జ్ఞాపకాల పందిరి-50

46
2

[box type=’note’ fontsize=’16’] “కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే…!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్. [/box]

హాస్యం.. అంటే వాడే..!!

‘భలే.. భలే.. మంచి రోజులులే
మళ్ళీ.. మళ్ళీ.. ఇక రావులే …
స్టూడెంట్ లైఫ్ సౌఖ్యములే …
చీకూ చింతకు దూరములే…!.’

[dropcap]ఎం[/dropcap]త బాగా చెప్పాడో చూడండి ఒక సినిమా కవి గారు. నిజంగా ఆ రోజులే వేరు! తలచుకుంటేనే మది పులకించి పోతుంది. మళ్ళీ ఆ రోజులు వస్తే ఎంత బాగుండు అనిపిస్తుంది. ఆలోచిస్తే ఇది అత్యాశే గానీ ఆ.. కాలం.. ఆ రోజులు.. జరిగిన సంఘటనలు, ఆనందించిన సందర్భాలు, వేసిన వెర్రివేషాలూ, చూసిన వింతలూ – విడ్డూరాలూ, మూటగట్టుకున్న అనుభవాలూ, చేసిన సాహస కృత్యాలూ అలాంటివి మరి! కొన్ని కొంటె పనులు కావాలని చేస్తే, మరికొన్ని అనుకోని రీతిలో ఎదురైన వింత -వింత సమస్యలూను!. ఆ.. రోజులు మంచివైనా చెడ్డవైనా, వయసు పెరిగాక అనుకోకుండా సందర్భానుసారంగా సింహావలోకనం చేసుకోవలసి వస్తే మనసు తేలికై కాసేపు యవ్వనం మనసులో చిందులు వేస్తుంది. అసలు ఆ వయసులో ఏమాత్రం మన గురించి మనం అప్రమత్తంగా లేకున్నా జీవితం తారుమారు అయిపోతుంది, తల్లిదండ్రుల ఆశలన్నీ తలక్రిందులైపోతాయి. అనుకున్నదొక్కటి.. అయినది ఒక్కటీ.. అన్న తీరులో జీవిత గమనం మారిపోతుంది. అల్లర్లు, క్లాసులు ఎగగొట్టడాలూ, ప్రేమ – దోమ.. అంటూ అమ్మాయిల వెంట తిరగడాలూ, అమ్మాయిలను ఏడిపించడాలు, అన్నీ ఈ వయసులోనే. ఆ వయసు,ఆ కాలం, ఆ పరిస్థితులు అలాంటివి. వాటిని అధిగమించి బయటకు వచ్చినవాడే, జీవితంలో ఒక ఉన్నత శ్రేణి పౌరుడిగా స్థిరపడగలడు. విద్యార్థి దశలో ఎన్ని వెర్రి వేషాలు వేసినా చదువులో శ్రద్ధ చూపించి అగ్రగాములుగా నిలిచిన వాళ్ళు చాలా మంది వుంటారు. అయినా ఆ నాటి విషయాలు గుర్తు చేసుకుంటే ఏంతో మధురానుభూతిని అందిస్తాయి. అందుకే జీవితంలో విద్యార్థి దశ గొప్పది, ప్రత్యేకమైనదీనూ. అప్పటి విషయాలు కొన్ని అందరిలోనూ చెప్పుకుని ఆనందించేవి గానూ, మరికొన్ని చెప్పుకోలేనివిగానూ మిగిలిపోతాయి. ఆ రోజులు ఎలాంటివైనా చాలా గొప్పరోజులు. అందుకే నాటి విద్యార్థి దశలోని జ్ఞాపకం ఒకటి మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను.

