[box type=’note’ fontsize=’16’] “కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే…!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్. [/box]
జన్మభూమికి వందనం..!!
[dropcap]ఉ[/dropcap]మ్మడి కుటుంబాల వ్యవస్థ కనుమరుగైపోయిన తరువాత కుటుంబాలలో సందడి తగ్గి ఒంటరితనం మొదలైంది. దీనితో పిల్లలు పలు చోట్ల, తల్లిదండ్రులు మరో చోట ఒంటరి జీవితంతో వెళ్ళబుచ్చవలసి వస్తున్నది. దీనితో పెద్దవాళ్లలో ఒకరకమైన నిర్లిప్తత ఏర్పడి మానసిక వ్యథలకు దగ్గరయ్యే పరిస్థిలు మొదలయ్యాయి. ఏదో కోల్పోయిన భావన తల్లిదండ్రులలో ఏర్పడుతున్నది. పొరుగు జిల్లాలకో, పొరుగు రాష్ట్రాలకో, పొరుగు దేశాలకు పొట్ట చేత పట్టుకుని పిల్లలు వలస వెళ్ళిపోతే, పిల్లలను వారితో ఉండమనలేక, ఉద్యోగ నిమిత్తం దూరప్రదేశాలకు వెళ్ళమనలేక, వాళ్ళల్లో వాళ్ళు కుమిలిపోయే తల్లిదండ్రులు ఎందరో!
ఉమ్మడి కుటుంబాల కాలంలో పరిస్థితి ఇలా వుండేది కాదు. కుటుంబంలో కొందరు విద్యావంతులు ఉద్యోగాల వేటలో ఇతర ప్రాంతాలకు వెళితే, మరి కొంత మంది వ్యవసాయం చేసుకుంటూ ఇంటిపట్టున ఉంటూ పెద్దవాళ్లకు సహాయకారులుగా ఉండేవారు. అలా ప్రతి ఇల్లూ ఎంతో సందడిగా ఉండేది ఎప్పుడూ. ఉమ్మడి కుటుంబాల వ్యవస్థ విచ్చిన్నం కావడానికి కారణాలు ఏమైనా ఇప్పుడు ప్రతి ఇల్లూ నిశ్శబ్ద సంగీతమే పాడుతున్నది. వృద్ధులైన తల్లిదండ్రులు/పెద్దలు, వృద్దాప్యాన్ని వెళ్లదీయలేక ,చావలేక బ్రతకలేక అన్నట్టు కాలం వెళ్ళబుచ్చడం చాలా బాధాకరం. ఇక్కడ నిరుద్యోగ సమస్య, కష్టానికి సరిపడా ఫలితం దక్కక పోవడం, విదేశాల్లో మంచి ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉండడం, కుటుంబాలలో స్వార్ధం పెరిగిపోవడం, డబ్బు మాత్రమే సర్వస్వం అనుకోవడం, ఇలా మనకు మనమే సమస్యలను సృష్టించుకుంటున్నాము. వాటికి పరిష్కారాలు వెతుక్కోలేక ఎంతగానో సతమతమైపోతున్నాం. కాలచక్ర గమనంలో ఇదొక మలుపు అనుకుంటూ అనుభవించక తప్పదన్నమాట! ఒకప్పుడు క్షయ, కలరా, అనుభవించ లేదా? ఇప్పుడు కరోనాను భరించడం లేదా? ఇదీ అలాంటిదే అనుకుని భరించాలి అంతే!
ఈ నేపథ్యంలో మా కుటుంబం గురించి చెప్పక తప్పదు. మా అమ్మనాన్నలకు ఇద్దరు కూతుళ్లు, ముగ్గురు కొడుకులం. అందరం ఉద్యోగాలు వేత్తుకుని తలో చోటా సెటిల్ అయిపోయాం. మా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, మా నిర్ణయాలను వాళ్ళు ఎప్పుడూ వ్యతిరేకించలేదు. కానీ ఒంటరితనంలో వాళ్లలో వాళ్ళు కుమిలిపోయారు. తర్వాత వివిధ రకాల మార్పులతో, సమస్యలతో మా అమ్మ ఇంటి దగ్గర (దిండి గ్రామం), మా నాయన నా దగ్గర (మహబూబాబాద్) చనిపోయారు. దానితో మా గ్రామంలో ఉన్న కొద్దీ మా ఆస్తిని, దగ్గరి బందువులకు అప్పగించి అప్పుడప్పుడు మా వూరికి వెళ్తుండేవాళ్ళం. అందులో నా పాత్ర ఎక్కువగా ఉండేది. ఆ తర్వాత పెద్దన్నయ్య (కె. కె. మీనన్) నేను ఒక నిర్ణయానికి వచ్చాము.
ప్రతి వేసవిలో స్వంత వూరికి వెళ్లాలని, అలా వెళ్లాలంటే, ఏదో పని పెట్టుకుని మాత్రమే వెళ్లగలమని, అందుచేత, ‘ఉచిత దంత వైద్య శిబిరం’ ప్రతి సంవత్సరం నిర్వహించాలని అనుకున్నాము. దంత వైద్య శిబిరం విషయంలో పెద్దన్నయ్య చాలా ప్లానింగ్ చేసాడు. దానికి మా వూళ్ళో ఉన్న మా పెదనాన్న గారి మనవడు బొండాడ వెంకటేశ్వర రావు (ఇప్పుడు లేడు) ఎంతగానో సహకరించేవాడు. అక్కడ లోకల్‌గా చేయవలసిన పనులన్నీ అతను చూసుకునేవాడు. దానికి అవసరమైన డబ్బు, అన్నయ్య – నేనూ సర్దుబాటు చేసేవాళ్ళం. నేను మందులు,అవసరమైన డెంటల్ పనిముట్లు సరఫరా చేసేవాడిని.
