జ్ఞాపకాల పందిరి-63

53
2

[box type=’note’ fontsize=’16’] “కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే…!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్. [/box]

వయసుతో పనియేమి..!

[dropcap]కొ[/dropcap]న్ని సంఘటనలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఊహించని సంఘటనలు మన చేత, మనమే కాదు, ఎవరూ ఊహించని పనులు చేయిస్తుంటాయి. అలా జరగడం మనకే ఆశ్చర్యం అనిపిస్తుంది. అలా మనం అనుకోని పని యాదృచ్ఛికంగా జరిగి పోయి అందరి మన్ననలు పొందినప్పుడు కలిగే ఆనందం, పొందే తృప్తి అంతా ఇంతా కాదు! ఇలాంటివి జీవితంలో చాలా మందికి అనుభవమే! అలాంటి సంఘటనలు మనం బ్రతికినంత కాలం మనకు గుర్తుకు వచ్చి ఎంతో మానసిక ఆనందాన్ని కలుగజేస్తాయి. జరిగిన సంఘటన కుటుంబానికి సంబందించినదైనా, బంధువులకు సంబంధించినదైనా, సాహిత్యానికి సంబందించినదైనా, ఏ ఇతర కళలకు సంబంధించినది అయినా, ఎప్పటికీ గుర్తుండి పోతుంది.

పద్య కవి శ్రీ కుసుమ వెంకట రత్నం గారు, హనంకొండ.

కవిత్వం రాయడం అంత ఆషామాషీ విషయం కాదు. అందరికీ అబ్బేది కాదు. కొందరికి పుట్టుకతోనే ఈ కళ అబ్బుతుంది. కొందరికి పరిసరాలూ, ఇంట్లో వాతావరణం కవిత్వం వైపు మక్కువ కలిగేలా చేస్తాయి. కొందరు సమయ పాలనతో కష్టపడి సాహిత్యాన్ని చదివి అందులోని మెళుకువలు తెలుసుకుని, కవిత్వం పట్ల ఆకర్షితులవుతుంటారు. అతికొద్ది మంది, తాము చిన్నప్పుడు చదువుకున్న సాహిత్యమూ వ్యాకరణము గుర్తుకు తెచ్చుకుని, శ్రమించి పదవీ విరమణానంతరం కవిత్వ సాధన చేస్తారు. అది పద్యం కావచ్చు, వచన కవిత కావచ్చు, మరింకేదైనా సాహిత్య-ప్రక్రియ కావచ్చు. తమ ఇష్టాన్ని బట్టి, తమ వయసుతో సంబంధం లేకుండా, సాహిత్యం వైపు మనసు మళ్లిస్తారు. ఇది ఒక్కటే వీరికి సరిపోదు. ఇంటి ఇలాలు సహాకారం, పిల్లల ప్రోత్సాహం, బంధువుల, స్నేహితుల ప్రశంశలు లేదా విమర్శలు అవసరం అవుతాయి. ఇలా సాహిత్యం/కవిత్వంపై ఆకర్షితులయ్యేవారి సంఖ్య బహు తక్కువ. అయితే ఇలాంటి వారి గురించే ఎక్కువ తెలుసుకోవలసిన అవసరం వుంది. రిటైర్ అయిపోయాము.. అనే విషయాన్ని,బాధను మనసు లోనికి రానీయకుండా ఇలాంటి వ్యాపకం పెట్టుకోవడం వల్ల నిత్యం ఉత్సాహంగా ఉల్లాసంగా, ఆరోగ్యంగా వుండే అవకాశం వుంది. అందు చేత రిటైర్ అయి ఒక కవిగా మారిన ప్రముఖ వ్యక్తిని మీకు ఇక్కడ పరిచయం చేస్తాను.

