జ్ఞాపకాల పందిరి-64

56
2

[box type=’note’ fontsize=’16’] “కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే…!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్. [/box]

చెన్నై టు హన్మకొండ..!

[dropcap]కొ[/dropcap]న్ని పరిచయాలు అనుకోని రీతిలో కలిసి వస్తుంటాయి. అలాంటి పరిచయాలు ఆయా వ్యక్తుల మనస్తత్వము, వ్యక్తిత్వమును బట్టి, తాత్కాలికంగా ఉంటాయా లేక శాశ్వతంగా కొనసాగుతాయా? అన్నది ఆధారపడి ఉంటుంది. అనుభవాలను బట్టి ఆలోచిస్తే పరిచయాలు స్నేహంగా మారి శాశ్వతంగా కొనసాగేవి బహు అరుదుగా ఉంటాయి. ఎందుచేతనంటే ఎక్కువమంది తాత్కాలిక ప్రయోజనాలను మాత్రమే దృష్టిలో ఉంచుకుని తమ అవసరాలు కాస్తా తీరిపోయాక వదిలించుకునే ప్రయత్నం లోనే వుంటారు. ప్రయోజనాలు మాత్రమే కాకుండా ఎదుటి వారి మనస్సును స్నేహాన్ని ఇష్టపడేవారు తమ పరిచయాలను శాశ్వతంగా నిలబెట్టుకుంటారు. దీనికి ఓర్పు సహనం, అవగాహన, సహృదయత అవసరం. ఇవి చాలా తక్కువమందిలో కనిపిస్తాయి. అందుకే అలాంటి పరిచయాలు – స్నేహాలు కొద్దికాలమే నిలుస్తాయి. ఇలాంటి పరిచయాలను స్నేహాలను చూసి కొంతమంది ఈర్ష్యపడడమూ, లేకుంటే వారి స్నేహాన్ని చెడగొట్టే ప్రయత్నంలో విశేష కృషి చేసేవారు కూడా వుంటారు. వీరికి స్నేహం చెయ్యడమూ, దానిని నిలబెట్టుకోవడమూ అసలు చేత కాదు, కానీ ఇతరులు స్నేహంగా ఉంటే కుళ్ళుకుంటారు. ఇది లోకరీతి, అంతే ప్రత్యేకంగా చెప్పడానికి ఏమీ ఉండదు.

ఇలాంటి వారికి భిన్నంగా, కొంతమంది అనేక కారణాల వల్ల దూరమై పోయి చిరునామా, ఫోన్ నంబర్లు పోగొట్టుకొని కూడా, విసుగు లేకుండా ప్రయత్నించి వారి వివరాలు సేకరించి తిరిగి అదే స్థాయిలో స్నేహాన్ని కొనసాగించేవారు కూడా వున్నారు. వారి ఎడం పది సంవత్సరాలు కావచ్చు, పాతిక సంవత్సరాలు కావచ్చు, ముప్పై సంవత్సరాలు కూడా కావచ్చు. అది వారి వ్యక్తిత్వ లక్షణం అంతే! ఇలాంటి జాబితాలో ఈ రచయిత కూడా వున్నాడు, అందులో ఎలాంటి సందేహమూ లేదు.

