జ్ఞాపకాల పందిరి-57

31
2

[box type=’note’ fontsize=’16’] “కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే…!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్. [/box]

ఆ ముగ్గురూ..!!

[dropcap]కొం[/dropcap]దరి నోటిమాట ఎందుకో అలా జరిగితీరిపోతుంది. దానికి కారణాలు ఫలానా అని చెప్పేటట్టు ఉండదు. కొందరు “నేను ఏదంటే అది అయిపోతుంది” అని గొప్పలు చెబుతుంటారు. కొన్ని కావచ్చు యాదృచ్ఛికంగా, అలా అని వారిలో యేవో ప్రత్యేకమైన శక్తులు ఉన్నాయని చెప్పడానికి లేదు. అలా అని అన్నింటినీ తీసిపారేయడానికి లేదు, వాళ్ళల్లో ఏవో శక్తులు వున్నాయన్న భావన వారు చెప్పే విషయాలని బట్టి మనకి కలగకపోదు. నమ్మకం వున్నవాళ్లు నమ్ముతారు, నమ్మకం లేనివాళ్ళు అలాంటి వాటిని అసలు పట్టించుకోరు.

నా చిన్నప్పుడు, మా చిన్నన్నయ్య, నన్ను ఉద్దేశించి అంటుండే మాటలు ఇప్పటికీ గుర్తున్నాయి. ఏదైనా విషయం వచ్చినప్పుడు “నువ్వు నోరు విప్పకు, ఆ నోట్లోనుంచి ఏ మాట వస్తే అది అయిపోతుంది” అనేవాడు. బహుశః ఏమైనా నెగెటివ్ మాటలు మాట్లాడతానని భయపడేవాడేమో మరి, తెలియదు.

ఒకసారి హాస్పిటల్లో పని చేసుకుంటున్న నా దగ్గరికి ఒక కోయ దొర వచ్చి, నా పని అయిపోయేవరకూ బయటే వేచి వుండి, తర్వాత లోపలికి వచ్చి, నా బాల్యం అంతా పూసగుచ్చినట్టు, సంఘటనల వారీగా చెప్పుకుంటూ పోతుంటే, నేను ఆశ్చర్యపోకనూ తప్పలేదు, అతని చేతిలో కొంత సొమ్ము వుంచకా తప్పలేదు. మరి అలాంటి శక్తిని ఏమనాలో తెలీదు. వినడానికి ఇలానే విషయాలు వింతగానే ఉంటాయి. జ్యోతిష్యం అనేది ఒక శాస్త్రీయమైన విజ్ఞాన శాస్త్రం. మరి అది చదవకుండానే,ఆ శాస్త్రం గురించిన సరైన అవగాహన లేకుండగనే, జరిగినవే, జరగబోయేవి ఎట్లా చెప్పగలుగుతున్నారు? ఇది మాత్రం అంతుబట్టని విషయమే! అయితే దీన్ని ఆసరా చేసుకుని ‘కోటి విద్యలు కూటికొరకే’ అన్నట్లు, బ్రతికేస్తుంటారు. నమ్మకం, కొందరిచేత, భవిష్యత్తును భయపెట్టించి ఏదో రూపంలో డబ్బులు గుంజడం అక్కడక్కడా చూస్తూనే ఉంటాం. మాట మీద వుండే నమ్మకం అలాంటిది మరి!

అనుభవంలో చాలామందికి, ఇలాంటివి ఎప్పుడో ఒకప్పుడు ఎదురుకాక మానవు. నా అనుభవం ఒకటి మీతో పంచుకుంటాను. పైన చెప్పిన అనుభవాలు కాదు గానీ, ఇంటోవాళ్ళ మాటలు, లేదా బంధువుల మాటలు జీవితంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయో చూడండి. అవి జీవితాలను ఎలా మలుపు తిప్పుతాయో గమనించండి. సంఘటన ఇక్కడ గతం నుంచి కొంత పునరావృతం అయినప్పటికీ, సందర్భం వేరుగా ఉంటుంది.

నేను ఇంటర్ చదూతున్నప్పుడు, మా పెద్దక్క దగ్గర వుండే వాడిని. అక్క నాగార్జున సాగర్‌లో ఉండేది. మాటల మధ్యలో బంధువుల గురించి మాట్లాడుకునే వాళ్ళం. అక్క ఎన్నో విషయాలు చెబుతుండేది.

మా పెద్దక్క స్వర్గీయ కుమారి కానేటి మహానీయమ్మ (నాగార్జున సాగర్)

ఒకరోజు విజయవాడలోని, పద్మక్క (తరువాత నాకు అత్తగారు అయింది) గురించి, వాళ్ళ పిల్లల గురించి, ముఖ్యంగా వాళ్ళ పెద్దమ్మాయి అరుణ (తర్వాత నా శ్రీమతి అయింది) గురించి, వాళ్ళ మంచితనం గురించి, చాలా గొప్పగా చెప్పింది. అక్క కంటే, పద్మక్క చిన్నది. ఆ విషయాలన్నీ నా మనసులో బాగా నాటుకున్నాయి. అందుచేత పద్మక్క (మా సరిపల్లి పిన్ని తొలి కోడలు, కూతురు) వాళ్ళింటికి విజయవాడ, సెలవుల్లో అప్పుడప్పుడూ వెళ్లి ఒకటి రెండు రోజులు వుండి వచ్చేవాడిని. అప్పట్లో నా మనసులో మరో ఆలోచన ఏదీ రాలేదు. అక్క బావగారు చాలా బాగా చూసుకునేవారు.

