[box type=’note’ fontsize=’16’] “కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే…!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్. [/box]
ఆన్షితో అమెరికా యాత్ర
[dropcap]ఆ[/dropcap]న్షి (పండు, గ్రేసీ) పుట్టక ముందు నుంచే, అమ్మాయి నిహార (మున్నీ) తనకు పుట్టే సంతానానికి (ఆడ అయినా, మగ అయినా) పేరు పెట్టే నేపథ్యంలో, కొన్ని పేర్లు సెలెక్ట్ చేయమని చెప్పింది. ఆమె కోరిక మేరకు చాలా పేర్లు డైరీలో రాసుకున్నాను. మనవరాలు పుట్టిన తరువాత (జనవరి, 24, 2017, పార్వతి హాస్పిటల్, హైదరాబాద్) పేరు పెట్టే సమయం ఆసన్నమైంది, కానీ నేను రాసిపెట్టిన పేర్లలో ఏ ఒక్కటీ వాళ్లకి నచ్చలేదు. అమ్మాయి, అల్లుడు వినోద్, కొన్ని పేర్లు సేకరించి, మళ్ళీ అసలు పేరు కోసం తర్జన భర్జనలు చేస్తున్న సమయంలో, వారు ఎంచుకున్నపేర్లలో ముగ్గురికి సమ్మతమైన పేరు ఒకటి నేను సెలక్ట్ చేసాను.
చివరికి అదే ఖాయమైంది, అదే ‘ఆన్షి’. ఇతర భాషలో దీని అర్థం ‘దేవుడు ఇచ్చిన బహుమానం’ అని తెలుసుకున్నాను. పేరు కొత్తగా, అందంగా వుంది కనుక అందరికీ నచ్చింది. వియ్యంకుడు, విజయకుమార్‌కి కూడా అది నచ్చింది. మనవడు (కొడుకు, కొడుకు) ఆశ్రయ్‌కి ఈ పేరు దగ్గరగా ఉండడం కూడా ఆయనకు మనవరాలి పేరు నచ్చడానికి ప్రధాన కారణం అయి ఉండవచ్చు. ఇలా ఆన్షి పేరు సర్వ జన బంధు ఆమోదం పొందింది.
ఇక, ముద్దు పేర్లు వచ్చేసరికి, ఎవరి స్వేచ్ఛ వారికి ఇవ్వడం జరిగింది. అనుకోని రీతిలో నా నోటి నుండి, మనవరాలిని చూసిన క్షణం ‘పండు’ అనే పేరు వెలువడింది. పండు ఆధారంగా, ఎన్నో రకాలుగా నా మనవరాలిని ముద్దు ముద్దుగా పిలుచుకుంటున్నప్పటికీ, పండు ముద్దు పేరుగా స్థిరపడిపోయింది. ఇకపోతే, అల్లుడు వినోద్ స్వర్గీయ తల్లి గుర్తుగా, ‘గ్రేసీ’ అని పెట్టుకున్నాడు. ఎక్కువ మంది ఆ పేరుతోనే పిలుస్తారు. ఎలా పిలిచినా మనవరాలు మంచిగా స్పందిస్తుంది. అమ్మమ్మ అరుణ – ‘నాన్నా’ అని, చిన్నోడా అని పిలుచుకుంటుంది.
ఆన్షి మాతృమూర్తి, నిహార, వరంగల్ ఆకాశవాణిలో ప్రోగ్రామ్ ఎగ్జిక్యుటివ్‌గా పని చేస్తుండడం వల్ల, రోజుల బేబీని హనంకొండకు తీసుకు రావడం వల్ల, అతి చిన్న వయసులోనే, వందల కిలోమీటర్లు, ప్రయాణం చేసే అవసరం ఏర్పడింది. తండ్రి వినోద్ సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా హైదరాబాద్‌లో పనిచేస్తుండడం వల్ల, తండ్రి తరుపు తాత కూడా హైదరాబాద్‌లో ఉండడం వల్ల, తరచుగా హైదరాబాద్ వెళ్లడం తప్పని సరి అయింది. అందుచేత అతి చిన్న వయస్సులోనే ఏ.సి. కారు, రైలులో ఏ. సి. కోచ్‌లు అలవాటు అయ్యాయి. తల్లి తండ్రుల అతి జాగ్రత్తకు ఇదొక గొప్ప ఉదాహరణ గా నేను భావిస్తాను. ప్రయాణాల్లోనే కాదు, ఇంట్లో కూడా అవసరాన్ని బట్టి ఆన్షికి ఏ.సి. అలవాటు అయిపొయింది. ముద్దుల మనవరాలి విషయంలో ఆది నాకు పెద్ద భారంగా అనిపించదు.
