జ్ఞాపకాల పందిరి-59

46
2

[box type=’note’ fontsize=’16’] “కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే…!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్. [/box]

అప్పుడు నేను… బిక్షగాడినే..!!

[dropcap]కా[/dropcap]లం కలసిరాకుంటే, పరిస్థితులు అనుకూలించకుంటే, అవసరానికి మించిన ఆలోచనలు చేస్తే, ముందువెనుకలు ఆలోచించకుంటే, ఒకోసారి మన పరిస్థితి ఊహించడానికి వీలులేనంత క్లిష్టపరిస్థితుల్లోకి దిగజారుతోంది. అలా జరుగుతుందని అసలు కలలో కూడా అనుకోలేము. కానీ సమస్య వచ్చినప్పుడు దాని నుండి బయటపడడానికి కూడా కాలం కలసి రావలసిందే! ఒక ధనవంతుడిగా, సమాజంలో గొప్పపేరున్న వ్యక్తి, ఒక సామాన్యుడి సహాయం కోరవలసి రావచ్చు. ఇంటి నిండా కార్లూ, ఇతర సౌకర్యవంతమైన వాహనాలు కలవాడైనా ఒక్కోసారి ఆటోలోనో, రిక్షాలోనో ప్రయాణం చేయవలసి రావచ్చును. అంతకంటే దారుణంగా కాలినడకన రావలసిన పరిస్థితి ఏర్పడవచ్చు. కోటీశ్వరుడు కూడా ఒక్కోసారి తప్పని పరిస్థితిలో ఒక సామాన్యుడి దగ్గర అప్పు చేయవలసిన పరిస్థితి ఏర్పడవచ్చు. వందలకొద్దీ చీరలు బీరువాల్లో మూలుగుతున్నా, పరిస్థితుల ప్రభావం వల్ల, ముతక నేతచీరతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. ఇలా పరిస్థితులు సందర్భాన్ని బట్టి తారుమారు అయినప్పుడు, మన అసలు పరిస్థితి మారిపోయి మరో అవతారం ఎత్తవలసిన పరిస్థితి ఏర్పడవచ్చు. అందుచేత ఎప్పుడు ఎవరి అవసరం వస్తుందో తెలియదు. పరిస్థితులను బట్టి ఆయా వ్యక్తుల విలువ గొప్పదనం తెలుస్తాయి. ఎంతటి చిన్న హోదాలోవున్నవాడైనా మనకంటే ఆ క్షణంలో కొన్ని ఎత్తుల ఎత్తుకు ఎదిగిపోతాడు.

ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుందో తెలీదు, ఊహించలేము. అనుభవించిన తర్వాత మాత్రమే మనకు దాని గురించి ఆలోచించే అవకాశం ఏర్పడుతుంది. ప్రతివారి జీవితంలోనూ ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి సన్నివేశాలు ఎదురవుతూనే ఉంటాయి. వాటిని కొందరు అప్పుడే మరచిపోతారు, నాలాంటి వారు మరికొందరు, ఎంత మరచిపోదామన్నా అది ఏదో సందర్భంలో గుర్తుకు వస్తూనే ఉంటుంది. నేను – నా శ్రీమతి ఎదుర్కున్న ఒక వింత అనుభవాన్ని ఇప్ప్పుడు మీ ముందు వుంచుతాను. అలాంటి అనుభవం పగవాడికి కూడా రాకూడదని ఎవరైనా అనుకుంటారు. 

