీ, “ఒక వేళ జీవితంలో ఏ చిన్న ఉద్యోగం చేసినా, రూపాయిలో కనీసం ఇరవై పైసలు రేపటి కోసం దాచుకోవాలి” అనే నిర్ణయం ఆ తెలిసీ తెలియని వయసులోనే తీసుకున్నాను. ఇది నా మస్తిష్కంలో చెరగని ముద్ర అయింది. నా జీవన యానంలో ప్రతి క్షణం నన్ను అప్రమత్తం చేస్తూనే వుంది. దీని ప్రభావం ఎదుటి వారి దృష్టిలో ‘పిసినారితనం’ గా రూపాంతరం చెందింది. అది నా తదుపరి జీవితానికి పూలపాన్పుగా మారుతుందని వాళ్ళు అప్పుడు ఊహించి వుండరు.

1982లో ఉద్యోగంలో చేరాను. 1983లో పెళ్లి అయింది. వెంటనే నా శ్రీమతి కాపురానికి రావడం జరిగింది. అయితే నా ఆర్థిక విధానం ఆమెకు ఆశ్చర్యాన్ని కలిగించేది ఎందుకంటే, ఇంట్లో టి.వి., రిఫ్రిజిరేటర్, క్లినిక్‌లో డెంటల్ చైర్ – ఇవన్నీ బ్యాంక్ లోన్‌తో కొనుక్కున్నవే. పోస్ట్ ఆఫీసులో చిన్న రీకరింగ్ డిపాజిట్, బ్యాంకులో చిన్న రీకరింగ్ డిపాజిట్, అప్పుడప్పడూ చిన్న మొత్తంలో ఇందిరా వికాస పత్రాలు, వీటికి తోడు ఇంటి అద్దె.. ఇలా జీతంలో 90 శాతం ఖర్చు పెట్టేయగా మిగతా సొమ్ముతో నెలాఖరు వరకూ బండి లాక్కొచ్చేవాళ్ళం. ఈ పరిస్థితికి నా శ్రీమతి అప్పుడప్పుడూ భయపడుతుండేది. తాను మాత్రం తనకోసం ప్రత్యేకంగా ఏమీ కావాలని అడిగేది కాదు. “కొద్దీ సంవత్సరాలు ఓపిక పడితే, సహకరిస్తే, ఆర్థికంగా నిలదొక్కుకుంటాము. అప్పటి వరకూ మామూలు జీవితానికి లోటు రానివ్వను.” అని సర్ది చెబుతుండేవాడిని. అలాగే ఆమె సహకరించింది. అప్పుడు నా జీతం వెయ్యి రూపాయలతో ప్రారంభం. వాటితోనే నా ఈ సర్కస్ అంతా. పోస్టల్ లైఫ్ ఇన్సురెన్సు, పి.పి.ఎఫ్ – అకౌంట్ ఇలా అన్నిరకాలుగా పొదుపు చేస్తుండేవాడిని. ప్రైవేట్ ప్రాక్టీస్ కాస్త మెరుగు పడడం, క్రమక్రమంగా జీతం పెరగడం ద్వారా ఆర్థికంగా కాస్త నిలదొక్కుకున్నట్టు అయింది. ఇద్దరు పిల్లలు పుట్టడంతో, అవసరాలు వాటికి అనుబంధంగా ఖర్చులూ పెరిగాయి. జాగ్రత్తగా ఇద్దరమూ డబ్బు – ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉండడం వల్ల, దాని ఫలితం ఈ రోజున కనిపిస్తున్నది. ఎవరి కోసమైతే నేను పిసినారిగా ముద్ర వేయించుకున్నానో, వాళ్ళు మమ్మల్ని, మా సంపాదనను సద్వినియోగం చేసుకుని ఈ రోజున ప్రయోజకులు కావడం నా చిన్న పొదుపు మొత్తాల వల్లనే! నా జీవితంలో నేను సాధించిన ఘన విజయం ఇది!