ఆన్షి మేనమామ బోస్టన్‌లో (అమెరికా) ఉంటాడు. అక్కడ క్వాలిటీ ఇంజనీరుగా పనిచేస్తున్నాడు. ఆన్షి పుట్టిన సమయానికి రాలేకపోయాడు. అందుచేత ఆమె మొదటి సంవత్సరం పుట్టిన రోజుకి ప్లాన్ చేసుకొని, హైదరాబాద్ (సఫిల్‌గూడ) వచ్చాడు. చెల్లి అంటే ఎంత ప్రేమో, చెల్లి కూతురు (ఆన్షి) అంటే అంతకు మించిన ప్రేమ రాహుల్‌కి! పుట్టిన రోజు పండగకు హాజరై అమెరికా తిరిగి వెళ్లిన తర్వాత, మేనకోడలిని అక్కడికి రప్పించుకునే ప్రయత్నంలో, ప్రోగ్రామ్ ఫిక్స్ చేసాడు కుమార రత్నం. అందుచేత మనమరాలు వెళ్లాలంటే అందరం బయలుదేరవలసిందే! అందరికీ పాస్‌పోర్ట్‌లు వున్నాయి. ఆన్షికి పాస్‌పోర్ట్ లేదు. నాకు, అరుణకి, వినోద్‌కి, వీసా వుంది, అమ్మాయికి, మనవరాలికి వీసా లేదు! అందుచేత ముందు ఆన్షికి పాస్‌పోర్ట్ తీసే పనికి పూనుకుంది అమ్మాయి నిహార.
గతంలో పాస్‌పోర్ట్ అప్లయ్ చేయడానికి హైదరాబాద్ వెళ్ళాలి, పైగా పూర్తిగా బ్రోకర్ల మీద ఆధారపడి అధిక సొమ్ము చెల్లించవలసి వచ్చేది. ఇప్పుడు కొన్ని సౌకర్యాలు మెరుగుపడ్డాయి. స్థానికంగా హనంకొండలో (హెడ్ పోస్టాఫీస్‌కి అనుబంధంగా) అప్లై చేసుకునే సదుపాయం కల్పించింది ప్రభుత్వం. అంతమాత్రమే కాకుండా, బ్రోకర్‌తో పనిలేకుండా స్వయంగా ‘ఆన్‌లైన్’ ద్వారా, అప్లై చేసుకునే అవకాశం వచ్చినందువల్ల, ఇప్పుడు ఇంచుమించు అందరికీ అంతో ఇంతో, కంప్యూటర్ జ్ఞానం ఉండడం వల్ల, అమ్మాయి సునాయాసంగా ఈ పని పూర్తి చేయగలిగింది. ఆన్షి ఫోటో తీసుకోవడం, దానిని ఒక పాస్‌పోర్ట్ సైజుకు తీసుకురావడం పెద్ద తతంగమే అయింది. రెండు సంవత్సరాల, చిన్నపిల్ల ఫోటో కోసం, కుదురుగా ఉండడం కాస్త కష్టమైన పనే!