అమ్మ – నాయనల సమాధుల దగ్గర ముందుగా చిన్న సమావేశం ఏర్పాటు చేసేవాళ్ళం. ఉచిత దంత వైద్య శిబిరం అవసరం గురించి మాట్లాడేవాళ్ళం. నాయనకు సమకాలికులను పిలిచి వారిని గౌరవించి సన్మానం చేసేవాళ్ళం. అలా సన్మానం పొందిన వాళ్ళల్లో సర్వశ్రీ నున్న సత్యం (రాజోలు), దేవ గెద్దయ్య (దిండి), దేవ ముసలయ్య (దిండి), చెరుకూరి సత్యం (దిండి), చింతా నరసింహ స్వామి (దిండి), దేవ చంద్రం (దిండి) మొదలైన వారు వున్నారు. కొన్ని జ్ఞాపకాలను అక్కడి ప్రజలతో పంచుకున్నాక, భోజనం ఏర్పాట్లు చేసేవాళ్ళం.
మేము మొత్తం మూడు సంవత్సరాలు వైద్య శిబిరాలు నడిపాం. రెండు సార్లు మా కజిన్ బ్రదర్ శ్రీ కానేటి మోహన రావు గారు (రాజమండ్రి-మొదటి పార్లమెంటు సభ్యుడు -కమ్యూనిస్ట్ పార్టీ పక్షాన), ఆయన ఏకైక పుత్రుడు డా. సూర్య మోహన్ కుమార్ (జోషి) ఒకసారి వైద్య శిబిరానికి కాకినాడ నుండి వచ్చి మాలో అత్యంత ఉత్సాహాన్ని కలిగించారు. మా చిన్నాన్న కుమారుడు, దిండిలో స్థిరపడిన శ్రీ కానేటి అప్పారావు, మాకు కొంత సహకారం అందించేవాడు. దిండిలో వైద్య శిబిరం కోసం వరంగల్ ఆకాశవాణి మిత్రుడు, (అనౌన్సర్) ప్రత్యేకంగా శిబిరం ప్రకటనను కేసెట్‌లో రికార్డు చేసి ఇవ్వడం, అది ఎందరినో ఆకర్షించడం మరచిపోలేని మధుర ఘట్టం. మొదటి సంవత్సరం చేసిన కార్యక్రమాలను, చక్కగా ఒక చోట బ్రోచర్‌లా తయారు చేసి ఇచ్చారు ప్రముఖ కవి, రచయిత, చిత్రకారులు శ్రీ శీలా వీర్రాజు గారు. వారికి మా కుటుంబం ఎప్పుడూ రుణపడి ఉంటుంది. గ్రామ పరంగా చింతా నాగభూషణం వంటి వారు శిబిరం దిగ్విజయం కావడానికి ఎంతగానో సహకరించారు.
ఇక వైద్య శిబిరానికి గుండెకాయ వంటివారు వైద్యులే కదా!మా అభ్యర్థనను మన్నించి, కొత్తపేటలో నివసిస్తున్న తమ్ముడు డా. పార్ధసారధి, రాజోలుకు చెందిన డా. జి. రమేష్ (సర్జన్), లక్కవరంకు చెందిన డా. కత్తిమండ శివాజీ (ఫిజీషియన్), డా. సుబ్రహ్మణ్యం (పాలకొల్లు. డా. పార్ధసారధి కి సహాధ్యాయి) వంటి సహృదయ వైద్యులతో కలసి, గ్రామస్తులకు తృప్తి కలిగేలా శిబిరం నిర్వహించాం, అవసరమైన మందులను ఉచితంగా సరఫరా చేసాము. అలా గ్రామస్థుల మన్ననలను పొందగలిగాము. ధవళేశ్వరంలో ఇంజనీరుగా పనిచేస్తున్న కజిన్ బ్రదర్ నల్లి భగవాన్ దాస్ (డా.పార్ధసారధి, చిన్నన్న) ప్రత్యేకంగా మాకు సహాకరించడానికి వచ్చేవాడు. ఆయన ఇప్పుడు లేక పోయినా ఆయన సహకారాన్నీ- సేవలను,ఎప్పటికీ మరచిపోలేను.
అలా అందరి సహకారంతో మూడు సంవత్సరాలు వైద్య శిబిరాలు దిగ్విజయంగా నిర్వహించాము. అయితే 1998లో హన్మకొండలో ఇల్లు కట్టే ప్రయత్నం చేయడం వల్ల, తర్వాత అది కొనసాగలేదు. ఈలోగా అనేక మార్పులు జరగడం, అన్నయ్య అనారోగ్యం పాలుకావడం; నాకు సహకరించడానికి అన్నయ్య లాంటి పెద్ద దిక్కు ఎవరూ లేకపోవడం వంటి విషయాల వల్ల వైద్య శిబిరాలకు స్వస్తి పలక వలసివచ్చింది.
వైద్య శిబిరానికి, శివకోడు, గుడిమెల్లంక, కొత్తపేట, రామరాజులంక గ్రామ ప్రజలు, దూరాభారాలను లెక్క చేయకుండా వచ్చి చికిత్స పొందడం ఆశ్చర్యాన్నీ, ఆనందాన్నీకలిగిస్తుంది. జన్మ నిచ్చిన ఊరిని ఇలా ప్రతి సంవత్సరమూ దర్శించ వచ్చునన్న ఆలోచన తర్వాత కల గానే మిగిలిపోయింది. వీటి గురించిన ఆలోచనలతో నిద్ర కోల్పోయిన రాత్రులు ఎన్నో..!!
(మళ్ళీ కలుద్దాం)