అది 2015వ సంవత్సరం. అప్పటికే నేను రిటైర్ అయ్యి నాలుగు సంవత్సరాలు కావొస్తున్నది. నా శ్రీమతి బ్యాంకింగ్ సర్వీస్‌లో వున్నది. అమ్మాయికి పెళ్లి అయింది, కానీ పాప ఇంకా అప్పటికి పుట్టలేదు. నేనూ – నా శ్రీమతి అమెరికాలో ఉంటున్న మా అబ్బాయి దగ్గరికి వెళ్లాలని అనుకున్నాం. అప్పటికి మా అబ్బాయి రాహుల్ అమెరికా వెళ్ళడమూ, అక్కడ ఎం.ఎస్. చేయడమూ, ఉద్యోగం చేయడం కూడా జరిగిపోయాయి. అబ్బాయి చాలాకాలంగా మా ఇద్దరినీ అక్కడికి రావాలని ఒకటే అడుగుతున్నాడు. మాకు కూడా చూడాలనే వుంది, కానీ ఏదో చెప్పలేని భయం. అన్ని గంటలు విమానంలో ప్రయాణం చేయడం, మధ్యలో దుబాయ్‌లో విమానం దిగి మళ్ళీ ఇంకొక విమానంలో ప్రయాణం చేయడం ఇవన్నీ తలచుకుంటేనే భయం వేసేది. సరే, అవన్నీ తర్వాతి విషయాలు. ముందు పాస్‌పోర్ట్, తర్వాత వీసా కావాలి కదా! పాస్‌పోర్టు హన్మకొండ లోనే ఒక బ్రోకర్ ద్వారా చేయించుకున్నాం (అప్పటికి హన్మకొండకు పాస్‌పోర్ట్ బ్రాంచి ఆఫీసు రాలేదు). ఇక తర్వాతిది వీసా వ్యవహారం. దానికి అవసరమైన డాక్యూమెంట్లు రాహుల్ అక్కడినుండి పంపించాడు. ఎలా అప్లై చేయాలన్నది చెల్లెలికి వివరించాడు. ఏమి పేపర్స్ కావాలి అన్నది కూడా చెప్పాడు. అలా అన్ని జాగ్రత్తలూ తీసుకుని అమ్మాయి ఇంటర్వ్యూ డేట్ కోసం అప్లయి చేసింది. ఒక శుభోదయాన డేట్ ఫిక్స్ అయి లెటర్ వచ్చింది. అన్నీ సిద్ధం చేసుకొని వాళ్ళు ఇచ్చిన తేదీ ప్రకారం అమెరికన్ కాన్సులేట్ (బేగంపేట్)కు వెళ్ళాము. మాతో మా అమ్మాయి నిహార కూడా వచ్చింది. గతంలో మా అబ్బాయి వీసాకు అప్లయి చేసినప్పుడు హైదరాబాద్‌లో ఈ ఆఫీసు లేదు. చెన్నై (మద్రాసు)కు వెళ్ళవలసి వచ్చేది. ఇప్పుడు హైదరాబాద్‌లో ఈ సౌకర్యం రావడం అందరికీ ఎంతో ఉపయోగకరంగా వుంది. ఇది ఇప్పుడు తెలంగాణా, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా రాష్ట్రాలకు పనిచేస్తున్నట్టు తెలిసింది. ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చేవాళ్ళకి కొంచెం ఖర్చుతో కూడుకున్న విషయమే. బంధువులో, మంచి మిత్రులో ఉంటే తప్ప అదనపు ఖర్చుల భారం మోయక తప్పదు.

నిర్ణయించిన సమయం ప్రకారం, బృందాలుగా లోపలికి పిలుస్తున్నారు. అవసరమైన డాక్యుమెంట్స్ ఫైల్ తప్ప,మిగతా అన్నీ మా అమ్మాయికి ఇచ్చేసి, మాకు పిలుపు రాగానే ఇద్దరం లోపలికి వెళ్ళాము. బయట గేటుకి, లోపలి ఆఫీసుకి చాలా దూరం వుంది. ఇలాంటి సందర్భాలలో నాకు విపరీతమైన టెన్షన్ వస్తుంది. నాకంటే ఇలాంటి విషయాల్లో నా శ్రీమతి చాలా దైర్యంగా ఉంటుంది. లోపలికి వెళ్ళగానే మొదటి విండో దగ్గరికి మార్గం చూపించారు. అక్కడ డాక్యుమెంట్లు, పాస్‌పోర్టులు పరిశీలించే స్థలం అది. ముందు నా ఫైల్ ఇచ్చాను. అన్నీ చెక్ చేసి ఫైల్ నాకు ఇచ్చేసి, రెండవ విండో దగ్గరకు వెళ్లామన్నారు. నా తర్వాత నా శ్రీమతి ఫైల్ తీసుకున్నారు. అంతే అక్కడ సమస్య ఎదురయ్యింది. మేము తీసుకెళ్లిన ఫోటోలు సరిగాలేవని, అక్కడ వున్న మినీ ఫోటోస్టూడియోలో ఫోటో తీసుకుని మళ్ళీ సబ్మిట్ చేయమని తిరిగి ఫైల్ ఇచ్చేసాడు. నాలో ఆందోళన మొదలయింది, వళ్ళంతా చెమటలు పెట్టడం మొదలయింది. ఏమి చెయ్యాలో తోచడంలేదు. ఒక్కసారిగా మెదడు మొద్దుబారిపోయింది. కారణం, అక్కడే ఫోటో తీసుకోవాలి, ఫోటోకు వందరూపాయిలు ఖర్చు అవుతాయి. జరిగింది ఏమిటంటే, సమస్తమూ బయట మా అమ్మాయికి ఇచ్చేసి వచ్చాము. అంటే పర్సులతో సహా! బయటికి వెళ్ళడానికి పర్మిషన్ అడిగితే, ఆవాళ్టి ప్రోగ్రామ్ కాన్సిల్ అవుతుందేమో అన్న భయం. ఏమి చేయడానికీ తోచడం లేదు. చెప్పలేని నీరసం శరీరంలో ప్రవేశించింది. పిచ్చివాడిలా అటూ ఇటూ తిరుగుతున్నాను. ఈలోగా నా శ్రీమతి ఒక ఉచిత సలహా ఇచ్చింది. అది కూడా భయంకరమైనదే. “ఎవరైనా ఇస్తారేమో, బయటికి వెళ్ళాక ఇచ్చేద్దాం, అడిగి చూడండి” అంది. ఇదేదో బాగానే వుందనిపించింది. కానీ ఎలా అడగడం?