తేదీ, సమయం, కేటాయించిన విధంగా, ఆఫీసుకు, పాపను తీసుకుని, అమ్మాయి,నేనూ, స్వప్న(కేర్ టేకర్) వెళ్ళాము. ఇంటర్వ్యూకి చాలా సమయం పట్టింది. అయినా, పండు పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. మొత్తానికి, ఆ పని పూర్తి చేసుకుని,ఆనందంగా,ఇంటికి తిరిగి వచ్చేసాము. మామూలుగా, ఎంక్వయిరీ కోసం, పోలీస్ అఫీషియల్, నెల రోజులకో, అంతకంటే తక్కువ రోజులకో వచ్చి, పని పూర్తి చేసుకుని వెళితే, మరో పదిహేను రోజులకు పోస్ట్‌లో పాస్‌పోర్ట్ వచ్చేది. కానీ ఇక్కడ,ఆన్షి విషయంలో మాత్రం వారం రోజులు లోపే, ఎంక్వయిరీకి వచ్చారు. సాధారణంగా ఇలా వచ్చిన వాళ్ళు, ఎంతో కొంత ‘ఇనాం’ ఆశిస్తారు. కొందరు అడిగేస్తారు, కొందరు, అడిగి అడగనట్టు ప్రవర్తిస్తారు. ఇతను మాత్రం అలాంటిది ఏమీ లేకుండానే, రిపోర్ట్ రాసుకుని వెళ్ళిపోయాడు. ఆతను చేయాల్సిన పని ఏమిటంటే, మనం ఇచ్చిన సమాచారం నిజమో కాదో నిర్ధారించుకోవడం. అయితే,ఇనాం,ఇవ్వకపోతే ఏదో మెలిక పెట్టి ఇబ్బందులు సృష్టిస్తారు. కానీ, ఈ ఆలోచనకు భిన్నంగా, వారం రోజుల్లో, ఆన్షికి, రిజిస్టర్డ్ పోస్టులో, పాస్‌పోర్ట్ మా ఇంటి తలుపు తట్టింది. సంతోషం అయింది. హమ్మయ్య ఒక పని అయింది,అనుకున్నాం. అతి చిన్నవయస్సులోనే ‘ఆన్షి.నల్లి’ పేరుతో, ఒక భారత పౌరురాలిగా, ఐడెంటిటీ నమోదు అయినట్టు తేలిపోయింది.
ఈ పనులన్నీ ఎవరి సహాయం లేకుండా, వొంటి చేతితో చేయగలగడం, మామూలు విషయం కాదు! ఆ పని అమ్మాయి, చేయగలిగింది. ఇది ప్రశంసనీయం. ఇక, రెండవ దశ, వీసా కోసం డాక్యుమెంట్లు, అమెరికన్ కాన్సిలేట్‌లో సమర్పించడం. ఆన్‌లైన్‌లో డేట్ తీసుకుంది, అమ్మాయి నిహార. అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించిన పిదప, ఇంటర్వ్యూకి సమయం తేదీ నిర్ణయించారు. అమెరికా వెళ్ళేదీ లేనిదీ ఇక్కడ తేలిపోతుంది. ఆన్షి నిహారలు, కేటాయించిన తేదీ ప్రకారం అమెరికన్ కాన్సిలేట్‌కు ఇంటర్వ్యూకు వెళ్లారు. ఆన్షి చిన్న పిల్ల కాబట్టి ఇంటర్వ్యూకు అవసరం లేదు అన్నారు. అందుచేత అమ్మాయి నిహార ఒక్కతే లోపలికి వెళ్ళింది. వీసా గ్రాంట్ అయింది ఇద్దరికీ. అమెరికా ప్రయాణానికి మార్గం సుగమం అయింది, అందరిలోనూ ఆనందం వెల్లువెత్తింది.
అందరం ఒకేసారి అబ్బాయి రాహుల్‌ని చూడ్డానికి వెళ్లడం సంతోషించదగ్గ విషయం అయినప్పటికీ, ఆన్షి చిన్నపిల్ల కావడంతో, ప్రయాణంలో పరిస్థితులు ఎలా వుంటాయోనన్న శంక ఒక వైపు నన్ను బాధిస్తూనే వుంది. దీనికి తోడు, అల్లుడు వినోద్‌కు 15 రోజులు మాత్రమే అనుమతి లభించడం వల్ల, మాతో కాకుండా, మేము వెళ్లిన 15 రోజుల తర్వాత రావాలని వినోద్ ప్రోగ్రాం ఫిక్స్ చేసింది అమ్మాయి. నా ఆందోళనకు ఇదొక కారణం అయింది. అమ్మాయికి 25 రోజుల సెలవు మంజూరు అయింది. అందుచేత, మా ఇద్దరం (అరుణ, నేను) రిటైర్ అయినప్పటికీ, అమెరికాలో ఎక్కువ రోజులు వుండే అవకాశం లేకుండా పోయింది.