మా అత్తగారు (అక్క) విజయవాడ.

పద్మక్కకు ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు. వాళ్ళతో చాలా ఆనందంగా గడుపుతుండేవాడిని. ఎక్కువ రోజులు సెలవులు వచ్చినప్పుడు, నా జన్మస్థలం దిండికి వెళ్ళేవాడిని. ఇంటికి వెళ్లేప్పుడు, తిరిగి వచ్చేప్పుడు, మార్గ మధ్యంలో వున్న మా పిన్ని వూరు ‘సరిపల్లి’కి తప్పక వెళ్ళవలసిందే. మా పిన్ని దగ్గర హాజరు వేయించుకోవలసిందే, ఒక పూట తప్పక భోజనం చేయవలసిందే! తిరుగు ప్రయాణంలో, పిన్ని నాకోసం ప్రత్యేకంగా వంట చేసి పొట్లం కట్టి ఇచ్చేది.

ఇలా సరిపెల్లి వెళ్ళినప్పుడు, మరియమ్మ పిన్నివాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు (మా పిన్నికి తోడికోడలు, మా అత్తగారికి తల్లి!) మామూలుగా క్షేమ సమాచారాలు అడగడం, ఏవేవో కుశల ప్రశ్నలు వేసి నా చేత మాట్లాడించి, ఉన్నట్టుండి, ఒక సలహాతో కూడిన ప్రశ్న నాకు సూటిగా సంధించింది.

నా శ్రీమతికి అమ్మమ్మ, నాకు పిన్ని స్వర్గీయ మరియమ్మ.ఈద. (మనవరాలిని నాకు ప్రపోజ్ చేసిన మహానీయురాలు)

“చదువు అయిపోయింది కదా! ఇంకా పెళ్లి చేసుకోవా?” అంది. ఈ ఊహించని ప్రశ్నకు వెంటనే నాకు సమాధానం చెప్పరాలేదు. అందుకే ఏమీ మాట్లాడకుండా, మౌనంగా ఉండిపోయాను. నా సమాధానం కోసం ఎదురుచూడకుండానే, మరో సూచనతో కూడిన ప్రశ్న వేసింది. “అక్క కూతురు, ‘అరుణ’ను చేసుకోరాదూ?” అంది నవ్వుతూ. దీనికి కూడా నేను ఏమీ సమాధానం చెప్పకుండానే, ఆవిడతో పాటు నేనూ నవ్వేసాను.

ఆ సంఘటన నన్ను ఆలోచింప జేసింది. అప్పటివరకూ, అరుణను చూసినప్పటికీ, ఆమెను పెళ్లి చేసుకోవాలనే ఆలోచన అసలు రాలేదు. మరియమ్మ పిన్ని అలా సూచన చేసిన తర్వాత, సాగర్ అక్క చెప్పిన మాట కూడా గుర్తుకు వచ్చి, మెల్లగా ఆలోచించడం మొదలుపెట్టాను. అప్పటి నుండీ నా విజయవాడ ప్రయాణాలు ఎక్కువైనాయి. నేను విజయవాడ ‘ఆమె’ కోసం వెళ్ళేవాడిని. కానీ ఆమె ఇంట్లో నుండి బయటికి వచ్చేది కాదు. ఆమెతో మాట్లాడడమే కష్టమయ్యేది. ఇక ఇంట్లో ఆమెతో మాట్లాడడం అసలు వీలయ్యేది కాదు, ఆ చిన్న గవర్నమెంట్ క్వార్టర్స్‌లో (విజయవాడ, ఎక్సిబిషన్ గ్రౌండ్స్ ప్రక్క నాగార్జున సాగర్ కెనాల్స్ క్వార్టర్స్). ఇక ఆలోచించి ఉత్తరాలను ఆశ్రయించక తప్పలేదు.

ఆ తర్వాత కొంత చనువు, క్లారిటీ వచ్చిన తర్వాత, నేను విజయవాడ వెళ్ళినప్పుడల్లా సైన్స్ రికార్డులు వేసిపెట్టమని నా దగ్గర వచ్చి కూర్చుని, తాను ఇంకేదో రాసుకునేది, లేదా చదూకునేది. మాటలే కాదు మనసులు కూడా కలిసి ‘ప్రేమ’ అనే మత్తులోకి ఇద్దరం జారుకున్నాం. అయితే ఈ విషయం నా పక్షాన గానీ, ఆమె (అరుణ) పక్షాన గానీ ఎవరికీ తెలీదు. టాప్ సీక్రెసీ అమలు జరిగేది. ఇవి దాచుకునే విషయాలు కాదు కదా! ఏదో రోజున ఏదో రూపంలో ఇది బయట పడక తప్పదు. అదే జరిగింది!