నేను దంత వైద్య విద్యార్థిగా వున్న రోజులు. మాది కలగూరగంప క్లాసు. అంటే, వివిధ ప్రాంతాలు/రాష్ట్రాలూ, కులాలూ, మతాలూ, భాషలూ, సంస్కృతులు గల వాళ్ళు ఉండేవారు. హిందీ, తమిళం, మలయాళం, ఆంగ్లం, తెలుగు, ఇన్ని భాషల మధ్య ఇతర భాషల పట్ల అవగాహన లేని తెలుగు విద్యార్థులు, అందరితో కలవలేక పోయేవారు. దీనికి భాషే కారణం. తెలుగు భాష తప్ప ఏ ఇతర భాషలలో ప్రావీణ్యత లేనివారు పూర్తిగా ఇతర తెలుగు విద్యార్థుల తోనే కలసి ఉండడానికి ప్రయత్నం చేసేవారు.

అలాంటి వారిలో నాకు అత్యంత ప్రేమ పాత్రుడు, మంచి స్నేహితుడు, దురదృష్టవశాత్తు అకాల మరణం చెందిన నా ప్రాణ మిత్రుడు డా. జి. డేవిడ్ రాజు ఒకరు. జి. డి. రాజు గా ప్రసిద్ధుడు. పశ్చిమగోదావరి జిల్లా వాసి. ఒక్క భాషలో తప్ప ఎన్నో విషయాలలో అతడికి మంచి కళాభిరుచులు ఉండేవి. పొట్టిగా వున్నా అందంగా ఉండేవాడు. హాస్యం వాడికి ప్రవృత్తి. వాడి మాటలకూ చేష్టలకూ కడుపుబ్బ నవ్వే వాళ్ళం. వాడు ఎక్కడవుంటే అక్కడ నవ్వుల పువ్వులు విరబూసేవి. అందుచేత మెడికల్ కాలేజీ హాస్టల్‌లో వాడికి మంచి డిమాండు ఉండేది. మా క్లాసులో నన్ను కాస్త ఎక్కువగా ప్రేమించేవాడు. వాడితో ఎక్కడికైనా వెళితే ఎప్పుడు ఏమి చేస్తాడో తెలీదు. వింత వింత చేష్టలతో కడుపుబ్బనవ్విస్తాడు. అందుకే అందరూ వాడి సహవాసం కోరుకుంటారు.

నాటి ప్రభుత్వ దంత వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ శేషాద్రి గారి నుండి ఉత్తమ విద్యార్ధి ప్రశంశా పత్రం అందుకుంటూ డా.డేవిడ్ రాజు
డా.జి.డేవిడ్ రాజు