నేను చిన్నప్పటినుండీ కొంతకాలం హైదరాబాద్‌లో పెద్దన్నయ్య మీనన్ గారి దగ్గర పెరగడం, ఆయన కథా/నవలా రచయిత కావడం, అందుచేత ఇంట్లో సాహిత్య వాతావరణం నెలకొని ఉండడం వల్ల చిన్నప్పుడే కథలు, నవలలూ బాగా చదివేవాడిని. వివిధ రచయితల రచనలు ఈ విధంగా చదవడం అలవాటు అయింది. నేను ఇలా చదువుతుంటే, అన్నయ్యాగానీ, వదిన గానీ ఏమీ అనేవారు కాదు, పైగా పరోక్షంగా చదవమని ప్రోత్సహించేవారు. నా విద్యాభ్యాసానికి ఇది ఏవిధంగానూ ఆటంకం కలిగించలేదు. కొద్దికాలం తర్వాత కథలు చదివి ఆ కథ గురించి నా అభిప్రాయం ఆయా పత్రికలకు ఉత్తరాలు (ఇప్పుడు మెయిల్స్) రాయడం అలవాటు అయింది, అంతమాత్రమే కాదు అవి తప్పనిసరిగా అచ్చు కావడం వల్ల మరింత ఉత్సాహం పెరిగి, ఆ అలవాటు మరింత వేగం పుంజుకుంది, పైగా మామూలుగానే నాకు ఉత్తరాలు రాయడం చాలా ఇష్టం. ఈ స్థాయికి చేరుకునే సరికి, నాకు ఉద్యోగం రావడం, పెళ్లి – పిల్లలు ఇవన్నీనా జీవితంలో చోటు చేసుకున్నాయి. కథలు రాయడమూ పుస్తకాలు ప్రచురించడమూ జరిగింది. ఇలాంటి వాతావరణంలో విశాలాంధ్ర వారి మాసపత్రిక ‘సాహిత్య ప్రస్థానం’లో ఒక కథ చదివాను. కథ పేరు గుర్తులేదు. కథ చదివిన వెంటనే రచయితను మెచ్చుకుంటూ పత్రికకు లేఖ రాయడమేకాక, ఆయన మొబైల్‌కు ఫోన్ చేసి మాట్లాడాను. ఆయన చెన్నైలో తమిళుల మధ్య జీవిస్తున్న తెలుగు కథారచయిత శ్రీ బొందల నాగేశ్వరరావు గారు. అలా మా ఇద్దరి మధ్య పరిచయం మొదలై, అది మంచి స్నేహంగా మారి ఇప్పటికీ కొనసాగుతుండడం ప్రత్యేకంగా నాకు ఆనందాన్ని కలిగిస్తుంది.

నాగేశ్వరరావు గారు, చాలా సంవత్సరాలుగా మంచి రచయితగా తెలుగు పాఠక లోకానికి పరిచితులు. నాకే కాస్త ఆలస్యంగా పరిచయం అయ్యారు. ఆయన కథ ప్రచురించని పత్రిక అంటూ లేదు, యేవో కొద్దీ బడా పత్రికలు తప్ప. ఆయన ఒక్క కథలే కాదు, పిల్లల కథలు, పాటలు, నాటికలు, తమిళ సినిమాలకు అనువాద సంభాషణలు, టి.వి సీరియల్స్, ఒక్కటేమిటి సాహిత్యంలో అనేక ప్రక్రియలను ఈయన కలం అందించింది/అందిస్తున్నది. ఈయన నాటక రచయిత మాత్రమే కాదు, నటుడు – దర్శకుడు కూడాను. వీరి నాటకాలు మద్రాసు కేంద్రం ద్వారా అనేకం ప్రసారం అయినాయి. గొల్లపూడి మారుతీరావు గారి నిర్వహణలో అప్పట్లో నాగేశ్వరరావు గారి నాటకం ప్రసారం కావడం ప్రత్యేకంగా చెప్పుకోవలసిన విషయం. ‘మొహమాటం’ ఈయనకు జన్యుపరంగా అబ్బిన గొప్ప లక్షణం.

రచయిత శ్రీ బొందల నాగేశ్వరరావు, చెన్నై.

నిజానికి నాగేశ్వరరావు గారు తెలుగువారు. వారి పూర్వీకులది (తండ్రి) అప్పటి ఒంగోలు జిల్లా, దర్శి తాలూకా, రామచంద్రాపురం అనే వూరు. రావు గారి తండ్రి ఉద్యోగరీత్యా మద్రాసుకు 1948లో వలసపోవడం వల్ల, ఈయన బాల్యము, చదువు, ఉద్యోగము, మిగతా జీవితమంతా చెన్నైకి అంకితమై అక్కడే స్థిరపడ్డారు. తమిళదేశంలో స్థిరపడినా, నాగేశ్వరరావు గారివి తెలుగు మూలాలు కావడం వల్ల ఆయన తమిళంను గౌరవిస్తూనే, తెలుగురచనా వ్యాసంగంలో పట్టు సాధించగలిగారు.