అన్ని విధాలా నాకు సహకరించిన నా శ్రీమతి అరుణ కానేటి

తరువాత మహబూబాబాద్ లోని ఆంద్రా బ్యాంక్ మిత్రులు ఇంటి స్థలాలు కొనుగోలు చేస్తూ నన్ను కూడా వారిలో ఒకరిగా చేర్చుకుని, నాకు స్థలం కొనుక్కునే అవకాశం కలిగించారు. ఆర్.డి.లు క్లోజ్ చేసి పదివేల మేరకు పెట్టుబడి పెడితే అది అమ్మినప్పుడు నా ఊహకు మించిన పెద్దమొత్తమే లభించింది. ఈ విషయంలో సహకరించిన నాటి ఆంధ్రా బ్యాంక్ మిత్రులు ప్రకాశరావు గారు, యాకుబ్ మియా, భుజంగ రావు, నరేందర్ రెడ్డి, తిరుమల రావు తదితరులకు నేనెప్పుడూ ఋణపడి వుంటాను.

శ్రీ ప్రకాశరావు
శ్రీ సయ్యద్ యాకూబ్ మియా
శ్రీ భుజంజరావు
శ్రీ బి.తిరుమలరావు

మా వదినగారు శ్రీమతి శిరోరత్నమ్మ గారి సలహా మేరకు, సహాయం మేరకు శేరిలింగంపల్లిలో ‘డోయేన్స్ టౌన్‌షిప్’లో ఇల్లు కొనుక్కున్నాను. ఇంటికి నా శ్రీమతి అరుణ బ్యాంక్ ఉద్యోగినిగా లోన్ సద్వినియోగం చేసిన ప్పటికీ, అది బుక్ చేసుకోవడానికి, పొదుపు చేసుకున్న సొమ్ము ఉపయోగ పడింది. ఈ విషయంలో పాట లేకుండానే చిట్టీ సొమ్ము అందించి సహకరించిన స్వర్గీయ డా. నరసింహారెడ్డి గారినీ, చిట్టీ నిర్వాహకులు శ్రీ రాజ గోపాల్ గారినీ ఎన్నటికీ మరువలేను.

ఇలా మా ఇద్దరి పరస్పర సహకారం వల్ల, కొద్దిపాటి పొదుపు పనుల వల్ల, మా అబ్బాయిని చదువు కోసం అమెరికా పంపించగలిగాం, మాకు నివాసయోగ్యమైన ఇంటిని హన్మకొండలో నిర్మించుకోగలిగాం. పిల్లలిద్దరికే ఘనంగా పెళ్లిళ్లు చేయగలిగాము. గుంటూరుకు దగ్గరి గ్రామంలో వాయిదాల పద్దతిలో కొంత భూమి కొనుక్కోగలిగాం, ఇబ్రహీం పట్టణంలో కూడా వాయిదాల పద్ధతి మీద చిన్న ప్లాట్ కొనుక్కోగలిగాం. స్వంత కారులో తిరగ గలుగుతున్నాం. ఈ రోజున ఇద్దరం పదవీ విరమణ చేసినా ఆనందమయ జీవితాన్ని గడప గలుగుతున్నాం.

ఇదంతా నా గొప్పలు చెప్పుకునేందుకు కాదు. ప్రణాళికాబద్ధంగా జీవితాన్ని మలచుకుంటే, ఎలా బ్రతకొచ్చునో చెప్పడానికి మాత్రమే నా ప్రయత్నం. రాబడిని మించిన ఖర్చులు ఎప్పుడూ చేయలేదు. అత్యాశలకు పోయి, అనవసర ఖర్చులు చేసింది లేదు. దీనికి పిల్లలిద్దరూ మా ఆలోచనలకు అనుగుణంగా సహకరించడం నిజంగా మా అదృష్టమే! మా ఇద్దరి జీవితాలకూ అండగా, వెన్నుదన్నుగా నిలిచిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖకూ, స్టేట్ బ్యాంకు ఆఫ్ హైదరాబాద్ (ఇండియా) వారికీ మేము ఎప్పుడూ ఋణపడి ఉంటాము. జల్సా జీవితాన్ని దూరంగా పెట్టి, సాధారణ జీవితంతో, భరోసా గల భవిష్యత్తును నిర్మించుకోవడం పిసినారితనం అవుతుందా? ఏమో.. మీరే చెప్పాలి మరి..!

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version