[box type=’note’ fontsize=’16’] “కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే…!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్. [/box]
జ్ఞాపకాల దీపావళి!
[dropcap]నా[/dropcap] బాల్యం సుమారు పదమూడేళ్ళ వయస్సు వచ్చేవరకు మా గ్రామం ‘దిండి’ లోనే జరిగింది. ప్రాథమిక విద్య దిండిలోనూ, హైస్కూల్ విద్య రాజోలు (నాటి తాలూకా కేంద్రం)లోనూ కొనసాగింది. నాకు వూహ తెలిసే నాటికి, సంఘటనలు గుర్తుంచుకునే స్థాయికి ఎదిగే వయస్సు వచ్చేనాటికి, దీపావళి సంబరాల వెనుక వున్న చారిత్రాత్మక అంశాలు, సంఘటనలు అవగాహన లేకున్నా, ఆ పండగ వస్తే టపాసులు, చిచ్చుబుడ్లు, కాకర పువ్వొత్తులు, భూచక్రాలు, విష్ణు చక్రాలు, మతాబులు, సిసింద్రీలు, తప్పక కాల్చాలి కాబోలు అనుకునే రోజులు.
గ్రామంలో, ఎక్కువశాతం ఇళ్ళు పేద కుటుంబాలవే! పైగా దళితులవి. అతి తక్కువ శాతం, రాజులు (క్షత్రియులు) వున్నా, వారంతా ధనిక జాబితాకు చెందినవారే! వారి పొలాల్లో పని చేసుకుని ఆ గ్రామ దళితులు బ్రతికేవారు. ఇంతకీ ఇదంతా చెప్పొచ్చేది ఎందుకంటే, పండగ వెలుగులు వాళ్ళ ఇళ్లల్లోనే కనిపించేవి. పేదరికం చిన్న చిచ్చుబుడ్డి కొనుక్కోలేని పరిస్థితిని కలిగి ఉండేది. నాకు వూహ తెలిసేనాటికి, మా గ్రామంలో క్రైస్తవం ఇప్పటిలా, గ్రామం మూలమూలనా విస్తరించి లేదు. ఆ వాతావరణం ప్రక్క గ్రామం రామరాజులంకలో ఉండేది. అందుచేత హైందవ సాంప్రదాయం ప్రకారం పండుగలు తమ తమ స్థాయిల్లో చేసుకునేవారు. కనీసం వున్న బట్టలు ఉతుక్కుని ఆ రోజు ధరించడం జరిగేది. ఈ పరిస్థితికి నేను అతీతుణ్ణి కాదు. టపాకాయలు కాల్చాలని వున్నా, ఇంట్లో డబ్బులు అడగ డానికి భయపడేవాళ్ళం. అడిగినా వాళ్ళ దగ్గర అలాంటి వాటికోసం ఖర్చు చేయ దగ్గ డబ్బులు వాళ్ళ దగ్గర ఉండేవి కాదు!
మా వూళ్ళో మా బంధువు కారిపెల్లి భీమారావు ఉండేవాడు. ఆయన ఇల్లు మా ఇంటి వెనుక ఉండేది. ఆయన హిందూ పండుగలు చేసేవాడు, ఆచారాలు కొద్దిగా పాటించేవాడు. అప్పటికి మా ఇంటి వాతావరణం పూర్తిగా భిన్నం. మా నాయన గారు శ్రీ కానేటి తాతయ్య గారు, పక్కా కమ్యూనిస్టు. ఇంట్లో దేవుడి మాట అసలు వినిపించేది కాదు. పూర్తి నాస్తిక వాతావరణం. కేవలం మా కోసం మా అమ్మ కానేటి వెంకమ్మ, పండుగలకు తన వంతు సహకారం అందించేది. సంక్రాంతికి మాత్రం ప్రత్యేకత ఉండేది. దానికి కారణం నా అసలు పుట్టిన రోజు జనవరి 13 అట. ఈ విషయం మా పెద్దక్క కుమారి కానేటి మహనీయమ్మ ఎప్పుడూ గుర్తు చేస్తుండేది. అసలు విషయానికి వస్తే, మా భీమారావు దీపావళి పండగ కోసం, వారం రోజులు ముందుగానే, మతాబులు, చిచ్చుబుడ్లు, సిసింద్రీలు తయారు చేసి సిద్ధం చేసి వుంచేవాడు. అవి చేసేటప్పుడు నేను దగ్గరగా వెళ్లి చూసేవాడిని. నా కోసం చిటికెల పొట్లం తయారు చేసి ఇచ్చేవాడు. అది చేయడానికి, ఖర్చు పెట్టవలసిన అవసరం ఉండేది కాదు. స్థానికంగా దొరికే వస్తువులతో అది తయారయ్యేది. దానితో తృప్తి పడేవాళ్ళం. అప్పటి ఆర్థిక పరిస్థితి, నాస్తిక వాతావరణం, మమ్మలిని మరింత ముందుకు సాగకుండా కట్టడి చేసేవి.