నాగేశ్వరరావు గారు నాకు పరిచయం అయ్యేనాటికి వందల సంఖ్యలో కథలు రాశారు. కానీ, ఒక్క కథా సంపుటి కూడా ఆయన పేరుతో రికార్డు కాలేదు. ఆ విషయం చర్చకు వచ్చినప్పుడు పుస్తకం వేయలేనందుకు చాలా బాధపడ్డాడు. ఆ రంగంలో తనకు తగినంత అనుభవం లేదని, అయితే కథల పుస్తకం వేసుకోవాలనే కోరికను ఆయన వెల్లడించారు. మరి ఆయన కోరిక తీరేదెలా?

నేను హన్మకొండలో, ఆయన చెన్నైలో. నేను ఏదైనా సాయం చేయాలన్నా ఎలా సాధ్యం? అయితే నేనొక ఉపాయం ఆలోచించి, అదే విషయం ఆయన చెవిన పడేసాను, పైగా అప్పటికే స్వంతంగా నేను కొన్ని పుస్తకాలు ప్రచురించడం జరిగింది, అదే ఆయనకు చెప్పాను. కథలు హన్మకొండలో పుస్తకంగా వేసి, అవసరమైతే ఇక్కడే పుస్తకావిష్కరణ చేయడానికి సహకరిస్తానని, పుస్తకానికి ముందుమాట ప్రఖ్యాత రచయిత అంపశయ్య నవీన్ గారితో రాయిస్తానని హామీ ఇచ్చాను. ఆయనకు నా మీద నమ్మకం కుదిరింది. చాలా సంతోషించారు. తప్పక కథాసంపుటి తీసుకురావాలనే నిర్ణయానికి వచ్చారు.

ఒక శుభ ముహూర్తాన నాగేశ్వరరావు గారు, చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లో ఖాజీపేట చేరుకున్నారు. తెల్లవారుఝాము సమయంలో నేను ఆయన కోసం స్టేషన్‌కు వెళ్లడం ఆయనకు చాలా సంతోషం అనిపించింది. ఇద్దరమూ శాంత్రో కారులో ఇంటికి వచ్చాము. ఆయనకు ప్రత్యేకంగా మా ఇంట్లో ఒక గది కేటాయించాను.

ఈ విషయాన్ని సందర్భం వచ్చినప్పుడల్లా చాలా గొప్పగా ప్రస్తావిస్తుంటారు. ఆయనను, రచయిత నవీన్ గారికి పరిచయం చేసాను. ముందుమాట తప్పక రాస్తానని చెప్పారు. తర్వాత, శ్రీ దీప్తి ప్రింటింగ్ ప్రెస్ అధినేత కృష్ణ గారికి పరిచయం చేసి కథల పుస్తకం ముద్రణకు సంబంధించిన అన్ని విషయాలూ మాట్లాడుకోమన్నాను. ఆర్థికపరమైన విషయాలు కూడా ఇద్దరూ మాట్లాడుకున్నారు. నాగేశ్వరరావు గారు ఎంతో తృప్తిగా తన పని ముగించుకుని చెన్నైకి సంతోషంగా తిరిగి వెళ్లారు.

కార్యక్రమం ఆహ్వాన పత్రిక

వేదిక, సభ నిర్వాహణ విషయాలు మిత్రులు కుందా వజ్జుల కృష్ణమూర్తిగారికి అప్పగించాను. వేదికగా వందేళ్లకు పైగా చరిత్ర వున్న గ్రంథాలయం ఖాయం అయింది. తేదీని నిర్ణయించి ముందుగానే నాగేశ్వరరావు గారికి తెలియజేశాము.