ఆలోచిస్తే, అంతకుమించి చేయగలిగింది ఏమీ లేదు కూడా! ఎవరి పనుల్లో వాళ్ళు  అటూఇటూ తిరుగుతున్నారు. అలాంటివారిలో ఒక తెలుగు మాట్లాడే మహానుభావుడిని గుర్తించి, ఆయన స్పీడుకు తగ్గట్టుగా ఆయన కూడా పరిగెత్తినంత పని చేసి, నా విషయం వివరించి,బయటకు వెళ్ళాక ఆ సొమ్ము ఇచ్చేస్తానని చెప్పాను. 

ఆయన నావంక అదోలా పైకి -క్రిందికి చూసి ‘చూడ్డంలేన్ది’ అని ఒక మాట నా ముఖానకొట్టి, మళ్ళీ కనిపించకుండా ఏటో వెళ్ళిపోయాడు. ఇలాంటి తెలుగువాళ్లు నలుగురైదుగురి వెంటపడి నా విషయం చెప్పాను. అందరూ ఏదో సాకు చెప్పి తప్పించుకున్నారు. ఇక మేము ఆశలు వదులుకున్నాం. మళ్ళీ ఇంకోరోజు రాక తప్పదని ఒక నిర్ణయానికి వచ్చేసాము. నాకు నాలుక ఎండిపోయి, నీరసం ముంచుకొచ్చింది. ఎందుకో ఆలోచన వచ్చి ఆఖరి ప్రయత్నం చేయాలనే నిర్ణయానికి వచ్చాను. మాకు కొద్ది అడుగుల దూరంలోనే ఒక జంట, ఫైల్ సర్దుకుంటూ ఏదో మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ దగ్గరకు వెళ్లి అసలైన బిక్షగాడి స్టైల్‌లో, తెలుగులో నా వ్యవహారం సణగడం మొదలుపెట్టాను. అప్పుడు అతను నావంక చూసి “ఇంగ్లీష్ ఆర్ హిందీ ప్లీజ్” అన్నాడు ఎంతో మర్యాదగా. నేను విషయం అంతా ఆంగ్లంలో వివరించాను. “జస్ట్ వెయిట్” అన్నాడు. ఇది కూడా అనుమానం కేసురా బాబూ.. అనుకుంటున్న సమయంలో, ఆయన భార్యను ఉద్దేశించి “సాబ్ కో సౌ రూపాయ్ దేదో” అన్నాడు. ఆవిడ మరో ఆలోచన లేకుండా బ్యాగ్‌లో నుండి వందరూపాయల నోటు తీసి నా చేతిలో పెట్టింది. 

వాళ్లకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియలేదు. బయటికి రాగానే సొమ్ము తిరిగి ఇచ్చేస్తానని, వచ్చేరాని హిందీ భాషలో చెప్పి, వారిద్దరి దగ్గరా సెలవు తీసుకుని ఫోటో స్టూడియోకి వెళ్లి మిగతా పనులన్నీ పూర్తి చేసాం. వీసా పది సంవత్సరాలకు అనుమతి వచ్చినట్టు తెలుసుకుని బయటికి వచ్చాము. ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే, మాకు సహాయం చేసిన ‘మనుష్యుల్లో దేవుడు’ కోసం బయట, అరగంటపాటు తిరిగి ముగ్గురం వెతికాము. మా ప్రయత్నం అసలు ఫలించలేదు. నాకు ఇచ్చిన వంద రూపాయలకంటే, వారి సమయం అమూల్యమైనది. అందుకే త్వరగా వెళ్ళిపోయివుంటారు. వారు చేసిన సహాయం సామాన్యమైనది కాదు. ఆ రోజు వాళ్ళందరి ముందు నిజంగానే నేను బిచ్చగాడినైపోయాను.

వారికి అలా ఋణపడిపోయాను. వారికి తిరిగి డబ్బు ఇవ్వలేకపోయానన్న బాధ నన్ను ఇంకా వెంటాడుతూనే వుంది. ఒకవేళ ఇప్పుడు వారు కనపడినా నేను వారిని గుర్తు పట్టలేనేమో! అలా వచ్చిన వీసాతో అమెరికా వెళ్లడం, నెల  రోజులు అబ్బాయితో ఆనందంగా గడిచిపోయినా, నాకు సహకరించిన జంట సహృదయతను ఇప్పటికీ మరచిపోలేక పోతున్నాను, అలాగే తెలుగు సోదరులు తప్పించుకున్న సంఘటన కూడా.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here