కానీ, దీపావళికి ఏమీ కాల్చలేకపోతున్నామే అన్న బాధ ఏమాత్రం ఉండేది కాదు కానీ, మేము బాధపడతామేమోనని, మా నాయన అప్పుడప్పుడు టపాకాయలు తెచ్చేవారు,
కానీ ఎలా తెచ్చేవారో తెలిసేది కాదు. పెద్దన్నయ్య శ్రీ కె. కె. మీనన్ (కానేటి బులి కృష్ణమూర్తి) నాగపూర్‌లో – ఎం.ఏ. చదివే రోజుల్లో, దీపావళి సెలవులకు ఇంటికి వస్తే (రామరాజులంక) సాయంత్రం సమయానికి టపాకాయలు, కొన్ని దీపావళి మందుగుండు సామాగ్రి తెచ్చి ఇచ్చేవాడు. చాలా సంతోషం అనిపించేది. అప్పుడు టపాకాయలను ‘పెటేపి కాయలు’ అనేవాళ్ళం. భీమారావు పొన్న కాయలతో బాంబులు కూడా చేసేవాడు. అవి నిజం బాంబులు పేలినంత హడావిడి చేసేవి. వాటి జోలికి పోయే ధైర్యం ఉండేది కాదు. దూరంగా నిలబడి చెవులు మూసుకునే వాళ్ళం. మా నాయన తాటాకు టపాకాయలు చేతితోనే పట్టుకుని కాల్చేవారు.
అన్నయ్య దిండికి వచ్చినప్పుడల్లా తినడానికి ఏదో ఒకటి తెచ్చేవాడు. ఆయన మా దగ్గరే ఉంటే బావుండు.. అనిపించేది. రాత్రికి రామరాజులంక వెళ్లిపోయేవాడు. అన్న.. నా తల్లిదండ్రులకు మొదటి సంతానం అయినప్పటికీ, మా పెద్దమ్మ గోనమండ సత్తెమ్మ, పెదనాయన (అయ్య) జేమ్స్ దంపతులకు ఎందుకు పెంపకానికి (అడాప్షన్)కు ఇచ్చారో ఇప్పటికీ అర్థం కాదు!
అన్న మీనన్, హైదరాబాద్ ఏ.జీ. ఆఫీసులో ఆడిటర్‍గా జాయిన్ అయ్యాడు. నేను ఎనిమిదో తరగతి మధ్యలో ఆపి అన్నయ్య దగ్గరకు వెళ్ళవలసి వచ్చింది. కాలి సమస్య వల్ల అనారోగ్యానికి గురయి ఆయన దగ్గరకు వెళ్లాను. ఆ రోజుల్లో దీపావళికి అన్నయ్య చాలా క్రేకర్స్ కొని తెచ్చేవాడు. పిల్లలు ఆలస్యంగా పుట్టడం వల్లనేమో.. నన్ను స్వంత పిల్లవాడిగా చూసేవాళ్ళు. తర్వాత కాలేజీ చదువులో పడి, దీపావళిని పెద్దగా పట్టించుకోలేదు. ఎప్పుడైనా దీపావళి సమయానికి, సికింద్రాబాద్ పాప (చిన్నక్క భారతి) వాళ్ళింటికి వెళ్ళినప్పుడు ఈ సరదా తీర్చుకునేవాడిని. హాస్టల్‌లో ఎవరైనా టపాసులు కాలుస్తుంటే ఎంజాయ్ చేసేవాడిని. అప్పటికి ఈ టపాసుల కోసం పెట్టే ఖర్చు, బూడిదలో పోసిన పన్నీరు అన్నట్టు అనిపించేది. క్రమంగా పండగ మీద ఆసక్తి తగ్గింది. తర్వాత, 1982లో, బెల్లంపల్లిలోని సింగరేణి ఏరియా హాస్పిటల్‌లో ఆరు నెలలు వుద్యోగం చేసిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ సర్వీసు కమీషన్ ద్వారా ఎంపిక కాబడి, నాటి వరంగల్ జిల్లా, మహబూబాబాద్ తాలూకా ఆసుపత్రిలో, జూన్ నెలలో డెంటల్ అసిస్టెంట్ సర్జన్ గా జాయిన్ కావడం, ఆ తర్వాత పెళ్లి – పిల్లలు – ఆసక్తి తగ్గింది.
పిల్లల కోసం మళ్ళీ వాళ్ళు కాస్త ఎదిగిన తర్వాత దీపావళికి టపాకాయలు, కాకర పువ్వొత్తులు, మతాబులు, చిచ్చుబుడ్లు తెచ్చిపెట్టేవాడిని. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్లకు పెళ్ళిళ్ళు కూడా అయ్యాయి. కూతురు నీహారకు, కూతురు పుట్టి, నాకు తాత ప్రమోషన్ కూడా వచ్చింది. మనవరాలు చి.ఆన్షి కోసం మళ్ళీ టపాకాయల సందడి మొదలు. ఈ సంవత్సరం అమ్మాయి ఆన్షి కోసం కాకర పువ్వొత్తులు రప్పించింది. మనవరాలు భయపడుతుందేమోనని నేను భయపడ్డాను. కానీ, ఈ వయస్సులో అంత దైర్యంగా కాకర పువ్వొత్తులు తన చేతిలో పట్టుకుని కాలుస్తుందని ఊహించలేదు, కించిత్ గర్వపడ్డాను. ఇప్పటికీ దీపావళి వచ్చిందంటే, నా బాల్యం తప్పక గుర్తుకు వస్తుంది. గతాన్ని మరచిపోవడం అంత సులభం కాదనుకుంటా, ఇది అందరికీ వర్తించకపోవచ్చు.
గతాన్ని సింహావలోకనం చేసుకుని, భవితను వూహించుకునేవారు నిత్య చైతన్యవంతులుగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఆరోగ్యంగా బ్రతుకుతారు.
(ఇంకా ఉంది)