చెన్నై మిత్రులు

హన్మకొండ లోని రాజరాజ నరేంద్రాంధ్ర భాషానిలయంలో 12-06-2016, ఆదివారం, పదిగంటలకు నిర్ణయించాము. ఓరుగల్లు సాహితీ మిత్రుల నిర్వహణ అని ప్రకటించాం. అనుకున్న సమయం రానేవచ్చింది. చెన్నైనుండి ఆదివారం ఉదయం బొందల నాగేశ్వర రావు గారు, ఆయనతో పాటు మరో ఇద్దరు మిత్రులు శ్రీ గుడిమెట్ల చెన్నయ్య, శ్రీ బెల్లంకొండ నాగేశ్వరరావులు చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లో వచ్చి కాజీపేట స్టేషన్లో దిగారు. నేను వాళ్ళని నా కారులో ఇంటికి తీసుకువచ్చి అల్పాహారం అదీ ముగిసిన తర్వాత సభావేదిక దగ్గరకు తీసుకు వెళ్లాను. ఇంచుమించు నేను పిలిచిన వాళ్ళు అందరూ వచ్చారు. గ్రంథాలయం కిటకిటలాడింది. చాలా సంతోషం అనిపించింది. సహృదయ ముఖ్యులందరూ ఎంతగానో సహకరించారు.

ఆవిష్కరణ కు నోచుకున్న కథాసంకలనం

ఆనాటి పుస్తకావిష్కరణ సభకి ప్రియ మిత్రులు సాహితీవేత్త శ్రీ గన్నమరాజు గిరిజామనోహరబాబు అధ్యక్షత వహించారు. డా. అంపశయ్య నవీన్ గారు పుస్తకాన్ని ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా శ్రీ పొత్తూరి సుబ్బారావు గారు హైదరాబాద్ నుండి విచ్చేసారు. పుస్తక సమీక్ష,ఆకాశవాణి అనీల్ ప్రసాద్ చేశారు. కార్యక్రమం కన్నులపండుగగా బ్రహ్మానందంగా ముగిసింది. ‘నిర్ణయం’ కధాసంపుటి రచయిత శ్రీ బొందల నాగేశ్వరరావు గారు నాకు సన్మానం చేశారు, నేను ఆయనకు చిరు సన్మానం చేసాను. ఈ కార్యక్రమం నా జీవితంలోనూ, నాగేశ్వరరావు గారి జీవితంలోనూ, వరంగల్ సాహిత్య చరిత్రలోనూ గుర్తు పెట్టుకోదగ్గ అంశం. నాగేశ్వరరావు గారి ఆనందానికి అవధులు లేకుండా పోయినాయి.

రచయితని సన్మానిస్తున్న శ్రీ బొందల నాగేశ్వరరావు
నాగేశ్వరరావు గారి చిన్న నాటి ప్రియ స్నేహితుడు శ్రీ చెన్నయ్య.జి.

అలా ఇప్పటికీ మా స్నేహం కొనసాగుతూనే వుంది. 71 సంవత్సరాల వయస్సులో కూడా, ఆయన రచనా వ్యాసంగం వేగం ఇతరులు అందుకోలేనంతగానే ఉండడం విశేషం. ఎంత ఎదిగినా ఒదిగివుండే సుగుణం ఆయనది. నా కథ నొక దానిని నాటకీకరణ చేసి ఢిల్లీలో ప్రదర్శించిన సహృదయత ఆయనది. మొదటి పుస్తకం పాఠకలోకానికి చేరిన కొద్దిరోజుల్లోనే మరో రెండు పుస్తకాలు ఆయన ఖాతాలో చేరాయి. ఇంకా చాలా పుస్తకాలుగా తీసుకురాదగ్గ కథలు ఆయన దగ్గర వున్నాయి. త్వరలో అవి కూడా పుస్తకరూపం దాలుస్తాయని నా నమ్మకం. స్నేహానికి, సహృదయతకు సరైన నిర్వచనం శ్రీ బొందల నాగేశ్వరరావు.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here