Site icon Sanchika

జ్ఞాపకాల పందిరి-62

[box type=’note’ fontsize=’16’] “కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే…!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్. [/box]

భూమి దగ్గరే హద్దులు… స్నేహానికి లేవు సరిహద్దులు…

[dropcap]జీ[/dropcap]వితంలో వింత వింత అనుభవాలు, వెనక్కి తిరిగి ఆలోచిస్తే విడ్డూరంగా అనిపిస్తాయి. ఆనందంగా గడపాల్సిన జీవితాలు… కానీ ఎప్పుడూ ఏదో వంకన అనవసరమైన టెన్షన్లు తెచ్చిపెట్టుకుంటారు. లేనిపోని ఉద్రిక్త పరిస్థితులను, కావాలని కల్పించుకుని, ఇబ్బందులను కొని తెచ్చుకుంటారు. ‘పాము చావదూ – కట్టే విరగదు’ అన్న చందాన, సమస్యకు ఒక పరిష్కార మార్గమంటూ వీలు కాకుండా సమస్యను సంవత్సరాల తరబడి, తరతరానికీ ఇది కొనసాగుతూ ఉంటుంది. శాంతి సౌభాగ్యాలకు అవరోధం ఏర్పడుతుంది. పైగా సమస్యలో… చేవ అంతగా ఉండదు, అయినప్పటికీ, దానికి ముగింపు అన్నది కానరాదు. ఈ సమస్య మరింత జటిలం కావడానికి ఒక్కోసారి ఇరుపక్షాలు కారణం కావచ్చు. లేకుంటే ఒక పక్షం సహకరించని కారణం కావచ్చు. మరి కొంత మంది మరోఅడుగు ముందుకు వేసి కోర్టుల చుట్టూ తిరుగుతూ, లాయర్లను మేపుతూ, ఉన్న కొద్దీ ఆస్తినీ హారతి కర్పూరంలా కరిగించేసుకునే వాళ్ళూ వుంటారు. అలాంటి మనస్తత్వం గలవాళ్ళు ఎవరు చెప్పినా వినే పరిస్థితిలో వుండరు. ఇలాంటి వాళ్ళు చేతులు కాలకే, ఆకులు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ అప్పటికే జరగాల్సిన భారీ నష్టం జరిగిపోతుంది.

గ్రామాలలో, పల్లెటూళ్లలో ఎక్కువగా ఇలాంటి అనవసర పరిస్థితులను కొనితెచ్చుకుని, సంతోషంగా గడపాల్సిన జీవితాన్ని, జీవితాంతం దుఃఖమయం చేసుకుంటారు. కక్షలు కార్పణ్యాలతో బ్రతుకు దుర్భరం చేసుకుంటునారు. పెద్దవాళ్ళు ఒకరినొకరు శత్రువులుగా భావించుకోవడం వల్ల, భావితరాలైన పిల్లల్లో కూడా అదే భావన, వాళ్ళ మెదళ్లలో అంకురిస్తుంది. అన్నెం పున్నెం ఎరుగని పిల్లల్లో ఇలాంటి భావనలు తలెత్తడం ఆరోగ్యకరం కాదు. పెద్దలు ఈ విషయాన్ని అసలు అర్థం చేసుకోరు. వాళ్ళ పంతాలు పట్టింపులకే ప్రాధాన్యతనిస్తారు. వీటివల్ల జీవితంలో తాము ఏమి కోల్పోతున్నారన్న విషయం అసలు పట్టించుకోరు. ఇది పిల్లలపై పెద్ద ప్రభావమే చూపిస్తుంది. పక్క పక్క ఇళ్లు అయినా, ప్రొద్దున్నే లేచి ఒకరి ముఖం మరొకరు చూసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. బంధాలు-అనుబంధాల పట్ల సరైన అవగాహన లేకపోవడం, చెప్పలేనంత మొండితనం, నువ్వెంత? అన్న గర్వం కలిపి జీవితాంతం ఘర్షణలతో, ఎడముఖం పెడముఖాలతో, జీవితాంతం శత్రువులుగా మిగిలిపోవడం జరుగుతుంటుంది. ఎవరి గురించో ఎందుకు నా జీవితంతో ముడిపడి వున్న ఉదంతమే మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను.