ప్రయాణ సన్నాహాలు జోరందుకున్నాయి. నా ఆనందానికి మించి, ఆందోళన రెట్టింపు కావడం మొదలు అయింది. షాపింగులు, ప్యాకింగులు ఊపందుకున్నాయి. నిర్ణీత బరువులను, అన్నిబ్యాగ్‌లలో సరిచూచే పని, సర్దడం వంటి పనులు అమ్మాయి నేను చూసుకున్నాం. నిజానికి ఒక్కొక్కరికీ రెండు బ్యాగ్‌లు (సూట్ కేసులు) అనుమతిస్తారు. ఇది చెక్ ఇన్‍కు సంబందించిన విషయం, అంటే విమానం లోపలికి పోయే లగేజీ. ఇది గమ్యస్థానం చేరిన తర్వాత మాత్రమే, తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ బేగ్ ఒక్కొక్క దానిలో 23 కేజీల బరువు గల లగేజి ఉంచవచ్చు అన్నమాట!
ఇంతేకాకుండా, కేబిన్ లోనికి ఒక చిన్న బేగ్ (మనం కూర్చున్న చోటికి తీసుకు వెళ్ళేది) కూడా అనుమతిస్తారు. ఇందులో 7 కేజీల బరువు గల లగేజీ తీసుకెళ్లవచ్చు. సాధారణంగా, అప్పటికప్పుడు, ఉపయోగానికి వచ్చే బట్టలు, అనుమతించబడిన వస్తువులు తీసుకెళ్లవచ్చు. చిన్నపిల్లల కోసం కేబిన్‌లో అదనపు బేగ్ కూడా అనుమతి ఉంటుంది. సరైన బరువులతో బేగ్‌లు సర్దడం కాస్త ఓపికతో చేయాల్సిన పనే! ఆ పని కూడా ఇబ్బంది లేకుండానే పూర్తి అయింది. అమెరికాకు ప్రయాణమయ్యే రోజు కోసం ఆత్రుత ఆందోళన, సమపాళ్ళలో ఎదురు చూస్తున్నాయి. ఆందోళన మాత్రం పూర్తిగా నాదే! మిగతావాళ్ళకి ‘పండు’ విమాన ప్రయాణం గురించి పెద్దగా ఆలోచన చేస్తున్న లక్షణాలు కనిపించడంలేదు. ఒకవేళ మనసులో వున్నా బయటపడడం లేదేమో!
అనుకున్న రోజు రానే వచ్చింది. భయాలూ ఆందోళనలూ పక్కన పెట్టి ప్రయాణానికి సన్నద్దమయ్యాము. 15, మే 2019, అర్ధరాత్రి ఫ్లైట్. దుబాయ్ బ్రేక్. అక్కడి నుండి సరాసరి ‘బోస్టన్’ వెళుతుంది దుబాయ్ ఎయిర్వేస్ విమానం. మొత్తం 21 ప్రయాణ గంటలు. విమానం బయలుదేరడానికి మూడుగంటల ముందే శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నాం. ఆన్షికి నిద్రాభంగం అయింది. ‘చెక్ ఇన్’ అయి లోపలికి వెళ్ళాము. దుబాయ్ ఎయిర్‌లైన్స్ కౌంటర్ దగ్గరకు వెళ్లి లగేజ్ బరువు సరిచూసుకుని, విమానంలోకి వెళ్లే లగేజ్‌ను సిబ్బందికి అప్పగించడం, గేట్ పాస్ (టికెట్) తీసుకుని, లోపలికి వెళ్లే సమయం ఇంకా ఉండడంతో అల్లుడితో కాసేపు ముచ్చట్లు పెట్టాము. అప్పుడు అక్కడ ఒక వింత వాతావరణం. సాగనంపడానికి వచ్చే వారి హావభావాలు, జాగ్రత్తలు చెప్పుకోవడాలు, ఏడ్చుకోవడాలు, ఒకరినొకరు చూసుకుంటూ, మూగ వేదనలో, మాటలు రాక,కన్నీళ్లు పెట్టుకోవడాలు,హాస్య సంభాషణలు, ఇలా ఆ ప్రాంతం రకరకాల సన్నివేశాలతో నిమగ్నమైవుంది. ఫ్లైట్ సమయం దగ్గర పడుతుండడంతో, ఒక్కొక్కరు బయట వున్నవారికి బై చెప్పి సెక్యూరిటీ గేట్ వైపు వెళ్లడం మొదలుపెట్టారు. మేము కూడా అల్లుడు వినోద్ దగ్గర సెలవుతీసుకొని సెక్యూరిటీ గేట్ వైపు బయలుదేరాము. ఆన్షి.. కొత్త వాతావరణం బాగా ఎంజాయ్ చేస్తున్నది, వాళ్ళ అమ్మను మాత్రం వదలడం లేదు. ఫార్మాలిటీస్ అన్నీ ముగించుకుని, బోర్డింగ్ గేట్ నంబర్ చూసుకుని దానికి దగ్గరలో కూర్చున్నాము. ఆన్షి ఏమాత్రం ఇబ్బంది పెట్టడం లేదు.