ఒకసారి ముగ్గురం మిత్రులం కలసి ఆదివారం కదా అని సరదాగా తిరగడానికి వెళ్ళాము. మేము వెళ్ళవలసింది కాస్త దూరం కాబట్టి బస్సులో వెళదామని నిర్ణయించుకున్నాము. మా అందరి దగ్గరా స్టూడెంట్ బస్సు పాసులు ఉండేవి కనుక ఆయా రూట్ల లోనే ప్రయాణం చేసేవాళ్ళం. కోఠీ (హైదరాబాద్) లోని మెడికల్ కాలేజీ హాస్టల్ నుండి బస్సు స్టాప్ దగ్గరికి వచ్చాము. ఆదివారం కావడంతో సందర్శకుల హడావిడికి బస్సులు కిటకిట లాడుతున్నాయి. రెండు మూడు బస్సులు వెళ్ళిపోయాక, ఇక తప్పనిసరి పరిస్థితుల్లో, అలాంటి సీటు దొరకని బస్సు లోనే ప్రయాణం చేయాలని నిర్ణయించుకుని, నిలబడి ప్రయాణం చేయడానికి మానసికంగా సిద్ధపడి మేము వెళ్ళవలసిన రూట్ బస్సు రాగానే అందరం డోర్ దగ్గరికి పరిగెత్తి బస్సు ఎక్కాము. మిత్రుడు రాజు మాత్రం అప్పటి వరకూ బాగానే నడిచివచ్చిన వాడు, మావెనక కుంటుతూ నడిచి అతి కష్టంగా బస్సు ఎక్కి స్త్రీలు కూర్చునే సీట్ల వైపు కష్టపడుతూ కుంటుతూ నడిచి వెళ్లి, రాడ్ పట్టుకుని నిలబడ్డాడు. మొదటినుంచి అతనిని గమనిస్తున్న ఒక పదహారేళ్ళ అమ్మాయి గబుక్కున లేచి నిలబడి, మావాడికి సీటు ఆఫర్ చేసింది. మనవాడు కాస్త మొహమాటంగా, ‘వద్దులెండి, కాసేపు ఇలా నిలబడతాను..’ అని ఆ అమ్మాయి దగ్గర మరింత సానుభూతిని పొందాడు. కాసేపు ఆ అమ్మాయి చేత బ్రతిమాలించుకుని అప్పుడు కూర్చున్నాడు. మాకు నవ్వు ఆగడం లేదు. నవ్వు ఆపుకోలేక తెగ ఇబ్బంది పడుతున్నాము. వాడు మమ్మల్ని చూడకుండా ఎటో చూస్తున్నాడు. సీటు ఇచ్చి నిలబడ్డ అమ్మాయి, ఏదో పుస్తకం చదువుకుంటూ రాడ్‌ను ఆధారం చేసుకుని నిలబడి తన లోకంలో తానూ నిమగ్నమైపోయింది. రెండు స్టేజిలు పోయాక మేము దిగవలసిన స్టేజి వచ్చింది. మిత్రుడు రాజు కుంటుకుంటూనే దిగి, మామూలుగా నడుస్తూ ఒకటే నవ్వడం మొదలు పెట్టాడు. ఆ.. అమ్మాయి ఎక్కడ వీడి నడకను గమనిస్తుందోనని మేము తెగ సిగ్గుపడిపోయాము. అలా వుండేవి వాడు చేసే పనులు. రాజు మూఖాభినయమే కాదు, ధ్వన్యనుకరణ (మిమిక్రి)లో కూడా సిద్ధహస్తుడే! క్రైస్తవ కుటుంబంలో పెరిగి పెద్దవాడు కావడంవల్ల, ఆ వాతావరణం ప్రతిబింబించే అంశాలను మిమిక్రీ చేసి చూపించేవాడు. ఉదాహరణకి, పల్లెటూర్లలో పాస్టర్లు ఎట్లా బోధ (సువార్త) చేస్తారు,తాలూకా స్థాయిలో,జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఎలా చేస్తారో,అభినయంతో సహా చేసి పొట్ట చెక్కలయ్యేలా నవ్వించేవాడు.

ఒకసారి నేను చార్మినార్ సూపర్ ఫాస్ట్ రైల్‌లో ప్రయాణం చేయవలసి వచ్చింది. నాకు వీడ్కోలు చెప్పడానికి రాజు నాంపల్లి రైల్వే స్టేషన్‌కు వచ్చాడు. నా కంపార్ట్‌మెంట్ వెతుక్కుని,నా బేగ్ సీటు మీద పెట్టి ఇద్దరం బయటికి వచ్చి డోర్ దగ్గర నిలబడి మాట్లాడుకుంటున్నాం. ఆ రైలులో డైరెక్ట్ గా తమిళనాడుకు వెళ్ళేవాళ్ళే ఎక్కువ వుంటారు. నాలాంటి ప్రయాణికులు తక్కువగా వుంటారు. మా మాటల మధ్యలో మావాడు భాష మార్చి మాట్లాడడం మొదలు పెట్టాడు. తమిళంలా మిమిక్రీ చేస్తూ మాట్లాడుతున్నాడు. కానీ, అది తమిళం కాదు. నాకు నవ్వాగడం లేదు.

