జ్ఞాపకాల పందిరి-53

52
2

[box type=’note’ fontsize=’16’] “కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే…!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్. [/box]

మొదటి అడుగు…!!

[dropcap]మొ[/dropcap]దటి అడుగు అనగానే టక్కున మనకు గుర్తుకు వచ్చేది పిల్లలు నడక నేర్చుకుని వేసే మొదటి అడుగు. అలా కాకుండా కాస్త ప్రపంచ జ్ఞానం వంటబట్టించుకున్న వాళ్లకు చంద్రమండలం మీద నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ వేసిన మొదటి అడుగు గుర్తుకు వస్తుంది. అయితే మొదటిది అందరి జీవితాల్లోనూ చూడగలమేమో గానీ, రెండవది ఆ మహానుభావులకు మాత్రమే సాధ్యం, అది వేరే విషయం.

సందర్భం ఏదైనా, మొదట మనం తలపెట్టే పనిని, మొదటి అడుగుగా అనుకుంటాం. విషయాన్ని బట్టి, అంశాన్ని బట్టి దాని ప్రాధాన్యత వెలుగులోనికి వస్తుంటుంది. వారి వారి, అభిరుచులను బట్టి, తీసుకునే నిర్ణయాలను బట్టి, చేసే సాహసాలను బట్టి, మొదటి అడుగు లేదా మొదటి ప్రయత్నం తగిన ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. భవిష్యత్తు గురించి క్షుణ్ణంగా ఆలోచించే వాళ్లకి దీని ప్రాధాన్యత విలువ తెలుస్తుంది. కష్టపడనిదే ఫలితాలు ఉండవని, ఉచితాల గురించి అదే పనిగా ఆలోచించేవాళ్ళు ఎన్నటికీ తమ జీవితంలో అడుగు ముందుకు వేయలేరని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇంచుమించు, అక్షరాస్యులైనా, నిరక్షరాస్యులైన, ప్రతి వారి జీవితంలోనూ ఈ మొదటి ప్రయత్నం అనుభవాలు తప్పక ఉంటాయి. ఇలాంటి విషయాల కోసం ఎవరి జీవితాలలోనికో తొంగి చూసే బదులు నా జీవితంలోని నా మొదటి ఉద్యోగ ప్రయత్నం గురించి చెబితే సబబుగా ఉంటుందేమో.. అందులోని తీపి/చేదు అనుభవాలు, నేటి తరం యువతీ యువకులకు, లేదా రాబోయే తరానికి, ఉపయోగపడి ప్రతి క్షణం అప్రమత్తంగా వుండే దానికి ఉపయోగ పడుతుందన్నదే, ఈ నా వ్యాసం ప్రధానోద్దేశం. మరి, పదండి ముందుకు.

కేవలం ఉద్యోగం మీద ఆధారపడి బ్రతకాలనుకునే మధ్యతరగతి మందహాసులకు, విద్యాపర్వం అత్యంత కీలకమైంది. చదువుకున్న చదువు మీదే, భవిష్యత్తు ఆధార పడివుంటుంది. ఈ రోజుల్లో పరిస్థితులనుబట్టి ఎంత చదువు చదివినా, చిన్న.. చిన్న ఉద్యోగాలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తున్నది,అది వేరే విషయం!

ఇంతకీ అసలు నా విషయానికొస్తే, ఎన్నో సమస్యలను ఎదుర్కొని, ఎవరూ ఊహించని రీతిలో వృత్తి విద్యా (దంత వైద్యం)కోర్సులో సీటు సంపాదించగలిగాను. దీనితో భవిష్యత్తు మీద చిన్న ఆశ కలిగింది. అది చివరికి నన్నొక బాధ్యత గల దంతవైద్యుడిగా నిలబెట్టింది. జీవితంలో చదువు ఒక ముఖ్యమైన మైలు రాయి అయితే, ఉద్యోగం సంపాదించడం అంతకు మించినది. ఇది అంత సులభమైనది కాదు. కానీ,కాలం నన్ను కనికరించింది. ఒక్కో మెట్టూ సులభంగానే అధిరోహించగలిగాను. నా గురువులు ప్రొఫెసర్ రామచంద్రా రెడ్డి గారి ఆశీస్సులు మెండుగా లభించే అవకాశం నాకు కలగడంతో, హౌస్ సర్జెన్సీ పూర్తి కాగానే, సింగరేణి కాలరీస్‌కు చెందిన ప్రాంతీయ ఆసుపత్రి (బెల్లంపల్లి, ఆదిలాబాదు జిల్లా)లో దంతవైద్యుడిగా ఉద్యోగం రావడం గొప్ప అదృష్టమే!

ఉద్యోగం వచ్చిన ఆనందం ఒక వైపు, అసలు ఆ ప్రాంతమే తెలియని నేను ఒంటరిగా వెళ్లడం ఎలా? అన్న భయం మరోవైపు. ఈ రెంటిలోనూ, ఉద్యోగం వచ్చిందన్న ఆనందమే గెలిచి, ఒంటరిగానైనా, వెళ్ళడానికి ప్రయాణ ఏర్పాట్లు చేసుకున్నాను. పెద్దన్నయ్య తప్పని పరిస్థితిలో, నన్ను ఒంటరిగా పంపాలనే నిర్ణయం తీసుకొనక తప్పలేదు.