రచయిత తల్లిదండ్రులు కానేటి వెంకమ్మ, కానేటి తాతయ్య

మా వూరు తూర్పు గోదావరి జిల్లాలోని, మల్కీపురం మండలంకు చెందిన ‘దిండి’ గ్రామం. మా నివాస స్థలానికి ఎడమవైపు మా పెద్ద మేనత్తకు చెందిన భూమి, కుడివైపు భూమి ఏనుగుపల్లి అర్జయ్య భూమి. అర్జయ్య నూటికి నూరు శాతం నిరక్షరాస్యుడు. భూస్వాముల కొబ్బరితోటల దగ్గర కాపలా వుండి పొట్టపోసుకునే జీవితం నెట్టుకొస్తున్న వ్యక్తి. భార్య మీరమ్మ కూలి నాలి చేసి కొంత సంపాదిస్తూ ఉండేది. ముగ్గురు ఆడపిల్లలు, నలుగురు మగపిల్లలు వీరి సంతానం.

నాగేశ్వరరావు తల్లిదండ్రులు ఏనుగుపల్లి అర్జయ్య, ఏనుగుపల్లి మీరమ్మ

నలుగురు మగపిల్లల్లో పెద్దవాడు, ఒకటవ తరగతి నుండి హైస్కూల్ వరకూ నా సహాధ్యాయి, నాకు మంచి బాల్య స్నేహితుడు, ఏనుగుపల్లి నాగేశ్వరరావు. రాజోలు హైస్కూల్‌లో కూడా మేమిద్దరం కలసి చదువుకున్నాం. ఇద్దరం హాస్టల్‌లో వున్నాం (అది స్వాతంత్ర్య సమరయోధుడు, శ్రీ గొల్ల చంద్రయ్య గారి వసతి గృహం. వీరు ప్రముఖ కవి శ్రీ బోయి భీమన్న గారి మామ గారు). మంచి స్నేహితులుగా మెలిగేవాళ్ళం.

రచయిత బాల్యమిత్రుడు స్వర్గీయ నాగేశ్వరరావు. ఏనుగుపల్లి
గొల్ల చంద్రయ్య గారి వసతిగృహం. కుర్చీలో, ఎడమ నుండి రెండవ వారు రచయిత.

ఇంటి దగ్గర భూమి తగాదాలు అప్పుడప్పుడూ జరుగుతూనే ఉండేవి. మా నాయన సరిహద్దులో దడి కడితే, తెలియకుండా, నాగేశ్వరరావు తండ్రి పీకేసి హద్దులు మార్చేసేవాడు. నాకు వూహ వచ్చినప్పటి నుండి, మొన్న మొన్నటి వరకూ ఈ తగాదా నడుస్తూనే వుంది. నాగేశ్వరరావు తండ్రి అర్జయ్య, మా నాయన తాతయ్య గారు, మరణించినా ఆ తగాదా అంతం కాలేదు. తండ్రి తర్వాత ఆ బాధ్యతను నాగేశ్వరరావు తమ్ముడు నరసింహమూర్తి తీసుకున్నాడు. ఇతను కూడా తండ్రిలానే ప్రవర్తించేవాడు. ఇన్ని జరుగుతున్నా, నాగేశ్వరరావుకు నాకూ మధ్య స్నేహంలో ఎలాంటి తేడా రాలేదు. నాకోసం హాస్టల్‌కు బత్తాయిలు, కొబ్బరి బొండాలు తెచ్చేవాడు. ఇంటి విషయాలు పొరపాటున కూడా ఇద్దరం ఎప్పుడూ ప్రస్తావించుకునే వాళ్ళం కాదు. ఒకసారి ఒక ప్రమాదకరమైన సంఘటన జరిగింది. మా హాస్టల్ పక్క ఇంట్లో పంపర పనస చెట్టు ఉండేది. ఎప్పుడూ చెట్టునిండా కాయలు ఉండేవి. మా మనసంతా ఆ చెట్టు చుట్టూ తిరుగుతుండేది, తినాలనే కోరిక. అయితే ఆ ఇంటి యజమానికి, మా హాస్టల్ మేనేజర్ చంద్రయ్య గారికీ ఎప్పుడూ గొడవలు జరుగుతుండేవి. అది కూడా భూమి వ్యవహారమే కావచ్చు. ఒకరోజు రాత్రి అందరు నిద్రపోయాక, నేను నా మిత్రుడు నాగేశ్వరరావు, అన్న వరుస గల బందిల అరుణకుమార్ (రిటైర్డ్ ఫార్మసిస్ట్) పంపర పనస కాయల చౌర్యానికి బయలు దేరాము. పంపర పనస చెట్టు పక్కన మంచి నీళ్ల బావి కూడా వుంది. మేము నాగేశ్వరరావును చెట్టు ఎక్కించాము. చీకటిలో కాయలు కోయబోయి జారిపడ్డాడు. కింద వున్నమా ఇద్దరి గుండెలు ఝల్లుమన్నాయి. నూతిలో పడిపోయాడు అనుకున్నాం. మా అదృష్టం కొద్దీ బావి ఒరమీద పడ్డాడు, ఇద్దరం గట్టిగా పట్టుకున్నాం. బ్రతుకు జీవుడా.. అనుకుని క్షేమంగా బయటపడ్డాము. వేసవిలో ఒంటి పూట బడులు ఉండేవి. మధ్యాహ్నం ఇంటికి వెళ్ళేటప్పుడు లంకల్లో పండే పుచ్చకాయలు, చీమ చింతకాయలు, యజమానులకు తెలియకుండా కోసుకుని తినేసేవాళ్ళం.