శ్రీమతి & శ్రీ వెంకట రత్నం. కుసుమ

ఆయన అతి సౌమ్యుడు. అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ‘ఎలక్టిసిటీ బోర్డు’లో చీఫ్ అకౌంట్స్ ఆఫీసరుగా పదవీవిరమణ చేశారు. ఆయన ప్రస్తుతం స్థిరపడింది వరంగల్ లోని హన్మకొండ (వినాయక్ నగర్) అయినప్పటికీ, పుట్టి పెరిగింది, మాత్రం తూర్పుగోదావరి జిల్లాలోని,శృంగవరప్పాడు అనే గ్రామం. ప్రాథమిక విద్య స్వంత ఊరిలోనే జరిగినా, హైస్కూల్ విద్య రాజోలు లోని బోర్డు హైస్కూల్ లోనూ డిగ్రీ, పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం లోని ‘వెస్ట్ గోదావరి, భీమవరం కాలేజీ’ (WGB College) లోనూ చదివారు. ఇప్పుడు ఈ కళాశాల ‘డి.ఎన్.ఆర్’ కళాశాలగా రూపాంతరం చెందింది. ఈ కళాశాలలో మా అన్నయ్య కె.కె. మీనన్ వీరు కలిసి చదువుకున్నారు. మా అన్నయ్యను అతి చనువుగా ‘ఏరా..’ అని పిలిచే అతి కొద్దిమందిలో వీరు ముఖ్యులు. అంతకు మించి మా అమ్మమ్మ ద్వారా వీరు మాకు సమీప బంధువు, నాకు చిన్నాన్న వరుస. గృహసంబంధమైన అన్ని పనులూ వీరి శ్రీమతి సుశీలమ్మ గారు చక్కబెడితే, మన కవిగారు పూర్తి సమయాన్ని ఉద్యోగానికి అంకితం చేసి అధికారుల -ప్రజల మన్ననలు పొందడమే గాక, క్లర్క్ స్థాయి నుండి చీఫ్ అకౌంట్స్ ఆఫీసరుగా ఎదిగిన మహానుహావులు. వీరు పదవీ విరమణ చేసేవరకూ ఆయన సాహిత్య ప్రియుడనీ, ఎప్పుడో ఎస్.ఎస్.ఎల్.సి లో చదువుకున్న ఛందస్సు గుర్తు చేసుకుని పద్యాలు రాస్తారనీ నాతో సహా ఎవరికీ తెలియదు.

కవి గారి మొదటి పద్యకావ్యం కోనసీమ సొంపులు

నేను మహబూబాబాద్‌లో పని చేస్తున్నప్పుడు,వారు ఆడిట్ కోసం వచ్చి,నన్ను వెతుక్కుంటూ నా దగ్గరికి వచ్చిచెప్పే వరకూ ఆయన వరంగల్‌లో ఉంటున్నట్టు గానీ, మా బంధుత్వం గురించి గానీ నాకు అసలు తెలియదు. ఆయనకు నాకూ వయసులో చాలా తేడా ఉన్నప్పటికీ నన్ను ఆయన ‘సార్’ అని పిలుస్తుంటే నాకు కించిత్ సిగ్గు అనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో మాకు పెద్ద దిక్కు వారు – వారి శ్రీమతి గారే! ముగ్గురు మగపిల్లలూ, ఒక అమ్మాయి, సంతానం గల వీరు, పిల్లల్ని ప్రయోజకులని చేయడమే కాకుండా, వారి సోదరుడి కుమార్తె, కుమారుడిని కూడా పెంచి పెద్దచేసి ప్రయోజకుల్ని చేసిన పుణ్యమూర్హులు ఈ ఆదర్శ దంపతులు. ఈ వూళ్ళో వాళ్లే మాకు పెద్ద దిక్కు.

రత్నం గారి రెండవ పుస్తకం సాహిత్య కుసుమాలు

ఇక అసలు విషయానికి వస్తే, నేను జనగాం ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తున్నప్పుడు వీరు హైద్రాబాద్‌లో ఇంజనీర్-ఇన్-చీఫ్ ఆఫీసులో పని చేస్తుండేవారు. అప్పటికి ఆయనకు రిటైర్మెంట్ కొద్దీ సంవత్సరాలే వుంది. రోజూ రైలులో ఆఫీసుకు వెళ్లి తిరిగి మళ్ళీ సాయంత్రం రైలులో వచ్చేవారు. అప్పటికి ఆయన చీఫ్ అకౌంట్స్-ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు.