నాకు సంతోషం అనిపించింది. మైక్‌లో అనౌన్స్‌మెంట్ రాగానే మా గేట్ గుండా విమానం లోకి ప్రవేశించాము. లోపలికి వెళ్ళగానే, ఆశ్చర్యం ఏమిటంటే, లోపల నా మనవరాలు ఆన్షి కంటే చిన్నపిల్లలూ వున్నారు, నన్ను మించిన కురువృద్ధులూ వున్నారు! నిజానికి ఇది నాకు అమెరికా వెళ్ళడానికి రెండవసారి కలిసొచ్చిన అదృష్టం. అప్పుడు పెద్దగా ఏమీ పట్టించుకోలేదు. ఈ ప్రయాణం ఆన్షితో ప్రత్యేకం. లోపల కూడా, లంచ్ డిన్నర్, తీసుకొనేటప్పుడు తప్ప, పండు (ముద్దు పేరు) అసలు మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. రెండుగంటల్లో దుబాయ్ చేరుకోవడం, ఒక గంట తర్వాత మళ్ళీ బోస్టన్‌కు వెళ్లే విమానం ఎక్కడం అంతా కొత్త లోకంలో ఆనందాన్ని ఆస్వాదిస్తూ కనిపించింది చిన్నారి ఆన్షి. పందొమ్మిది గంటల ఏకధాటి ప్రయాణంలో కాసేపు నిద్రపోవడం, ఎక్కువసేపు మెలుకువగా ఉండడం చేసేది, చక్కగా ఆడుకున్నది. తర్వాత బోస్టన్ చేరుకోవడం, విమానాశ్రయానికి అబ్బాయి రాహుల్ రావడం, ఒక గంట కారు ప్రయాణంతో, తాను కొత్తగా కొనుక్కున్న ఇంటికి చేరుకోవడం జరిగిపోయాయి. ఇక్కడ ఆన్షి ప్రయాణం అనుభవం చెప్పడమే తప్ప అక్కడ సుందర దృశ్యాలను వర్ణించి చెప్పే అవకాశం తీసుకోవడం లేదు. మేము బోస్టన్ చేరుకున్న పదిహేను రోజులకు, ఆన్షి తండ్రి వినోద్ హైదరాబాద్ నుండి రావడం, ఉన్న నెల రోజుల్లోనూ చాలా ముఖ్యమైన ప్రదేశాలు తిరగడమూ, కారులో లాంగ్ డ్రైవ్ చేయడమూ, ఆన్షితో ఆనందంగా గడిచి పోయింది. ఆన్షికి ఆ సమయంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకపోవడం మా అదృష్టం.
మేనమామ తన కోసం ప్రత్యేకంగా చేసిన ఎన్నో ఏర్పాట్లు ఆన్షిని ఆనందంగా గడిపేలా చేసినాయి. బోట్ షికార్లలో పెద్దవాళ్ళు భయపడినా తాను చక్కగా ఎంజాయ్ చేసింది. తిరుగు ప్రయాణంలో నేను ఎలాంటి టెన్షన్‌లు లేకుండా వున్నాను. హాయిగా జూన్ పదిహేను తెల్లవారు ఝాముకు శంషాబాద్ విమానాశ్రయంలో దిగాము. ఫార్మాలిటీస్ అన్ని పూర్తి అయ్యాక లగేజి కలెక్ట్ చేసుకున్నాము.
ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే, కొన్ని ముఖ్యమైన బట్టలు, వస్తువులు, గిఫ్టులు సర్దిపెట్టుకున్న మా అమ్మాయి నిహార సూట్‌కేస్ మిస్ కావడం. అప్పుడు మా పరిస్థితి ఎలా వుంటుందో మీరు ఊహించుకోవచ్చు.
(మళ్ళీ కలుద్దాం)