ఇద్దరం గౌలిగూడ (పాత) బస్‍స్టాండుకు చేరుకున్నాం. హైదరాబాద్ – ఆసిఫాబాద్ బస్సు సిద్ధంగా వుంది. సీటు రిజర్వ్ చేసుకున్నాను కనుక, నా సీట్ వెతుక్కుని అందులో కూర్చున్నాను. నన్ను చూస్తూ అన్నయ్య బయట నిలబడ్డాడు. క్షణాల్లో బస్సు నిండిపోవడమూ, కండక్టర్ టికెట్లు చెక్ చేస్తూ, “డ్రైవర్ సాబ్ – రైట్.. రైట్..” అన్నాడు. డ్రైవర్ ఒకసారి వెనక్కి తిరిగి చూసి, బస్సు స్టార్ట్ చేసాడు. మెల్లగా బస్సు కదలడం మొదలు పెట్టింది. అన్నయ్య జాగ్రత్తలు చెబుతూ, కాసేపు బస్సు కూడా నడిచాడు.

బస్సు వేగం అందుకోగానే, నిలబడిపోయి చెయ్యి వూపుతూ బస్సు కనుమరుగు అయ్యేంత వరకూ, అక్కడే నిలబడి ఉండిపోవడం గమనించాను.

అన్నయ్య నాకు దగ్గరగా ఉన్నంత సేపు, ఏదో దిగులు నన్ను ఆవరించింది. తెలియని చోట, ఎలా వుంటుందన్న భయం. బస్సు వేగం అందుకోగానే, ఎందుకో గొప్ప దైర్యం నా వెన్ను తట్టింది. చెప్పలేని దైర్యం వచ్చింది. నా ఉద్యోగం గురించిన ఆలోచనలతో చాలా సేపు గడిపాను. రాత్రి తొమ్మిది కావొస్తోంది. అప్పటికి లగ్జరీ బస్సుల్లో టి.వి.లు ప్రారంభం కాలేదు. కండక్టర్ బస్సులో లైట్స్ ఆర్పేశాడు. మెల్లగా నేను కూడా నిద్రలోకి జారుకున్నాను. ఉదయం నుంచి సూట్‌కేసు సర్దుకోవడం, చెప్పలేని టెన్షన్‌తో అటూ -ఇటూ తిరగడం, తిండి సహించక పోవడం వంటి సమస్యలతో, శారీరకంగానూ మానసికంగానూ బాగా అలసిపోయాను. అందుకే త్వరగా నిద్ర పట్టేసింది.

మళ్ళీ బస్సులో లైట్లు వెలిగే వరకూ నాకు మెలుకవ రాలేదు. ఉదయం 5.30 అయివుంటుంది. బస్సు బెల్లంపల్లి చేరుకుంది. ఆ విషయం తెలియగానే, గబ గబా సూట్‌కేసు తీసుకుని క్రిందికి దిగాను. కొత్త ప్రదేశం, కొత్త వాతావరణం, కొత్త మనుష్యులు. నా ముఖం చూడగానే ఆటోవాళ్ళు నన్ను చుట్టుముట్టారు. బస్సు స్టాండ్ నుండి సింగరేణి – ఏరియా ఆసుపత్రికి దూరం ఎంతో తెలీదు. ఒక్కొక్కడు ఒక్కో రేటు చెబుతున్నాడు. అంతా కన్ఫ్యూషన్. చివరికి నాకు నచ్చిన ఆటో ఎన్నుకుని ఆసుపత్రికి పోనిమ్మన్నాను. జనవరి నెల కాబట్టి ఆటోలోనికి చల్లని గాలి రివ్వున కొడుతోంది. అయినా చలి అనిపించలేదు. ఆలోచనల, తల వేడికి,అది సర్దుబాటు చేసుకుంది.

పది నిముషాల్లో ఆటో ఆసుపత్రి ప్రాంగణం లోనికి చేరుకుంది. అసలు సంగతి ఇక్కడితోనే ప్రారంభం అయింది. ఆటో దిగి అతను అడిగిన సొమ్ము చెల్లించి, ఆసుపత్రిలోని డ్యూటీ మెడికల్ ఆఫీసర్‌ను కలిసి విషయం చెప్పాను. ఆయన మనిషిని ఇచ్చి మాలాంటి వాళ్ళకోసం ఏర్పాటు చేసిన గెస్ట్ హౌస్‌కు పంపించారు. నాకు కేటాయించిన గదిలోకి వెళ్లి, ఫ్యాన్ వేసుకుని మంచం మీద కూర్చుని అయిదు నిముషాల తర్వాత బట్టలు మార్చుకుని స్నానం చేద్దామన్న ఆలోచన వచ్చేసరికి గుండె ఝల్లుమంది. ఒళ్లు చెమటలు పట్టి చల్లగా అయిపోయింది. ఒక్కసారిగా మెదడు మొద్దుబారిపోయింది. ఏమిటిది? ఎందుకు ఇలా జరిగింది?