రత్నం గారి మరో పుస్తకం భావ కెరటాలు

అనుకోకుండా ఒకరోజున ఉదయం ఆయన హైదరాబాద్ వెళ్తూ, నేను జనగాం వెళ్తూ భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్‌లో కలిసాం. పక్కపక్కన సీట్లు దొరకడంతో ముచ్చట్లు మొదలు పెట్టిన తర్వాత, సడెన్‌గా ఒక మడత పెట్టిన కాగితం జేబులోనుంచి తీసి నా చేతిలో పెట్టి ‘చదవండి’ అన్నారు. కాగితం మడత విప్పి చూద్దును కదా అది సీసపద్యం. నేను ఛందస్సు మరచిపోయి చాలా కాలం అయింది, అక్కడ ఫలానా అని రాస్తే తప్ప, ఏ పద్యం అన్నది గుర్తుపట్టలేను. కానీ నాకు పద్యం అన్నా, పద్యం పాడేవాళ్ళన్నా చాలా ఇష్టం. ఆయన ఇచ్చిన కాగితంలోని పద్యం సరళమైన భాషలో ‘కోనసీమ అందాలు’ గురించిన కమ్మని పద్యం. నాకు చాలా బాగా అనిపించింది, బహుశః నేనుకూడా కోనసీమకు చెందినవాడిని కాబట్టి కావచ్చు!

రత్నం గారి మరో రచన హృదయ తరంగాలు

పద్యం రెండు మూడు సార్లు చదివి  “ ఎవరండీ ఇది రాసింది?” అన్నాను.

“ఏమి.. బాగోలేదా?” అన్నారు.

“చాలా బాగుంది.. అందుకే అడిగాను” అన్నాను.

“నేనే..!!” అన్నారాయన, నవ్వుతూ.

నాకు చాలా సంతోషమైంది. ఆయనకు సాహిత్యం పట్ల, ముఖ్యంగా పద్యం పట్ల అంత అభిరుచి, అవగాహన వున్నఉన్న విషయం, ఆ పద్యం చదివేవారకూ నాకు తెలీదు. ఆయన ఏమాత్రం విశ్రాంతి సమయం దొరికినా ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల అభిరుచి చూపించడం నాకు తెలుసు. ఆ పద్యం ఆయన రాసినట్టు చెప్పగానే,వారిని ఒక కోరిక కోరాను, అది ఏమిటంటే,కోనసీమ గురించి ఒక శతకం రాయమని ఆయనను అర్థించాను. ఆయన నవ్వుతూ ‘తప్పక రాస్తాను’ అన్నారు. ఎప్పుడో చదివిన ఛందస్సు గుర్తు పెట్టుకుని ఈ వయసులో పద్యాలు రాయడం మామూలు విషయం కాదు. ఆయన నాకు మాట ఇచ్చిన ప్రకారం పదవీ విరమణ చేయగానే వందకు పైగా పద్యాలు రాసి నాకు చూపించారు. అది చదూతుంటే కోనసీమ.. కళ్ళముందు ప్రత్యక్షం కావలసిందే! దానికి ‘కోనసీమ సొంపులు’ అని నామకరణం చేసాము. ముందుమాట రాయవలసిందిగా, అప్పుడు అమలాపురం డిగ్రీ కళాశాలలో తెలుగు పండితులుగా పనిచేస్తున్న మిత్రులు ద్వా.నా. శాస్త్రి గారిని కోరడం జరిగింది.

వెంకటరత్నం గారి కుటుంబం
రచయితతో శ్రీ కుసుమ వెంకట రత్నం గారు, హనంకొండ.

ఆయన చేతనే ఈ పుస్తకాన్ని తూర్పుగోదావరి జిల్లా ‘మోరి’లో ఆవిష్కరింప జేశాము. ఆ సభకు కందికట్ల మందేశ్వరరావు గారు, భూపతి నారాయణ మూర్తి గారు కూడా హాజరైనారు. ఆ తర్వాత ఆయన చాలా పుస్తకాలు రాశారు. నావల్లనే అన్ని పుస్తకాలు రాయగలిగాను, అని అయన అంటున్నప్పుడు నాకు కించిత్ గర్వమూ, కొంచెం సిగ్గు కూడా కలుగుతుంటాయి. ఆయన పాండిత్యం ముందు నేను అసలు పనికి రాను. అయినవారి ప్రోత్సాహము, సహకారమూ మరింత వుండి ఉంటే, ఆయన మరెన్నో పద్య కావ్యాలు రాసివుండేవారు. ఆగస్ట్ నెల 1997లో పదవీ విరమణ చేసిన, ఈ కవిగారి ప్రస్తుత వయస్సు 86 సంవత్సరాలు. ఇంతకీ కవిగారి పేరు చెప్పనేలేదు కదూ! ఆయనే పద్య కవి, శ్రీ కుసుమ వెంకటరత్నం గారు. విశ్రాంత జీవితం గడుపుతున్న సహజ కవి మిత్రుడు. సహృదయతకు నిలువెత్తు సాక్ష్యం శ్రీ వెంకటరత్నం గారు.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here