నాతో పాటు రాజు కూడా నవ్వడం మొదలు పెట్టాడు. మళ్ళీ అలాగే మిమిక్రీ మొదలు పెట్టాడు. రైలులో కూర్చున్న అసలు తమిళులు మనవాడివంక వింతగా చూడడం మొదలుపెట్టారు. తమిళులు అసలే భాషాభిమానులు! తప్పుగా అర్థం చేసుకుంటే కొంపలు అంటుకుపోతాయి. అందుకే మిత్రుడిని కాస్త దూరంగా తీసుకుపోయి, నచ్చజెప్పి మళ్ళీ అట్లా మాట్లాడకుండా అరికట్టగలిగాను. రైలు కదలగానే నాకు వీడ్కోలు పలికి హాస్టల్‌కి వెళ్లి పోయాడు. మా అందరిలోనూ ప్రత్యేకమైన వ్యక్తిత్వం డా. రాజుది. అతనిలో ఎన్ని వ్యధలు మనసును రగిలిస్తున్నా, పక్కవాడిని మాత్రం ఎప్పుడూ సంతోషంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తుండేవాడు. అంతమాత్రమే కాదు, అతని పెళ్ళికి నేను గుడివాడకు వెళ్ళినప్పుడు, నా చేత గ్రీటింగ్స్ చెప్పిస్తేనే పెళ్లి చేసుకుంటానని మొండిపట్టు పట్టాడు. అలా నాచేత మాట్లాడించి ఎంతో సంతోషం పొందాడు. నేను అప్పటికే కవితలూ,వ్యాసాలూ రాస్తూండేవాడిని, అందుకని నన్ను ‘మహా కవీ’ అని సంబోధించేవాడు. నా పట్ల డా.రాజుకి వున్న అభిమానం, ప్రేమ గురించి చెప్పడానికి ఇవి కొద్ది ఉదాహరణలు మాత్రమే! నాతో పాటు రాజును అభిమానించే వాళ్ళు, రాజు అభిమానాన్నిపొందిన వాళ్ళూ ఇంకా చాలా మంది వున్నారు. అందులో డా.తోట ప్రసాద్, డా.హరనాధ్ బాబు, డా.హరిప్రసాద్ వంటి వాళ్ళు కొద్దిమంది ముఖ్యులు.

డా.తోట ప్రసాద్.. రచయిత
డాక్టర్ హరనాథ్‌తో రచయిత
ప్రొఫెసర్ హరిప్రసాద్

డా.డేవిడ్ రాజు చనిపోవడానికి రెండు రోజుల ముందు (అప్పుడు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో సివిల్ సర్జన్‌గా పనిచేస్తున్నాడు, రాజు కొలీగ్‌గా నా కజిన్ బ్రదర్ డా.పార్ధసారధి పని చేస్తున్నాడు) మేము ఫోన్‌లో సుమారు ముప్పై నిముషాలపాటు మాట్లాడుకున్నాం, కాలేజీ కబుర్లు ముచ్చటించుకున్నాం, తిట్టుకున్నాం, పగలబడి నవ్వుకున్నాం. మేము మాట్లాడుకున్నరెండు రోజుల తర్వాత డా.పార్ధసారధి ఫోన్ చేసి రాజు మరణవార్త చెప్పాడు. అది విని కొద్ది నిముషాల పాటు మనిషిని కాలేక పోయాను. సుమారు అయిదు సంవత్సరాలపాటు హాస్యానందంలో మమ్ములను ముంచి తేల్చినవాడు అకాస్మాత్తుగా మా అందరినీ దుఃఖ సాగరంలో ముంచి పోయినాడు.

నేను బ్రతికి ఉన్నంత కాలం డా.రాజును మరచి పోవడం అసాధ్యం! అతని జ్ఞాపకాలు ఎప్పటికీ నాతోనే ఉంటాయి. డా.రాజు అమరుడు! నా జ్ఞాపకాలలో ఆతను చిరంజీవి!!

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here