ఒక్కసారిగా శరీరంలో వణుకు పుట్టింది. చెప్పడానికి అక్కడ ఎవరూ లేరు. ఒక్కసారిగా కళ్ళల్లో చీకటి ఆవరించింది. త్వరగా నిర్ణయం తీసుకోవాలి, ఏది అటూ ఇటూ జరిగినా, నా ఉద్యోగ జీవితానికి తెర పడినట్లే! కారణం, ఆటో దిగాను గానీ, ఆ సంతోషంలో నా సూట్‌కేస్ తీసుకోవడం మర్చిపోయాను. నా బట్టలు, సర్టిఫికెట్లు, ఉద్యోగానికి సంబంధించిన ఆర్దరు, ఇతర అవసరాలకు సంబందించిన వస్తువులు అన్నీ అందులోనే వున్నాయి.

ఇక ఎలాంటి ఆలోచనలకూ సమయం లేదు. ఒక్కసారి లేచి, వేగంగా బస్ స్టాండు వైపు, కాలినడకన బయలుదేరాను. అప్పుడు ఆలోచన అంతా, సూట్‌కేస్ దొరుకుతుందా లేదా? అన్నదే మెదడులో మరుగుతోంది. అపశకునపు ఆలోచనలు ఎక్కువ అయ్యాయి. నడుస్తూనే వున్నాను. చెమటతో లోపలి బనియన్ తడిచి, చొక్కా మీద తడి చిత్రపటాలు ఏర్పడుతున్నాయి. ఆటో తీసుకునే సమయం కన్నా ముందుగానే, కాలినడకన బస్ స్టాండ్‌కు చేరుకున్నాను. నన్ను ఆసుపత్రికి తీసుకువెళ్లిన ఆటో కనిపించింది. ముఖంలో సన్నని వెలుగు ప్రకాశించింది. మళ్ళీ అనుమానం, అతడు అబద్ధం చెబుతాడేమో! నాకు తెలియదు అంటాడేమో!! ఇలా పరి పరి విధాల ఆలోచిస్తూ ఆటో దగ్గరకు వెళ్లాను. నన్ను చూడగానే కొత్త పాసెంజర్ అనుకుని “ఎక్కడికి పోవాలి సార్?” అంటూనే, నన్ను గుర్తు పట్టి, “ఇప్పుడే కదా సార్, మిమ్ములను అక్కడ దింపి వచ్చాను!” అంటూ,ఆశ్చర్యంగా నా వంక చూసాడు.

“అవునయ్యా…. నేను నా పెట్టె తీసుకోవడం మర్చిపోయాను” అన్నాను కాస్త ఆందోళనగా. నిజానికి నేను ఆటో దిగినప్పుడు, ఇది అతను కూడా గమనించలేదు. నా మాట విని, అతను ఆటో వెనుక డిక్కీలో చూసాడు. నా అదృష్టం పండింది. అది అక్కడ వుంది. సూట్‌కేస్ నా చేతిలో పెడుతూ.. “జాగ్రత్తగా ఉండాలి సార్” అన్నాడు. ఎప్పుడూ దేవుడిని తలవని నేను మనస్సులో ‘థాంక్ గాడ్’ అనుకున్నాను.

ఎవరెస్టు విజేత యెంత పులకించిపోయి ఉంటాడో ఆ సమయంలో గానీ నేను అంతకు మించిన ఆనందానికి గురి అయ్యాను. ఆటో వాలాకు ధన్యవాదాలు చెప్పి, పెట్టె బరువుగా వున్నా, చేతితో పట్టుకుని చెమటలు కక్కుకుంటూ నడక సాగించాను. ఆశ్చర్యం ఏమిటంటే ఆ ఆటోవాలా మళ్ళీ నన్ను తీసుకెళతానని కూడా అడగలేదు. తిరుగు ప్రయాణం కాలినడకన సుమారు అరగంట సేపు పట్టింది. రూమ్‌కు వెళ్లి తృప్తిగా స్నానం చేసి, కాసేపు పడుకుని, ఆ తర్వాత జరగాల్సిన కార్యక్రమాల కోసం సిద్ధపడడం మొదలు పెట్టాను. జరిగిన విషయం చాలా రోజులవరకూ ఎవరికీ చెప్పలేదు. ఆలోచనల్లో పడి అసలు విషయాలు మరచిపోకూడదన్న విషయం మెదడులో ముద్ర పడిపోయింది. అయినా అన్నీ మన చేతుల్లో వుండవు కదా!

ఉద్యోగంలో చేరడానికి ముందు ఎంత టెన్షన్‌కు గురి అయ్యానో, అంతకు మించిన ఆనందం అక్కడ పని చేసిన ఆరునెలలూ పొందాను. మంచి వైద్య మిత్రులతో పరిచయాలు, ఊహించని అనుభవాలూ, బెల్లంపల్లి జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. మొదటి అడుగు అలా ఒక క్లిష్టమైన, భయంకరమైన జ్ఞాపకాన్ని మిగిల్చింది. ఇలాంటి అనుభవం ఎవరికీ రాకూడదు సుమా!

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here