నా అనారోగ్య పరిస్థితిని బట్టి నేను ఎనిమిదవ తరగతి పూర్తి కాకుండానే, రాజోలు వదలి హైదరాబాద్‌కు వెళ్ళవలసి వచ్చింది. అనుకోకుండా ఇద్దరం విడిపోయాం. ఏనుగుపల్లి నాగేశ్వరరావు, తర్వాత చదువు మానేసి పెళ్లి చేసుకుని విశాఖపట్నం వెళ్లాడని, చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ తర్వాత కాంట్రాక్టులు చేసేవాడని, ఆ తర్వాత గుండెపోటుతో చిన్నవయసులోనే (41 సంవత్సరాలు) చనిపోయినట్టు తెలిసింది. హైస్కూల్ నుండి మేమిద్దరం ఎవరికి వారం వేరైపోయినా, వాడు విశాఖపట్నంలో, నేను హైదరాబాద్‌లో, ఒకరికొకరం మళ్ళీ పలకరించుకునే అవకాశం రాలేదు. నేను స్వగ్రామం ‘దిండి’కి ఎప్పుడు వెళ్లినా, నాగేశ్వరరావు తమ్ముడు నరసింహమూర్తి (ఆర్.టి.సి.లో డ్రైవర్ – రాజోలు డిపో) తో, ఏదో రూపంలో ఘర్షణలు తలెత్తుతుండేవి. మా సరిహద్దు గొడవ మాకు సంబంధం లేకుండా ప్రశాంతంగా ముగిసి పోయింది.

నాగేశ్వరరావు తమ్ముడు ఏనుగుపల్లి వెంకటేశ్వరరావు (రాజోలు), (ఫోటోల సౌజన్యం)

కోటిపల్లి – నరసాపూర్ రైల్వే లైన్, నాటి లోకసభ స్పీకర్ బాలయోగి గారి చొరవతో కదిలి, ఆయన మరణించిన చాలాకాలానికి ప్రారంభం కావడంతో, ఏనుగుపల్లి వారి భూమి పూర్తిగానూ (ఇంటితో సహా), మా భూమి నాలుగో వంతు, ప్రభుత్వానికి సరెండర్ చేయవలసి వచ్చింది. అలా ఆ చిరకాల సమస్యకు తెరపడినట్టు అయింది. ఆ గ్రామ రూపురేఖలు కూడా గణనీయంగా మారిపోయాయి. నాగేశ్వరరావు – నా స్నేహం మాత్రం ఒక చరిత్రగా మిగిలిపోయింది. మా స్నేహం అంత పటిష్టంగా, ఆత్మీయంగా అలా కొనసాగడానికి వాడి పాత్రే ఎక్కువ. మిత్రుడు ఏనుగుపల్లి నాగేశ్వరరావు అమరుడు!

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version