నేను హైదరాబాద్ నుండి రాసిన ప్రేమలేఖ, అరుణ కాలేజీ నుండి ఇంటికి ఆలస్యంగా రావడమూ, వాళ్ళమ్మ స్కూల్ నుండి త్వరగా రావడమూ జరిగి ఆవిడ కళ్లబడింది. దాని తర్వాత ఇంట్లో బోలెడు సమావేశాలు, నీతి బోధనలు, చర్చలు, వాదనలూ జరిగి ఉంటాయి. అరుణ మా ఇద్దరి వివాహానికి పట్టుబట్టడంతో, తల్లీ కూతుళ్లు ఒకటీ, మిగతా కుటుంబ సభ్యులు, బంధువులు ఒకటిగా విడిపోయారు. కారణం, వాళ్ళు క్రైస్తవులు, నేను కాదు. వారి భాషలో నేను ‘అన్యుడు’ని. నా భాషలో నాస్తికుడిని. నా గురించి కొంత అర్థం చేసుకున్నాక, పెళ్లి ఎలా చేయాలి? అని. వాళ్ళు చర్చిలో పెళ్లి అంటున్నారు, నేను క్రైస్తవ పెళ్లి వద్దంటున్నాను. అరుణ నన్ను తప్ప ఎవరినీ పెళ్లి చేసుకోనంటున్నది. బి.ఎస్.సి డిగ్రీ పూర్తి చేసి గుంటూరులో బి.ఎడ్.లో చేరింది. నేను సింగరేణి ఆసుపత్రి బెల్లంపల్లిలో పని చేస్తున్నాను. బెల్లంపల్లిలో ఒక టెలీఫోన్ ఆపరేటర్ ఉండేవాడు. అతని పరిచయంతో, ఇద్దరం ఉచితంగా ట్రంకాల్‌లో చాలా సేపు మాట్లాడుకొనేవాళ్ళం. మా పెళ్లి సమస్య క్లిష్టంగా మారుతున్న తరుణంలో, ఈ కథలో మూడవ పాత్ర ప్రవేశించింది. అది కూడా స్త్రీ పాత్రనే. ఆవిడ ఎవరో కాదు, అరుణకు తల్లి, ఇప్పుడు నాకు అత్తగారు.

ఆవిడ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నది. ఆవిడ చాలా తెలివిగా కూతురు భవిష్యత్తు గురించి ఆలోచించింది. భవిష్యత్తును చాలా గొప్పగా అంచనా వేసింది. “ఎవరు అడ్డు వచ్చినా.. నా కూతురిని తమ్ముడి కిచ్చి (నాకు) పెళ్లి చేస్తాను” అని శపథం చేసింది. అందరూ ఖంగు తిన్నారు.

నేను కూడా చర్చిలో పెళ్లి చేసుకుంటానని అరుణకు మాట ఇచ్చాను. అన్నయ్య, వదిన కల్పించుకుని జరగాల్సిన తంతులన్ని జరిపించి మా ఇద్దరినీ ఒకటీ చేశారు.

నా పెళ్ళిని ప్రోత్సహించిన అన్న-వదినలు కె.కె.మీనన్, శిరోరత్నమ్మ (హైదరాబాద్)

ఇలా మాది ప్రేమ వివాహం అయినప్పటికీ దాని వెనుక ముగ్గురు స్త్రీ మూర్తులు వున్నారు. వీరు ముగ్గురూ ఇప్పుడైతే లేరు గానీ, 81 ఏళ్ళు వయసున్న మా అత్తగారు (అక్క), ఇప్పటికీ మమ్మల్ని మా పిల్లల్నీ ఎంతో ప్రేమగా చూసుకుంటారు.

మా మొదటి సంతానం (రాహుల్)తో నా అత్తమామలు
పెళ్లయిన మొదటి రోజుల్లో నా శ్రీమతి అరుణ

ప్రేమ పెళ్లిళ్లు అన్నీ సజావుగా సాగవు. కానీ ఇరుపక్షాలలోను కొన్ని పట్టు విడుపులు ఉంటే ప్రేమలు తప్పక ఫలప్రదం అవుతాయి. దీనికి మేమే గొప్ప ఉదాహరణ అనుకుంటాను. ఇందులో కొసమెరుపు ఏమిటంటే, నా పెళ్ళికి ఒప్పుకోనివాళ్లంతా, మా పెళ్లి తర్వాత నేనంటే అమితంగా ఇష్టపడడం, నన్ను అతిగా ప్రేమించడం, గౌరవించడమూను.

ఆ పెద్దలు చాలామంది ఇప్పుడు లేరు. ఆ జ్ఞాపకాలే మిగిలాయి.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here